Menu Close
SirikonaKavithalu_pagetitle
సఖీ! -- గంగిశెట్టి ల.నా.

నా పట్ల నాకు స్పృహ మొదలైనప్పుడు
నువ్వు తారసపడ్డావు
నన్ను నేనర్థం  చేసుకోడానికే నువ్వున్నావని తెలియదు
నా అర్ధానికి నీ అర్ధం పరిపూర్ణత జత అని తెలియదు
మనం ఒకరికొకరి పరిశేషమనీ తెలియదు
కలిసిన మొదట్లో నేనో గోళం నువ్వో గోళం అనుకొన్నాను
కలుస్తున్న కొద్దీ తెలుసుకొన్నాను ఇద్దరమొక ప్రపంచమని
కలిశాక తెలిసింది మనమే విశ్వమని...

ఒకరిలో ఒకరం ప్రవేశించాకనే కదా
మనలో విశ్వం అర్థమయ్యేది విశ్వకీలకాలు మనమేనని బోధపడేది
కీలలుగా మన ఉనికి సార్థకమయ్యేది...

మండుతున్న మంటకు తెలియదు కాంతి విలువ
ఎగరేసిన చుక్కానికి తెలియదు సాగర ప్రశాంతి విలువ
కానీ ఒడ్డుకు తెలుసు నౌక మోసుకొచ్చే విలువల విలువ

అనంత తీరమై పరచుకొన్న సఖీ! నువ్వే నా విలువ
లంగరేసిన జన్మాంతర భారయానాల విలువ
తడి సైకతాల్లో మెరిసే నక్షత్ర సందేశాల గుప్త విలువ!

భావుకత్వం భాసిస్తున్న భవ్యమైన కవిత్వం. నా విలువ ..... నువ్వే అంటున్న అభివ్యక్తి చాలా బాగుంది. ఈ కవిత మొదట్లో ఉన్న *నా* చివర్లో ఉన్న *విలువ* వెరసి కవీంద్రుల అంతిమ నిర్ధారణ నా విలువ నువ్వే... ఆద్యంతాల కలయిక వల్ల ఈ భావం ముద్రగా తెలుస్తుంది.

Gangisetty Laksmi Narayana: నా *సఖి* ని శంసించిన రసజ్ఞులందరికీ పేరు పేరునా నమోవాకాలు.

(త్వమేవాహం అనే మాటకు నిర్వచనంగా భావిస్తూ దీన్ని రాసుకొన్నా. దాన్ని సరిగ్గా చూపెట్టేలా వ్యాఖ్యానించిన చి. గంగిసెట్టి లక్ష్మీనారాయణకు ధన్యవాదాలు)

ఇవ్వాళ .... -- స్వాతి శ్రీపాద

బడి గంట మోగించినట్టు
ఏ గంట లోలోన మోగుతుందో కాని
సరిగ్గా వెలుగు రేఖలు సగం దూరం
వచ్చీ రాకముందే
చటుక్కున ఏ లోకం నుండో
ఇక్కడకు జారినట్టు మెలుకువ.
కంటిరెప్పల మీద వాలిన
నిద్ర రెక్కలు విదిలించుకు
అదృశ్యమవుతుంది
అయిష్టంగా మొదలైన
రోజువారీ పరుగుపందెం
కుంటి సాకుల మధ్య
ఊపందుకుంటుంది.

ఎవరి వ్యాపకం వారిని నిలువునా ఆవహించి
తలుపులు బార్లా తెరిచి ఆహ్వానిస్తుంది
గడప పక్కనే ముడుచుకు కూచున్న భయం
కాలు ముందుకు సాగనివ్వదు.
అయినా తాజాగా మందహాసాలు పండించిన
హరిత బాలలు
పరామర్శలతో బాటు
చల్లగాలితో ఉషోదయం పలుకుతాయి.
అక్కడే కదా కుళ్ళూ కుతంత్రాలూ
రాజకీయాలు మచ్చుకైనా సోకవు.

చినుకుల సడి తట్టి లేపగానే
వదలలేక వదిలే పసికూన మనసుతో
వెనక్కు మళ్ళక తప్పదు.
ఇహ మొదలు
నెమరువేత వ్యవహారం.
నీ,నా లతో మొదలై ప్రపంచం చుట్టివచ్చే
గాలి తిరుగుడు.
ఎప్పటెప్పటి కధలో గాని
ఏ స్టోరేజీ అవసరం లేని ప్రవాహం కదలి వస్తుంది.

అయినా రేపుందో లేదో తెలియని తనాన
తిరిగిరాని నిన్నను నెమరేసుకోడం
తలకి రోకలి చుట్టుకోడమే కదా...
కాస్సేపు రేపంటూ లేనివారికి
చేయూతకారాదూ
కన్నీటి చారలు వాలిన చెక్కిళ్ళనో సారి
మెత్తగా అనునయించరాదూ ....

కొన్ని ప్రేమ బిందువులు..! -- డా పెరుగు రామకృష్ణ

ప్రేమ పెగ్గు
చాలా సేపటి
ముందు తాగాను
మత్తు ఇప్పటికింకా దిగలేదు..

ఒక నేనేమో స్వయంగా
నిషాలో ఉన్నాను
ఒక నువ్వేమో స్వయం
నిషావై ఉన్నావు..

నీ నిషా పట్ల ఇంతగా
మిడిసి పడకు ఓ!మధుబిందూ!
నీకంటే అధికనిషా
ఆమె కన్నుల్లో ఉంది..

ప్రేమ మత్తు ఎంత గాఢంగా ఎక్కిందంటే
నేనెప్పుడు నీవాడినయ్యానో తెలియనేలేదు..

స్మృతుల
నిషాలో ఉంటాను
నిషాలో
నిన్ను స్మృతిస్తుంటాను..

అద్బుతం
నా మనసులో నీ ఉనికి..
నాకు నేనే దూరం
కానీ నువ్వు నాలోనే..

ఎంత సంక్షిప్తంగా
నాజీవితం
గూర్చి చెప్పను..?
నీ పేరే నా జీవితం..!

వొరలచ్చిమి రొతం -- డా. కె.గీత

సత్తెపెమాణకంగా సెప్తున్నాను
సారుమతమ్మకొచ్చిన కల
నాకెప్పుడూ రానేదండి
ఏమాట కామాట
మాకసలు గొప్ప గొప్ప కలలుండవండి
ఎప్పుడూ ఒకటే కలండి బాబూ!
వోనలో తడుసుకుంటా
జెలగల్ని పీక్కుంటా
నాట్లెయ్యకుండానే
వొరి పిలకలు
కిసుక్కున నొవ్వుకుంటా
బుర్రలూపుకొచ్చేత్తాయండి-
పొగులల్లా ఒడిసి రాయి తిప్పకండానే
పిట్టలు కల్లో రాల్తాయండి-
రోజల్లా రెక్కలిరిగీలా కుప్ప నూరకుండానే
కూలి గింజలు గంపలో పెత్తెక్ష్యం అయిపోతాయండి-
అమ్మగోరు మా దయగల మాతల్లి
నడుం బడిపోయీలా
తిరగలి తిప్పినందుకు
"బూర్లొండుకోయే" అని మినప్పొప్పోసినా
నూనీ, బెల్లం అప్పిచ్చీ సావుకారేడండీ?
అయినా మాకు రొతాలొద్దండి-
తల తాకట్టెట్టైనా
పిసరంత ఎండో, బంగారమో మూలనెట్టాలంట
గెంజి నీళ్లకి గతిలేకపోయినా
పిండొంటలొండి నైవేద్దాలెట్టాంట
రోజూ తాగొచ్చి ఈపు ఇమానం సేసీసీ
పెనిమిటి కాళ్ల మీదపడి దణ్ణవెట్టాలంట
అయినా మన్లో మన మాట-
కడుపులో
పేగులు నకనకలాడతన్నా
మా పిడకల దాలి యెచ్చదనానికి
పొగులూ, రేత్తుళ్లూ
మా గుమ్మం కాడే
ముసుగెట్టి తొంగునే
నా సయితి
దయిద్రలచ్మికీ-
డబ్బున్నకాడే కొలువుండే
వొరలచ్చిమికి-
పడదండి

సుజలాం సుఫలాం -- డా.కోడూరు ప్రభాకరరెడ్డి
కృష్ణవేణీమాత కృపజూడ చల్లగా
  పంటలే ముక్కారు పండుచుండు,
గోదావరమ్మ మా బాధల నాలింప
 వరదలే మా గడ్డ దరికి రావు,
తుంగభద్రానదీతోయమ్ము తియ్యన
 మా తెన్గు మనుషుల మనసు తేనె,
పెన్నమ్మ మా పాలి పెన్నిధిగా నిల్చి
 సన్నిధి సేయను స్వర్గసీమ,

ఇంత సంపద మా తల్లి చెంతనుండ
పరుగులెత్తము మేమింక పరుల చెంత
మంచి మనసులు మాతకు మాల చేసి
పూజ సేతుము భక్తితో పుత్రచయము!

 (రచనాకాలం:1972-73) 
బ్రతుకుట ప్పులు -- డా. రాయసం లక్ష్మి

"ఇన్నేళ్లు గడిచాయి... ఇంకా ఎవరికి అప్పులు పడ్డామని?
అర్థాలంటే ఏమిటని?"
ఓ గడ్డిపువ్వు అడిగింది నిస్సహాయంగా..

"ముందుకు తోసుకు వెళ్లడానికి
సందుచాటు ఇరుకు బతుకులు చాలించి
విశాలతత్వంతో మమేకమై
విశ్వ విపంచులుగా మ్రోగడానికి
వినీలాకాశంలో
హద్దులు లేని
పద్దులు రాయని
ప్రపంచంలోకి
ఎగరడానికి వలను కాని ఈ బ్రతుకేమిటని?"
మంచు కన్నీటి బిందువులు రాలుస్తూ తనే అనుకొంది జాలిగా...

పక్కనల్లుకొన్న తీగ పలికింది అంతర్వాణి గా
"అప్పులు పడ్డాం నేస్తమా!
జన్మాలకు, జన్మకారకులకు
అర్థాలు వెదుక్కొంటూనే ఉన్నాం సఖ్యమా
జన్మ కారణాలకు
జన్మాంతర బంధాలకు
జన్మ నుంచి జన్మదాకా
జాడలేని వాసనల అర్థమేమిటా అని ఆరాటపడుతూనే ఉన్నాము
అంటుగట్టిన తీగలమై అల్లుకుపోతూనే ఉన్నాము
పందిరి పూవాసనలు మనం పీల్చకుండానే
నేల రాలుస్తూనే ఉన్నాము
నేల అప్పులు తీర్చుకొంటున్నాము
నింగి మెప్పుల కాశ పడుతున్నాము"

గట్టి నిట్టూర్పుతో చలిస్తూ
గడ్డి పువ్వనుకొంది:
"అమ్మకు పడ్డ అప్పు
ఈ జన్మలో తీరేనా
అర్థాలు వెతికినా
వాసన తొలి రూపు తెలిసేనా
కొత్త దారులు వెతుకు తుంటే
మల్లెలుకట్టిన బట్ట వాసనలా
పాతడొంకలూ కదులుతాయిగా
అంటుగట్టినా
పందిరితో ఎంత మమేకమైనా
పూలు రాల్చక తప్పదుగా
పూలు పూయడం
రాలి పోడానికేగా....
నేల అప్పులకు వృద్ది
నింగిమెప్పులపై బుద్ధి...
ఇదిలా సాగాల్సిందే నేస్తమా
ఈ పచ్చoదనమే మన మూల ధనంగా"
మలయ మారుతం తోడురాగా
పులకిస్తూ అంది పిచ్చి గడ్డిపువ్వు పచ్చపచ్చగా ......

Posted in March 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!