Menu Close
ప్రేరణ

ఉప్పలూరి మధుపత్ర శైలజ

-- ఉప్పలూరి మధుపత్ర శైలజ --

డెబ్బైయ్ ఏళ్ళ కాంతారావుగారు విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీలో పనిచేసి ప్రస్తుతం కొడుకు శేఖరం దగ్గర విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు.

ఒక్కడే కొడుకు కావటంతో గారాబంగా పెరిగినా మనవడు సందీప్ బీ.టెక్ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం వున్న కరోనా సంక్షోభం వల్ల “వర్క్ ఫ్రం హోం” చేస్తూ వైజాగ్‌లోనే తండ్రి దగ్గర ఉంటున్నాడు. ఎంతసేపూ “కాల్‌లో ఉన్నాను” అనే సందీప్‌తో ఆదివారాలు తప్పితే ఎక్కువగా మాట్లాడే అవకాశమే కుదరదు కాంతారావుగారికి. అందుకనే కళ్ళు కనబడటంలేదనే మిషతో రోజూ ఉదయమే సందీప్‌తో పేపర్ చదివించుకునే పని పెట్టుకున్నారు.

“తాతగారూ! మీరు టిఫెన్‌తినడం పూర్తయ్యిందా? కాఫీ తాగారా? మీకు పేపరు చదివి వినిపించి నా పనులు చూసుకుంటాను” అన్న సందీప్ మాటలు వినబడ్డా, వినబడనట్లు నటిస్తూ, నవ్వుకుంటూ “ఏమిట్రా కన్నా! నీలో నీవు గొణుకుంటున్నావు. మరోసారి చెప్పు నాకేమి అర్ధంకాలేదు” అన్నారు కాంతారావుగారు.

తాతగారి మాటలకు “ఛా! ఈ ముసలాళ్ళొకరు చాదస్తంతో విసిగిస్తూంటారు” అని సణుక్కున్నాడు సందీప్.

ఇంతలో అటుగా వచ్చిన శేఖరం “ఏరా! తాతగారు పెద్దవారైనారు. నీతో ఓ అరగంటైనా గడపాలనే కోరికతోనూ, నీకు తెలుగు రావాలనే ఆశతోనూ నీతో పేపర్ చదివించుకుంటున్నారు. దానికేంటి పెద్ద ఫోజులిస్తావు? ఇప్పుడు నీవు బయిటకెళ్ళి చేసే రాచకార్యాలేమున్నాయట?” అన్నాడు కోపంగా.

“చాలు, చాలు నాన్నా! ఆ పేపర్ ఇటివ్వండి” అంటూ విసురుగా లాకున్నంత పని చేసి, “తాతగారూ ఇక వినండి” అని పేపర్‌లోని హెడ్‌లైన్స్ చదవటం మొదలుపెట్టాడు బిగ్గరగా.

“రాష్ట్రానికి కరోనా టీకాలు వచ్చేశాయి! ముందుగా డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య కార్మికులకు అందజేస్తారుట. విశాఖ ఉక్కు ఇక ప్రయివేట్ పరం. ఆంధ్రుల భవితను కాలరాస్తున్న కేంద్రం” అని చదువుతున్నాడు సందీప్‌.

“ఆగరా ఆగు! మన విశాఖ స్టీల్స్‌ను అమ్మేస్తున్నారా? ఎంత దారుణం. ఎందుకురా అమ్మటం? ఏమైనా అవకతవకలుంటే సరిచేయాలిగానీ, అమ్మేస్తారా? మన ఆంధ్రుల హక్కుగా దాన్ని పొందటానికి నీలాంటి పిల్లలు చదువులు మానేసి, ప్రాణాలొడ్డి, ఆమరణ నిరాహార దీక్ష సాగించిన యువకుల త్యాగఫలంగా సాధించుకున్న తీపి కల మన ఉక్కు ఫ్యాక్టరి.

ఒక ప్రక్క నీలి సముద్రం, మరో ప్రక్కన స్టీల్‌ప్లాంట్ మన విశాఖకు ఠీవిని తెచ్చిపెట్టాయి. ఆ ఫ్యాక్టరీను చూస్తున్నప్పుడల్లా ఆ ఉద్యమంలో పాల్గొంటూ పోలీసుకాల్పులలో ప్రాణాలు విడచిన నా అన్నగారు గుర్తుకు వస్తారు.

1956లో ఆంధ్రప్రదేశ్ రాష్త్రమవతరించిన తరువాత దాదాపుగా 15 సంవత్సరాలు పోరాడితే వచ్చిన తీపి గుర్తు. ఇప్పటివలె పార్లమెంట్‌లో వార్షిక ప్రణాళిక అంటే ఉచితాలు, సబ్సిడీలు కాక అప్పటి ప్రభుత్వాలు ప్రతి ప్రణాళికలోనూ ఏదో ఒక ప్రాజెక్ట్ ను దేశాభివృధ్ధికి రూపొందించేవారు. అలా మన ఉక్కు ఫ్యాక్టరీ కొరకు అనేక మంది తమ విలువైన భూములను దానం చేశారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా మన రాష్ట్రాన్ని, తద్వారా దేశాన్ని అభివృధ్ధి పథంలో తీసుకెడతారని, స్థానిక ప్రజలకు ఉద్యోగాలొచ్చి వలసలు ఆగుతాయని ఆలోచించే ఆనాటి ప్రజ అంత గొప్ప ఉద్యమాన్ని నడిపారు.

అప్పటి తరంవారు చదువులు, కొలువులు, భూములు పోగొట్టుకుని సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రయివేటు పరంచేస్తే, వారి ఆశయానికి వెన్నుపోటు పొడిచినట్లుకాదా? విశాఖ ఖ్యాతిని తన ఉక్కు ఎగుమతులద్వారా రెపరెపలాడించిన సంగతిని మన నల్ల దొరలు మరచిపోయినట్లున్నారు.

దాని అభివృధ్ధిలో ఇప్పటి వృధ్ధుల భాగస్వామ్యం ఎంతో ఉంది. నాటి యువత ‘నేను, నా రాష్ట్రం, నా దేశం’ అంటూ జాతీయ భావాలతో ఎదిగిందిరా. మరి మీరో?” ఆవేదన, ఆవేశం కలగలసి ఆయాసం రాగా ఆగిపోయారు కాంతారావుగారు.

“నాన్నగారూ! ఊరుకోండి. ముందు కాసిని మంచినీళ్ళు తాగండి. ‘చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదుతారెందుకు’. మనం చేయాల్సింది మనం చేద్దాం’ అని ఊరడించాడు శేఖరం.

సందీప్‌ను పక్కకు తీసుకెళ్ళి, “తాతగారు ఈవార్త విని చాలా బాధపడుతున్నారు. నువ్వాయనతో వాదించి విసిగించకు. మీకు చరిత్ర అంటే బోర్. ఎంతసేపూ స్మార్ట్‌ఫోన్స్, వీకెండ్ పార్టీలు, సినిమాలు, షికారులు, పబ్‌లు వీటితో మీ జీవితం గడిపేస్తున్నారు. మీకీ విషయాలను తెలుసుకునే ఓపిక, ఆసక్తి లేదు. మరి మాతరం వాళ్ళం తల్లిదండ్రుల ఆదర్శాలను, ఆశయాలను అందిపుచ్చుకుని ఇంత కాలం ముందుకు నడిచాం. అందుకే ఈ వార్త మమ్మల్ని అంతగా కదిలించింది.

మీ తరానికి గాంధీగారంటే కరెన్సీ నోట్‌పై ఉన్న బొమ్మ, ఆయన జయంతినాడు సెలవు తీసుకుంటారుగానీ ఆయన చేసిన గొప్ప పనులు తెలియవు. తెలుసుకునే ప్రయత్నమైనా చేయరు. మీరు చేసేవి విదేశీ కొలువులు. మీరు ఈ స్టీలు ఫ్యాక్టరీ గురించి ఏం ఆలోచిస్తారు? అదీ తాతగారి బాధరా” అంటున్న తండ్రి మాటలకు ఆలోచనలో పడ్డాడు సందీప్.

“అమ్మా! కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకండి” అంటూ తన రూంలో కెళ్ళి తలుపులు మూసుకున్నాడు. సిస్టం ముందు కూర్చుని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ చరిత్రను అంతా చదివాడు. అమృతరావు అనే విద్యార్ధి చేసిన త్యాగం, భవిష్యత్తు కోల్పోయిన విద్యార్ధుల ఉద్యమ తీవ్రత సందీప్‌ను కదిలించాయి. అలా ఎంతసేపు కూర్చుండి పోయాడో.

“సందీప్ ఎంత సేపురా! తలుపు తీయ్. ఏమైనా సినిమా చూస్తున్నావా? లేక నిద్రపోతున్నావా?” అని బయటనుండి తల్లి కేకలు వినిపించి ఈలోకంలోకి వచ్చాడు.

తాతగారికి అన్నం తినిపించాలని తల్లి బలవంతం చేస్తోంది. “మామయ్యగారూ! లేవండి ఉదయం నుండి ఏమీ తినలేదు. ఇంట్లో పెద్దలు మీరు ఏమీ తినకుండా ఇలా పడుకునుంటే మాకెలా ఉంటుంది. లేవండి. మీరు ఒక్కరే ఇలా ఉపవాసాలు చేసి బాధపడుతూంటే ప్రభుత్వానికెలా తెలుస్తుంది?

మీ అబ్బాయి కూడా మీకు కోవలోనే ఆలోచిస్తూ ఉదయం నుండి మీతో పని చేసిన మీ స్నేహితులనందరినీ ఫోనులో పలకరిస్తూ. సాయంత్రానికి ఓ నోట్ వ్రాసి అందరి ఇళ్ళకు వెళ్ళి సంతకాలను తీసుకుని ప్రభుత్వాలకు పంపుతారట” అంది.

ఆమె మాటలను వింటున్న కాంతారావుగారు గభాలున లేచి, “మంచి మాటను చెప్పావు అమ్మాయ్! ఎంతైనా వాడు నా వారసుడు. నా అభిప్రాయాలు, బాధలు వాడికి బాగా అర్ధమౌతాయి. నా మనవడేడీ? నేనన్న మాటలకు చిన్న బుచ్చుకుని ఏ స్నేహితుడింటికి వెళ్ళి బాధపడుతున్నాడో. ఫోను చేసి వాడిని కూడా భోజనానికి పిలువమ్మా. ఇద్దరికి కలిపి అన్నం వడ్డిద్దువుగాని” అన్నారు.

రూంలో కూర్చుని తాతగారి మాటలను మననం చేసుకుంటున్న సందీప్, “వారి ఆలోచనలను నా సాంకేతికాయుధాలతో ప్రభుత్వానికి పంపిస్తాను. మా స్నేహితులనందరినీ సాయంత్రం ఇంటికి పిలిచి తాతగారి సలహాలతో దిశానిర్దేశం చేసుకుని ముందుకెడతాను” అనుకుంటూ “అమ్మా! అన్నంపెట్టమ్మా” అని తలుపు తీసి భోజనాల దగ్గరకు వచ్చాడు.

“ఓరే కన్నా! ఇంట్లోనే ఉండి మాట్లాడవేమిటిరా? ఇలారా” అంటూ సందీప్‌ను మురిపెంగా తన పక్కన కూర్చోపెట్టుకుని భోజనం ముగించారు కాంతారావుగారు.

ఆ సాయంత్రం కాంతారావుగారిల్లు “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అనే మరో ఉద్యమాన్ని ఎలా ప్రారంభించాలనే తలపు కలిగిన వ్యక్తులకు వేదికగా మారింది.

తాతగారి ఆరాటం, ఆవేదన ఈ తరం వారైన సందీప్‌ను, అతని స్నేహితులను కదిలించి, ప్రభుత్వాలకు లక్షల సంఖ్యలో సందేశాలను పంపి కదలిక తేవటానికి నాంది అయ్యింది. ఆంధ్ర రాష్ట్రమంతటా వ్యాపించిన ఉద్యమానికి మద్దత్తుగా రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్రానితో పోరుసలపటానికి కార్యోన్ముఖులయ్యారు.

“ప్రేరణ, ప్రోద్బలం ఉంటే నేటి యువత సరైన మార్గంలో దూసుకుపోతుంది” అని నిరూపించారు సందీప్ మిత్రబృందం.

(సమాప్తం)

Posted in May 2021, కథలు

2 Comments

  1. GSS Kalyani

    Nice story! తాతకు మనవడిపై ఉన్న అపారమైన ప్రేమను చూపించిన విధానం చాలా బాగుంది!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!