Menu Close
SirikonaKavithalu_pagetitle
ప్రశాంత మందిరం -- పి.లక్ష్మణ్ రావ్

వాలు కుర్చీలో కూర్చొని
నిశిరాత్రిలో నక్షత్రాలను
కంటి రెప్పలతో
లెక్కబెడుతుంటాను

గతానుగత
జ్ఞాపకాల దొంతరలను
ఒక్కొక్కటిని
కన్నీటి సాక్షిగా విప్పుతుంటాను

గుండె పొరల్లో దాక్కున్న
నిట్టూర్పుల ఉచ్ఛ్వాసలను
దుఃఖ భారంతో
నిశ్వాసిస్తుంటాను

కంటిరెప్పల మాటున
నిలిచిపోయిన
దుఃఖాశ్రువులను
ఓదార్పు గీతికలుగా మలుస్తుంటాను

వీలు కుదరనప్పుడల్లా
వాలు కుర్చీయే
నాకు విశ్రాంతినిస్తుంది
వీగిపోయినప్పుడల్లా
వాలు కుర్చీయే
నాకు మనశ్శాంతవుతుంది!

మైత్రి -- గంగిశెట్టి లక్ష్మీనారాయణ

నిన్నునిన్నుగా చూద్దామంటే
నీలో నాకు నిన్న కనిపిస్తోంది
నీకూ నాకూ నడుమ నిన్న చీకటి కట్టిన
ఇనుపగోడలు కనిపిస్తున్నవి
ఇనుపగోడల చాటున ఇనబింబం
ఇంకా బందీపడ్డట్లున్నది
లేకుంటే నీ ముఖం ఎందుకలా నల్లబడ్డది?
ఏ క్రోధం ఎరుపులు ముదిరి  నల్ల బరుస్తున్నవి
జ్ఞానవంతుడా! నువ్వే చెబుతావు కదా
నీ నిన్నకు నువ్వు వారసుడివి కాదని
ఇకెందుకు ఆ నిమ్నోన్నతాల భారాన్ని మూపు కెత్తుకోవడం
వారసత్వ సంపదకు మురిసిపోవడం
సాటిమనిషితో సమంగా పంచుకోలేని వారసత్వ సంపదెందుకు
హృదయం గడపకావల నిలిపిపంపే వైభవప్రదర్శనమెందుకు
నువ్వే అంటావే -నిన్న గతించింది, నేడు తాజాగా నిశ్వసిస్తోందని!
ప్రతి చోటా ఈ నిన్నా, నేనూల వాపెందుకు
నేటి ప్రాణ వాయువును నిన్నటి బొగ్గుపులుసుతో రేపటిని కూడా కలుషపరచడమెందుకు
అందుకే నిన్నెంత ప్రేమిస్తున్నా నీనుంచి దూరంగా వచ్చేశా
నీ వీధి ఇనుపగుమ్మం పదును గుమ్మటాలు గుచ్చుకొన్న జ్ఞాపకం వెంటాడుతోంటే
నీ వీధీ, ఊరూవాడ వదిలి దూరంగా ఒంటరి పూరిల్లు వేసుకొని పందిరి అల్లుకున్నా
నిత్యం తాజాగా పూసే పూల
సహవాసంలో కొత్త ఊపిరి పీలుస్తూ...
అసూర్యంపశ్యంగా తాతలు కట్టిన భవంతిలో ఊపిరాడనప్పుడు ఇటురా!
ప్రకృతిఇచ్చే పరిమళాలతో విందు చేసుకొందాం
ఏ గోడల్లేని ఆరుబయలులో మైత్రిని పంచుకొందాం
రగిలే చైతన్యాన్ని నాలో నింపే నేస్తమా!
నిన్న లేని నిన్నును ఒక్కమారు ఆలింగనం చేసుకోవాలనుంది
చేయీ చేయి కలిపి రేపటిలోకి సాగాలని
చేదోడువాదోడుగా రేపటితోట పెంచాలనుంది
విచ్చేయవా, ఈ ఆశ తీర్చవా?

ఆ నలుసే -- అభిరామ్

అక్షరం అణుబాంబు
పదం పాశుపతాస్త్రం
వాక్యం ఏకమైన సూర్యకిరణాల సమూహం
కవిత్వం భూతల భావకెరటాల విశాలసంద్రం
అందులో కవి
అణువును అరకోటీ ముక్కలు చేయగా మిగిలే నలుసు
ఆ నలుసే,
భూతల భావకెరటాల విశాలసంద్రంపై
విహరించే నిత్య విహారి

కోతల సమయం‬ -- వేణు ఆసూరి
నారు, నీరు పెట్టని వారు
    రెక్కలు ముక్కలు చేయని వారు
కోతల సమయం వచ్చేదాకా
    పొలాల గట్లే దాటని వారు

పదులో పరకో కూలీ పంచి
    పంటలనెత్తుకు పొయ్యేవారు
భుమిని దున్నని ‘భూస్వాములు’ వీరు
    ప్రజలే పట్టని ‘ప్రజాస్వామ్యులు’ వీరు
ఇది పంటలు చేతికి వచ్చే సమయం
    ఎన్ని 'కలలో' పండే సమయం
ఇది కోతల సమయం
    కోతల ‘రాయళ్ల’ కాలం
నువ్వూ-నేనూ -- స్వాతి శ్రీపాద

చెప్పాలన్న ఆలోచనే సోకదు 
తలపులు అటునుండి ఇటూ 
ఇటు నుండి అటూ 
మాటలు కూర్చుకోకుండానే 
తేనె వాగుల్లా ప్రవహిస్తాయి కదా 
చుట్టూ పరిమళిస్తున్న 
నక్షత్రాలు ఒక్క క్షణం ఆగి 
నీ కళ్ళల్లో తళుక్కు మంటాయి కదా 

చెప్పాపెట్టకుండా 
పారిపోయావన్నఊహ 
అణువణువునూ తొలిచెయ్యకముందే
అగరుపొగలా అల్లుకుపోయి 
ఉక్కిరిబిక్కిరి చేస్తావు కదా 
కనురెప్పలు వాలితే చాలు 
రెక్కలుకట్టుకు వాలిపోయే నీకు 
పెదవికదలని తపన ఎలా వినిపించను? 

చుట్టూ పరచుకున్న 
నీ చిరునవ్వుల మధ్య 
మెత్తని చూపుల పచ్చదనంలో
పసిపాపనై ఆదమరుస్తానా 
ఆనవాలుగా ముని వేళ్ళ స్పర్శ 
చెక్కిళ్ళపై వదిలి 
రాత్రికి వీడ్కోలు పాడతావు 

వెతికి వెతికి వేసారే దిగులు చూపులు 
వెన్నంటి అనుసరిస్తూ 
కనిపించకుండా వినిపిస్తావు. 
ఎన్నిసార్లో 
ఆగిపోయిన సమయాన్ని వెన్నుతట్టి 
అక్షరం అక్షరానా పాటై ప్రవహిస్తావు. 

నదులూ సముద్రాలూ నయాగారా జలపాతాలూ 
పచ్చని చెట్లూ వెచ్చని వెలుగులూ 
పిడికిట్లో నా వాకిట గుమ్మరిస్తూనే ఉంటావు 
ప్రతిఉదయం కళ్ళుతెరవగానే
పాదాలపై రాలిన పారిజాతమై పలకరిస్తావు 

మూల మలుపు మసక వెలుతురులో యుగాలుగా ఎదురు చూస్తూనే ఉంటావు 
పల్చని ఈ తెర చీల్చుకు పరుగెత్తుకు వచ్చే 
నా కోసం!!!!

నేను ... మరణ వాంగ్మూలాన్ని -- విశ్వర్షి వాసిలి

•1•
నేను
చీకటిలో ముసుగుతన్ని నిద్ర నటిస్తున్నప్పుడు
నా మనసు మరింతగా తేజరిల్లుతుంటుంది
నా ప్రాపంచికతను జోకొట్టి పరుండబెడితే
నా మనసు 
నా శ్వాసలో ప్రాణం పోసుకుంటుంటుంది
అయినా, ప్రతిరోజూ
ఎంతోకొంత చస్తూనే ఉన్నాను కదూ!

•2•
అయిదు నక్షత్రాల 
సంపన్న భోజనానికి ఖరీదు చెల్లిస్తున్నప్పుడు
స్వాగతం పలికిన ద్వారపాలకుడి 
నెలసరి ఆదాయం కళ్ల ముందు మెదిలి
నా ఆలోచనను కప్పిపుచ్చుకున్నప్పుడు
ఎంతోకొంత చస్తూనే ఉన్నాను కదూ!

•3•
సంతకెళ్లిన నేను బేరమాడి
తక్కువకే కొనగలుగుతున్నానని మురిసిపోతుంటే 
తక్కెడ పట్టుకున్న బుడతడి చూపు 
నన్ను చుట్టుముడుతుంటే
ఎంతోకొంత చస్తూనే ఉన్నాను కదూ!

•4•
ఖరీదైన వస్త్రధారణలో 
నాకు నేనే షరాబునవుతుంటే
గుండెగదిలో బాంబు పేలినట్టయి తడుముకుంటే
నా కారు కిటికీనుండి 
చూపుల్ని పిండిన ఆ పిగిలిన బట్టల అందం
నా సంస్కారాన్ని బద్దలు చేస్తుంటే 
ఎంతోకొంత చస్తూనే ఉన్నాను కదూ!

•5•
నేను కన్నతల్లి పుట్టినరోజుకి
సమాజంమెచ్చే కానుక కొన్నప్పుడు
మెరిసిన చిట్టితల్లి కనుపాపల్లో
ఎండిన డొక్కతో 
వీధినపడ్డ నిర్జీవ చూపులు వెంటాడుతుంటే
ఎంతోకొంత చస్తూనే ఉన్నాను కదూ!

•6•
మా వొళ్లు అలవకుండా 
అన్నీతానే అయి నిర్వహించే పనిమనిషి
సలసల మంటున్న జ్వరంలోనూ 
బడికెళ్లే పిల్లని 
మా పనులకు పురమాయించినపుడు
నా చేతిలోని న్యాయశాస్త్ర పుస్తకాన్ని
తదేకంగా చూస్తున్నప్పుడు 
జిడ్డోడుతున్న నా జీవితం నిలదీసినప్పుడు
ఎంతోకొంత చస్తూనే ఉన్నాను కదూ!

•7•
ఒక అత్యాచారం మరొక ఆత్మహత్య
న్యాయదేవత కళ్లకు గంతలు విప్పమన్నప్పుడు
ఖజానాలో వొళ్లు విరుచుకుంటున్న
కాసులమ్మ సమ్మోహనంగా పిలుస్తుంటే
నన్ను మరచిన ఆ క్షణాలలో
ఎంతోకొంత చస్తూనే ఉన్నాను కదూ!

•8•
ఈ జీవనక్షేత్రంలో
మతాలు కులాలు దాయాదులవుతుంటే
నాటి కురుక్షేత్రపోరు నాలో జరుగుతుంటే
నా నిస్సహాయత, చేతకానితనం
రాజకీయ అభిమన్యులకు ముసుగుతొడిగి
బాధ్యత మోసినట్టు మీసం మెలేస్తూంటే
ఎంతోకొంత చస్తూనే ఉన్నాను కదూ!

•9•
నా నగరం కాలుష్య కాసారమయిందంటూ
నల్లద్దాల కారులో నా ఊపిరిని చల్లబరచుకుంటూ
ఆక్సిజన్ హబ్లో ప్రాణం నిలుపుకుంటూ 
నా వాహనమొక్కటి నగరాన్ని రక్షించదనుకుంటూ
ఏసీ గదిలో విదేశీ బ్లాంకెట్లో వెచ్చబడుతూ
ఎంతోకొంత చస్తూనే ఉన్నాను కదూ!

•10•
అవును, చీకటి మరింతగా చిక్కబడుతూనే ఉంది
నా మనస్సాక్షి నిలదీస్తూనే ఉంది
తనలో తాను శ్వాసిస్తూనే ఉంది
ఆశ్చర్యం !
రోజు కింత చొప్పున 
ఎంతలా చంపుకుపోతున్నా 
ఇంకా సమాధి స్థితికి చేరుకోదేం!
(Rashmi Trivedi 
“My Dying Conscience"కి 
అనుకరణ, అనుసృజన)

Posted in July 2021, సాహిత్యం

1 Comment

  1. Venugopal Rao Gummadidala

    చాలా బాగుంది దీన బ్రతుకుల రంగుల చిత్రం .. అలవోకగా భావాలని విప్పిన కుంచె అభినందనీయం..

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!