Menu Close
దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర
పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

శ్రీరంగం

Srirangamపలముదురు సోలై నించి బయల్దేరి శ్రీరంగం చేరుకున్నాము. ఇంకా ఊర్లోనే ఉన్నామనుకున్నాము కానీ, రోడ్డు మీదే ఒక రాజగోపురం కనబడింది. ఇంకా చాలా ట్రాఫిక్ ఉన్నది. మామూలుగా అయితే ఎవరైనా మధుర మీనాక్షి గుడి చూసాక అంతకన్నా పెద్ద గుడి, గోపురం ఉండడం సాధ్యం కాదనుకుంటారు. అది అతిశయోక్తి కాదు కూడా. శ్రీరంగం చేరేటప్పటికి సాయంత్రం 6.30 అయింది. అసలు ఆ గుడి విస్తారం చూసి నోరెళ్ళబెట్టాను నేను. ఇంకా ఊళ్ళోనే ఉన్నామనుకున్నా, కానీ, మొదటి ప్రాకారం, రాజగోపురం సైజు చూసి అద్భుతః ! అని నమస్కారం చెయ్యని వాడు భారతీయుడు కాడు. ఈ రాజగోపురం 13  అంతస్తులతో, 9 కలశాలతో చుట్టూ జనాభా, ట్రాఫిక్కూ, కొట్లూ, సందడీ - వీటిమధ్య కుక్కలని లెక్క చెయ్యని భద్ర గజంలాగా ఠీవిగా నిలుచుని, ఊర్ధ్వ పుండ్రాలు పెట్టుకుని, హుందాగా ఉన్నది.  ఫోటో కింద చూడండి. అసలు అంత గొప్పగా ఎలా కట్టగలిగారు? ఊరంతా ఈ గుడి చుట్టూ ప్రబలుతుందన్న నమ్మకం అప్పటి వాళ్లకి ఉన్నదని అర్థమవుతుంది. ఇంతా చేస్తే ఇది మొదటి ప్రాకారం గోపురం మాత్రమే. దాని లోపల ఇంకామూడు ప్రాకారాలున్నాయి. మొత్తం 7 ప్రాకారాలున్నాయని చెప్పారు కానీ, మేము 4 చూసాము. మొత్తానికి ఆఖరు ప్రాకారం చేరుకొని, పళ్ళు, పూలు కొనుక్కుని ఒక గోపురం ద్వారా లోపలకి వెళ్ళాము. ఎంత పెద్ద గుడో! అని నోరు తెరుచుకుని చూడటం తప్ప కొన్ని నిమిషాలు ఏమీ చేయలేకపోయాము. ఆ రాజ గోపురం ఒక్కటే ఒక పూట చూడచ్చేమో సమయం ఉంటే!

Srirangamఈ గుడికి చాలా ద్వారాలున్నాయి. మేము వెళ్లిన ప్రాకారం తాయారమ్మవారి (లక్ష్మీదేవిని తాయారంటారు) గుడి పక్కగా ఉంటుంది. అంటే రంగనాథాలయం వెనుకపక్కకి వస్తుందన్నమాట. వైష్ణవాచారం ప్రకారం ముందు రంగనాథ దర్శనం చేసుకుని, తరువాత అమ్మవారి దర్శనం చేసుకోవాలని తాయారమ్మ గుడి ముందునించి ఇంకా ముందుకు వెళ్ళాము. కుడి చేతివైపు తాయారమ్మ గుడి ఉండగా, ఎదురుగా చాలా ఎత్తైన మెట్లు, ఆ పైన ఒక గుడి కనిపించాయి. చూద్దామని ఆ మోకాటి పర్వతంలాంటి మెట్లెక్కి లోపలకి వెళ్ళాము. అక్కడ భైరవ నరసింహుడున్నాడు. ఆచార్యుల వారినడిగితే, ముందర ఈ నరసింహ మూర్తిని దర్శనం చేసుకుని మాత్రమే రంగనాథుడి దర్శనానికి వెళ్లాలన్నారు. అనుకోకుండా మంచిదే అయింది అని అర్చన పూర్తి చేసుకుని, బయట పరిశీలిస్తే, గోడలమీద చాలా మంచి చిత్రాలు కనిపించాయి. పెద్ద నరసింహ మూర్తి చిత్తరువు, లక్ష్మీ అమ్మవారి చిత్రం కనిపించాయి. మెట్లు దిగి, గుడి లోకి ఎలా వెళ్ళాలో తెలియక అలా ఎడమ పక్కనించి ముందుకు వెళ్ళాము.

ఇక్కడ  మేము అనుకోని అనుభవం, ఒకటి జరిగింది. అది మా అదృష్టం. అక్కడ ఒక అంతస్తు కిందనించి వెళితే కుడి చేతివైపు పెద్ద ఆవరణ ఉన్నది. దానికి ఇంకా చాలా అవతల ప్రాకారం, కొన్ని కట్టడాలు ఉన్నాయి. (ఫోటో చూడండి; కానీ పూర్తి ఆవరణ చూపించడం సాధ్యం కాలేదు). ఐమూలగా అవతలనించి ఊరేగింపు వస్తోంది. కొన్ని వందలమంది బ్రాహ్మలు నారాయణ సూక్తం వల్లిస్తున్నారు. మధ్యలో పెద్ద పల్లకీ ఒకటి వస్తున్నది. చాలా మంది మోస్తున్నారు. ఇటు ఆడ, మగా చాలా మంది చక్కగా ఎర్ర పంచె, ఉత్తరీయాలతో, చక్కటి సంప్రదాయ కట్టుతో ఆడవాళ్లు, మగవాళ్లు అందరూ నారాయణ సూక్తం చెపుతూ వస్తున్నారు. ఆ ఊరేగింపుగా వస్తున్నది ఎవరని అడిగాను. ఎవరో ఒకాయన అమ్మవారు అని అన్నాడు. అదేమిటని మిగతా కొంతమందిని అడిగాను. రంగనాథుడన్నారు. వేదఘోషతో ఆవరణ అంటా ప్రతిధ్వనిస్తున్నది. ముందు మేళగాళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారు. చక్కటి ఊరేగింపు వాతావరణం ఏర్పడింది. క్రమేణా మేము నిలుచున్నచోటికి ఊరేగింపు వచ్చి ఆగింది. చూతును కదా, స్వామి రంగనాథుడు బంగారు అశ్వ వాహనం మీద కళ్లెం పట్టుకుని వచ్చి ఉన్నారు. కళ్ళ కెదురుగా పెద్ద పెద్ద వెదురు బొంగుల మీద వాహనం. అంటే ఒకొక్క బొంగు 6 అంగుళాల వ్యాసం కలిగి ఉన్నది! దానిపైన బంగారు అశ్వము. రంగనాథుడి ఉత్సవమూర్తి బంగారు అశ్వంని స్వారీ చేస్తున్నాడు. ఆయన వెనుక ఒక బట్టతో మంచి విశేషమైన అలంకారం బలే తమాషాగా అందంగా ఉన్నది. వీడియో, ఫోటో చూడండి. యాధృచ్చికంగా సరిగ్గా మా ముందే అశ్వవాహనం ఆగడంతో బాగా చూడగలిగాము. అంత మంచి సమయానికి వచ్చినందుకు సంతోషించాము. ఆయన ఎదురుగా ఏముందో తెలియలేదు. ఎవరినో అడిగాను. తీర్థానికి వచ్చారన్నారు. ఒక నిమిషం పట్టింది నాకు అర్థం చేసుకోవడానికి. తీర్థం అంటే పుష్కరిణి. స్వామి స్నానానికి వచ్చారన్న మాట. ఈ పుష్కరిణి వర్తులాకారంగా పెద్దగా ఉంటుంది. లోతుగా ఉన్నది. అంటే చాలా పెద్ద గుండ్రటి దిగుడు బావిని ఊహించుకోండి. దాని ఎదురుగా 'రాజ రాజ పెరుమాళ్ ', రంగనాథుడి ఉత్సవ మూర్తి ఆగి ఉన్నది. అక్కడ హారతి ఇచ్చి, స్వామిని లోపలకి తీసుకు వెళ్లారు. ఆ కట్టడాలన్నీ ఎంత పెద్ద ప్రమాణంలో ఉన్నాయో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.

Srirangam

కొంతసేపు ఆ విశేషం చూసి, అల్లా ఎడమ పక్కగా ఒక పెద్ద ఆవరణం, కిందంతా  ఇసుకతో ఉన్నది - దాన్ని దాటి చుట్టూ తిరిగి రంగనాథాలయం ముందుకి, అంటే ఇందాక నిలుచున్న వైపే గానీ ఇప్పుడు గుళ్ళోకి వచ్చాము. అక్కడ స్థంబాల ప్రమాణం చూసి బుగ్గ మీద వేలేసుకున్నంత పని చేశాను. దాదాపు 25 అడుగుల పైనే ఉంటాయా స్తంభాలు. ధ్వజ స్థంభం ఉన్నది గానీ, ఏ స్థంభం కూడా చెక్కడాల్లో మీనాక్షీ గుడిలాగా లేదు. రంగనాథుడి దర్శనం కోసం విచారిస్తే  ఒక 250 రూపాయల టికెట్టు కొనుక్కుంటే ఇవాళ రాత్రికి దర్శనం అయే అవకాశం ఉన్నదని అన్నారు. సరే అని కొనుక్కుని నుంచున్నాము. ఎంత మందున్నారంటే, అన్నిటి కంటే అదే ఖరీదైన టికెట్టన్నారు కానీ, రెండున్నర గంటలు పట్టింది మాకు; లోపలకి వెళ్ళడానికే. సరే, ఉత్తినే నిలుచున్నాము కదా అని అక్కడ దొరికిన ఒక ఆలయ అధికారితో స్థల పురాణం ముచ్చటించాను.

ఈ శ్రీరంగం ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. విష్ణువు 108 దివ్య దేశాలలో మొట్ట మొదటిది. గుడి రెండు నదులు - కావేరి, కొల్లిదం నదుల మధ్య తిరుచిరాపల్లి తాలూకాలో, తిరుచినాపల్లి దగ్గిర ఉన్నది. 150 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నదంటే మీరు ఎంత పెద్దదో ఊహించచ్చు. తటాకాలు, గోపురాలు, విడి విడి గుళ్ళు కోకొల్లలు. ఇది ద్రావిడ సాంప్రదాయాన్ననుసరించి 11 వ శతాబ్దిలో కట్టారంటారు కానీ, మా పక్కనున్న ఒకాయన ఇంకా ప్రాచీనమైనదన్నాడు. 5, 6 వ శతాబ్ది కాలంనాటిదన్నాడు.  వినడం తప్ప చెప్పడానికేమీ నోరు పెగలని నేను అదంతా చూస్తూ ఉండి పోయాను. 18 వ శతాబ్దంలో టిప్పు సుల్తాను సైన్యం పాండ్య రాజ్యాన్ని కొల్లగొట్టింది. ఈ గుడిని మొత్తం ధ్వంసం చేశారు. (వీళ్ళ దుండగీడుతనం గురించి కొంత మీనాక్షీ గుడి గురించి చెప్పినప్పుడు కూడా ముచ్చటించుకున్నాము. ఈ టిప్పు సుల్తాను చాలా గొప్పవాడు, మంచివాడు అనే ప్రచారం ఇప్పుడు జరుగుతోంది; చిన్న పిల్లల పాఠ్య పుస్తకాలలో ఇది చూసి ఆశ్చర్య పోయాను.. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవాలి ). మళ్ళీ 14వ శతాబ్దంలో తిరుమలనాయకుడి సహాయంతో ఇంకా ఎక్కువ గోపురాలతో, తటాకాలతో ఆ ఊరి ప్రజలంతా గుళ్లోనే ఉండగలిగేటట్లు నిర్మించారు. నాథముని, రామానుజాచార్యులు, మొదలైన ప్రసిద్ధ వైష్ణవ మత ప్రచారకులు ఇక్కడ నివసించారట.  మిగతా గుళ్ళలో నేను చూడనిది, ఇక్కడ కనబడింది ఏమిటంటే, మిగతా గుళ్ళలో ఉన్నది కాపాడుకుంటూ వస్తున్నారంతే. ఈ గుడిలో కొత్త కట్టడాలు కనిపిస్తున్నాయి. ఈ క్యూలో నిలుచుంటే పక్కన ఒక స్తంభాల మందిరం - ఇంకా కడుతున్నారు - అది కనబడుతుంది. కానీ చూడడానికి ప్రాచీన సంప్రదాయంతోనే కడుతున్నారు. బయటనించి చూస్తే స్వామి గర్భ గృహం కుడివైపు ఈ కొత్త మంటపం వస్తుంది.

ఎలాగోలా లోపలకి చేరుకున్నాం. ఇదేమిటి? స్వామి కనపడడు? అసలు గర్భాలయం లాగా లేదే! చాంతాడులాగా క్యూ మాత్రం ఉన్నది. ఒక అంతపెద్దది కాని అంతరాలయంలో మనం ఎడమకి వెళ్లి, కుడికి తిరిగి మళ్ళీ కుడికి వెళితే ఒక చిన్న, 'ద్వారం' అనకూడదు; గోడలో మార్గంలాగా ఉన్నది. అక్కడకి వెళ్లి లోపలకి తొంగి చూసి వెళిపోతున్నారందరూ. అర్చకుల పని తొయ్యడం తప్ప మరేమీ లేదన్నట్టు ఉన్నది. సరే అని పట్టుదలగా ఆ చిన్న దారిగుండా లోపలకి వెళ్లి తల ఎడమవైపు నించీ కుడివైపు దాకా తిప్పి చూసాను. అంతే! నా జన్మ ధన్యమయిపోయింది! రంగనాథుడు విలాసంగా పడుకుని ఉన్న విగ్రహం తల ఎడమ వైపు, కాళ్ళు కుడి వైపు ఉన్నాయి. అద్భుతమైన విగ్రహం! ఎంత నున్నగా, సున్నితంగా ఉన్నదో!, 20 అడుగుల పొడవు ఉంటుంది. పాదాలు రెండూ బంగారు తాపడం చేసి ఉన్నాయి. ఎడమ పాదం పైకి ఉంటే, కుడి పాదం దానికి 75 డిగ్రీల లంబంలో ఉంటుంది. చాలా పెద్ద పెద్ద పాదాలు. ఆ పాద దర్శనం కావాలంటే ఆ నారాయణుడి అనుగ్రహం కావాలి. అక్కడ పరివార దేవతలు ఎలా ఉన్నారో చూద్దామని ప్రయత్నిస్తుంటే అర్చకుడు బయటకి లాగేసాడు. అప్పటికే రాత్రి 10.30 అయింది. ఇంకా చాలామంది చూడాలి. అందుకనుకుంటా. దణ్ణం పెట్టుకుని బయటకి వచ్చాము. అప్పటికే రాత్రి పొద్దు పోయింది కాబట్టి తాయారు గుడి మూసేసారు. అందుకని ఆ రాత్రి అక్కడే ఉందామని నిశ్చయించి, ఒక హోటలు వెదుక్కుని రాత్రి పడుకున్నాము.

పొద్దున్నే లేచి, 5.30 కల్లా మళ్ళీ బయలు దేరి అమ్మవారి ఆలయంకి వెళ్ళాము. ఎంత బాగుందో!  అక్కడ అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. రాత్రి తొందరలో అంత బాగా కనబడలేదో, లేదా అమ్మవారి గుడికే ప్రత్యేకమో తెలియదు కానీ, ఇక్కడ అద్భుతమైన చెక్కడాలున్నాయి. ఒక స్థంభంపైన ఒక నెమలి పించం విప్పుకుని ఉన్నది. దాని నోట్లో ఒక పాము వేలాడుతున్నది. పాము తల వేలాడడం, తోక తిరిగిపోయి ఉండడం, నెమలి పాముని తినడానికి ఉద్యుక్తమవుతున్నదని అర్థమవుతుంది. మనవాళ్ళు రాతిలో ఎన్ని కథలు చెక్కగలిగారో! ఇలా చాలా ఉన్నాయి. ఆ తల్లి దర్శనం మా భాగ్యం.

అమ్మవారి దర్శనమయ్యాక అక్కడనుంచి ముఖ ద్వారం నించి పుష్కరిణి వైపు వెళ్లి, అటుపక్కగా చూస్తే చాలా చిన్న చిన్న గుళ్ళు కనపడతాయి. వాటిలో కథలు విని నోటు చేసుకున్నాను. వాటిమీద కింద పొందు పరిచిన వీడియోలో వివరంగా చెప్పాను. టిప్పు సుల్తాను దాడుల్లో రంగనాథుణ్ణి తిరుపతి తీసికెళ్ళారట. ఇదెలా సాధ్యమో నాకు అర్థం కాలేదు. ఉత్సవ విగ్రహమై ఉండచ్చు అనుకున్నాను. ఎందుకంటే ఆ రంగనాథుడి విగ్రహం మామూలుగా కదల్చగలిగేది కాదు. ఉపద్రవం మీదకి ముంచుకొచ్చినప్పుడు అసలు సాధ్యం కాదు. ఇదాలోచిస్తే ఎందుకు గర్భగుడి ద్వారం అంత ఇరుకుగా ఉన్నదో అర్థమయింది.

ఆ కథలు మీరు వీడియోలో వినచ్చు; కానీ, ఒక మాట నన్ను కలత పెట్టింది. ఇవాళ్టిరోజు కూడా గుడి యాజమాన్యం - అంటే ప్రభుత్వం అని అర్థం చేసుకోండి - గుడి భద్రతా, శుభ్రతా తప్ప, అన్ని గుళ్ళకి కైంకర్యాలు, పూల మాలలు, అలంకరణలకి డబ్బు ఇవ్వట్లేదట. ఆ అర్చకులు మనవంటి భక్తులకి చెప్పి మాలలకోసం డబ్బు సేకరిస్తున్నారు. అది విని చాలా బాధ వేసింది. వీళ్లంతా ఎంత శ్రద్ధ, భక్తి చూపిస్తే ఇంత పెద్ద ఆలయాలు నడుస్తున్నాయి? మనం హిందువులం చాలా డబ్బులు గుళ్ళకి ఇస్తాము (ఇవ్వాల్సినంత కాదని మీకూ నాకూ కూడా తెలుసు!) ఇస్లాము మతంలో లాగా 2 శాతం ఎవరూ మనదగ్గిర వసూలు చెయ్యరు. అందుకని మనం ఇవ్వం. ఇచ్చినదే బోల్డు ఉన్నా, దాన్ని ప్రభుత్వం తీసేసుకుని కొంత మాత్రమే గుడికి వెచ్చించి, మిగతాది దానిష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతోంది. ఇదేం న్యాయం? ఇది చెప్పిన 'లక్ష్మణన్ ' అనే ఆచారి ఫోటో, వీడియో పొందుపరుస్తున్నాను. ఆవేదన అణుచుకోలేక మీ అందరితో పంచుకుంటున్నాను.

వీడియోలో చెప్పిందెందుకు రాయడం? ముస్లిముల దురాగతాలు మీరంతా బయటకి తీసుకు రండి. మన ఆలయాలని పాడు చేసిన వారి గురించి మన చరిత్రలో చదవక పొతే ఇంకెక్కడ చదువుతాం? అలాంటి ఇతిహాసాలు మర్చిపోతే మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. అందుకని మీ పిల్లలకందరికీ చెప్పండి. మనవళ్ళకి  చెప్పండి.

ఈ పుష్కరిణి వెనకాల ఒక గోపురం ఉన్నది. దాని వెనుక ఇంకొక ఆవరణ ఉన్నది. అక్కడ ఒక వెయ్యి స్తంభాల మంటపమున్నది. అక్కడ శిల్ప సౌందర్యం చూసి తీరాలి. నేను మీనాక్షీ అమ్మవారి గుడిలో ఫోటోలు తియ్యలేక పోయాను. ఇక్కడ తియ్యగలిగాను. చూడండి. ఒక శిల్పంలో - 15 అడుగుల ఎత్తున్న స్తంభంలో ఎన్ని విశేషాలు చెక్కారో చూస్తే మధుర గుడిలో శిల్ప సంపద కొంత అర్థం అవుతుంది. గుర్రం మీద ఎక్కి ఉన్న వీరుడు ఒక మృగం డొక్కలో కత్తితో పొడిస్తే ఆ కత్తి లోపలకి వెళ్లి మళ్ళీ బయటకి రావడం, అక్కడ చర్మం ఉబ్బుగా ఉండడం, ఆ సహజత్వం, ఆ ముఖ కవళికలు - చూసి తీరాలి. నమ్మండి - అదంతా ఒక్క శిలే - ముక్కలైతే ఈ పాటికి కాలగర్భంలో కలిసిపోయేవి.  ప్రతి స్థంభంలోనూ వేరే వేరే చిత్రీకరణ. ఎంత కష్ట పడ్డారు? అది వాళ్ళు కష్టం అనుకున్నారా? లేక తమ ప్రతిభని భావి తరాలవారికి గర్వంగా చూపించదలచుకున్నారా? లేక నిర్లిప్తతతో భక్తితో భగవంతుడికి సమర్పించారా? శిల్ప కళలో భారతీయులు ప్రథమస్థానంలో వేల  ఏళ్ల కిందనే ఉన్నారన్న మాట ఘంటాపథంగా చెప్పచ్చు.

అక్కడే ఉన్న 'సొన్నది కేక పెరుమాళ్' సన్నిధి చూసి దర్శనం చేసుకుని బయలుదేరాము. అంటే చెప్పినది వినే విష్ణుమూర్తి అని అర్థం. ముందు అక్కడ దర్శనం చేసుకుని, రంగనాథుడి దగ్గిరకి వెళ్లాలనే ప్రథ కూడా ఉన్నదన్నారు. మా అదృష్టం కొద్దీ మేము ఆఖరున చూసాము.

ఈ శ్రీరంగం రంగనాథుడి ఆలయ విశేషాలగురించి నాకూ, ఆర్యులు శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికీ కొంత ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. వచ్చే నెల వాటిని రాస్తాను.

ఎవరూ నన్ను తిట్టుకోవద్దు - ఇంత పెద్ద గుడిలో ఎక్కువ ఫోటోలు తియ్యకుండా ఉండలేము, అవి చూపించక పొతే కథ సరిగ్గా అందదేమోనన్న తపన. అవసరమైనవే జతచేస్తున్నాను. పైగా నేను ఏ గుడిలోనూ గర్భగుడిని ఫోటో తియ్యలేదు. మూల విరాట్టును గాని, ఇతర ప్రధాన దేవతలని గాని ఫోటో తియ్యలేదు.

### సశేషం ###

Posted in September 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!