Menu Close
Adarshamoorthulu
-- మధు బుడమగుంట --
గానతపస్వి, పద్మవిభూషణ్ శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
SP Balasubrahmanyam

‘శిశుర్వేత్తి..పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణిః’ అని మనందరికీ తెలిసిన ఆర్యోక్తి. దానర్థం శిశువైనా, పశువైనా, పామైనా, సమస్త ప్రాణులకి సంగీతం ఒక జీవామృతం, ఆనందకర సాధనం. అటువంటి సంగీత సాగరంలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ సంగీత గాన రసాన్ని ముందుగా తను ఆస్వాదించి, ఆనందించి, అటు పిమ్మట  ఒక విలక్షమైన గాత్ర శుద్ధితో, గాన మాధుర్యంతో, శ్రోతలను మంత్రముగ్ధులను చేయడం మొదలుపెట్టి వారిలో మధురానుభూతిని కలుగజేసి, ఆరు దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ జగత్తులో ‘బాలు’ అనే పదమే పదే  పదే వినిపించే విధంగా నలభై వేలకు పైగా పాటలు పాడి తనకంటూ, తనకు మాత్రమే ఉండే స్థానాన్ని అధిరోహించి, ఎంతో మంది సంగీత గాయనీగాయకులకు మార్గదర్శియై, భావితరాలకు ఒక భవికయై, వారిలో సంగీతం మీద మక్కువ ఏర్పరిచి, స్ఫూర్తిని రగిలించిన, గాన గంధర్వుడు, నటుడు, సంగీత దర్శకుడు, తాత్వికవేత్త, డా. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేటి మన ఆదర్శమూర్తి.

1946 జూన్ 4 న, విక్రమసింహపురి (నెల్లూరు) పట్టణంలో, శకుంతలా సాంబమూర్తుల ముద్దు తనయునిగా పండితారాధ్యుల వారి ఇంట బాలసుబ్రహ్మణ్యం జన్మించారు. బాల్యంనుండే తనకు సంగీతం మీద మక్కువ ఏర్పడింది. తండ్రిగారైన సాంబమూర్తి గారు ప్రతి సంవత్సరం సంగీత ఆరాధనోత్సవాలు జరిపేవారు. ఆ సమయంలో తెల్లవారుఝామున పురవీధుల్లో తిరుగుతూ అధ్యాత్మిక సంకీర్తనలతో, త్యాగరాజ కృతులతో అందరిలో భక్తిభావాన్ని పెంపొందింపజేసేవారు. క్రమంతప్పక చేస్తున్న ఈ సంగీత ఆరాధనలు మన బాలునిలో ఆసక్తిని కలిగించి, ఆయనలో ఒక మంచి గాయకునికి ఉండవలసిన లక్షణాలను, సంగీత పరిజ్ఞానాన్ని పొందేవిధంగా మలిచాయి.

సాంకేతిక విద్యను అభ్యసిస్తూ, పాటను ఆరాధిస్తూ ఎన్నో బహిరంగ వేదికలమీద పాడుతూ, బహుమతులు పొందుతున్న తరుణంలో నాటి ప్రముఖ సంగీత దిగ్గజం ఎస్పీ కోదండపాణి గారి దృష్టిని ఆకర్షించి, 1966లో తన మొట్టమొదటి  పాటను ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రానికి పాడటం ద్వారా సినిమా రంగంలోకి నేపధ్య గాయకుడిగా అరంగేట్రం చేశారు. అటుపిమ్మట అలుపెరుగని గాయకుడిగా, స్వయంకృషితో తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర 14 భాషల్లో వేలాది పాటలు పాడారు. అప్రహితంగా కొనసాగిన ఆయన కళామతల్లి సేవ ఆయనకు ఎంతో గుర్తింపును, మంచి జీవనశైలిని ఆపాదించింది. ఆయనకు లభించిన పురస్కారాల పట్టికను ఇక్కడ ఇవ్వాలంటే స్థలం, సమయం సరిపోదు. తన సుదీర్ఘ అనుభవంతో, నిత్య విద్యార్థిగా ఎంతో నేర్చుకొని విజయవంతమైన బాటలో పయనించిన సంగీతజ్ఞుడు బాలు. ఆయన నేపధ్య గాయకుడిగానే కాకుండా, 45 సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. అలాగే నటుడిగా వివిధ పాత్రలలో తెలుగు, తమిళం, కన్నడ భాషలలో 45 సినిమాలో నటించారు. అంతేకాదు పరభాషా నటులకు గాత్ర దానం చేసి డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. వంద సినిమాలకు డబ్బింగ్ చెప్పిన ఘనత బాలు గారి సొంతమైంది. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ నటుడి గాత్రానికి తగ్గట్టుగా అనుకరించేవారు. కనుకనే ఎందఱో ప్రముఖ నటులు కూడా ఆయన మీద ప్రత్యేక అభిమానంతో ఉండేవారు.

ఈటీవీ వారు నిర్వహించిన ‘పాడుతా - తీయగా’, కార్యక్రమానికి తనే కర్త, కర్మ, క్రియ గా మారి గత సంవత్సరం వరకు నిరాఘాటంగా నిర్వహించి ఎంతోమంది వర్ధమాన గాయనీ గాయకులను తయారుచేయడంలో తన కర్తవ్యాన్ని ఎంతో నిబద్ధతతో నిర్వహించారు. అలాగే, స్వరాభిషేకం అనే మరో కార్యక్రమం ద్వారా ప్రతిభ కలిగిన గాయనీ గాయకులకు సరైన గుర్తింపు లభించే విధంగా వెన్నుతట్టి ప్రోత్సహించారు. నేటి నేపధ్య గాయనీ గాయకులలో దాదాపు అందరూ బాలు గారి ఆశీస్సులతో ఎదిగినవారే. అందరికి ఆయన ఒక ఆత్మబంధువు. తన ముందు తరం వారి యెడల భక్తి భావం, తన తోటి మరియు తరువాతి తరం పట్ల ప్రేమాభిమానాలు చూపి అందరినీ దరిచేర్చుకొన్న మహా మనిషి మన బాలు గారు.

మారుతున్న సమాజ స్థితిగతులు, పోకడలకు అనుగుణంగా తన గాత్ర శైలిని మార్చుకొంటూనే సంగీత శాస్త్రం లోని నైతిక విలువలకు, భాషకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా నాలుగు దశాబ్దాలు, నలభై వేల పైచిలుకు పాటలతో తెలుగు చలన చిత్ర రంగంలో ఏక ఛత్రాధిపత్యాన్ని, తమిళం, కన్నడ ఒకటేమిటి పధ్నాలుగు  భాషలలో పాటలు పాడి సంప్రదాయ సంగీత పండితులను త్రోసిరాజని తనకంటూ ఒక ప్రత్యేకతని, ఉనికిని చాటుకొన్నాడు.

పలురకాల వేదికల మీద, పాత్రికేయుల ప్రశ్నోత్తర కార్యక్రమాలలో ఆయన చెప్పిన కొన్ని మాటలు యధావిధిగా ఇక్కడ వ్రాస్తున్నాను;

“నేను ఒక యోగిని. నా ఊపిరి, రక్తాన్ని పణంగా పెట్టి పాట పాడుతున్నా. కానీ వీటన్నింటికీ మించి భగవంతుడు నాకంటూ ఒక యోగాన్ని ప్రసాదించాడని ధృడంగా నమ్ముతున్నా. గత జన్మలో వదిలేసిన పనిని పూర్తిచేసేందుకు ఈ జన్మను ఇచ్చాడని నమ్ముతున్నా. ఒక గాయకుడికి ఉండాల్సిన లక్షణం కేవలం సంగీత ప్రజ్ఞ మాత్రమే కాదు. సాహిత్యం పట్ల పిపాస ఉండాలి. భాష నేర్చుకోవాలనే తపన ఉండాలి. వీటన్నింటికన్నా మనకు ఏమీ తెలియదు..నిష్కల్మషంగా తెలుసుకుందాం అనే భావన ఎల్లప్పుడూ ఉండాలి.”

కనుకనే ఆయన ఆదర్శమూర్తులయ్యారు.

భావితరాలకు బాలు గారి జీవితం ఒక స్ఫూర్తిదాయకం. తెలుగు భాష మీద ఉన్న మమకారంతో మాతృభాష మీద ఎంతో పట్టు సాధించి, సినిమా పాటలు పాడే యువ గాయనీగాయకులకు ఉచ్ఛారణ లోని దోషాలను ఎత్తి చూపుతూ, ఆ అక్షరాల స్పష్టతను వివరిస్తూ, తెలుగు భాషాభివృద్ధికి తనవంతు కృషిని పలువిధాలుగా అందించారు. కనుకనే ఆయనకు శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 1999 లో గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. ఆయన పాడిన పాటలలో అది ఏ భాషలోనైనా ఉచ్ఛారణ లోని తప్పులు ఎత్తిచూపడం కుదరదు. ఎందుకంటే ఆయన నోటినుండి వెలువడే పదాలలో అంతటి ఖచ్చితమైన సాహితీ విలువలు దాగి ఉంటాయి. అందుకనే భాషతో నిమిత్తం లేకుండా అనేక విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి ఆయనలోని విద్వత్తును నిర్ధారించారు. తమ జీవిత కాలంలో ఆరు గౌరవ డాక్టరేట్ లు పొందిన గొప్ప వ్యక్తుల జాబితాలో బహుశా బాలుగారు మాత్రమే ఉంటారేమో!

తెలుగు పదాల, అక్షరాల ప్రాముఖ్యతను వివరిస్తూ తదనుగుణంగా పలికిస్తూ ఉచ్ఛారణ దోషాలను భావితరాలకు అర్థమయ్యే విధంగా చేస్తూ పాటకు ప్రాణం పోయడమే కాకుండా భాషకు కూడా సజీవాన్ని ప్రసాదింపజేశాడు. ఎంతోమంది పరభాషా గాయకులకు తెలుగు భాషను నేర్పించడంలో, పాటను పాడే విధానం లోని మెళుకువలను వివరించడంలో నిజమైన గురువు పాత్రను పోషించారు మన పండితారాధ్యుల పరిజ్ఞాని. హృదయానికి హత్తుకునే రీతిలో అక్షరాలకు జీవం పోసి వ్రాశారు. ఆయన గురించి వ్రాయాలని కలం పట్టుకుంటే పదాలు, పంక్తులు, పుటలు ఇలా పోతూనే ఉంటాయి. ఆయన ఒక ఎన్సైక్లోపీడియా వంటి వాడు. పామురుల చేతకూడా పదనిసలు పలికించి, సంప్రదాయ రీతులను పరిరక్షిస్తున్న సంగీత గని, నిరారంబరుడు, నిగర్వి.

ఆయనలోని మరో గొప్పగుణం హాస్యచతురత. ఆయన చుట్టూ ఉన్న వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ, మంచి హాస్యంతో ముఖ్యంగా పిల్లలతో వారి ప్రాంత మాండలీకాల యాసతో మాట్లాడుతూ ఎంతో ఉత్సాహపూరిత వాతావరణం సృష్టించేవారు. కనుకనే ఆయన అందరి దృష్టిలో ఒక దొడ్డమనిషి గా మిగిలిపోయారు. ఆయన జీవితానుభవం, జీవనశైలి ఒక ఉత్ప్రేరక ఔషధం. అది అందరి జీవితాలకు సరైన మార్గాన్ని చూపే సద్గుణ సంపన్న ప్రోత్సాహం.

బాల సుబ్రహ్మణ్యం గారు తన జీవితానుభవ సారాన్ని అంతా భావితరాలకు పంచుతూ తెలుగు భాషను, తెలుగు పాటల లోని సొబగులను నిత్యం అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తూ అవిరళ కృషితో ఎంతో చైతన్యవంతంగా నిర్వహిస్తున్న సమయంలో కరోనా అనే మృత్యుపాశానికి చిక్కుకొని ఎంత ప్రయత్నించినను, ఎన్నో వేలమంది ప్రార్థనలు చేసినను, విధి లిఖితమై, సెప్టెంబర్ 25, 2020 న  దైవ సాన్నిధ్యాన్ని పొందారు. భౌతికంగా ఆ గొంతు మూగపోయిననూ, ఆయన గొంతులో పలికించిన, ‘పాటనై బతకనా మీ అందరినోట’ పదాల సాక్షిగా తెలుగు పాట మన తెలుగువారి నోట వినిపిస్తున్నంత వరకు మన బాలు అమరజీవి.

చివరి మాట: బాలు గారి శతజయంత్యుత్సవాలను ప్రత్యక్షంగా జరుపుకునే అవకాశం కోల్పోయాము. అయినా ఉడతా భక్తిగా ఆయన 76 వ జయంతి వేడుకను పురస్కరించుకుని ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ వ్యాసాన్ని, క్రింది పంక్తులతో నివాళిగా అర్పిస్తున్నాను.

గానగంధర్వా......

మూడుతరాల జనపథంలో సారధివై
సంగీత స్వరమాధురిని అందించి, ఆసక్తి కలిగించి
అందరి మనసులలో స్థిరమైనారు.

పెరిగారు విక్రమ సింహపురిలో
సింహమై విలసిల్లారు సంగీత సాహిత్య జనారణ్యంలో
అవార్డులు, పురస్కారాలు, అష్టైశ్వర్యాలకు అతీతులు మీరు
గానగంధర్వులు మీరు, విశ్వానికే సంగీత సామ్రాజ్ఞులు

‘పాడుతా తీయగా’ కలకాలం
నాడు, నేడు, భావితరాలకు ఒక వన్నెతరగని పాఠశాల
సర్వజనుల ఆలోచనలలో జీవించి, జీవన దిశానిర్దేశం చేశారు

సంస్కృతి, సంప్రదాయ విలువలను వివరించి, విశ్లేషించి
శాస్త్రీయ సంగీతం యొక్క ఉనికికి ప్రాణం పోసి,
పసిడి మొగ్గల వంటి చిన్నారులను నిబద్ధతతో
పరిణితి చెందిన నిత్యనూతన సుగంధి సంగీత సౌరభాల వలె మలిచి
మానసిక ప్రశాంతతకు మూలమైన సంగీత పరిమళాలను సృష్టించిన
మీకు మా మనసులలో స్థానం తప్ప వేరేమివ్వగలము

బాలుడు మాత్రమే చేయగల మరెన్నో మహత్తర కార్యక్రమాలను
అర్థవంతంగా వదిలి అనాధలుగా, జీవచ్చవాలను చేసి వెళ్ళడం
ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, కాకూడదు కానీ విధి లిఖితం.
సంగీతంలో పామరుడైన నా వంటి వారికి
సంగీత పరిజ్ఞానం కలిగేటట్లు చేసి
కోట్లమంది అభిమానులలో ఒకడైన నాకు
మీ నిష్క్రమణ రుచించలేదు.

మాలో వెలిగించిన సంగీత జ్యోతిలో మీరే ఉన్నారు మరి
మంచి ఆలోచనలతో, ఆదర్శవంతమైన
అనురాగపూరితమైన, ఆత్మబంధమైన
ఆచంద్రార్కమైన మీ ఆశయాలను, సంకల్పాలను
సచ్ఛీలతతో  సదా ఆచరించి మిమ్ములను
మాతోనే ఉంచుకొనాలని మా ఆశ, అభిలాష.

Posted in June 2021, బాలు ప్రత్యేకం, వ్యాసాలు

3 Comments

  1. సి వసుంధర

    బాలూ పాట రాగాల తోట
    బాలూ మాట వరాల మూట
    బాలు మది పలు భాషలకు నిధి
    బాలూతో ఉంటే లేదు బోరు
    ఆయన్ని కలిస్తే ఆ జోరే వేరు

    బాలు అంటే మెరిసే మణి
    మణి అంటే వాంగ్మణి
    బాలును గూర్చి చాలానే రాసింది
    మధుగారి కలం
    చూపించుకొంది తన బలం
    సంపాదకుల లక్షణం అది అందుకే
    స్తుతించిన మధుగారికి
    స్తుతిపాత్రుడైన బాలుగారికి
    నా ఈ చిన్న సన్నుతి.**********
    Dr సి వసుంధర,చెన్నై

  2. సి. వసుంధర

    సిరిమల్లె చిన్నదేకాని
    దాని పరిమళం గొప్పది

    పరిమళాల వరిమళ్ళ లో పం డిన పంటే బాలూ పాటల రుచుల వంట
    అది వ్యాసమా కాదు
    బాలు జీవిత విన్యాసంపై
    రసభరితంగా సాగిన గానం
    ఎంత చెప్పినా చాలని మణి ని గూర్చి
    ఎంతో వివరించిన మధుగారికి
    ఆదర్శ సంపాదకులు
    అన్న చిన్న బిరుదు
    ఓ చిరు కానుక అంతే
    నే నేమి ఇక ఇవ్వలేనంతే
    Dr సి వసుంధర.

    విన్యాసం—-వీణ

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!