Menu Close
51. మాపల్లె

ఇదేలే నా పల్లె
రైతులున్న రేపల్లె
ఆనందమిచ్చు హరివిల్లె
పచ్చదనాల పొదరిల్లె
పాడిసిరులు గల సిరిమల్లె
మనుషుల మధ్య మమకారాల మరుమల్లె
పేరు పల్లె ఆత్మీయతకు ఒక ఇల్లె
జావ త్రాగి జగతికి అన్నంపెట్టే అన్నపూర్ణమ్మ తల్లె
అవనికి ఆనందం ఇచ్చిన ఆత్మీయతే నా పల్లె
అందరి మదిలో చింతలు తీసే చిరుజల్లె
పండగలొస్తే పసిపాపల మనసల్లె
సంప్రదాయంతో ప్రపంచాన్ని పలకరించు నాపల్లె
ప్రపంచానికి పట్టుకొమ్మేరా నా పల్లె
పట్నం అను పసిపాపలకు తల్లేరా నాపల్లె

52. కర్షక గాధ

హలం మోసిన
బలరాముడు
దేవుడైయ్యాడు
ఆ హలాన్నే
నమ్ముకున్న కర్షకుడు
ఉరి తాడు ఆకలికి
ఆహారమైయ్యాడు

బలరాముడు చేసిన
పుణ్యం ఏమిటి
ఈ కర్షకుడు చేసిన
పాపం ఏమిటి

ఇది దేవుడిచ్చిన శాపమా
ఈ ప్రభుత్వ పాలన లోపమా

ఏది న్యాయం
ఎక్కడుంది ధర్మం

సమస్తాన్ని వర్ణించే
కవికలం
ఎరుపు సీరాతో మండి న్యాయం అడగదెందుకు?
మట్టికొట్టుకొన్న తలపాగ చుట్టిన
తలకుమాసిన మనిషి గురించి మనకెందుకనా?

53. సమాజ తీరు

ఈ సమాజం చాలా చిత్రమైనది
అభివృద్ధిలో నత్తతోను
అవినీతిలో చిరుతతోను
పోటీపడుతుంది.

ఈ సమాజం చాలా చిత్రమైనది
మంచిచేయడంలో దుర్యోధనుడితో
చెడు చెయ్యడంలో శకునితో
పోటీపడుతుంది.

ఈ సమాజం చాలా చిత్రమైనది
కష్టపడటంలో చీమలు పెట్టిన పుట్టలు దోచే పాముతోను
సుఖపడటంలో స్వేచ్ఛగా తిరిగే సీతకోకచిలుకలతోను
పోటీపడుతుంది.

ఈ సమాజం చాలా చిత్రమైనది
మంచి మాటలు చెప్పడంలో రాముడితోను
ఆచరించడంలో రావణుడితోను
పోటీపడుతుంది.

ఈ సమాజం చాలా చిత్రమైనది
ప్రక్కోడి కష్టాన్ని తక్కువగాను
తన కష్టాన్ని ప్రపంచం భరించలేనిదిగాను
చూస్తుంటుంది.

ఈ సమాజం చాలా చిత్రమైనది
నిజాన్ని అద్దంలోను
అబద్ధాన్ని భూతద్దంలోను
చూస్తుంటుంది…

54. పల్లెతల్లి

చలువ చీకటి కురులతో
ఆత్మీయ ముఖంతో
మమకారపు బొట్టుతో
నింగీ నేలను స్వర్ణకాంత నగలతో
శ్రమయను చెమట చుక్క బిందువులతో
మానవత్వమను ముక్కెరతో
మధుర భావాల పలుకులతో
వడ్డానమను కాలముతో
పచ్చదనమను వస్త్రములతో
ఉరుము మెరుపులను మెట్టెలతో
పక్షులు సవ్వడి గలగల గాజులతో
రైతుయను ఇంటనిండిన దాన్యపు రాశులతో
పై చదువుల కోసమని సుదూరం వెళ్ళిన
పట్నం, నగరం అనే కొడుకుల రాకకై
ఎదురుచూస్తున్నది పల్లెతల్లి

55. నా పల్లె

తెలవారక ముందే మేల్కొని
ముగ్గులేసి సూర్యుడికి స్వాగతం చెప్పే
సువర్ణ సౌరభ సమిష్టీపురము నా పల్లె

అటంకాల అడ్డుగోడల్ని పతనంచేసి
అనురాగాల అలల పలకరింపులతో
ప్రవహించే ఆత్మీయ నది నా పల్లె

మానవత్వ మమతలతో నిత్యం ఊరే ఊటబావి
పచ్చదనపు పరిమళాలతో పుడమితల్లి వస్త్రమైనది
కులమతాలకు కత్తెరేసి మొహరంతో మురిపించే డప్పుల చప్పుడు
చంటిపిల్లల అల్లరితో చిద్విలాసం చెందే చిన్మాయనందం
వాగు వంకల వన్నెలు తిరిగిన సౌందర్యంతో
మెరిసిపోయే నిత్య యవ్వన కన్యపడుచు ...నా పల్లె

56. కౌలు రైతు

రైతు జీవితం
కరువుకి, వరదకు
మధ్యన వేలాడే
వంతెన వంటిది

వరద ఉధృతి పెరిగితే
విలవిలబోవాల్సిందే
కరువు కన్నెర్ర జేస్తే
కడుపు కాలి కందిపోవాల్సిందే

కూలీ గిన్నే పట్టాల్సిందే
ధనమున్నోడి కింద దగా పడాల్సిందే
బూతు మాటలే బిరుదులుగా స్వీకరించాల్సిందే
అట్లుండలేనంటే ఆత్మహత్యకు స్వాగతం చెప్పాల్సిందే
కౌలు రైతుల బ్రతుకులిలా సాగాల్సిందే

57. జొన్నకంకి

పుడమి గుండె చీల్చుకుని మొలకెత్తి
వాయువును గుండెలకు హత్తుకుని
సూర్యకిరణాలను అతిథిగా ఆహ్వానించి
ఆశయాలను ఆకులుగా తొడిగి
కణికలుగా ఎదిగి
ఎదుగుతున్న కొద్ది ఒదిగి
సుతి మెత్తని పరిమళంతో
తేనెటీగల మనసు దోచుకుని
చిరునామా లేని గువ్వలకు కూడా
బువ్వపెట్టి
చెమటచుక్క చిందించిన రైతుకు
సిరుల చుక్కలను కానుకిచ్చి
ఇల్లు చేరి
నా ఆలి స్పర్శకు పరవశించి
రొట్టెగా మారి
ఉరకలేస్తున్న నాలోని
ఆకలిని ఉరితీసి
నన్ను బ్రతుకించిన
జొన్న కంకంటే
చాలా ఇష్టం నాకు

58. పల్లెతల్లి

మసకబారుతున్న ఊటబావి కళ్ళతో
కదలలేని గుడిసె తలుపుల కాళ్ళతో
నెరిపోయి బీడు వారిన పిచ్చి మొక్కల జుట్టుతో
విరిగిపోయిన కుమ్మరి చట్ర కర్రతో
నిండుకున్న ధాన్యపు మదితో
మాయమాటలు చెప్పి పట్నాలకు
వలసపోయిన కొడుకుల రాకకై ఎదురుచూస్తూ
పిల్లలు లేని గొడ్రాలిగా మారి
కాలమనే గుంజానికి ఊడిపోతున్న
రోజుల చెక్క ముక్కలను చూస్తూ
నిలిచిపోయిందా పల్లెతల్లి

59. కష్టమొచ్చిన వేళ

అమ్మా...! ఆకలేస్తుందే తినడానికి ఏదైనా పెట్టమన్నాడు
చంటోడు.
ఒరే..., చిన్న నీవు అల్లరిచేస్తూ నాకు దొరకకుండా పరుగెట్టినట్టు..!
మీ అయ్యకు చేపలు దొరకలేదంటరా...!
అమ్మ నేను నీకు దొరుకుతాను
అయితే అయ్యకు చేపలు దొరుకుతాయా..?
కళ్ళలో నీళ్ళు తిరిగిన అమ్మంది.
లేదు నాన్న ఆ చేపలు నీయంత మంచివి కావు
ఇందా ఈ నీరు తాగు., లాక్డాన్ అయిపోగానే నీకు ఐసుక్రీము కొనిస్తాను....
సరే అమ్మ...
పొద్దునైనా బువ్వెట్టు గిపుడు నేను బజ్జుంటాను...
బంగారువని అమ్మతొడ దిండైంది..,చంటోడికి...

60. దేవుడా...కూలోడిగా పుట్టి చూడు

ప్రాణం మీదికొస్తే
డాక్టర్ దేవుడాయే...

యుద్దమొస్తే
సైనికుడు దేవుడాయే...

తిండికి కొదవొస్తే
రైతు దేవుడాయే...

అంటురోగాలొస్తే
పారిశుద్ధ్య కార్మికుడు దేవుడాయే...

పథకాలు పెట్టిన సీఎం దేవుడాయే...
ప్రసంగాలు చేసిన పీఎం దేవుడాయే...

పొట్ట చేతబట్టి దేశానికి భవనాలను నిర్మించిన కూలోడే
ఎప్పుడూ లేనోడాయే...

గృహ నిర్మాణానికి గాడిద బరువులు మోసిన కూలోడే
నేడు దేశం దృష్టిలో గాడిద కన్నా...హీనమాయే....

పవిత్ర భారతదేశం
అభివృద్ధికి రాళ్ళెత్తి రక్తం త్యాగం చేసిన కూలోడికి ఇచ్చిన ఘనతిది...

ఎవరినన్నా...ఏముంది కూలీ బ్రతుకు ఎగిరిపోయే...
ఎండుటాకాయే...

రాత రాసే దేవుడా...కూలోడిగా పుట్టి చూడు
కూడు గూడు లేక గోడెళ్ళబోసుకునే
ఆ బాధెందో...తెలుస్తది

సాటి కూలి వాడిగా వారి వేదనకు కృంగిపోతు రాసినది

... సశేషం ....

Posted in June 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!