Menu Close

Adarshamoorthulu

శ్రీ ఎస్.వి.రంగారావు

S.V. Rangarao

మన తెలుగు చలనచిత్ర రంగం ప్రారంభంలో కథకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండి, అందులోని నాయక, నాయకి, ప్రతినాయక పాత్రలు సందర్భోచితంగా వచ్చి వెళుతూ ఎంతో సందేశాత్మకంగా ఉండేవి. అందుకే నేటికీ మన పాత సినిమాలు మనకు ప్రీతిపాత్రమైయ్యాయి. అంతేకాదు, పాత సినిమాలలో నటించిన నటీనటులందరూ కూడా ఆయా పాత్రలకు జీవం పోశారు. ప్రతిఒక్కరూ వారికంటూ ఒక అభినయాన్ని సొంతం చేసుకొన్నారు. అది వృత్తి పట్ల వారికున్న త్రికరణశుద్ధికి నిదర్శనము.

S.V. Rangaraoరాముడు, కృష్ణుడు ఎట్లుంటారో మనం చూడలేదు. కానీ మన పౌరాణిక చిత్రాల ద్వారా మనకు రాముడైనా, కృష్ణుడైనా మన నటరత్న నందమూరి తారక రామారావు గారు మాత్రమే. అలాగే ప్రతినాయక పాత్రలో రావణాసురుడు, హిరణ్యకశిపుడు, ‘సాహసం సేయారా డింభకా, రాజకుమారి సిద్ధించును’ అన్న నేపాలి మాంత్రికుడు అంటే మనకు గుర్తుకువచ్చేది ఒకే ఒక ఆజానుబాహుడు, తెలుగు, తమిళ భాషలలో అనర్గళంగా డైలాగులను చెప్పగలిగి, నాయకులతో సరితూగే ప్రతినాయకుని పాత్రలో మరియు మంచి నైతిక విలువలు ప్రధాన అంశాలుగా వచ్చిన ఎన్నో కుటుంబకథా చిత్రాలలో అత్యత్భుతంగా నటించి, తన నటనా చాతుర్యంతో మనలను మెప్పించిన మహానుభావుడు, మనందరికీ ఎస్.వి.రంగారావు గా సుపరిచితమైన శ్రీ సామర్ల వెంకట రంగారావు గారు, నేటి మన ఆదర్శమూర్తి.

S.V. Rangaraoకృష్ణా జిల్లా లోని నూజివీడు లో జూలై 3, 1918 న మన రంగారావు గారు జన్మించారు. తల్లిదండ్రులు ధనవంతులైనందున హైస్కూల్ విద్య కొఱకు ఇతనిని నాడు మద్రాస్ అని పిలువబడే నేటి చెన్నై కి పంపించారు. తరువాత B.Sc పట్టా కూడా పుచ్చుకొన్నారు. కానీ చదువు, ఉద్యోగం, సాంకేతిక నైపుణ్యం వీటన్నింటిని మించి కళలంటే విపరీతమైన మక్కువ. ఉన్నత చదువులకు వెళ్ళాలా లేక తన కళా తృష్ణతో చిత్రరంగ ప్రవేశం చేయాలా అని తర్జన బర్జన పడి చివరకు ‘వరూధిని’ చిత్రంతో చిత్రరంగంలో ప్రవేశించారు. ధనవంతులైన మాత్రానా నేటి కాలంలో మాదిరి సినిమాలలో స్థిరపడటం అంత సులువుకాదు. ఎంతో దీక్ష, పట్టుదల, నైపుణ్యం ఉండాలి. అందుకనే మొదటి సినిమా తరువాత ఆయనకు సినిమాల లో వేషాలు వేసే అవకాశం రాలేదు. సరే, అని కొంతకాలం TATA వారి సంస్థలో ఎదో కొలువు ఇష్టంలేక పోయినా చేశారు. కానీ ప్రతి మనిషి జీవితానికి ఒక దిశా నిర్దేశం ఉన్నట్లే ఆయన జీవితంలో నిర్దేశించిన చిత్రరంగంలోకే మరల ‘పాతాళ భైరవి’ చిత్రం లో నేపాలి మాంత్రికుడి వేషం ద్వారా ప్రవేశించి, ఆ పాత్రలో జీవించి పండిత, పామరుల ప్రశంసలతో ఒక సువర్ణ అధ్యయనానికి తెరతీశారు. తద్వారా విజయా ప్రొడక్షన్సు వారికి ఈయన ఆస్థాన నటుడయ్యారు. ఆ రోజు ఆయన నేపాలి మాంత్రికుడు కాకుంటే మనం నిజమైన ఒక మంచి ప్రతినాయక పాత్రధారిని కోల్పోయేవారము.

S.V. Rangarao‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు’ అని మాయాబజార్ లో ఆయన నటన, భక్త ప్రహ్లాద లో హిరణ్యకశిపుడు గా ఆయన చూపిన పద్య వాచక పటిమ, కీచకుడిగా, దుర్యోధనుడిగా, రావణ బ్రహ్మ గా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పౌరాణిక ప్రతినాయక పాత్రలు అన్నింటా మనకు గోచరించేది కేవలం ఆజానుబాహుడైన, ‘నటనకు నటనను నేర్పిన నరుడు’ మన రంగారావు గారు. తనదైన శైలిలో ఆయన చేసే సంభాషణల ఉచ్చారణ, ఆ విరుపు, హావ భావాలు ఆయనకు మాత్రమే సొంతం. వేరెవ్వరూ ఆయనకు సరిపోరు. అందుకే నాడు అగ్రనటులుగా ఉన్న రామారావు, నాగేశ్వరరావు తదితరులు సైతం ఎంతో జాగ్రత్తతో రంగారావు గారితో కలిసి నటించేవారు. అది ఆయన మీద ఉన్న భయం కాదు. ఆయన నటనకు వారిచ్చే నీరాజనం. అయితే అంతటి రంగారావు గారు, ‘మహానటి’ సావిత్రి గారితో నటించేటప్పుడు మాత్రం ఎంతో నిబద్ధతతో తన డైలాగ్ లను ఒకటికి పదిసార్లు మననం చేసుకొని సెట్ కు వచ్చేవారు. ఒక సందర్భంగా ఆయన సమకాలీనుడైన మరో గొప్ప నటుడు గుమ్మడి గారు, రంగారావు గారు అమెరికా వంటి దేశాలలో పుట్టివుంటే ప్రపంచఖ్యాతి గాంచేవారని ఎంతో ఉదాత్తంగా సెలవిచ్చారు. ఆనాడు కళామతల్లి దగ్గర, నటనకు ఎవ్వరైనా ఇచ్చే గౌరవం, గుర్తింపు ఆ విధంగా ఉండేది. అక్కడ వయసుతో, అనుభవంతో పనిలేదు. ఎవరు అత్యద్భుతంగా నటనలో జీవిస్తారో వారే గొప్పవారు. అది నాటి సినీ సంస్కృతి.

పౌరాణిక పాత్రలలో అలవోకగా ఇమిడిపోయి అత్యద్భుత నటనను ప్రదర్శించిన మన రంగారావు గారు, సాంఘీక మరియు కుటుంబ కథా చిత్రాలలో కూడా ఏమాత్రం తన కళా ప్రతిభను తగ్గించలేదు. 'పెళ్లి చేసి చూడు' సినిమాలో రంగారావు గారు పోషించిన 'వియ్యన్న' పాత్ర కూడా నేపాలి మాంత్రికుడి వేషం వలె తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇదే చిత్రం తమిళంలో కూడా నిర్మిస్తే అక్కడ కూడా ఆయనే ఆ పాత్రను పోషించి, తమిళ ప్రజల మన్ననలను కూడా పొందారు. ఈ విధంగా ద్విభాషా నటుడుగా కూడా ఆయనకు ఎనలేని ఖ్యాతి వచ్చింది.

నాదీ ఆడజన్మే, సుఖదు:ఖాలు వంటి గొప్ప సినిమాలను నిర్మించి సామాజిక చిత్రాలపై తనదైన సరళిని మనకు పరిచయం చేశారు. దర్శకత్వం మీది ఆసక్తితో చదరంగం, బాంధవ్యాలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. బతుకుతెరువు, బంగారుపాప, బందిపోటుదొంగలు, తాతామనవడు, రాజు పేద, గుండమ్మ కథ, ...ఎన్నో ఆణిముత్యాలు అన్నింటా ఆయనే మేలిమి ముత్యము. అందుకే నాడు, నేడు ఏనాడైనా ఆయన నటనకు ప్రత్యామ్నాయం లేదు. చార్లీ చాప్లిన్ వంటి మహా నటుని ప్రశంసలు మన రంగారావు గారికి దక్కాయి. ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు, కేంద్ర, రాష్ట్ర పురస్కారాలు పొందిన ఈ మహానుభావుడు నటనే ఊపిరిగా జీవిస్తూ 1974, మార్చి 18న తనువు చాలించారు. కానీ ఆయన నటన మాత్రం అజరామరము.

Posted in June 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!