Menu Close
Teneloluku Page Title

సంపాదకునికి ఉండవలసినది భాషా పరిజ్ఞానాన్ని ఇనుమడింపజేసే సృజనాత్మకత. సూర్య కాంతి తెలుపు అని అందరికీ సుపరిచితమే. కానీ, కాంతి తరంగ ధైర్ఘ్యాన్ని మార్చి అందులో నుండి అందమైన వివిధ రంగులను సృష్టించవచ్చు. అలాగే విషయం పాతదే అవచ్చు కానీ దానిని విభిన్నంగా చూపించి అందులో కొత్తదనం నింపే బాధ్యత కూర్పరిదే.

వినూత్న రచనా ప్రక్రియతో పాఠకులను ఆకర్షిస్తే ఆ పిమ్మట వారికి భాషమీద ఆసక్తి కలిగి సాహితీ ప్రియులుగా మారి మన పంథాలో నడుస్తారు. ఆ విషయంలో సంపాదకునిదే ముఖ్య పాత్ర అవుతుంది.

మన తెలుగు భాష సంస్కృత భాషతో ముడిపడివుంది. కనుక గ్రాంధిక భాషలో వ్యాకరణ శుద్ధితో రచనలు చేయాలంటే సంస్కృత పరిజ్ఞానం కూడా ఎంతో అవసరం. అందుకు భాషలో పట్టాలు సాధించిన పండితులు మాత్రమే అర్హులు కారు. భాష మీద ఆసక్తి, మమకారం పెంచుకున్న ఎవ్వరైననూ అర్హత కలవారే. వారికి ఉండవలసిన ముఖ్య లక్షణం కృషితో కూడిన సృజనాత్మకత. అది లోపించిన నాడు ఎంతటి పండితుడైనను తన రచనలతో ఎదుటివారిని మెప్పింపజాలడు.

ఇప్పుడు మన రాఘవ మాస్టారు గారి “మన తెలుగు వెలుగు” చూద్దాం.

ఇది మన అమ్మ ఒడి
అమ్మ అనురాగపు నుడి
కమ్మదనాల చల్లని గుడి
తెలుగు ఓనమాల బడి

తేటగీతి:

౧.
సంస్కృతంబు లోని మధుర సారమంది
అరవభాష నుండి నుడుల అందమంది
కన్నడంపు కస్తూరికా వన్నెలంది
కమ్మనైన తెలుగు మన అమ్మ నుడిర
౨. పుడమితల్లిని వానలు తడిపినట్లు
పూలచెట్లకు తావిని పులిమినట్లు
తెలుగుమాటలు విన మేను పులకరించు
కమ్మనైన తెలుగు మన అమ్మ నుడిర
౩. జననికంటె గొప్ప యెవరు జగతియందు
అన్య భాషలు నేర్చిన హాయిరాదు
తల్లి భాషను మించిన తావిలేదు
అమ్మ నుడి పలకని వాడు అసలు మొద్దు
౪. తేనెకన్న మన తెలుగు తీయనన్న
మల్లె కన్నా మన తెలుగు తెల్లనన్న
వెన్నెల చలువకన్నను మిన్నయన్న
పరిమళ పునుగుకన్న సువాసనన్న
సోగాసులున్న మన తెలుగు సులభమన్న
Posted in November 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!