Menu Close
పరిగపంట
- వెంపటి హేమ (కలికి)

"పోష్టు" అన్న కేక విని గుమ్మంలోకి పరుగెత్తి, ఉత్తరం అందుకున్నాడు ప్రశాంత్. ఆ ఉత్తరం చదవగానే వాడి మొహం సంతోషంతో వికసించింది. అది ఒక ఎంప్లాయిమెంట్ ఆర్డర్! ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్సు ఇంజనీరింగ్ పాసై వున్న ప్రశాంత్ కి ఉద్యోగం వచ్చింది.

వాడు కాలేజిలో చదువుతుండగా పరీక్షలకు ముందే జరిగిన కాంపస్ సెలక్షన్లో వాడిని ఎంపిక చేసుకుంది ఒక ప్రముఖ ప్రైవేట్ కంపెనీ. మెరిట్ స్టూడెంట్ అయిన ప్రశాంత్ పరీక్షలో ఆనర్సుతో నెగ్గాడు. వెంటనే అతనికి ఉద్యోగం ఇస్తున్నట్లుగా ఆర్డర్ పంపారు ఆ కంపెనీ వాళ్ళు. మొదట్లో ఒక సంవత్సరం ట్రైనింగ్ పీరియడ్. ఆ పైన మంచి జీతంతో ఉద్యోగం స్థిరమౌతుంది. అది ఆ లేఖలోని సారాంశం. వెంటనే ఆ శుభవార్త తల్లికి చెప్పాలని ఆరాటపడ్డాడు ప్రశాంత్.

ఆ లేఖ చేత్తో పట్టుకుని వచ్చి, గుమ్మంలో కూర్చుని, లేసు అల్లుతున్న తల్లి శ్యామల కాళ్ళమీద వాలిపోయాడు ప్రశాంత్. "అమ్మా! నాకు చెన్నైలో ఉద్యోగం వచ్చిందమ్మా! ఇదంతా నీ కృషి ఫలమమ్మా! నన్ను దీవించు" అంటూ.

ఆనందంతో శ్యామల ఒళ్ళు పులకించింది. ఎట్టకేలకు తను, తన భర్త కోరికను నెరవేర్చగలిగింది. "భగవంతుడా! ఈ అదృష్టం చాలు నాకు, మరేమీ కోరను." అలా అనుకునేసరికి ఆమె మనసు గతంలోకి వెళ్ళిపోయింది .....

=================

శ్యామల, బొడ్డున మాడిక్యం పెట్టుకు పుట్టిన అదృష్టజాతకురాలేమీ కాదు. ఆమె, కోనసీమలో, ఒక మారుమూలనున్న పల్లెటూరిలోని వ్యవసాయ కూలీల ఇంటిలో, నలుగురు పిల్లల్లో కడసారపు పిల్లగా పుట్టింది. ఆ వాడకట్టున ఉన్న పిల్లల్లో కొందరు బడికి వెళుతుంటే తానూ వాళ్ళతోపాటుగా బడికి వెళ్లి, మాతృభాషలో చదవనూ, రాయనూ నేర్చుకుంది.

ఆమె తల్లి గంగమ్మ, తండ్రి నాగభూషణం. రెక్కాడితేగాని, డొక్కాడని బ్రతుకులు వాళ్ళవి. వ్యవసాయపు పనులు ముమ్మరంగా ఉండే రోజుల్లో వాళ్ళకి చేతినిండా పని, జేబునిండా డబ్బులు ఉంటాయి. కాని పొలం పనులు ఏటి ఎల్లకాలం ఉండేవి కావు కదా. పొలం పనులు లేనప్పుడు వాళ్ళకి ఇల్లు గడవడం చాలా కష్టమయ్యేది. ఆ రోజుల్లో ఊళ్ళోని ఇళ్ళల్లో కట్టెలు కొట్టడం, గడ్డివామిలు వెయ్యడం లాంటి చిల్లర మల్లర పనులు చేసుకుని బ్రతకాల్సి ఉంటుంది. ఆడకూలీలైతే, పొలం గట్ల వెంట, కాలువ వారల మొలచిన పచ్చగడ్డి కోసుకుని తెచ్చి ఊళ్ళో అమ్మీ, ఇంటి పనుల్లో యజమానురాలికి సాయంచేసీ ఎలాగోలా నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు, చేతినిండా డబ్బు ఉన్నప్పుడు కొంతైనా దాచుకోవాలన్నది తెలియని ఆ శ్రమజీవులు!

వరిపంట కోతకొచ్చాక దానిని కోసి, ఆ పనలను కొన్నాళ్ళు పొలంలోనే ఉంచుతారు. అవి కొంచెం ఆరిన తరవాత వాటిని, కట్టలుకట్టి మోసుకుపోయి, ముందే అమర్చి ఉన్న కళ్ళం (ఖాళీ జాగా) లో కుప్పలుగా వేసి, బాగా ఆరిన తరవాత కుఫ్ఫనూర్పిళ్ళు జరిపించి, గడ్డినుండి ధాన్యాన్ని వేరు చేస్తారు. ఈ పనులన్నీ జరుగుతుండగా కొన్ని వరికంకులు చెదురుమదురుగా రాలి క్రింద పడుతుంటాయి. అలా రాలిపడిన కంకులను కొందరు ఏరుకుంటారు. సాధారణంగా ఆ పనికి పిల్లలే ముందుంటారు. ఆ పనినే పరిగ ఏరుకోడం అంటారు. చిన్నప్పుడు అలా పరిగ ఏరుకురావడానికి అక్కతోపాటుగా శ్యామల కూడా వెళ్ళేది. గంగమ్మ కూతుళ్ళు ఏరితెచ్చిన పరిగెను దులిపి, ఆ వచ్చిన ధాన్యంతో అటుకులు చేసేది. ఆ అటుకులు చాలా రోజులపాటు పిల్లలకు చిరుతిండిగా కొంచెం కొంచెంగా పెడుతుండేది.

శ్యామల పెద్దమనిషి కాగానే ఆమెకు పక్క ఊరిలోవున్న మేనత్తకొడుకు వెంకటేశుతో పెళ్లి జరిపించి, వెంటనే ఆమెను అత్తవారింటికి పంపేశారు తల్లిదండ్రులు. ఒక సంవత్సరమైనా కాకముందే వెంకటేశు పట్నానికి ప్రయాణం కట్టాడు. శ్యామలకు అది నచ్చలేదు. ఐనవాళ్ళందరినీ విడిచి, ఏమీ తెలియని కొత్తచోటుకి రానని మొరాయించింది. కాని వెంకటేశు ఆమెను సముదాయించాడు.

"ఈ పల్లెటూరిలో ఏముందే వెర్రి నా యాలా! చేద్దామన్నా ఏడాది పొడుగునా పని కూడా దొరకదు. అదే పట్నంలో అయితే, నువ్వు ఓపికుండి చెయ్యాలేగాని చేతినిండా, ఏడాది పొడుగునా పని ఉంటుంది. మనం ఎప్పుడూ ఇలాగే ఉండిపోతామా ఏమిటి? మనకో బాబు పుడతాడు! వాణ్ణి మనం, మన కరణం గారి అబ్బాయిగారికి మల్లే గోప్ప చదువులు చదివించి ఇంజనీర్ని చెయ్యాలంటే మనం ఇప్పటినుండీ సంపాదించి కూడబెట్టాలే వెర్రిమొగమా" అన్నాడు. భర్త మాటల్ని అర్థం చేసుకున్న శ్యామల మరి కాదనలేదు.

అలా మొదలయ్యింది వాళ్ళ హైదరాబాదు కాపురం! తెలిసినవాళ్ల సాయంతో రైలుకట్ట వారనున్న బస్తీలో ఒక గది అద్దెకు తీసుకుని, అందులో మకాంపెట్టారు వాళ్ళు. వెంటనే ఒక కిరాణా కొట్లో పొట్లాలు కట్టే పని దొరికింది వెంకటేశుకి. శ్యామలకూడా ఊరికే కాలక్షేపం చెయ్యకుండా, ఇంటిపని, వంటపనీ పూర్తయ్యాక మిగిలిన సమయంలో లేసు అల్లో, బీడీలు చుట్టో, విస్తళ్ళు కుట్టో నాలుగు రాళ్ళు సంపాదించేది. ఇద్దరి సంపాదన ఉండడంవల్ల, వాళ్ళకి ఖర్చులు పోగా కొంచెం డబ్బు మిగిలేది. అది వాళ్ళకి ఎంతో సంతోషాన్నిచ్చేది.

మొదట్లో శ్యామల పచ్చని పైరులు, పాడిపశువులు కనిపించక దిగులుపడినా క్రమంగా పట్టణపు జీవితానికి అలవాటు పడింది. ఏడాది తిరిగేసరికి ఆమె గర్భవతి అయ్యింది. కొడుకు పుట్టాడు. వాడికి ప్రశాంత్ అని పేరు పెట్టారు.

కొడుకు నెత్తుకుని, "ఇంజనీర్ గారూ" అంటూ ముద్దులాడేవాడు వెంకటేశు. "మనకింక బిడ్డలొద్దే, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన ఔతుంది. వీడిని పెద్దచదువు చదివించాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి" అనేవాడు శ్యామలతో.

పిల్లవాడికి ఐదవ ఏడు రాగానే దగ్గరలో నున్న ప్రాధమిక పాఠశాలకు పంపించడం మొదలుపెట్టారు వాళ్ళు. మారాం చెయ్యకుండా శ్రద్ధగా బడికి వెడుతున్న కొడుకుని చూస్తూంటే ఆ దంపతుల మనసు నిండా ఎన్నెన్నో ఆశలూ, ఏవేవో కోరికలూ పుట్టుకొచ్చేవి. పలకా పుస్తకాలు పట్టుకుని, ఒక్కరోజైనా మానకుండా బడికి వెడుతున్న ప్రశాంత్ ని మురిపెంగా చూసుకుంటూ మురిసిపోయేవారు ఆ దంపతులు. వాడు మూడవ తరగతిలో ఉండగా జరిగింది ఆ ఘోరం!

అందమైన ఆ సంసారాన్ని చూసి ఏ దేవుడి కళ్ళు కుట్టాయోగాని, వెంకటేశు కడుపు నొప్పితో బాధపడసాగాడు. అది మామూలు కడుపునెప్పే అనుకుని, చిట్కా వైద్యాలతో కొన్నిరోజులు గడిపారు. నెప్పి తగ్గకపోగా క్రమేపీ మరింత ఎక్కువయ్యింది. చివరకు పెద్దాసుపత్రిలో చేర్పించారు. కాని అప్పటికే సమయం మించిపోయింది. డాక్టర్లు వెంకటేశుని కాపాడలేకపోయారు! అతడు "అపెండిసైటిస్" తో మరణించాడు. శ్యామలకు బ్రతుకంతా అంధకారమై కనిపించింది. కొడుకుని చేరదీశుకుని కంటికీ, మంటికీ ఏకధారగా ఏడుస్తూ ఉండిపోయింది.

టెలిగ్రాం అందుకుని వచ్చారు శ్యామల అన్నలు. చెయ్యవలసిన కర్మకాండలన్నీ పూర్తయినాక, చెల్లెల్ని, మేనళ్ళుణ్ణీ వెంట తీసుకువెళ్ళాలనుకున్నారు వాళ్ళు. కాని శ్యామల ఎంతమాత్రం ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితిలోనూ పట్నం విడిచి రాను - అని ఖండితంగా చెప్పేసింది.

ఆ పల్లెటూరికి వెడితే ప్రశాంత్ కి చదువు సాగదు. ఏ భూకామందు కమతంలోనో, తన అన్నలలాగే ఒక పాలేరుగానో లేదా ఏ వ్యవసాయ కూలీగానో బ్రతకవలసి ఉంటుంది. అలా జరిగిననాడు, తన భర్త కన్న కలలన్నీ కల్లలు కావాలల్సిందే కదా!
చివరకి, అవసరమైతే ఆమే వస్తుంది లెమ్మని, గుండె రాయి చేసుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అగమ్యగోచరంగా ఉన్న భవిష్యత్తుని ముందర ఉంచుకుని, పసివాడి చేయి పట్టుకుని పట్నంలో ఉండిపోయింది శ్యామల. భర్తను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోకుండా, అతని కోరిక తీర్చడంకోసం తాను శ్రమించాలి - అనుకున్న శ్యామల వెంటనే ఏడుపును దిగమింగుకుంది.

"ఏడుస్తూ కూర్చుంటే రోజు గడవదు, బ్రతుకుతెరువు కోసం ఏదో ఒక పని చెయ్యాలి, ఆపై ప్రశాంత్ ని చదివించాలి” అనుకున్న శ్యామల కళ్ళు తుడిచేసుకుంది. పరామర్శకు వచ్చిన రత్తమ్మతో మాటలు పెట్టుకుంది.

"పెద్దమ్మా! తెల్లారి లేవగానే ఆకలి మొదలౌతుంది కదా! బిడ్దకింత తిండి పెట్టాలన్నా, నెల తిరిగేసరికి గదికి ఇంటికి అద్దె కట్టాలన్నా నేను ఏదో ఒక పని చెయ్యలి కదా! నాకా ఉద్యోగం చేసేటంత చదువులేదు. కాయకష్టం తప్ప మరో మార్గం లేదు. ఎక్కడైనా పనుంటే చూపించవా" అని అడిగింది.

రత్తమ్మ నాలుగిళ్ళల్లో పాచిపనీ, పైపనీ చేసుకుని, పిల్లలమీద ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతుకుతోంది. వయసు అరవై దాటినా ధృఢంగా ఉంటుంది. శ్యామల పరిస్థితిని అర్థం చేసుకుంది రత్తమ్మ.

"నేను పనిచేస్తున్న చోట, మరి నలుగురు నన్ను పనిచెయ్యమని మరీమరీ అడుగుతున్నారు. నా కంత ఓపిక లేదనిపిస్తోంది. ఆ పనులు నీకు ఇప్పిస్తా, చేసుకో. నమ్మకంగా ఉంటే పనికి ఢోకా ఉండదు. పిలిచి మరీ పనిస్తారు."

"శతకోటి ధన్యవాదాలు పెద్దమ్మా! నీకు ఎట్టి పరిస్థితిలోనూ చెడ్డ మాట రానీను. నేను నీ బిడ్డనే అనుకో" అంది శ్యామల కన్నీళ్ళతో.

…. సశేషం ....

Posted in July 2018, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *