Menu Close
దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర
పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

అళగర్ కోయిల్, పళ ముదుర్ సోలై

ఈ అళగర్ అనే మాటని ద్రావిడులు అళహర్ అని కూడా అంటారు, ఆ 'ళ' కారాన్ని సగం తాళువు గా, సగం కంఠ్యము గా పలకడం ఎవరిదగ్గరైనా విని నేర్చుకోవలసిందే. తెలుగులో రాయడం వీలుకాదు. ఆ శబ్దానికి మనకి సంజ్ఞ లేదు. అలాగే 'పళ' కూడా.

ఈ  అళగర్ కోయిల్ మదురై నించి 50 కి.మీ దూరంలో ఉత్తరానికి ఉంటుంది. అళగర్ అంటే విష్ణుమూర్తి. ఈ ఆలయంకి ఒక ముచ్చటైన కథ ఉన్నది:

Alagar Koyilపాండ్యబాల మీనాక్షికీ, సుందరేశ్వరుడికీ అత్యంత వైభవంగా వివాహం జరిగింది. విష్ణుమూర్తే పెళ్లిపెద్దయి అమ్మవారిని కన్యాదానం చేసాడు. అక్కడి ప్రజలందరూ అమితోత్సాహంతో పండుగలు చేసుకుంటున్నారు. ఇక సుందరేశ్వరుడు, మీనాక్షి మాత ఒకరినొకరు చూసుకుని మురిసిపోతున్నారు;  ఈ హడావుడిలో ఇక విష్ణుమూర్తిని పట్టించుకునేవాళ్ళు లేకపోయారు. ఆయన త్వరగా అక్కడ భక్తుల కష్టాలు తీర్చాలని, తన చెల్లెలు, బావగార్లతో కలిసి సరదాగా సమయం గడుపుదామని అనుకుంటే తనవంక చూసే వాడు లేకపోతే, ఇంకా ఎవరితో సమయం గడుపుతాడు? అందుకని కినిసి, తాను విడిగా ఉండాలని నిశ్చయించుకుని, తపోభంగం కాకుండా ఉండాలని ఒక పెద్ద రాయిబండని ఎంచుకున్నాడు. అక్కడే వెలిసి, తన భక్తులకి అక్కడే ఆలయం నిర్మించమని ఆదేశం ఇచ్చాడు. అదే అళగర్ కోయిల్.

ఈ ఆలయం మొత్తం కొండల ముందు ఒక పెద్ద రాతిబండపైన నిర్మించబడింది. ముందు చాలా పెద్ద ఆవరణ ఉంటుంది. కింద ఫోటో చూడండి. ఒక ద్వారంలాగా కట్టబడి ఉంటుంది; ఆలయం పరిధి సూచించడానికి. లోపలికి వెళితే ఒక చిన్న గోపురం, అక్కడ ఒక మూర్తి (బలిమూర్తి?) ఉంటారు. ఎంత సందడి ఉంటుందంటే ఒక క్షణం మీరు ఇదేనా కోవెల? అని ఆశ్చర్య పోతారు. దానికి కుడిచేతిపక్కగా కొండరాయి పైకి ఎక్కుతూ ద్వార గోపురం ముందు చెప్పులు అప్పజెప్పి, ఆ మండుతున్న కొండరాయి మీద కాళ్ళు మండుతుండగా ఓర్చుకుంటూ లోపలకి వెళ్ళాలి. తమాషా ఏంటంటే అలా నడవాల్సిన దారి చాలా పొడుగుంది! ఇంకొంచెంలో కాళ్ళు బొబ్బలెక్కిపోతాయేమో అని భయం వేస్తుంటే గబగబా లోపలకి వెళ్ళాము. ఇదికూడా పెద్ద గుడి. ఇక్కడ ప్రధానమూర్తిని "కల్లళగర్" అని పిలుస్తారు. ఇక్కడ స్వామి నిలుచుని ఉంటారు. పక్కన శ్రీదేవి, భూదేవి ఉంటారు.

Alagar Koyilప్రధాన గోపురం కొండల మధ్యలో ఎంతో అందంగా ఉంటుంది. 5 అంతస్తులు, 5 కలశాలతో చాలా అందంగా కనిపిస్తుంది. ఆలయం విజయనగర రాజుల కాలం నాటిది. అప్పటి శిల్ప కళ బాగా తెలుస్తుంది. ఒక నరసింహ స్వామి విగ్రహం, ఒడిలో ఉన్న హిరణ్యకశిపుడిని చీల్చుతున్నట్లు ఉంటుంది. ఇది చూస్తే సింహాచలంలో మనం దర్శించిన (ఆలయం వెనకాల ఉన్న) నరసింహుడి విగ్రహం మనకి గుర్తుకువస్తుంది.

ప్రతియేడూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయిట. ఆడి మాసంలో స్వామి అశ్వారూఢుడై, ఆలయం నించి వైగై నదిదాకా ఉత్సవంగా వెళతారుట. అసలు అంత రమణీయమైన కొండల మధ్యలో ఉన్న ఆలయం, ఆయన వైభవం చూస్తే మరి విష్ణువు అలంకార ప్రియుడన్న మాట నెరవేర్చుకున్నాడని తెలుస్తుంది. ఆ రాతిబండపైనే చతురస్రంగా ఉన్న ఆలయ ప్రాకారంలో ఒక గోపురం పూర్తిగా శిధిలావస్థలో ఉన్నది. కానీ, 30, 40 అడుగుల ఎత్తున్న గోపురద్వారమే ఆ నిర్మాణ చాతుర్యాన్ని, శిల్ప సంపదని చాటుతోంది.

కింద ఫోటోలలో చూస్తే మీకు తెలుస్తుంది; ఈ ఆలయం ఎంత పటిష్టంగా కట్టారో, ఎంత దూర దృష్టితో కట్టారో అని. ఇక్కడ మహమ్మదీయులు చేసిన విధ్వంసం ఏమీ కనపడలేదు నాకు. బాగుచేసారో, లేక వాళ్ళు ఈ గుడిగురించి తెలియక వదిలేసారో తెలియదు.(మధుర మీనాక్షి గుడిలో మహమ్మదీయులు జరిపిన విధ్వంస కాండ గురించి ఆ ఆలయ ప్రతిష్ట గురించి రాసినప్పుడు చెప్పాను. గుర్తుండకపోతే సిరిమల్లె పాత సంచికలు తిరగెయ్యండి.)

ఇక్కడ విష్ణుమూర్తి నిలుచుని ఉంటాడని రాసాను కదా? ఆయన పేరు సుందరబాహు పెరుమాళ్. కల్లలఘర్ అనికూడా అంటారు. అంటే రాతిమీద ఉన్న విష్ణుమూర్తి. అళగర్ అంటే 'గొప్పగా ఉన్నవాడు' అని కూడా అర్థం ఉన్నది. ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉన్నారు. గొప్పతనం ఏమిటంటే చాలా అందమైన నిలువెత్తు - అంటే 8 అడుగుల ఎత్తని నాకనిపించింది - విగ్రహాలు అవి.  వైష్ణవుల దివ్యప్రబంధ ఆరాధనాలయాలలో ఇది ఒకటి. ఎప్పుడూ సన్నద్ధంగా ఉండే పెరుమాళ్ అని అంటారు. అంటే మనలని కటాక్షించడానికి. ఈ ఆలయం అంతా ద్రవిడ సంప్రదాయంతో కట్టబడినది. పచ్చటి కొండల మధ్యలో ఉండడం వల్ల చాలా అందంగా కనబడుతుంది. మీరు బాగా తీరుబడిగా చూడాలంటే కాస్త చల్లగా ఉండే నెలలలో వెళ్లడం మంచిది.

పళ ముదుర్ సోలై

కింద చూపించిన కొండల్లోనే బాగా లోపల ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరు దివ్యదేశాల్లో ఒకటైన, ఆఖరుదైన పళ ముదుర్ సోలై అనే క్షేత్రమున్నది. శైవులు ఇక్కడకి తప్పక వచ్చి దర్శనం చేసుకుంటారు. అంత  పేరున్న ఆలయం అంటే చాలా పురాతనమైనది అనుకున్నాను. కానీ, ఇది 16, 17వ శతాబ్దిలోఁ కట్టిన ఆలయం. అయితే చాలా అందంగా, విశాలంగా ఉన్నది. (మొత్తం గుడి చిన్నదే అయినా నడిచే దారులు విశాలంగా ఉన్నాయి. టికెట్టు కొనుక్కుని లోపలకి వెళితే సులభంగా దర్శనమైంది. అబ్బ! ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చక్కగా చిన్న పిల్లవాడిలాగా ఉన్నాడు. చూడగానే బుగ్గలు నొక్కి ముద్దు పెట్టుకోవాలన్నట్లు ఉన్నారు. అసలు ఎదురుగుండా చూస్తూ ఆకర్షితులమవకుండా ఉండలేము. ఆయన శక్తి అలాంటిది. ఈ క్షేత్రంకి ఇంకొక కథ ఏంటంటే మీనాక్షి కోవెలని కట్టిన తిరుమల నాయకుడే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్టించాడని ప్రతీతి.

Alagar Koyil

మామూలుగా అన్నిచోట్లలాగా కాకుండా ఇక్కడ వల్లి, దేవసేన అమ్మవార్లకు విడివిడిగా ఆలయాలున్నాయి. విఘ్నేశ్వరుడి కోవెల, వీరిద్దరికీ కుడిచేతివైపు పెద్దగా ఉంటుంది. మేము వెళ్ళేటప్పటికి అక్కడ స్వామిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నారు. సరే మేమూ ఆ ఊరేగింపులో కలిసి, అందరితోపాటు నడిచాము. బలే అనిపించింది. కింద వీడియోలో చూడండి. ఆ ముచ్చట తీయడానికి నేను పడిన తాపత్రయం, అంత  బాగా రాకుండానే వదిలిపెట్టవలసిన అవకాశం.

ఇంత మంచి క్షేత్రానికి మరి ఈ పేరేమిటి? తెలుసుకోవాలనే కుతూహలంతో ఆలయంలో మా గోత్ర నామాలని తీసుకున్న ప్రధాన ఆచార్యులవారిని అడిగాను. ఆయన చాలా ఓపికగా మా గోత్ర నామాలని తీసుకుని, అర్చన చేయించి, కథ చెప్పారు: తమిళనాడులో అవ్వైయారు అనే ఆమె చాలా ప్రసిద్ధికెక్కిన భక్తురాలు, కవయిత్రి. ఒకసారి ఆమె ఈ కొండల్లో తిరుగుతూ అలిసిపోయి, ఆకలిదప్పులతో ఒక చెట్టు కింద కూర్చున్నది. పైన పళ్ళు అందవు పాపం. ఎలా పళ్ళు సంపాదించాలో తెలియక అయోమయంగా చూస్తుంటే ఒక చిన్న అబ్బాయి చెట్టుపైనించి, 'పళ్ళు కావాలా? పచ్చివి కావాలా, కాల్చినవి కావాలా?' అని అడిగాడు. నిప్పు లేకుండా పళ్ళు ఎలా కాలుస్తారు? ఈ అబ్బాయికి అదికూడా తెలియదని జాలిపడ్డది అవ్వైయారు. అయినా పచ్చివే పడెయ్యి నాయనా అని అడిగింది. వెంటనే కొన్ని పళ్ళు కిందకి  పడేసాడు ఆ అబ్బాయి. దుమ్ము అంటిందేమో అని ఆవిడ ఆ పళ్ళని ఊదుతుంటే, " కాల్చిన పళ్ళు వేడిగా ఉన్నాయని ఊదుతున్నావా, అవ్వయ్యార్?" అని అడిగాడా అబ్బాయి. తమిళంలో కాల్చడానికి, ఊదడానికి ఒకేరకమైన మాటలు కవిత్వంలో వాడతారు. ఆశ్చర్యపోయిన ఆవిడ యితడు సామాన్య బాలుడు కాదని, నువ్వెవరో చెప్పమని చేతులు జోడించి ప్రార్థించింది. అప్పుడు ఆ అబ్బాయి సుబ్రహ్మణ్య స్వామిగా అవతరించి ఆమెని అనుగ్రహించాడు. ఆమె మురుగన్ అని అతన్ని వివిధ కవితలతో కీర్తించింది. ఆఖరున ఆమె కైవల్య సిద్ధి పొందిందని చాలా కథలు చెపుతున్నాయి. ఆవిడ ఎప్పుడూ విఘ్నేశ్వరుడిని కొలిచేది. ఆఖరున పితృదేవతలు, మేము కైలాసానికి వెళుతున్నాము, నువ్వు వస్తే మేము నిన్ను తీసుకెళతాం అంటే, వినాయకుడి  పూజ పూర్తిచేసి కానీ రానని ఖచ్చితంగా చెప్పింది. వాళ్ళు దివ్య రథాలని వేసుకుని కైలాసానికి వెళ్లిపోయారు. పూజ పూర్తి చేసుకున్న అవ్వయ్యార్ జరిగినది వినాయకుడికి చెప్పి, నేనా అవకాశం వదులుకున్నాను, నన్ను కైలాసం చేర్చవా? అని అడిగింది. వినాయకుడు తన తొండంతో ఆవిడని ఎత్తి బొందితో కైలాసంలో శివుడి ముందు కూర్చోబెట్టాడు. శివుడి ముందు కాళ్ళు చాపుకు కూర్చున్న అవ్వైయార్ని శివ భటులు శివుడివైపు కాళ్ళు పెట్టి కూర్చోకూడదని ఆక్షేపించారు. 'శివుడు లేనివైపు మీరే నా కాళ్ళు తిప్పండని ఆవిడ అన్నది. వాళ్ళు ఆవిడ కాళ్ళు ఎటువైపు తిప్పితే శివుడు అటువైపే తిరగడం చూసి, శివ భటులు క్షమాపణ కోరుకున్నారు. అంతటి భక్తురాలావిడ. ఆవిడకి సుబ్రహ్మణ్యుడు అంత గౌరవం కలిగించడంలో ఆశ్చర్యం ఏముంది?

ఇలా ఉత్సవం, ఊరేగింపులలో పాల్గొని, స్వామి అర్చన తరువాతవల్లి, దేవసేన మాతలని దర్శించుకుని, విఘ్నేశ్వరుడికి మొక్కులిడి. కిందకి వచ్చాము. అక్కడ అళగర్ కోవిల్ ముందు దోర మామిడికాయలు ఉప్పూకారం తో తిని, స్వామి రథ దర్శనం చేసుకున్నాము. ఫొటోలో ఆ రథం ఉంచిన భవనం బయటనించి తీసిన ఫోటో చూడండి. ఈ రథం అద్భుతంగా చెక్కబడి ఉన్నది. నల్ల టేకు చెక్కతో తయారు చేశారు. ఇలా హాయిగా దర్శం అయినతరువాత మళ్ళీ ఇంకొక క్షేత్రానికి దారి తీసాము.

### సశేషం ###

Posted in August 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!