Menu Close
Teneloluku Page Title

గత సంచిక తేనెలొలుకు శీర్షికలో మొదలుపెట్టిన ‘సంపాదకీయం-నా అనుభవ పరిశీలన దృక్కోణంలో నాకు స్ఫురించిన అంశాలు’ తరువాయి భాగం ఈ సంచికలో పూర్తిచేస్తున్నాను.

నా దృష్టిలో సంపాదకీయం అనేది రెండు రకాలు:

ఒకటి, వ్యాపార దృష్టి తో వృత్తి ధర్మాన్ని పాటిస్తూ చేసేది. మొదట్లో వచ్చిన ఎన్నో సాహిత్య పత్రికలు నాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ, ఎంతో పారదర్శకంగా విమర్శిస్తూ, జీవన అభ్యున్నతికి దోహదకాలుగా పనిచేసేవి. అందుకు తగినవిధంగా సంపాదకులు ఎంతో నిబద్దతతో తమ విధులకు న్యాయం చేసేవారు. కాకుంటే ఆ శాతం తగ్గింది. ఆ నిస్వార్థ పారదర్శక సేవ ఈ మధ్యకాలంలో కొంచెం లోపించిందని నాకు అనిపిస్తున్నది. ముఖ్యంగా వార్తా పత్రికల్లో భాష కన్నా భట్రాజు ధర్మానికే మక్కువ చూపుతున్నారు. అటువంటి వ్యాపార పత్రికలకు వ్రాయాలన్నా, కూర్పరిగా పనిచేయాలన్నా మనకు పాత్రికేయ అనుభవం, అందులో పట్టా ఉండాలి. ప్రజల అభిమతానికి అనుగుణంగా మన అభిప్రాయాలను మార్చుకోవాలి. పైగా ప్రచురించే ప్రతి శీర్షికా వ్యాపార కోణంలోనే చూడాలి. ప్రతి క్షణం ప్రక్క పత్రిక మీద ధ్యాస వుంచి అనుక్షణం పోటీ ధోరణిలో సాగాలి. లేకుంటే మనుగడ కష్టం. ఇంతకన్నా నాకు ఇంకేమి తెలియదు.

వ్యవహారిక భాష పుట్టుక ఎవరో పండితుడు, మహానుభావుడు సృష్టించినది కాదు. సామాన్య జీవన విధానంలో మనిషి గ్రాంధిక పదాలకు అర్థాలు వెతికే పనిలో ఆ పదాలను మరింత సులభతరం చేయడం కొఱకు పర్యాయ పదాలు సృష్టించాడు. ఉదాహరణకు ప్రహసనం అనే పదానికి నవ్వులాట అని, ప్రక్రియ అనే పదానికి సులభంగా పనిలో విధము అని అనవచ్చు. అలాగే ప్రత్యూషము, ఉషస్సు అంటే సామాన్యులకు అర్థం కాదు అదే తెల్లవారుఝామున అనో లేక సూర్యోదయానికి ముందు అనో లేక తొలిపొద్దు అంటే సులభంగా అర్థమౌతుంది. మన తెలుగు భాష అందరికీ దగ్గరవాలంటే ఇలాంటి విధానాన్ని అవలంబించాలని నా వ్యక్తిగత అభిప్రాయం. ముఖ్యంగా ఒక్క అక్షరంతో అర్థం పూర్తిగా మారిపోయే పదాలు మన తెలుగులో కోకొల్లలు.

విరులు, సిరులు, గిరులు – ఈ మూడుపదాలలో మొదటి అక్షరం మాత్రమే వేరుగా ఉంది కానీ మూడు పదాలకు అర్థాలు పూర్తిగా మారిపోయాయి. విరులు అంటే పుష్పాలు, సిరులు అంటే సంపదలు, గిరులు అంటే కొండలు. పై మూడు పదాల మొదటి అక్షరాలు కలిపితే ‘విసిగి’ వేసారి పోతాము. అలాగే కురులు అంటే వెండ్రుకలు. ఇలా ఎన్నో తమాషైన విషయాలు మన తెలుగు సాహిత్యానికే మాత్రమే సొంతం.

ఇప్పుడు మన రాఘవ మాస్టారి పద్యాలు చూద్దాం.

అమ్మ నుడి అమృతం ..

తే.గీ: తేట తేట పలుకులతో తీపిగలిగి
చిన్ని చిన్ని పదములతో జిలుగులొలికి
అమ్మ లాలిపాటలవోలె హాయి గొలుపు
కమ్మనైన తెలుగు మన అమ్మనుడిర
తే.గీ: తెలుగు హద్దులు వేరైనా తేజమొకటె
మనల బుద్దులు వేరైన మనము ఒకటె
మాట యాసలెన్నైనను మధుర తెలుగె
ఎక్కడున్నను సంస్కృతి ఒక్క తీరె
తే.గీ: కట్టుబొట్టులు తెలుగోళ్ళ కలిమిపెట్టు
పప్పు పరమాన్న పచ్చడి దప్పలాలు
ప్రతిభ పాటవాల ప్రగతి పల్లవించ
దేశ దేశాల మన వారి తీరు యిదియె
తే.గీ: అట్టి తెలుగు వారల భాష అమృత ధార
అన్య భాషల నేర్చిన హాయి రాదు
అమ్మ నుడి పలకని వాడు అసలు మొద్దు
పుట్టిన ఫలమేమి కలుగు పుడమికసలు?!
Posted in December 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!