Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

ఈ కరోనా కాలంలో వార్తలు వింటున్నప్పుడు కొంచెం బాధ కలుగుతున్నది. ఎంతోమంది హితులు, ఆప్తులు అందరూ ఈ అంటురోగ సముద్రంలో కొట్టుకుపోతున్నారు. అందులో కొంతమంది తిరిగిరాలేని లోకాలకు తరలిపోగా మరికొంతమంది తిరిగివచ్చిననూ దీర్ఘకాల రుగ్మతలతో బాధపడుతున్నారు. ఎన్నో సంప్రదాయ వంటకాల దినుసులతో, సహజమైన భౌతిక వ్యాయామ ప్రక్రియలతో రోగనిరోధకత ను పెంచుకున్న భారతం లోనా ఈ పరిస్థితి అని కొంచెం దిగులు. కాలంలో ఎన్నో మార్పులు, మనిషి సౌఖ్యాలకు అలవాటుపడి, చెడు అలవాట్లే ఒక గొప్ప సామాజిక స్థితికి గుర్తింపు అంటూ, ఫాస్ట్ ఫుడ్స్ ప్రభావంతో రోగనిరోధకత ను చేజేతులా కోల్పోతున్నాడా అని ఒక చిన్న సందేహం. మీరేమంటారు?

పులి గాడి కంటే గిలి గాడు ఎంతో ఎంతో బలవంతుడు అనే సూక్తి మనమెరిగినదే. అది ప్రస్తుతం ఇక్కడ వర్తిస్తున్నది.

ఎవరో ఒక అంటువ్యాధుల స్పెషలిస్ట్ అయిన డాక్టర్ కూడా కరోనా వచ్చిందని భయపడే విధంగా న్యూస్ వచ్చింది. ఆయన ముందుగా మనిషి ఆపైన అది ఆయన చేసే వృత్తి అంతమాత్రానా ఆయనకు అన్నీ తెలుసు అనుకోవడం పొరపాటు. మనుషులుగా మనం ఏ చిన్న పొరపాటు చేసినా దాని తీవ్రత కొన్ని సార్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అది మనం గమనించాలి. ఇటువంటి వార్తలు మనలో మరింత జాగ్రత్తను పెంచాలే తప్ప మనలో భయాందోళనలు కలిగించకూడదు. ప్రపంచం లోని కుబేరులలో ఎక్కువ శాతం మన దేశంలోనే ఉన్నారు. మన దేశమే మొదటగా వాక్సిన్ కనుక్కున్నది. అన్ని రంగాలలో మన భరత సమాజం అభివృద్ధి పథంలో దూసుకొని పోతున్నది. మరి ఆక్సిజన్ అందక మృతి చెందడం అనేది కూడా మనదేశంలోనే జరిగింది. దీనికి కారణం ఎవరు? మనందరం. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది కదా అని సమాజానికి ఏది మంచి, ఏది చెడు అనేది చూడకుండా కనపడిన చెత్త వార్తలను ఫార్వర్డ్ చేస్తున్నారు. దానిని చదివి ప్రభావితం అయిన వారు వారి స్వార్థం కొరకు అతి జాగ్రత్తలు పడుతున్నారు. ఉదాహరణకు కోవిడ్ వచ్చినప్పుడు వాడవలసిన మందులను ముందుగానే కొని ఇంట్లో దాచుకుంటే, తద్వారా విపణిలో మందులు దొరకక నిజంగా కోవిడ్ వచ్చిన వారు బాధపడుతున్నారు. మానవత్వం మరిచి మరికొంతమంది నల్ల బజారులో పదిరెట్ల ధరకు అమ్ముతున్నారు. ఈ పనులన్నీ డబ్బులు బాగా ఉన్న ధనవంతులు చేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితులలో పేదవాడైన సగటు మనిషి మందులు దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఎంత మంది రాజకీయ పైరవీలతో నెగ్గుకు రాగలరు? అదేమంటే జనాభా ఎక్కువ కనుక ఇవన్నీ సర్వసాధారణం అంటారు. మరి అభివృద్ధి జరిగినప్పుడు కూడా జనాభా ఎక్కువే కదా. అంటే ఎక్కువ మేధోసంపత్తి సంపత్తి ఉన్నట్లే కదా. మరి అటువంటి సంపద ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు ఎందుకు మంచి కార్యాలకు శ్రీకారం చుట్టదు. ఎందుకంటే స్వార్థ చింతన. అంతేకాదు, దేశ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి కదా. ఇవన్నీ జరగవు. ఎందుకంటే ఒకరు చెబితే మరొకరు వినరు. విన్నట్టు నటిస్తారు. చెప్పేవారు కూడా ఎక్కువే. పది మంది పది రకాలుగా చెబుతారు. మరి ఏది నిజం. ఏది పాటించాలి. సందిగ్దతతో ఏమీ చేయరు.

ఒక విధంగా మన శరీరంలో ఏదీ శాశ్వతం కాదు. క్రొత్తనీరు వచ్చి పాత నీటిని తోసేసినట్టు, శరీరంలో కొత్త కణాలు పుడుతుంటాయి. పాతవి చస్తుంటాయి. తదనుగుణంగా మన రోగనిరోధక సాంద్రతలో మార్పులు వస్తుంటాయి. మనం అందుకుతగిన విధంగానే మన అలవాట్లను మార్చుకుంటూ పోవాలి. ఇది ఒక విధాన నిరంతర ప్రక్రియ. టీకా వేసుకున్నా కూడా నీ శరీరం యొక్క స్పందనలను నీవు అర్థం చేసుకుని అందుకు తగినట్లుగా మలచుకోవాలి. అంతేకాదు ఏ ఇద్దరి వ్యక్తుల శరీరాకృతి, లోపలి నిర్మాణం ఒకటి  కాదు. పరిస్టితులకు స్పందించే విధానం కూడా పూర్తి భిన్నంగా ఉంటుంది. ఒక వ్యక్తి, ఆ రంగంలో నిష్ణాతుడైన వైద్యుడు కావచ్చు, అనుభవం సంపాదించి తర్కంతో చెప్పగలిగిన సామాన్య వ్యక్తి కావచ్చు. అతను లేక ఆమె చెప్పే విషయాలను అర్థం చేసుకొని వాటిని నీ శరీర స్పందనలతో పోల్చుకొని సరైన నిర్ణయం నీవు తీసుకునే స్థాయికి మన ఆలోచనలు ఎదగాలి. దానికి శాస్త్రీయ పరిజ్ఞానం అవసరం లేదు. కొంచెం తర్కం తెలిసుండి ఇతరుల మాటలకు సులువుగా ప్రభావితం కాకుండా ఉండగలిగిన సత్తా ఉంటే చాలు. మరి అది ఎక్కడనుండి వస్తుంది అంటే ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అని మన మహాకవి వేమన ఏ నాడో చెప్పాడు. సాధించాలనే సంకల్పం ఉంటె మనుషులు ఏమైనా చేయగలరు. ఈ ఫార్వర్డ్ మెసేజెస్ వలన జనాల ఆలోచనలు ఒక విధమైన అయోమయ స్థితిలోకి వెళ్లి వారు చేయాలనుకున్న పనులను భయంతో మానేస్తున్నారు. ఒక వింత వ్యాధితో మన జనజీవితాలు అతలాకుతలం అవుతున్నప్పుడు మరింత భయాలతో మన వంతు సహకారాన్ని కూడా అందించకపోతే సమిష్టిగా ఆ సమస్యను ఎదుర్కొనడం కష్టమౌతుంది. ఈ ప్రస్తుత యుద్ధంలో రాజులు కాదు, మంత్రులు కాదు, సిపాయిలు కాదు అందరూ బలౌతున్నారు. మన గాన గంధర్వుడు కూడా ఈ సూక్ష్మ ప్రాణి వలన మనలను వీడి వెళ్ళిపోయారు. ఇది మనందరికీ పెద్ద కనువిప్పు కావాలి. మన కర్తవ్యం ఏమిటి అనేది మనమే నిర్ణయించుకోవాలి.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in June 2021, ఆరోగ్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!