Menu Close
PrakriyalaParimalaalu_pagetitle
మధురిమలు

బాలగేయాలకు తగినట్లుగా అంత్య ప్రాసపదాలతో మాత్రా సహితమై లయాత్మకంగా సాగే మరో ఛందోబద్ద మినీ కవిత్వ ప్రక్రియ “మధురిమలు” గురించి ఈ నెల తెలుసుకుందాం.

ఇది కూడా నాలుగు పాదాల ప్రక్రియే. నాలుగుపాదాలూ ఒకే సంఖ్య గల మాత్రలతో ఉండడం వలన అద్భుతమైన లయను కలిగి చదవాలనే, వినాలనే ఉత్సాహస్థానంలో రాయాలనే ఆసక్తి ప్రవేశించి తీరుతుంది.

ఏ వస్తువును తీసుకున్నా మధురిమగా మలచగలగడం సులువే కానీ ఆ భావాన్ని కేవలం ఒక సూక్తిగా విషయంగా కాక కవితాత్మకంగా వర్ణించడం అనే నిబంధన వలన ఒకో కవిత సృజించిన పిదప ఆనందం గూటినొదిలిన సీతాకోకచిలుకలా రెక్కలు విప్పుకుంటుంది.

పేరుకు తగినట్లే మధురమైన ప్రక్రియ “మధురిమలు” సృష్టికర్త శ్రీ ఈర్ల సమ్మయ్య. వీరు తెలంగాణా రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా, శ్రీ రాంపూర్ మండలం, తారుపల్లి వాసి. ఫోన్: 9989733035.

వాట్స్ఆప్ వేదికగా ఇటీవలే ప్రారంభమైన మధురిమలు ప్రక్రియ అచిరకాలంలోనే కవులను ఆకర్షించి కవనసేద్యం చేయిస్తోంది. పైగా వర్ధమాన, కొత్త కవులు తమ సృజనలతో రోజుకి ఒక కవితతో గ్రూపుని పరిపుష్టం చేస్తుండగా వారికి ప్రోత్సాహకంగా 100 మధురిమలు సృజించిన కవికి మధుర కవి భూషణ, 250 దాటితే మధురకవి విభూషణ,400 దాటితే మధుర కవి విశిష్ట గా ఈర్ల సమ్మయ్య ప్రకటించారు. రోజుకి ఒకటేనను నిబంధన వలన ఇప్పటికి 40 మంది పైగా శతకమైలురాయిని దాటారు. కొందరు 250 కి చేరువలో ఉన్నారు.

త్వరలో కవులందరి ఎంపిక చేయబడిన మధురిమలతో సంకలనం తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. లయాన్వితమైన మధురిమలు ప్రక్రియ ఎలా రాయాలో ఆ నియమాలను ఒకసారి చూద్దాం.

  1. మధురిమలు ఒక నూతన మినీ కవితా ప్రక్రియ. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
  2. ప్రతి పాదం 7 నుండి 12 మాత్రల మధ్య ఒకే సంఖ్య లో ఉండాలి.
  3. 1,3 మరియు 2,4 పాదాలకు అంత్యానుప్రాస ఉండాలి.
  4. అన్నిపాదాలూ ఒకే అంత్యానుప్రాసపదాలతో కూడా ఉండవచ్చును.
  5. వస్తువును కవితాత్మకంగా వెలయించాలి.

(తెలుసు కదా! గురువు అంటే రెండు మాత్రలు లఘువు అంటే ఒక మాత్ర. అంతే.)

ఇప్పుడు మరింత అవగాహన కోసం ఉదాహరణగా నేను రచించిన కొన్ని మధురిమలను మీ ముందుంచుతున్నాను. ఒకో మధురిమ ఒకో విభిన్న వస్తువుతో రాయవచ్చు.లేదా ఒకే అంశంతో కొన్ని మధురిమలు రచించి ఒక గేయం లేదా కవితలా పత్రికకు పంపవచ్చు.

స్నేహ మధురిమలు

నైరాశ్యమునే చిదిమే
మంత్రగాడు నా మిత్రుడు
ఒంటరితనమును తరిమే
మహా గొప్ప వీరుడతడు

నాన్నలాగా ఆదరణ
అమ్మలాగ సంరక్షణ
నేర్పునుకదా విచక్షణ
మిత్రుడిచ్చు కద శిక్షణ

జాజిపూలు రాలినట్లు
హాయిగొలుపునోయ్ స్నేహం
నెమలీకను తాకినట్లు
మృదువైనదటోయ్ స్నేహం

ఎండవేళ గొడుగులా
కాచుకొనును స్నేహితుడు
కష్టంలో నీడలా
వెంటనడుచు స్నేహితుడు

ఇలా ఒక అంశాన్ని ఎంచుకుని నాలుగయిదు మధురిమలు రాస్తే చక్కని గేయంలా లేదా కవితలా శోభించగలదు.

ఇప్పుడు 7 నుండి 12 వరకు వివిధ మాత్రా నియమాలతో కొన్ని ఉదాహరణలు ఇస్తాను. మీరూ మధురిమలు లిఖించే ప్రయత్నం ప్రారంభిస్తారు కదూ!

పరిణయవేళ
పులకింతతో
మోము కళకళ
చిరునవ్వుతో
(7 మాత్రలు ప్రతి పాదానికి)

కోపం వస్తే
మౌనం వహించు
శ్రద్ధ వహిస్తే
జనులు ప్రేమించు
(8 మాత్రలు)

పొందిన ప్రేమలో
చిటికెడంత పంచు
అమ్మకి ముదిమిలో
ఆసరాని పంచు
(9 మాత్రలు)

మూడుముళ్ళను వేయ
కొనగోటి కవ్వింత
తలంబ్రాలను పోయ
కలిగేను తృళ్ళింత
(10 మాత్రలు)

పెద్దలు చేసే పనిని
పిల్లలనుకరిస్తారు
పెద్దలు నడుచు దోవని
పిల్లలనుసరిస్తారు.
(11 మాత్రలు]

కత్తిగాటుకన్న పదును
మాటేనని తెలుసుకొనుము
ఇంకా వాడిగ చీల్చును
మౌనముయని గుర్తెరుగుము
(12 మాత్రలు)

చెడ్డవారు చెలరేగగ
వనితలకిక రక్షణేది?
పాపభీతి తరిగిపోగ
ప్రాణాలకు విలువయేది?
(12 మాత్రలు ప్రతి పాదానికి)

మధురిమలు ప్రక్రియ మిమ్మల్నాకట్టుకుందని భావిస్తున్నాను. వచ్చే నెల మరో ఆసక్తికరమైన ప్రక్రియ పరిచయంతో కలుద్దాం. ధన్యవాదాలు.

***సశేషం***

Posted in March 2021, సాహిత్యం

7 Comments

  1. వి.వి.వి.కామేశ్వరి (v³k)

    మధురిమలు ప్రక్రియను విపులంగా వివరించారురాధికారాణి గారూ ధన్యవాదములు.

  2. వి.వి.వి.కామేశ్వరి (v³k)

    మధురిమల ప్రక్రియ గురించి విపులంగా వివరించారు రాధికారాణి గారూ.

  3. యూ.వి.రత్నం

    రాధికారాణి గారి మధురిమ లు చదివాను.కొత్త ప్రక్రియ రాసేవానికి
    సులభమే, చదివేవానికి ఓపిక అవసరం.
    మీ ఏ కావ్యం తీసుకున్నా బగా వ్రాస్తారు.
    రత్నం ఒంగోలర్

  4. Eerla Sammaiah

    గౌరవ రాధికా రాణి మేడమ్ గారికీ ధన్యవాదాలు. మధురిమలు ప్రక్రియను పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ పరిచయ వ్యాఖ్యానం అద్భుతం.

  5. బొల్లాప్రగడ ఉదయ భాను

    ఈ ప్రక్రియను గురించి విశ్లేషణాత్మకంగా వివరించారు, ధన్య వాదాలు.🙏

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!