Menu Close
balyam_main

మన్మథా... నవ మన్మథా...

- డా. రావి రంగారావు

సౌందర్యం

సౌందర్యం అంటే
మనవడి వల్లే తెలిసింది
ఆనందం అంటే
నా బంగారు దేవుడి వల్లే తెలిసింది...

నా భార్యను కౌగిలించుకున్నప్పుడు
శృంగారమే ఆనందమనుకున్నాను,
నా పిల్లల్ని గుండెకు హత్తుకుంటే
చనువువల్ల చెడిపోతారని
పుత్ర ప్రేమ ఆనందమే అని తెలిసినా
ఎప్పుడు ఎర్ర కళ్ళ సూర్యుడిగానే ఉండేవాణ్ని,

నాన్నా, నా ప్రియమైన కొండకాయా,
నిన్ను వాటేసుకుంటుంటే
నా తనువులోని ఆణువణువూ
ఓ మధురానుభూతి కేంద్రమై
బతికితే నీకోసమే బతకాలనుకున్నాను...

నాకు దేవతల అమృతం వద్దు
నా మనవడికి నేను పెట్టే ముద్దు చాలు,
నా మనవడు నాకు పెట్టే ముద్దు చాలు,

యముడొచ్చినా వాడెమ్మ మొగుడొచ్చినా
కలకాలం కోటీశ్వరుడిగా బతికేస్తాను,
వాడినలా చూస్తుంటే చాలు
నా ప్రాణ దీపం వెలుగుతూనే ఉంటుంది...

మాయల పకీరు ప్రాణం
చిలకలో ఉందో లేదో
నా ప్రాణం మాత్రం
నా మనవడిలో ఉంది,

నా కోసమిలా
పుట్టివచ్చిన మా నాన్న
ఈ జన్మలోను
నన్ను బతికిస్తూనే ఉన్నాడు...

నాన్నా, నా కన్నా,
నా అమృత భాండమా,
రారా, మరోసారి
గట్టిగా వాటేసుకుందాం...

Posted in June 2019, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!