Menu Close

Alayasiri-pagetitle

మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు

సరస్వతి ఆలయం, టొరంటో, కెనడా

సరస్వతి ఆలయం, టొరంటో, కెనడా

ఉ: క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ, జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికిఁ, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్,
వాణికి. నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.

అని పోతనామాత్యుడు ఆంధ్ర మహాభాగవతం ప్రారంభంలో స్తుతించిన ఈ సరస్వతీ పద్యాలు ఎంత గొప్పవో తెలుగువారమైన మనకు విదితమే.

జ్ఞానసముపార్జనకు మూలస్తంభమైన ఆ చదువుల తల్లి సరస్వతి దేవి ఆలయాలు మన దేశంలో ఎక్కువగా లేవు. మన ‘సిరిమల్లె’ లో పెద్ది సుభాష్ గారు ‘వరవీణ’ శీర్షిక ద్వారా ప్రపంచంలో ఉన్న సరస్వతి దేవాలయాల గురించి వివరణ ఇచ్చారు. ఇప్పుడు శృంగేరి మఠం వ్యవస్థాపకుడు శంకర భగవత్పాదులు 7 వ శతాబ్దంలోనే శృంగేరి లో నిర్మించిన ఆలయ నమానాతో, ప్రస్తుత మఠాధిపతి శ్రీ శ్రీ భారతీతీర్థ స్వామీజీ ఆశీస్సులతో శృంగేరి మఠం వారు కెనడా దేశంలోని టొరంటో నగరంలో నిర్మించిన  సరస్వతి ఆలయం గురించిన విశేషాలే నేటి మన ఆలయసిరి.

సరస్వతి ఆలయం, టొరంటో, కెనడామన వేదాలలో నిక్షిప్తమైన సనాతన సంప్రదాయ పూజారీతులను అర్థం చేసుకొని, పరిరక్షిస్తూ, ప్రపంచానికి మరియు  భావితరాలకు అందజేయాలనే సత్ సంకల్పంతో శ్రీ శంకర భగవత్పాదులు 7 వ శతాబ్దంలోనే శ్రీ శృంగేరి విద్యాపీఠం నెలకొల్పారు. అప్పుడే ఆయన శృంగేరి లో ఒక సరస్వతి ఆలయాన్ని కూడా నిర్మించారు. ఆ ఆది శంకరుని జననం  మన పవిత్ర ధర్మాలను, ఆగమ పద్ధతులను అందరికీ సులభతరంగా అర్థమయ్యే విధంగా వివరించుటకు జరిగిందనే చెప్పవచ్చు. మహా పురుషులు ఒక నిర్ధిష్టమైన సంకల్పంతో, కార్యోన్ముఖులై ఈ భువిలో జన్మిస్తారు.

ఈ ఆలయ ప్రాంగణం అంతా ద్రవిడ దేవాలయ నిర్మాణ శైలిలో జరిగింది. ఆదిశంకరులు అద్వైతం ప్రచారం చేయడానికి నెలకొల్పిన నాలుగు మఠాలలో శృంగేరి శారద మఠం మెదటిది. దీనినే దక్షిణామ్నాయ మఠంగా చెబుతారు. దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యములో ఉన్న కృష్ణ యజుర్వేదము ఈ మఠానికి ప్రధాన వేదం. ఆ మఠం యొక్క ఆధ్వర్యంలో ఏర్పడిన శ్రీ విద్యా భారతి ఫౌండేషన్, కెనడా వారి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్వహణ జరుగుతున్నది. శృంగేరి శారద మఠం ప్రస్తుత అధిపతి అయిన శ్రీ శ్రీ భారతీతీర్థ స్వామీజీనే ఈ సంస్థ నిర్వహణను నియంత్రిస్తారు.

నేటి ఆధునికతకు అనువుగా అన్ని హంగులతో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని, 2010 జూన్ 20న, శ్రీ శ్రీ భారతీతీర్థ స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠతో పాటుగా వినాయకుడు, చంద్రమౌళి, ఆదిశంకరుడు, దుర్గా దేవి, హనుమంతుడు, కార్తికేయుడు, రాధాకృష్ణులు, రాముడు తదితర దేవతామూర్తుల ప్రతిష్ఠాపన కూడా జరిగింది.

౩౦వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ప్రధాన రాజగోపురం దక్షిణ భారత వాస్తు నమూనాను పోలి అంతా శృంగేరి ఆలయంలో ఉన్నట్లే ఉంటుంది.

ఈ ఆలయంలోనే ఉన్న ఒక వరండా ఇరువైపులా గోడల మీద ఆది శంకరుని జీవిత చక్రాన్ని పాలరాతి ఫలకలతో చెక్కి ప్రతిబింప చేశారు. శృంగేరి పీఠాథిపతులను కూడా వరుస క్రమంలో ప్రతిష్టించారు.

ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక మ్యూజియం కూడా నెలకొల్పారు. సామాజిక సేవలో భాగంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను, ఆధ్యాత్మిక తరగతులను కూడా నిర్వహిస్తున్నారు.

Posted in May 2018, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!