Menu Close

page title

పాలపిట్ట

Blue Bird

పాలపిట్ట ను [ఇండియన్ రోలర్] బ్లూజాయ్ అని కూడా అంటారు. పాలపిట్ట ను "బ్లూ-బర్డ్"అని కూడా అంటారు. ఇది రోలర్ కుటుంబానికి చెందిన పక్షి. మగ పాలపిట్ట ఆడ పాలపిట్ట రెండూ ఒకేలా ఉంటాయి. మెడ, పొట్ట భాగం ముదురు గోధుమరంగులో, తెల్లటి గీతలతో ఉంటాయి. తల పైభాగం, రెక్కలు లేత నీలం, ముదురు నీలం రంగుల్లో ఉంటాయి.

అబ్బో పాలపిట్టకు చాలా పేర్లే ఉన్నాయి. కికి, కిదివి, చాషము, చిత్రవాజము, చిత్రవాలము, పాలగుమ్మ, పూర్ణకూటము, సుపర్ణము.

ఇవి వలస పక్షులు కావు. కానీ, కొన్ని కాలాల్లో చిన్న చిన్న వలసలు పోతాయి. తమ బంధువర్గ పక్షులను చూడనో లేదా మనం వెళ్ళినట్లు ఏదైనా ప్రదేశాల దర్శనాలకో కావచ్చు.

కొన్ని ప్రాంతాల్లో ఈపక్షిని 'నీలకంఠ’ అని కూడాఅంటారు 'కంఠం’ నీలం గా ఉండటాన అలా పిలుస్తుండవచ్చు. ఏది ఏమైనా నీలకంఠుడైన శివుని తలపిస్తుంది ఈ పేరు. వీటి అరుపు మాత్రం వినసొంపుగా ఉండదు. చాలా వికృతంగా ఉంటుంది. కాకి అరుపుని పోలి ఉంటుంది. ప్రత్యుత్పత్తి సమయంలో గోల గోలగా అరుస్తుంటాయి. వాటి బాధ వాటిది!!

మనదేశంలో ఎక్కువగా కనిపించే పాలపిట్ట ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్నాటక, ఒరిస్సా, బీహారు రాష్ట్రాలకు రాష్ట్ర పక్షి. ఎండు చెట్టు కొమ్మల్లో, విద్యుత్తు తీగలమీద పాలపిట్టలను మనం చూడవచ్చు. ఇవి ఆహారంగా కప్పలు, చిన్న పాములు, మిడతలు,కీచురాళ్ళు వంటి వాటిని వేటాడి తింటుంటాయి.

Blue Birdపాలపిట్టలు పంటపొలాలు ఉన్నచోట తరచుగా కనబడుతుంటాయి. వీటి జీవితకాలం 17-20 సంవత్సరాలు. చెట్ల తొర్రల్ని గూళ్ళుగా మల చుకుని మూడు నుంచి ఐదు గుడ్ల వరకూ పెడతాయి. గుడ్లను పొదగడంలో ఆడపక్షి మగపక్షి రెండూ బాధ్యత వహిస్తాయి. వీటి ప్రత్యుత్ప త్తి కాలం అవి నివసించే ప్రాంతాలనుబట్టి ఫిబ్రవరి నుండి జూన్ వరకూఉంటుంది.

కొన్ని ప్రాంతాల వారు దసరా పండగ రోజుల్లో పాలపిట్ట ని చూస్తే శుభం జరగు తుందని నమ్ము తారు. దానికోసం వాటిని బంధించి ప్రదర్శనకు పెడుతుంటారు. డబ్బు సంపాదనకు మానవునికి వచ్చినన్ని ఆలోచనలు ఇహ ఏ జీవికీ రావు కదా!

ఈ పాలపిట్టను దసరా రోజుల్లో చూడటంలోని విశేషం ఏమంటే ‘పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట వారికి ముందుగా కనపడిందట. వారికి యుధ్ధంలో విజయం కలిగినందున అప్పటినుండి పల్లెవాసులల కంతా దీన్ని దర్శిస్తే శుభాలు జరుగుతాయనే నమ్మకం ఏర్పడిపోయింది.

ప్రతి ఒక్కరికీ ఏదైనా ముఖ్యమైన పనిమీద వెళ్ళేప్పుడు ఎలాంటి విఘ్నాలూ లేకుండా పని పూర్తి కావాలని ఆశిస్తారు. బయలుదేరే ముందు మంచి శకునం చూసుకుని వెళ్ళడం రివాజేగా! పాలపిట్ట శకునం కూడా శుభసూచకంగా కొందరు నమ్ముతారు.

పశుపక్ష్యాదులను దైవ స్వరూపాలుగా భావించి పూజించడం భారతీయ సంప్రదాయం. పాలపిట్ట దేవీ స్వరూపమని నమ్మకం. అందువల్లే దసరా రోజున తెలుగువారంతా పాలపిట్టను దర్శించుకోవాలని కోరుకుంటారు.

Posted in September 2018, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *