Menu Close
దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర
పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

సెప్టెంబర్ నెల సంచికలో శ్రీరంగం రంగనాథ ఆలయం గురించి నాకు తెలిసినంత వివరించాను. ఆ సందర్భంగా శ్రీయుతులు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి, నాకు కొంచెం సంభాషణ నడిచింది. నేను ముందర నెల రాసినదానికి కొంత టిప్పణి  దొరకాలంటే ఈ సంభాషణ చదవాలి.

ఆచార్య లక్ష్మీనారాయణ గారు:

“చాలా బాగా సాగుతోంది.. మీతోపాటు మాకూ క్షేత్రదర్శనం చేయిస్తున్నందుకు మరోసారి కృతజ్ఞతలు.

పోతే ఈ వీడియోలో పైన రాసిన విషయమే పునరుక్తం చేశారు... టిప్పు సుల్తాన్ కాలావధి కుదరడం లేదని మీరే అన్నారు కదా! ఒకక్షణం గూగులమ్మను అడిగివుంటే, ఆయన కాలం 18 వశతాబ్ది అని స్పష్టమై ఉండేది.

పోతే 11 వ శతాబ్దం నాటి ఆ కథ వాస్తవమైనదే. అప్పుడు ఆ ప్రాంతానికి ఒక శైవ పాలకుడుండి, ఈ పవళించిన స్వామి ఉండవలసింది సముద్రంలో కదా, ఇక్కడెందుకు, సముద్రానికే చేర్చండి అని ఆజ్ఞవేస్తే, అక్కడి నుండి కదల్చబడి, సముద్రం వైపు కొంపోతుంటే, ఆ విషయం ఆ నోటా ఈ నోటా తిరుపతిలో వేంచేసిఉన్న శ్రీ రామానుజస్వామి చెవినబడితే, అప్పుడు వారు ఆ విగ్రహాన్ని తరలిస్తున్న దండనాయకుని మంచి చేసుకొని, లోపాయి కారీగా, అతని సహకారంతో శ్రీ రంగనాథుని విగ్రహాన్ని తిరుపతికి చేర్పించారు... అప్పటిదాకా, అక్కడ 'తిరుపతి' లేదు... అది కొత్తపల్లి అని ఒక చిన్న పల్లెటూరు.. ఒట్టి చిట్టడివి.. పార్థసారథి కోవెల ఒకటే ఉండేది. గత్యంతరం లేక, ఆ గుడి ప్రాంగణంలోనే, పడమటి వేపు ఖాళీ స్థలంలో గోవిందరాజస్వామి పేరిట, రంగనాథుని ప్రతిష్ట చేయించి, చుట్టూ పెద్దప్రాకారంతో చిన్న ఊరంత గుడి కట్టించారు రామానుజస్వామి.  తన 112 ఏట వారు ఈ కైంకర్యం చేయించారట... అప్పటినుంచి కొత్తపల్లి, వారుంచిన తిరుపతి నామధేయంతో ప్రసిద్ధమైంది. దీని వెనుక మరో ఆశయం కూడా ఉంది.  తిరుచానూరు నుండి కొండపాదంలోని లక్ష్మీనారాయణ స్వామి కోవెల వరకు ఒకటే చిట్టడివి కావడంతో దొంగల భయం వల్ల, చాలామంది భక్తులు నాటికి ప్రధాన మార్గంలోని తిరుచానూరులోనే ఒక చిన్న గుడిలో వెలసిన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్కు దండం పెట్టుకొని వెళ్లిపోయేవారు. కొండవేపు వెళ్లేవారు తక్కువ.. తిరుమలవాసుని పూజారులైన వైఖానసులు కూడా పూజ చేసుకొచ్చి దిగువ లక్ష్మీనారాయణ స్వామి గుడివద్దనే ఉండేవారట... భక్తుల భయం పోగొట్టి, తమ వశం (శ్రీవైష్ణవుల వశం) లోకి తెచ్చుకున్న తిరుమల దర్శనాన్ని ఇనుమడింప చేయడానికి రామానుజుల వారు దాదాపు మూడేళ్లు శ్రమించి ఆ వయసులో ఆ దివ్య కైంకర్యం చేయించారు...

ఈ వివరాలన్నిటినీ ఆచార్య ఎస్. రామచంద్రరావు గారు "తిరుపతి తిమ్మప్ప: యథార్థచరిత్ర" (తెలుగు అనువాదం: జోళదరాశి చంద్రశేఖర రెడ్డి) సప్రామాణికంగా నిరూపించి చెప్పారు. దాన్ని శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, తమ ఆర్ట్స్&లవర్స్ పక్షాన (ఇందిరాపార్కు వద్ద, హైదరాబాద్) ముద్రించారు...

వైష్ణవాలయాల పట్ల, రాయలయుగం ప్రారంభమయ్యేదాకా శైవులు చేసిన దురాగతాలేమీ తక్కువ కావు! ఏ రాయి అయితేనేం తల బద్దలుకొట్టుకోడానికి అని అందువల్లే ఈ జాతి నిస్తబ్దమై, సులువుగా అన్యాక్రాంతమైపోయింది. ఆ బానిస జబ్బు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో బయటపడు తూనే ఉంది... ప్చ్!”

నాకు పూర్తిగా బోధపడని మాట ఆచార్య లక్ష్మీనారాయణ గారు ఎంత సులభంగా చెప్పారో చూడండి! దానికి నా జవాబు:

“నేను శ్రీరంగం గురించి రాసిన వ్యాసం మీద మీ స్పందన చాలా ఆనందం కలుగ చేసింది. నిజంగా ఆ అర్చకులు అంత సరిగ్గా నాకు జరిగిన చరిత్ర గురించి చెపుతున్నారా? అన్న సందేహం నాకు ఉండింది. మీ జవాబుతో ఆ సందేహం తీరింది. మన ధర్మం పట్ల మన శ్రద్ధ ఎంత కష్టమైన పనైనా చేయిస్తుందన్న మాట రుజువయింది. దానితోపాటు నేను చిన్నప్పుడు చదివిన చరిత్రలో కానీ, ఈ నాటి వికీపీడియాలోకానీ ఈ విషయాలు ఎందుకు లేవనే బాధకూడా కలిగింది. మీలా చెప్పేవారు లేకపోతే, ఈ విషయాలు మరుగున పడిపోవడం ఎంతసేపు?

ఐతే మీరు ఒక మాట అన్నారు; 'శైవులు కూడా వైష్ణవులని అణగదొక్కారని, కాబట్టి ముస్లిములని ఎత్తి చూపనవసరం లేద'ని. ఈ మాట పట్ల ఒక పండిత చర్చ జరగవలసిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం. ప్రాజ్ఞులు, ఇక్కడ ఉన్న సభ్యులు చర్చించవలసిందిగా కోరుతున్నాను.

మొదట మీరు రాసిన కథనంలో ఒక శైవ పాలకుడు రంగనాథ స్వామి విగ్రహాన్ని సముద్రంలో పడెయ్యమన్న మాట - నిజంగా జరిగింది. నేను ముఖతః తెలుసుకున్నది, మీరు రాసినదీ ఒకటే అయినాయి కాబట్టి. దీన్ని ఎవరూ మర్చిపోకూడదు. చరిత్ర దీన్ని తప్పక ఎత్తి చూపాలి. నాలాంటి అద్వైత అనుయాయికి ఇది చాలా బాధాకరమైన, చేదు నిజం. అయినా తెలుసుకోవాల్సిందే. కానీ, మనం ఏదైనా రెండింటిని తులమానంగా పోల్చేటప్పుడు రెండూ సరి సమానమయినవి పోలుస్తున్నామా లేదా అని ప్రశ్నించాలి కదా?

ప్రతి మతంలోనూ ఇలాంటి  అంతర్గత దెబ్బలాటలు ఉంటూనే ఉంటాయి. ఉదాహరణకి ఇస్లామ్లో షియా, సున్నీ దెబ్బలాటలు జగద్విదితం. ఆ కావేషాలు ఎంత మటుకు వచ్చాయి అంటే, దేశాలు దేశాలే మారణ హోమాలకి దిగాయి. కానీ, మనం ఇస్లాము గురించి మాట్లాడేటప్పుడు ఒక మతం గానే మాట్లాడుతాము. అలాగే క్రిస్టియానిటీలో ప్రొటెస్టెంట్స్, కాథోలిక్స్ మధ్య ఎలాంటి మారణ హోమాలు జరిగాయో మీకు నేను వివరించక్కరలేదు. ప్రతిచోటా ఈ అంతర్యుద్ధాలు మామూలే.

భారత దేశంలో శైవ, వైష్ణవ అంతర్యుద్ధాలు లేవనేటంత మూర్ఖుడ్ని కాదు; అలాగే హైందవులతో జైనులు, బౌద్ధులు కూడా యుద్ధాలు చేశారనటానికి చాలా నిదర్శనాలున్నాయి కదా! కానీ, ఈ మూడు ఆలోచనలూ మౌలికంగా కొద్దీ తేడాలతో సనాతన భారతీయ దృక్పథం నించి పుట్టాయని మా ఇంట్లో మీరే చెప్పారు  ఆ తేడాలు కొన్ని కొన్ని సార్లు విపరీత ధోరణులని సంతరించుకున్నాయనడంలో కూడా నిజం ఉన్నది. ఇన్ని వివిధ దృక్పధాలున్న హైందవ ధర్మంలో మనం ఎన్ని రంగనాథ విగ్రహం లాంటి ఉదాహరణలు చూపించ గలం? కర్ణాటకలో లింగాయతులు కొట్టుకున్నా, వారు శైవుల మధ్యే కొట్టుకున్నారు. నేను ఇలాంటి ప్రశ్నలు ఎన్ని వేసినా ఎవరో ఒకరు ఏదో ఒక ఉదాహరణ చూపించ గలరని కూడా నాకు తెలుసు. కానీ ఒక higher perspective మనం అప్ప్లై చేస్తే ఇవన్నీ 40,000 గుళ్ళని ధ్వంసం చేసిన ముస్లిములతో సరిపోలుతాయా? అన్నదమ్ముల మధ్య కొట్లాటలు లేని కుటుంబాలు అరుదు. కానీ ఆ కొట్లాటలు వేరే వాళ్ళ ముందు సమసి పోయి వారి ఐక్యత ముందుకు రాదా? పైగా, దేశ వ్యాప్తంగా శైవ, వైష్ణవ క్షేత్రాలన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఒకరినొకరు క్షేత్రాలు పాడు చెయ్యడం అనేది సామాన్యమైతే దేశమంతటా అదే పరిస్థితి ఉండాలి కదా? కనబడదే?

నా ఈ యాత్రలోనే అనేక ఉదాహరణలు ఎదురైనాయి; ముస్లిములు దక్షిణ భారతంలోనే ఎన్ని క్షేత్రాలని దాడి చేసి నాశనం చేశారో! మీరు ఇంకా ముందు చదువుతారు, ప్రమాణాలతో సహా. బయట దేశాల వారొచ్చి మన సంస్కృతిని తుడిచిపెట్టివెయ్యడానికి చేసిన ప్రయత్నాలు మనం మర్చి పొతే, మనం ఆ పరిస్థితిని మళ్ళీ అనుభవించాల్సివస్తుంది కదా? చరిత్ర మన మంచిని, చెడును కూడా సమంగా ప్రతిఫలించాలి. అప్పుడు చదివిన వాళ్ళు తమ విజ్ఞత బట్టి సరిగా బేరీజు వేసి, ఒక అభిప్రాయానికి రావడానికి వీలవుతుంది. మన చరిత్రని మనమే సరిగ్గా, తులనాత్మకంగా చూడలేకపోతే బయటవాళ్ళు ఎలా చూస్తారు?

కాబట్టి మీ అభిప్రాయంతో ఏకీభవించలేక పోతున్నాను. కాకపొతే మీరు అనుభవజ్ఞులు, చాలా తెలిసిన వారు కాబట్టి మీ దృక్పథం అర్థం చేసుకోవాలనుకుంటున్నాను.”

ఈ పైన నాకు, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి జరిగిన సంవాదం పొందుపరిచాను. ఆయన నాకు మంచి మిత్రులు, దక్కన్ యూనివర్సిటీ సాంస్కృతిక శాఖ ప్రధానాచార్యులుగా (vice chancellor) గా పని చేసారు. ఇలాంటి పండితులు నాకు కొంతమంది మిత్రులుగా ఉన్నందుకు గర్వ పడుతున్నాను. ఇది మా మధ్య జరిగిన సంభాషణము. యథాతథంగా ఇక్కడ పొందు పరుస్తున్నాను. మన ఆలయాల పరిస్థితులగురించి చదువరులకు కొంత అర్థమవాలని ఈ మాసం ఇలా రాయడం జరిగింది. వచ్చే నెల ఇంకొక క్షేత్రం గురించి తెలియజేస్తాను.

### సశేషం ###

Posted in October 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!