Menu Close
SirikonaKavithalu_pagetitle
గారెలూ! కమ్మని గారెలు! -- శిష్ట్లా తమ్మిరాజు
వారించగ లేము వాయవాయలు నివియే!
యారోగ్యము చూచు కొనుచు 
మీరిక తగుమాత్రము తిన, మీరకయాశన్
ఛాయ మినప పప్పు సరిగ బాగును జేసి  
   నానబెట్టిన పిదప నలుగ రుబ్బి
యాకునందు నదిమి నరయ రంథ్రము జేసి 
   మరుగు నూనెను తగు మసల వేచి 
మనసు దోచెడి రంగు మరులు గొల్పెడి పొంగు
   మెత్త మెత్తని గారె  మత్తు మత్తు
వాయ వాయను వేసి వడ్డించ తిననిదె 
   జిహ్వనందున నూట  జిల్లు జిల్లు 
కరకరా కొరుకుచూ కసపిసా నమలంగ 
   గొంతుజారి దిగగ వింత హాయి 
కమ్మని పెరుగులో కళపెళా నానిన 
   నావడ తిన్నంత హాయి హాయి 
యుల్లి జీరక మిర్చి నల్లము మసాల
   జోడించు గారెయే చుర్రు చుర్రు
పాకమందున నాని పదును పట్టిన యట్టి
   బెల్లపు గారెయే థ్రిల్లు థ్రిల్లు 
చుయ్యి చుయ్యి యనగ వెయ్యంగ చారులో 
   రసము గారె తినగ రంజు రంజు 
గారెలందు రుచుల గమ్మత్తు వేరయా 
   సాంబారు గారెన్న సంబరంబు 

భారతంబు వినగ బహుపసందు చెవులు
గారె తినగ జిహ్వ గంతు లేయు 
విశ్వమందు మనదె విఖ్యాత పేటెంటు 
చిల్లి గారె గొప్ప చెప్పతరమె!
భువికిరణం -- ఘాలి లలితా ప్రవల్లిక
దివి నుంచి భువికి వచ్చిన పుణ్యమూర్తులు
జ్ఞాన జ్యోతిని వెలిగించే దివ్య చరితలూ
                          " దివి "
అక్షరాలే అమ్మా నాన్న అన్ని బంధాలు
నల్లబల్ల సుద్దాముక్క ప్రియనేస్తాలు
అనుదినమూ నీతులు చెప్పి ,నడవడి శిల్పం చెక్కి
ఉత్తములనందిచే ఉపాధ్యాయులు
                           " దివి"
వృక్షానికి వేరువోలే అంతర్లీనమయ్యీ
మధురమైన ఫలాలు మహిన పంచు వారు
బాధలన్ని బొజ్జలొనుంచుకు చిరునగవులు చిందించి
రాయిని రత్నంగ మార్చే నేర్పరులు
                          "దివి"
గది సూర్యుడయ్యీ , విద్యార్థుల కిరణాలను
దశ దిశలా వ్యాప్తి చేసే దినకరులు
చిన్ని నోట ప్రపంచాన్ని , చూపించే సత్తా ఉన్నా
అలుపెరగని యోధులే అధ్యాపకులు
                            "దివి"
గడియ -ఘడియ -- రాజేశ్వరి దివాకర్ల

తాళాలు తెరచిన వీధికి,
గడియ బిగిసిన ఉనికి.
విక్రయాల బజారుకి
కొరతకలిగింది ఘడియలలో అమ్మకానికి.
సూర్యుడొచ్చిన ఉదయానికి
తూరుపు కొండ నునుపు అద్దానికి.
దసరా సెలవుల ప్రత్యేకానికి,
సంతోషం కలుగదు పిల్లలకి.
పేరంటాలు రాని తాంబూలానికి,
బొమ్మల కొలువు నామ మాత్రానికి.
యథావిథి జీవన గమనానికి,
ఆతుర పడుతున్న లోకానికి,
ఆచారాలు సంప్రదాయానికి.
వాన నీళ్ళు నిలిచిన చిన్ని గుంటల్లోకి,
చిలిపి తనం మాయ మై పోయింది
కాగితం చిరగని పడవల్లోకి.
కిటికీ కళ్ళ చూపుల్లోకి,
చల్లని గాలికి తిరిగే కబుర్ల తోటి,
భుజ భుజాలను
కౌగలించుకోవాలనుంది మనిషికి.
సంపదలివ్వని బేరానికి,
మనసు ముడుపు కట్టాలన్న
కొత్త కోరిక పుట్టింది ఇప్పటికి.
పూజారి ఇచ్చే తీర్థానికి
భయం పుడిసిలి పట్టడానికి ,
గుడి మెట్లమీద కనుపించరు
యాచకులిపుడు దానానికి.
ఆవిరులూదే పాశ్చాత్తాపానికి
ఆలస్యం ఎప్పుడూ కాదు
మరో ఆరంభానికి...!
సరి కొత్త రేపటికి
ప్రణాళిక వేయాలి
పర్యావరణ సుఖానికి,
మానవతాపథ నిర్మాణానికి.

నేను... స్వ తంత్రాన్ని -- విశ్వర్షి వాసిలి
నేను
స్వ తంత్రాన్ని
స్వాతంత్ర్యాన్ని.
•1•
నేను స్వాతంత్ర్యాన్ని
        దేశ స్వాతంత్ర్యాన్ని
        దేహ స్వాతంత్ర్యాన్ని
        మనసు స్వాతంత్ర్యాన్ని
        ఆత్మ స్వాతంత్ర్యాన్ని.
* మన దేహమంటే 
           మన దేశమోయ్ •
•2•
నేను స్వాతంత్ర్యాన్ని
        స్వాభావిక స్వాతంత్ర్యాన్ని
        పౌరజీవన స్వాతంత్ర్యాన్ని
        సామాజిక స్వాతంత్ర్యాన్ని
        భౌగోళిక స్వాతంత్ర్యాన్ని
* మన దేశమంటే 
           మన మోహమోయ్ •
•3•
నేను స్వాతంత్ర్యాన్ని
        మట్టికి వారసత్వాన్ని
        నలుదిక్కుల పౌరుషాన్ని
        పాంచభౌతిక సంస్కారాన్ని
        నింగికి ఎగసిన కేతనాన్ని
* మన మోహమంటే
           మన రాజ్యాంగమోయ్ •
ఘన కాలాగ్ని -- బులుసువేంకటేశ్వర్లు
ఘన కాలాగ్ని విషాహతాహత దిశా 
          క్రామ్యత్ పటు క్రూరమై 
  చన,  కాళిoదిని తిష్ట వైచిన విష 
           జ్వాలాహి సామ్రాజ్యమున్ 
  వణుకన్  త్రోలి , స్వదేశవాసిత జన 
          స్వాతంత్ర్యముల్ రక్ష జే
   సిన నీ నిర్మథనైక నాట్యములకున్ 
           జేజేలు గోపార్భకా !!
స్వచ్ఛభారతం ... అఖండ భారతం -- ఆచార్య రాణి సదాశివ మూర్తి
స్వచ్ఛభారతం ... అఖండ భారతం
రాష్ట్రశక్తి మేలుకొన్న నవ్య భారతం
ప్రబుద్ధ భారతం విశుద్ధ భారతం
సుక్షాళిత రాజకీయ స్వచ్ఛభారతం
మౌర్యచంద్రగుప్తుని కల నిజమాయెను చూడు
హర్షవర్ధనుని వారసులిదె వచ్చిరి నేడు
విదేశీయ వారసత్వపరిపాలనమంత మొంది
స్వచ్ఛమైన భారతీయ జనత వచ్చె గూడి.
                                       ||స్వచ్ఛభారతం||
జగద్గురువు శ్రీకృష్ణుడు ఆర్యుడు చాణక్యుడు
ఆచార్యులు శంకరులు సమర్థగురు రామదాసు
మహనీయులు తపోధనులు ఆశించిన భారతం
రాణా ప్రతాప్ శివాజి సాధించిన భారతం
                                       ||స్వచ్ఛభారతం||
ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు స్వేచ్ఛావాయువు వీచే
ఎన్నేళ్ళకు ప్రతి ఎడదను స్వాభిమానముప్పొంగె
భారతీయ జనతనొక్క తాటిపైన నడుప
స్వచ్ఛమైన భారతీయ జన నేతలు వచ్చె
                                       ||స్వచ్ఛభారతం||
కాశ్మీరం మణిపూరం అరుణాచల్ హిమాచలం
అస్సాం మేఘాలయ త్రిపుర ఉత్తరాఖండము
ఉత్తర ప్రదేశము మధ్య దేశము 
ఎటు చూసిన అటు భారత హాసరేఖలుదయించె
                                             ||స్వచ్ఛభారతం||
కేరళలో తమిళనాట కర్నాటక లోన
తెలుగు నాట ఉత్కళలో వంగభూమిలోన
భారతాంబదివ్యకళల చిత్కళ వికసించే
నవనవచైతన్యపూర్ణరవికిరణములలరించె
                                         ||స్వచ్ఛభారతం||
పోనీయకు పోనీయకు స్వపరిపాలనం తిరిగి
రానీయకు రానీయకు పరపాలన రానీయకు
స్వాభిమానమే మతం శక్తి భరిత పాశుపతం
స్వాతంత్ర్యపు పాంచజన్య ఘనశంఖారావం
                                          ||స్వచ్ఛభారతం||

చివరి నుంచి రెండవ చరణం దక్షిణ భారతాది రాష్ట్రాలగురించి. ఈ చరణాన్ని ఆచార్య శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ వర్యుల సూచనపై జోడించటమైనది.

కొత్త బట్టలు -- వేణు ఆసూరి
“కొత్త బట్టల్లో భలే ముద్దొస్తున్నావురా!”
  అమ్మ కళ్లలో ప్రేమ, మురిపెం
నా ముఖం మతాబులా వెలిగిపోవడం
  బుగ్గ మీద అమ్మ పెట్టిన ముద్దు
అన్నీ ఙ్ఞాపకమే నాకు!

“కాలేజికి వెళ్తున్నావుగా, మంచి ప్యాంట్లూ, చొక్కాలు తీసుకో”
  ఎదిగిన కొడుకుని చూసిన నాన్న కళ్లలో ప్రేమ, గర్వం
నా గుండెల్లో నాన్నంటే అభిమానం, గౌరవం
  అమ్మ వైపు చూసి నవ్వడం
అన్నీ ఙ్ఞాపకమే నాకు!

“హ్యాపీ బర్త్ డే శ్రీవారు! కొత్త బట్టల్లో హీరోలా ఉన్నారు!”
  మెచ్చుకోలుగా చూస్తున్న శ్రీమతి గుండెల్లో ప్రేమ
శ్రీమతి గుండెల్లో నేనే హీరోననే గర్వం ఒకింత,
  పైకి మాత్రం గంభీరంగా ‘అవునా?’ అంటూ అద్దంలో చూసుకొని తల సవరించుకోవడం
అన్నీ ఙ్ఞాపకమే నాకు!

“నాన్నా, ఈ రోజు మీ బర్త్ డే, హ్యాపీ బర్త్ డే నాన్నా!”
  కొత్త బట్టలు నా చేతిలో పెట్టి ప్రేమగా ఆలింగనం చేసుకొన్న కుమారుడు
“ఇప్పుడివన్నీ ఎందుకురా” అన్నా, వాడి ప్రేమకి ఉప్పొంగిన గుండె
  వాడికి ఇంకా నేనంటే ఉన్న ప్రేమని తలచుకు గర్వం
అన్నీ ఙ్ఞాపకమే నాకు!

“రావోయ్! కొత్త బట్టలు నీ కోసమే, ఈ శరీరం శిథిలమయిందిగా”
  చిరునవ్వుతో, అనంతమైన ప్రేమా, సౌజన్యాలతో మహా తేజమొకటి పిలిస్తే
కనులు మసకబారుతూ, ఊపిరి భారమవుతూ
  నే పలికిన ఆఖరి మాటలు - “మళ్లీనా? ఇంక నాకే కొత్త బట్టలు వద్దు ప్రభు!”
Posted in September 2021, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *