Menu Close
“సీ రియల్”
-- ఉప్పలూరి మధుపత్ర శైలజ --

కథైనా, సంగీతమైనా, పాటైనా, నాటకమైనా, సినిమా అయినా, చివరికి టీవీ సీరియలైనా, అది ఆ పాతమధురమే. సాయత్రం నాలుగు గంటలయ్యిందంటే చాలు, రెండున్నర దశాబ్దాల కిందటి దృశ్యం మదిలో కదలాడుతుంది మధురిమకు.

“ఆ!ఆ!ఆ!ఆ! వాసంత సమీరంలా నునువెచ్చని గ్రీష్మంలా..” అంటూ కూనిరాగం తీస్తూ పనిమనిషి బుజ్జమ్మ గబగబా గిన్నెలను కడిగే శబ్దం హృదయానికి తాకినట్లుగా ఇప్పటికీ అనిపిస్తూంటుంది.

ఎందుకంటే “ఆ బుజ్జమ్మ వ్యక్తిత్వం అంతగా మనసును కదిలించింది. కాబట్టే ఆ జ్ఞాపకాలిప్పటికీ చెక్కుచెదరలేదు” అనుకుంటూ గతంలోకి జారుకుంది మధురిమ.

“పెద్దమ్మగారూ కరంట్ ఉందాండి? టైమౌతోంది, కాస్తంత టీవీ పెట్టి కూర్చోండమ్మా. పది నిముషాలలో గిన్నెలు కడిగేసి వస్తాను, చిన్నమ్మగారూ, మీరు టీ పెట్టండి” అని వంటగదిలోకి వినిపించేలా కేకవేసి, గలగల మాటల సందడితో ఆప్పటి దాకా రాజ్యమేలిన నిశ్శబ్దభూతాన్ని ఆఇంటి నుండి తరిమి కొట్టింది బుజ్జమ్మ.

“ఏం బుజ్జమ్మ! అప్పుడే నీ సీరియల్‌కు వేళయ్యిందా! నీ పిచ్చి పాడుగాను, నాలుగవ్వటానికి ఇంకా సమయముందే, నే టీవీ పెడతాగానీ నీవెళ్ళి ముందు ఆ గిన్నెలను శుభ్రంగా కడుగు” అంటూనే టీవీ ని ఆన్ చేశారు లలితమ్మగారు.

ఆ సమయంలో దాదాపుగా టీవీలున్న ప్రతి ఇంట్లోనూ "ఋతురాగాలు" సీరియల్ మొదలై ఒక కొత్తవాతావరణం నెలకొనేది. ఆ వేళలో ఇంటికి ఎవరైనా బంధువులు, స్నేహితులు వచ్చినా మాటాపలుకు లేకుండా, సీరియల్ కథలో మమేకమవ్వల్సిందే. అంతలా ఆకట్టుకుంది ఆ సీరియల్.

మా బుజ్జమ్మకు, తన జీవితానికి దగ్గరగా ఉందనో, ఏమో, ఆ కథలోని “కావేరి”లా బ్రతకాలని తపన. అందుకే ఆ సీరియల్‌ను వదలకుండా, కదలకుండా చూసేది. ఆ సీరియల్ రాని ఆదివారాల్ని తిట్టుకునేది.

బుజ్జమ్మ ప్రతిక్షణం కావేరిలా ఆలోచించేది. మాటను మెరుగుపరచుకుంది. లలితమ్మగారితో నాక్కూడా కావేరిలా చదువుకోవాలనుంది, నాకు చదువు వస్తుందా? మీరు నేర్పిస్తారా? అని అడిగేది అంతలా కావేరిని అనుకరించేది. దానికి ప్రధాన కారణం ఆ సీరియల్‌లో కావేరి ఓ పనిమనిషి పాత్ర పేరు.

ఆ పాత్రను నాటికలో ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఆమె ఓ ప్రేమమూర్తి, తన కుటుంబాన్ని ఎంతగా గౌరవించేదో, తాను పనిచేసే కుటుంబాలవారిని కూడా అంతే సమానంగా గౌరవిస్తూ, ప్రేమించేది. అది టీ వీ నాటికయే అయినా, కావేరి పడే కష్టాలకు బుజ్జమ్మలాంటి వారు, ఆమె కష్టాలకు, తామే ఆకష్టాలను అనుభవిస్తున్నట్లుగా కన్నీరు కార్చేవారు.

గత సాయంత్రం తాగి వచ్చిన భర్తచేతిలో తిన్న తిట్లు, దెబ్బల కారణంగా, ప్రకృతిధర్మానికి విరుధ్ధంగా బుజ్జమ్మ ఉదయం ముకుళించిన పద్మంలా పనిలోకి వచ్చేది. మధ్యాహ్నం భర్తకు భోజనంపెట్టి, పసిపిల్లను అతనికి అప్పగించి వికసించిన పద్మంలా ఆనందంతో కావేరిని ("ఋతురాగాలు") చూడటానికి వచ్చేది.

“ఆమె సీరియల్ పిచ్చిని ఒక్కోసారి పరిశీలిస్తే తనని తాను తీర్చిదిద్దుకోవటానికి, తన బాధలను మరచిపోవటానికి దాన్ని వాడుకుంటోంది” అనిపించేది మధురిమకు.

ఉదయం పూట దొడ్డిని శుభ్రంచేసి, వీధివాకిట్లో ముగ్గులేస్తూ, గతరోజు జరిగిన ఎపిసోడ్‌ని తలచుకుంటూ, కూనిరాగం తీసుకుంటూ పని చేసుకునేదేగాని, భర్తమీద ఒక్క చాడీ కూడా చెప్పేది కాదు.

ఓ రోజు మిట్టమధ్యాహ్నం సమయం ఒంటిగంట అయ్యుంటుంది. మధురిమ మామగారు వరండాలో కూర్చుని ఆఫీసు పని చేసుకుంటున్నారు. ఈలోగా గేటు టకటక చప్పుడు చేస్తూ, “పెద్దయ్యగారూ! కాపాడండి” అని ఏడుస్తూ బుజ్జమ్మ ఒక్కసారిగా లోపలకొచ్చి కూలబడిపోయింది.

ఆయన ఆదుర్దాగా “ఏమయ్యింది తల్లి? పిల్లకేమైనా అయ్యిందా?” అని అడుగుతూనే, మధురిమను పిలచి గ్లాసుతో నీళ్ళు తెమ్మని చెప్పారు. ఆ నీళ్ళు తాగిన బుజమ్మ కొంత తెప్పరిల్లి వణుకుతూ, పులి వేటకు బెదిరిన లేడిలా మాటిమాటికి గేటు వైపు చూస్తూ జరిగిన సంగతిని వెక్కుతూ చెప్పింది.

“ఇవాళ పొద్దునే తాగివచ్చి, చేపలకూర వండలేదేమని దెబ్బలాడుతున్నాడు. నెలాఖరు రోజులలో డబ్బులేవి? నీవు పొద్దున్న కూరవండమని చెప్పివెళ్ళేటప్పుడే, డబ్బులిచ్చి ఉంటే వండి పెట్టేదాన్ని. పిల్లదానికి గుక్కెడు పాలు కొనటానికే నా దగ్గర డబ్బులుండటంలేదు. నీకు నీసుకూరలు, చేపలకూరలకెక్కడివి?” అని అన్నాను.

అంతే, చూరులోని వాసం ఒకటి లాగి ఎక్కడ పడుతోందో కూడా చూడకుండా కొడుతున్నాడమ్మా. వాడిని తప్పించుకుని రోడ్డుమీదకు వస్తే వెంటపడి మరీ కొడుతున్నాడు. వేరే దారితోచక మీ ఇంటికి వచ్చానమ్మా. అదిగో ఆ పక్క సందులో నక్కిదాక్కున్నాడు. “పెద్దయ్యగారంటే ఆడికి భయం, అందుకని లోపలకు రాడు. ఆ ధైర్యంతో వచ్చానమ్మా. మీరు పనిలో ఉన్నారేమో క్షమించండి” అంటూ ఏడుస్తోంది బుజ్జమ్మ.

ఈ హడావిడికి బయటకొచ్చిన లలితమ్మగారు, “ముందు ఏడుపు ఆపు. అన్నం తిన్నావో లేదో, కాస్త తిని కొంచం సేపు రెస్ట్ తీసుకో. సాయంత్రం పనయ్యాక వెడుదువుగాని” అన్నారు.

“వద్దమ్మగారు! చంటి పిల్లనొదిలేసి ఇద్దరం రోడ్డుమీదే ఉన్నాం. ఏమయిపోయిందో ఏమో?” అంటూ ధైర్యంగా బయటకెళ్ళింది బుజ్జమ్మ.

వెనుకనే మధురిమ మామగారు కూడా వచ్చి అతనికి వినిపించేలా, “పోలీసులకు చెప్పి ఉంచుతానమ్మా. మీ ఇంటికి వస్తారు. నీకేమైనా అయ్యిందా నీ మొగుడుకి జైలే గతి. ఆడపిల్లను బాధపెట్టిన వాళ్ళెవరు బాగుపడరు’ అని చెప్పటంతో పిల్లిలా జారుకున్నాడు అతను.

ఎప్పుడో ఒకసారి మధురిమకు బుజ్జమ్మ తన జీవితం గురించి చెప్పింది. “పదహారేళ్ళు వచ్చే వరకు తన బాల్యం ఇంటి ముందు వేసిన అందమైన ముగ్గులా తెల్లగా ఉండేది.  అమ్మానాన్నలకు ఒక్కతే కూతురు కావటంతో అల్లారుముద్దుగా పెరిగింది. బుజ్జమ్మ తండ్రి ముగ్గు బండి తిప్పుతూ, ఆవూరిలో ప్రతి వీధిలోనూ ముగ్గు అమ్మేవాడు.

ఒక్కోరోజు అతనితోపాటు బుజ్జమ్మ కూడా బండితో పాటు వెళ్ళేది. తన ముద్దుముద్దు మాటలతో, అందమైన ముగ్గులేసి, “ఎంత బాగుందో చూడండి మీ వాకిలి. ఆ పున్నమి చందమామ మీ వాకిట్లోకి దిగొచ్చినట్లుగాలేదూ” అంటూ చెప్పి అందరితోనూ ముగ్గు కొనిపించేది. అందుకే ఆమె వచ్చిన రోజు బేరాలు ఎక్కువగా ఉండేవి.

“పిల్ల పెరిగి పెద్దది అవుతోంది. కేవలం ముగ్గు వ్యాపారంతో మన బ్రతుకు తెల్లవారదు. ఒక రిక్షాను అద్దెకు తీసుకుని తిప్పు” అని భార్య బలవంతపెట్టటంతో, రిక్షా కార్మికుడయ్యాడు బుజ్జమ్మ తండ్రి.

అలా రిక్షాస్టాండ్‌లో పరిచయం అయ్యాడు నారాయణ. చిన్న కుర్రోడు. ఓ రోజు ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుండి బుజ్జమ్మ, నారాయణ ప్రేమలో పడ్డారు.

ఓరోజు తండ్రి బుజ్జమ్మతో “నారాయణతో మాట్లాడకు. ఆడు సంపాదించేదంతా సారాకొట్టుకే ఇచ్చేస్తున్నాడు” అని కోఫ్పడ్డాడు. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. “ప్రేమ గుడ్డిదని ఊరికే అన్నారా?”

“మన కులంలో తాగని వాళ్ళెవరున్నారు. ఆమాటకొస్తే నీవు మాత్రం తాగవా ఏమిటి?” అంటూ తండ్రిని ఎదిరించి, తల్లి వద్దని బ్రతిమాలినా, “అందంగా ఉన్నాడు, పెళ్ళయిన తరువాత నేను దారికి తెచ్చుకుంటాను” అని చెప్పి నారాయణను పెళ్ళాడింది బుజ్జమ్మ.

పెళ్ళైన కొన్నాళ్ళకే తీర్ధానికి వెళ్ళివస్తూండగా జరిగిన రోడ్డుప్రమాదంలో, అటు అత్తమామలను, ఇటు తల్లిదండ్రులను కోల్పోయింది బుజ్జమ్మ. సంవత్సరం తిరిగేసరికి ఆడపిల్ల తల్లయ్యింది. పిల్ల పుట్టినప్పటినుండి నారాయణకు తాగుడు మరీ ఎక్కువైపోయింది.

తాను సంపాదించింది ఇంట్లో ఇవ్వకుండా, సారాకు డబ్బులని బుజమ్మను వేధించటం మొదలుపెట్టాడు. మెలకువగా ఉన్నప్పుడు మాత్రం పిల్లను బాగానే చూసేవాడు. తాగి వచ్చినప్పుడు మాత్రం, కట్నం ఏమీ ఇవ్వకుండా పెళ్ళిచేశారని, ఆడపిల్లను కన్నావని, ఇలా ఏదో ఒకటి అంటూ సాధించేవాడు.

పిల్లకు ఆరునెలలొచ్చాయి. ఓపూట తినటం, రెండో పూట కన్నీళ్ళతో కడుపు నింపుకోవటం బుజ్జమ్మకు అలవాటైపోయింది. పక్కింటి మామ్మ సలహాతో, నాలుగిళ్ళలో పనులు ఒప్పుకుని, పిల్లను ఆ మామ్మదగ్గరే వదిలి పనులకు వెళ్ళేది.

ఈలోగా ఇంటికొచ్చిన నారాయణ బుజ్జమ్మ కనిపించకపోతే, మామ్మనడిగి బుజ్జమ్మ పనిచేసే ఇళ్ళకు వెళ్ళి గొడవచేసేవాడు. అలా ఆమెను అనుమానిస్తూ, సూటిపోటిమాటలతో నలుగురిలో అల్లరి చేసేవాడు.

ఒకసారి, “ఉన్న ఒక్కపిల్లనే సరిగా తిండిపెట్టకుండా పెంచుతున్నాం, ఇక పిల్లలు తనకు వద్దనుకొని”, ప్రక్కింటి మామ్మనే సాయంగా తీసుకెళ్ళి, ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది బుజ్జమ్మ.

“కొడుకు పుట్టాలని నేనెదురుచూస్తూంటే, నాకు చెప్పకుండా ఆపరేషన్ చేయించుకుంటావా?” అని ఆరోజు నారాయణ చేసిన గొడవకు అంతే లేకపోయింది.

బుజ్జమ్మ పిల్లకు “రోజ” అని పేరు పెట్టింది. అయిదేళ్ళు రాగానే స్కూలులో జేర్పించింది. ఆ చిన్న క్లాసుకే ప్రయివేటు పెట్టి చదివించేది. పిల్ల చదువు కోసమని మరో నాలుగిళ్ళలో పని ఒప్పుకుంది.

అలా బుజ్జమ్మ ఆ సీరియల్‌లోని పనిపిల్ల కావేరి పడే కష్టాలను, తన కష్టాలను పోల్చుకుంటూ, ఆ కథలో కావేరి తన చెల్లెళ్ళనెలా చదివిస్తోందో, అలా తన కూతురిని చదివించాలని మనస్సులో దృఢసంకల్పం చేసుకుంది.

పట్టుమని 20 ఏళ్ళ వయస్సు కూడా లేని బుజ్జమ్మ జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలను తట్టుకుని, చదువురాని తాను తన కూతురి చదువుకై పడే తపనకు, మధురిమ తనకు చేతనైన సాయం అందించేది.

మధురిమ శ్రీవారికి ట్రాన్స్‌ఫర్ రావటంతో వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోయారు. ఇక ‘బుజ్జమ్మ’ ఆమెకు జ్ఞాపకాలలోనే మిగిలిపోయింది. పరుగులిడే కాలప్రవాహంలో 15 సంవత్సరాలు గడిచిపోయాయి.

చుట్టాల ఇంటిలో వేడుకలుండటంతో మరలా ఆ ఊరువచ్చి మూడు రోజులు ఉండాల్సి వచ్చింది మధురిమ. తాము ఉన్న పాత ఇంటికి వెళ్ళి, ఇంటిని చూసి, బుజ్జమ్మ విషయం అరా తీసింది.

“కూతురు పదవ తరగతి పాస్ కావటంతో చాలా సంతోషపడింది బుజ్జమ్మ. కాలేజిలో ఆడపిల్లలకు ఉచిత విద్య అన్నారని, భర్త వద్దన్నా, వాళ్ళను వీళ్ళను పట్టుకుని కాలేజిలో చేర్పించింది.

కానీ ఆ తాగుబోతు పెనిమిటి పడనిస్తేగా. ఎవరో నీకూతురు చాలా బాగుంటుంది. ఎదురుడబ్బిచ్చి మాకొడుక్కి చేసుకుంటామని అంటే, ఆ డబ్బుకోసమని కక్కుర్తి పడి, ఆ సంబంధం ఖాయం చేసుకొచ్చాడు ఆ వెధవ.

తాను ఎన్నో కష్టాలను అనుభవిస్తూన్నప్పటికి, కూతురిని చదివిస్తూంటే, దానికి అడ్డుగా నిలచిన భర్తను క్షమించలేని ఆ పిచ్చితల్లి నారాయణతో గొడవపడి, కూతురితో సహా వేరే ఊరెళ్ళి పోయింది. ఇది జరిగి మూడేళ్ళు కావొస్తోంది. బుజ్జమ్మ వివరాలు మరి తెలియలేదు” అని చెప్పిన వారి మాటలలో నారాయణపై వారికి తగ్గని కోపం కనిపించింది మధురిమకు.

“పెనుగాలికి అల్లలాడిన తన జీవితం, కూతురి జీవితాన దీపావళీ వెలుగులు నింపటానికి ఆసరాగా నిలవాలని నిర్ణయించుకున్న బుజ్జమ్మ, ఆ సీరియల్‌లోని కావేరి లాగానే ధైర్యంగా బ్రతికింది” అనుకుంది మధురిమ.

(సమాప్తం)

Posted in September 2021, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *