Menu Close

Adarshamoorthulu

శ్రీ అక్కిరాజు రమాపతిరావు

-- పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

శ్రీ అక్కిరాజు రమాపతిరావు

మనకి తెలుగు రచయితలూ, కవులూ, సంఘ సంస్కర్తలూ, ప్రముఖ వ్యక్తులూ, రాజకీయ నాయకులూ చాలామంది ఉన్నారు. తెలుగు ప్రముఖ రచయితలూ, రాజకీయ నాయకులూ, ఇతర ప్రముఖులూ - చాలామంది గురించి ఇవాళ ప్రత్యక్షంగా, అధికారికంగా తెలుసుకోవాలంటే మీకు చాలా తక్కువ మంది దొరుకుతారు. కొందరు కొంతమటుకు గత రచయితలగురించి, వ్యక్తుల గురించి చెప్పగలుగుతారు. కానీ,  గత 65 ఏళ్లలో ఇలాంటి ప్రముఖ వ్యక్తులనెందరినో కలిసి, వారితో ముఖాముఖి చర్చలు జరిపి, వాళ్ళ దృక్పథమేమిటో మనకి ఇవాళ గొప్ప వివరాలతో చెప్పగల విశిష్ట వ్యక్తి నాకు తెలిసి ఒకరే ఉన్నారు. ఆ విశేషమైన వ్యక్తి, స్వతహాగా గొప్ప రచయిత, కవి, పరిశోధనకర్త, ఎన్నో రచనలని ఆవిష్కరించిన మనీషి. ఆయనే నేటి మన సంచిక ఆదర్శమూర్తి - శ్రీ అక్కిరాజు రమాపతిరావు.

akkiraju02

ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలు అందరికీ తెలియజేయాలని ఈ వ్యాసం రాస్తున్నాను. ఆంధ్రదేశ చరిత్రకి ఆయన ఒక నడుస్తున్న నిఘంటువు. వారి సారస్వత కృషి బహుముఖీనమైనట్టిది. ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి ఒక్క చిన్న వ్యాసంలో చెప్పడమనేది మామూలు సాహసం కాదు - ఆయనతో నా పరిచయం వల్ల కొంత ధైర్యం వచ్చింది రాయడానికి.

శ్రీ అక్కిరాజు రమాపతిరావుఅసలు ఈ వ్యాసానికి ప్రోత్సాహమైన కారణం ఒకటుంది. ఇటీవలే గడచిన 2018 జులై 15న గుంటూరులో డా. అక్కిరాజు రమాపతిరావుగారి సహస్ర చంద్ర దర్శన సత్కార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వారి సన్మానాన్ని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషను వారు 5 లక్షల వ్యయంతో, అభిమానంతో జరిపించారు. ఆయన సమగ్ర రచనలపై రెండు పూటల సదస్సు నిర్వహించి, 10 అధ్యయన పత్రాలు ప్రముఖ రచయితల ద్వారా వారికి సమర్పించారు. అవి త్వరలో పుస్తక రూపంలో ప్రచురితం కానున్నాయి. తెలుగులో ఇప్పటివరకు ఎవరూ చూడని ఒక విశిష్ట సంచిక 500 పేజీల క్రేన్ సైజులో ఆయనని అభిమానించేవారి నూరు రచనలతో ప్రచురించి వారికి బహూకరించారు. ఆ సంపుటి పేరు 'స్వాత్మకథ'. దీనిని రమాపతిరావే సంకలనం చేశారు. నేను ఈ పుస్తకం చూస్తే ఆయనకి ఎంతమంది అభిమానులో తెలిసింది! ఈ సందర్భానికి "వేయి పున్నముల వేడుక" అని అందమైన, ఆకర్షణీయమైన పేరు సందర్భోచితంగా పెట్టారు, ట్రస్టు వారు. దీనితోపాటు 'తొలిమలి తరం తెలుగు కథలు' అనే శీర్షికతో 45 కథలు - గురజాడ అప్పారావు గారికి ముందు వచ్చిన గొప్ప కథలు, అక్కిరాజు వారి కాలిక నేపథ్యం, సామాజిక, వాస్తు, శిల్ప, నిర్వహణ పరిణామాల వ్యాఖ్యానంతో పాటు ప్రచురించి రమాపతిరావు గారికి బహూకరించారు. (300 పేజీలు, మూల్యం: 250 రూపాయలు).

డా. రమాపతిరావు గారు గుంటూరు జిల్లాలోని వేమవరంలో 1936 మే నెల 4 వ తారీఖున ఆంధ్ర దేశంలో పండితవంశంగా ప్రసిద్ధికెక్కిన అక్కిరాజు కుటుంబంలో శ్రీ అక్కిరాజు రామయ్య, శ్రీమతి అన్నపూర్ణలకు జన్మించారు. హైస్కూలు చదువులు నరసరావు పేటలో పూర్తిచేసి ఎస్. ఎస్. ఎన్. కళాశాలలో బి.ఏ వరకు చదివారు. 1964 లోనే "వీరేశలింగం పంతులు - సమగ్ర పరిశీలన" థీసిస్ కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం వీరికి డాక్టరేట్ పట్టా ఇచ్చింది. రమాపతిరావు గారు హైదరాబాదు న్యూసైన్సు కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగానూ, తెలుగు అకాడమీలో పరిశోధనాకారిగా, ఉపసంచాలకుడిగా పనిచేశారు. 34 సంవత్సరాలు పనిచేసి 1994లో పదవీ విరమణ పొందారు.

దీనివలన మనకి అర్థం అయ్యేదేమిటంటే రమాపతిరావు గారి మొట్టమొదటి రచనే గొప్ప పరిశోధనా గ్రంథం అయ్యింది. ప్రస్తుతం ఎవరైనా వీరేశలింగం పంతులుగారి గురించి అధికారికంగా తెలుసుకోవాలంటే ఈ గ్రంథాన్ని సంప్రదించవలిసిందే. ఈ పరిశోధనాశైలి, విషయ విశదీకరణ ఆయన మాటల్లోనూ, అన్ని రచనలలోనూ మనకి కనిపిస్తుంది. అయితే అప్పుడు మొదలైన రచనా వ్యాసంగం ఈ నాటివరకూ కొనసాగుతూనే ఉన్నది. ఎనభై ఏళ్ల పైబడ్డ జీవితంలో రెండు వందల పైచిలుకు చిన్న, పెద్ద గ్రంథాలు రచించారు. ఆంధ్రదేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేసిన కవుల, చరిత్రకారుల, సాంఘిక సంస్కర్తల, భాషావేత్తల జీవిత విశేషాలు తెలుసుకోవాలన్నా, ఆంధ్రదేశ సాంస్కృతిక సమగ్ర పునరుజ్జీవన సమగ్ర స్వరూపాన్ని దర్శించాలన్నా శ్రీ అక్కిరాజు రమాపతిరావుగారి గ్రంథాలను చదవక తప్పదు. ఆంధ్రదేశం విస్మరించిన మహనీయుల కృషినీ, సాంస్కృతిక పునరుజ్జీవన ఘట్టాలను వారు తవ్వి తలకెత్తారు. ఒకసారి నాకు అనుకోకుండా వారు రాసిన కొమఱ్ఱాజు వెంకట లక్ష్మణరావు గారి జీవిత చరిత్ర పుస్తకం బహూకరించారు. దాంతో నాకు ఆయన ఎంత కృషితో విషయాన్ని సేకరిస్తారో, ఎంత సమగ్రంగా దాన్ని మనకి అందజేస్తారో అర్థమయింది. వీటిగురించి మళ్ళీ ప్రస్తావిస్తాను.

శ్రీ అక్కిరాజు రమాపతిరావురమాపతిరావుగారు వీరేశలింగంగారి సారస్వతాన్ని పరిశీలించిన వాళ్లలో మొట్టమొదటివారు. వీరు రచించిన 'సారస్వత ప్రబంధం 'దేశ, విదేశ విద్వాoసుల ప్రశంసలు పొందింది. వీరి రచనలని సారస్వత, ఆధ్యాత్మిక రచనలుగా విభజించవచ్చు. జారుడుమెట్లు, ఋణానుబంధం ... మొదలైన పది నవలలు, మైథిలి, మంచు కురిసిన రాత్రి ... మొదలైన ఆరు కథా సంపుటాలు రచించారు. వీరి చాలాకథలు ఇతర భాషలలోకి అనువాదితాలయ్యాయి. కందుకూరి వీరేశలింగం, కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు, అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు, వెన్నెలకంటి సుబ్బారావు, గిడుగు వెంకటరామమూర్తి, వేటూరి ప్రభాకర శాస్త్రి, కోరాడ రామకృష్ణయ్య, ఆరుమల రామచంద్ర, మొదలైన మహనీయుల సారస్వత సాహిత్య సేవలను తెలుసుకోదల్చుకున్న వారు రమాపతిరావు గారి రచనలు చదవాల్సిందే. ఇంతేకాక వీరి రచనలు ప్రముఖ సాహిత్య సామాజిక వార పత్రిక- 'తెలుగు స్వతంత్ర' లో 1953లో మొదలై, సుమారు 65 ఏళ్ల సాహిత్య కృషిలో వివిధ దైనిక, వార,మాస పత్రికల్లో నాలుగు వేల పైచిలుకు ప్రచురింపబడ్డాయి. అంటే మనం అనుకుంటున్న వాళ్లు చాలామంది కంటే అక్కిరాజు రమాపతిరావు గారి రచనలు ఎక్కువగా ప్రచురింపబడ్డాయన్నమాట!

ఇదే చాలా ఎక్కువ అని మనం అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి! 1965లో తంజావూరు మహారాజు సరస్వతీమహల్ (TSSSM) లైబ్రరీలో కవిత్రయ మహాభారతం తొమ్మిది తాళపత్ర సంపుటాలనుంచి పాఠామ్తరాల సేకరణ కృషిలో పాల్గొన్నారు. 2008 నించీ 2012 దాకా 5 సంవత్సరాలు సాహిత్య అకాడెమీ తెలుగు సమన్వయ కర్తగా పని చేశారు. ఒకప్పుడు నేషనల్ బుక్ ట్రస్టు కార్యనిర్వాహక మండలి సభ్యులుగా ఉన్నారు.

శ్రీ అక్కిరాజు రమాపతిరావుఇంతేకాక, వివిధ ప్రక్రియలకు సంబంధించి 140 (నూట నలభై) గ్రంథాలు వీరివి ప్రచురితమయ్యాయి. ఇటీవలే రచించిన 'ధమ్మ పథం' గ్రంథం బుద్ధుని బోధనల సంక్షిప్త సంకలనం (222 నీతి కథలతో) ప్రచురితమైంది. డా. రమాపతిరావు గారు గత 800 ఏండ్లగా ఎవరూ తలపెట్టని పాల్కురికి సోమనాథుడి బసవ పురాణం, పండితారాధ్య చరిత్రలు తెలుగు వచనంగా తెచ్చారు. వీటి సాహిత్యపు విలువ అసామాన్యం. ఈ రెండు గ్రంథాలు ఒకొక్కటీ దాదాపు 1000 పుటలుంటాయి. రెఫరెన్సు పుస్తకాలన్నమాట. 'ప్రతిభా మూర్తులు' అనే పేరుతో 150 మంది తెలుగు సాహిత్య సామాజిక మూర్తులను చిత్రించారు. వీరు రచించిన 'ఆంధ్ర కేసరి ప్రకాశం', అవిభక్త ఆంధ్రదేశ రాష్ట్రంలో 9 వ తరగతి ఉపవాచకంగా దాదాపు 50 లక్షల మంది పిల్లలు చదివారు. వీరు రాసిన రామాయణం ఎన్నో కొత్త ఘటనలని మనకి తెలియజేస్తుంది. దీన్ని సిలికాన్ ఆంధ్రా వారు 'సుజనరంజని' లో ధారావాహికంగా ప్రచురిస్తున్నారు.

ఇంత సాహిత్య కృషే కాకుండా, రమాపతిరావు గారు మంచి వక్తలు. 200 పైగా రేడియో కార్యక్రమాలు చేశారు. వీరి రెండు నవలలు ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు, చెన్నై కేంద్రాలనుంచి ధారావాహికంగా ప్రసారమయ్యాయి. సామాన్యులకి పది జీవిత కాలాలకు సరిపడే పని ఆయన ఒక జీవితంలోనే సాధించారు.

ఇంతసేపూ నాకు పైన ఉటంకించినట్లుగా రమాపతిరావు గారు ఏం రాసారో అవి కొంతమటుకు తెలియజెప్పడమే సరిపోయింది. ఇక ఒక వ్యాసంలో వాటిని విశ్లేషించడం సాధ్యం కాదు కదా? అలా చేస్తే ఉద్గ్రంథమే అవుతుంది. సహస్ర చంద్ర దర్శనాలు దాటినా ఏమీ తగ్గని ధారణాపటిమ ఆయన సొంతం. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు కూలంకషంగా ఆ విషయం యొక్క కాలిక దర్శనమూ, శిల్ప వివరణా అతి సులభంగా చెప్పగలిగే సామర్థ్యం ఆయనది. నిగర్వి. ఇంకా చాలా చెయ్యాలనే తాపత్రయం ఆయనని నిత్య యవ్వనులుగా నిలబెడుతోంది. నేను ఆయన కంటే చిన్నవాడిని అయినా, ఆయనతో ఏవిధంగా కూడా సరిపోల్చ దాగిన వాడిని కాకపోయినా, మామూలుగా మాట్లాడుకుంటుంటే ఎంతో వివరంగా విషయాన్ని తెలియజెపుతుంటారు. అమెరికాలో వాళ్ళ అబ్బాయి దగ్గిర ఫ్రీమాంట్ లో ఉంటూ, మా వీక్షణం సాహితీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. రాస్తూ ఉంటారు, ప్రసంగిస్తూ ఉంటారు. ఆయన సాధించినవన్నీ చూసి, ఇంకా ఇంత చురుకుగా ఉన్నారే! అని ఆశ్చర్య పోవడం తప్ప చెయ్యగలిగింది లేదు.

అసలు ఒక మనిషికి ఇంతసాధించడానికి సమయం ఎలా సరిపోయింది? అనే ప్రశ్న నాలో ఎప్పుడూ తొలుస్తూ ఉంటుంది! రమాపతిరావుగారు పదికాలాల పాటు ఆరోగ్యంతో, ఇంకా సాహిత్య సేవ చేస్తూ, శుభగంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

రచయిత పరిచయం: ప్రస్తుత ఫ్రీమాంట్, కాలిఫోర్నియా వాస్తవ్యులు. కించిత్ రచనా వ్యాసంగోత్సాహం కలవారు. ఛందోభరిత పద్య రచనలంటే మక్కువ ఎక్కువ. బే ఏరియా సాహితీ గవాక్షం వీక్షణం సభ్యులు.

Posted in December 2018, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *