Menu Close

Alayasiri-pagetitle

మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు

పరాశక్తి అమ్మవారి ఆలయం, కెన్నెత్ పోంటియాక్, మిచిగాన్ రాష్ట్రం, యు.ఎస్.ఎ.

Parasakthi Temple

మనం ఏ మంచి కార్యాన్ని తలపెట్టినా అందుకు భగవంతుని సంకల్పం, ప్రోత్సాహం, ఆశీస్సులు మెండుగా ఉంటేనే ఆ కార్యం ఎటువంటి అవాంతరాలకు లోనుకాకుండా పూర్తి అవుతుందని మానవులమైన మనందరి నమ్మకం. అటువంటి సన్నివేశం డా. కృష్ణ కుమార్ గారి విషయంలో జరిగి, ఆయన  కలలో ఆ కుండలినీ అమ్మవారు, ఆది పరాశక్తి కనపడి, ప్రపంచ శాంతి పరిరక్షణ, సుఖశాంతులు పరిరక్షించడానికి తనకు ఒక ఆలయం నిర్మించమని ఆదేశించింది. పర్యవసానమే ఆరు మార్గాల హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా 1999 వ సంవత్సరంలో మిచిగాన్ రాష్ట్రంలో నిర్మితమైన ఈ ఆదిపరాశక్తి తీర్థపీఠం, నేటి మన ఆలయసిరి.

Parasakthi Templeఈ ఆదిపరాశక్తి ఆలయంలో అమ్మవారు పరాశక్తి కుమారి అంబిక గా మనకు దర్శనమిస్తారు.  ఎన్ని రూపాలలో ఉన్ననూ ఆ అమ్మవారి కృపాకటాక్షాలు లేకుంటే అంతా వినాశనమే. ప్రపంచం అంతా నిండివున్న ఆ శివశక్తి లో, శక్తి ఉన్నచోట మరి లయకారుడు కూడా ఉండాలి కదా. అందుకే ఆ శంకరుడు కూడా కొలువై ఉన్నాడు.

Parasakthi Templeఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ ఎంతో అందంగా మలచిన శ్రీ చక్రం. రాతితో చెక్కబడిన ఈ శ్రీ చక్రం ఎంతో పవిత్రమైనదిగా, అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు.

సాధారణంగా మన దేశంలో అయితే శివాలయం, రామాలయం, అంటే ఆ దేవుళ్ళు మాత్రమే ఉంటారు. కాని విదేశంలో అయితే అందరు దేవుళ్ళు ఒకేచోట వెలిసుంటారు. అలాగే ఈ శక్తి అమ్మవారి ఆలయంలో కూడా మీకు సకల  దేవతలను సందర్శించుకునే భాగ్యం కలుగుతుంది.

Parasakthi Templeమిచిగాన్ రాష్ట్రంలోని పోంటియాక్ పట్టణంలో, ఎంతో ప్రశాంతమై ప్రకృతితో మమేకమై 16 ఎకరాల సువిశాల స్థలంలో పూర్తి దక్షిణ భారత సంప్రదాయ శైలిలో ఈ ఆలయం నిర్మితమైనది. ఎంతో మంది భక్తుల అండదండలతో ఈ ఆలయ నిర్మాణం వివిధ దశలలో జరిగినను, ప్రస్తుతం పన్నెండు వేల చదరపు అడుగుల భవన నిర్మాణంతో ఈ ఆలయం నిత్య అభిషేక, హోమజపాదులతో పూజలందుకుంటున్నది. ఈ ఆలయ అధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు కూడా. ఈ ఆలయానికి పూర్తిగా కర్త, కర్మ, క్రియ అంతా కూడా ఒకే ఒక కుండలినీ ఉపాసకుడు, డా. కృష్ణ కుమార్. ఆయన కుండలినీ యోగాను కూడా నేర్పుతున్నారు.

ఈ ఆలయం నిర్మితమైన ప్రాంతం కూడా ఎంతో పవిత్రమైనదని ఇక్కడి స్థానికులైన రెడ్ ఇండియన్ జాతుల నమ్మకం. ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణా కేంద్రంగా కూడా అభివృద్ధి చేశారు.

Parasakthi Temple
Posted in July 2018, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!