Menu Close
Palle Brathukulu Page Title
21. ఏది కష్టం

ఊహల ఊరేగింపుకు ఊగిపోవడమెందుకు
ఆశల పాశాలకు హడలిపోవడమెందుకు
ఆకలి కేకల ఆర్తనాదాలెందుకు
కష్టాలకు కలత చెందే తీరెందుకు
నష్టాలకు నలిగిపోవడమెందుకు
ఇష్టాలకు పొంగిపోవడమెందుకు
బ్రతుకు భారమని బాధలెందుకు
మెతుకు చిత్రమని చింతలెందుకు
ఉప్పొంగే రక్తం నీలో ఉండగా భయమెందుకు
ఈ సృష్టిలో విరిచిన విరగని దృడ సంకల్ప నిర్మాణం నీది కాదా
నువ్వు తలచుకుంటే ఏదైనా నీ వెంటరాదా
నీ తలరాతను మార్చే సత్తా నీది కాదా
నీ పనితీరుకు కష్టం సైతం ఇష్టమైపోదా
విధి ఆడే వింత ఆటలకు చింతనొందక
సమస్యలోనే సమాధానముండునని తెలియజేసిన నరోత్తమా నీకు జోహార్!!!!

22. ఎవరు గెలుస్తారో...?

మూతికి గుడ్డకట్టుకోలేని
వారి జీవితానికి తెల్లగుడ్డ కప్పుతానంటున్నది కరోనా...

తెల్లగుడ్డైనా కప్పుకుంటాను గానీ...
మూతికి గుడ్డ కట్టుకోనంటున్నాడు మనిషి

ఎవరు గెలుస్తారో...?

23. రైతు దేవుడే కానీ..?

ఆనాడు కూర్మావతార రూపంలో ఓ మహనీయుడు మంధర పర్వత భారాన్ని మోశాడు
ఈనాడు వ్యవసాయమను రూపంలో రైతు మహనీయుడు అప్పుల భారాన్ని మోస్తున్నాడు

ఆనాడు కృష్ణుడను మహనీయుడు గోవులను మేపాడు
ఈనాడు రైతు మహనీయుడు దళారిలను మేపుతున్నాడు

ఆనాడు రాముడను మహనీయుడు రాక్షసులతో యుద్ధం చేసాడు
ఈనాడు రైతు మహనీయుడు పురుగుపుట్రలతో యుద్ధం చేస్తున్నాడు

ఆనాడు హరిశ్చంధ్రుడను మహనీయుడు సత్యవ్రతముకై కష్టాలు పడినాడు
ఈనాడు రైతు మహనీయుడు పంట పండించుటకై రేయిపగలు కష్టపడుతున్నాడు

ఆనాడు క్షీరసాగరమథనంలో మహాదేవుడను మహనీయుడు
హాలహలాన్ని స్వీకరించి దేవతలను రక్షించాడు
ఈనాడు వ్యవసాయక్షేత్రమథనంలో స్వార్ధం దోపిడీ కరువు వరదను
హాలహలాన్ని స్వీకరించిన రైతు దేవుళ్ళను ఏ దేవుడు రక్షిస్తాడో?

24. తెగిన తాడు

పండించిన పత్తే
మెత్తటి కత్తై
కుత్తుక కోసిందని
నమ్మలేక
కళ్ళలో నీళ్ళతో
చెంపల్ని తడుపుతూ
రోదనతో కూడిన
ఆవేదనతో
దక్షిణ దిక్కునే
చూస్తున్నదామె
తెగిపడిన
మెళ్ళో తాడు
అతుక్కుంటుందేమోనని

25. స్థితిగతులు

అరువుల బరువులు
మోయలేక
కరువుల
కష్టాలను
ఎదుర్కొనలేక
మండే పచ్చనికట్టెగా మారి
పంటను పండించేటోడు
కమ్ముకున్న
రాజకీయ మేఘాలు
కురిపించే
వాగ్ధానాల వరదల్లో
కొట్టుకు పోయిన
ఆశ్చర్యమేముంది
చచ్చాక నివాళి అర్పించి
తప్పుకు తిరిగే
సమాజ స్వభావమనేది
జగమెరిగిన సత్యముగా

26. ఇంకెన్ని తాళ్ళో

సీమలోని
పొలాలగట్లపై ఉన్న చెట్లకు
తాళ్ళు వేలాడుతున్నాయి
నోళ్ళు అయ్యో అంటున్నాయి
కళ్ళు ఉప్పునీళ్ళు చల్లుతున్నాయి
నీళ్ళు లేని సాళ్ళు మాత్రం ఇంకా
నోళ్ళు తెరుచుకుని
బీళ్ళుగానే ఉన్నాయి
ఈ బీళ్ళు నోళ్ళు మూయాలన్నా
కళ్ళు ఉప్పునీళ్ళు చల్లడం ఆపాలన్నా
నోళ్ళు అయ్యో అనకూడదన్నా
ఇంకెన్ని
తాళ్ళు చెట్లకు వేలాడాలో నా సీమలో

ఘనచరిత్రకు పురుడుపోసిన నా సీమ సాళ్ళకు నీళ్ళు వస్తాయా...
కన్నీళ్ళే అన్నదాతల అప్పు చరిత్రకు పునాదులుగా మిగిలిపోతాయా...

27. ఏం మనుషులో...

జాగ్రత్త పడమంటే
అదేం చేస్తదంటరు

అదొచ్చిన వారినేమో చిత్రంగా...
అదోలా చూస్తరు

ఏం మనుషులో
అవసర సుడిగుండంలో
వారికి వారే అర్థంకారు

నిజంగా కనిపించని కరోనా కన్నా
కనిపిస్తూ కనికరం లేకుండా చూసే వీరే ప్రమాదకారులు

28. దేవుడు చాలా చెడ్డోడు

కంచంలో అన్నమును చెయ్యి ముట్టట్లేదు
చెయ్యి ముట్టిన అన్నమును నోరు ముట్టట్లేదు
నోరు ముట్టిన అన్నము గొంతులో దిగట్లేదు
ఎందుకంటారా....?
వలసెళ్ళి వాపసొచ్చి వాసిపోయిన కాళ్ళతో
ఖాళీ కడుపుతో
పనిలేక పస్తులు కూర్చున్న ఓ గుడిసెను చూశాను...

అదే నా గుండెల్లో గునపమైంది

దేవుడా నువ్వు చాలా చెడ్డోడివి
చాలా చాలా చెడ్డోడివి నీ తలుపులను మూసుకుని
నీ మెట్లకాడ చేయి చాసే స్థితికి కూడా చితిపెట్టావు

29. మారని తీరు

ఎన్ని ఆకలి కేకలు
ఆత్మహత్యలు చేసుకున్నా
ఖాళి కంచాలు నిండుకోవడం లేదు

ఎన్ని నాగళ్ళు
పురుగులమందులు తాగిన
అప్పుల పురుగులు చావడమే లేదు

ఎన్ని ఎన్నికలు
నోట్ల వర్షాలతో తడిసిన
సామాన్యుడి పాట్లు కొట్టుకుపోవడమే లేదు

ఎన్ని ఒంటరి జీవితాలు
చెత్త కాగితాలను ఏరిన
స్వచ్చభారత్ కనబడుట లేదు

చిక్కులసుడిగుండాల్లో
చిక్కుకున్న 70 ఏళ్ళ స్వాతంత్ర్యం
మారని తీరై మౌనానికి వేలాడుతూనే ఉంది

30. ఎక్కడుంది వైకల్యం

ఎంత
అదృష్టవంతులో వీరు
ఎన్నో దాంపత్యాలకు వచ్చిన
అంగవైకల్యం
వీరి దరిదాపుల్లోకి కూడా రాలేదు

పాపం
అంగవైకల్యం వచ్చిన దాంపత్యాలు
కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి
బహూశా
పనికిమాలిన పందులు పెంచే ఫించన్లకు
మేము అర్హులమని చెప్పడానికి
కాబోలు

... సశేషం ....

Posted in March 2021, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *