Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

ప్రతి మనిషి ఒక నిత్య విద్యార్థి అన్న విషయం మనం గ్రహించాలి. మనకున్న పరిజ్ఞానం తో అన్ని విషయాలను విశ్లేషించడం తగదు. కాకుంటే అనుభవంతో కూడిన ఆలోచనలు కొంచెం మెరుగుపరిచి మనలోని విశ్లేషణా శక్తిని పెంపొందిస్తాయి. సద్గురువులకు కూడా అఖండమైన ఈ జీవన అఖాతాన్ని అవపోసన పట్టడం అంతసులువు కాదు. వారు నిత్య సాధకులు. కనుకనే మనకు దిశానిర్దేశం చేయగలరు. అట్లని వారికి అవగాహన లేని సమస్యను పరిష్కరించమని అస్తమానం విసిగిస్తే ఆ సమయంలో వారికి తోచిన సలహాను ఇచ్చి మనలను వదిలించుకుంటారు. ఆ సలహా ఎంతవరకు నీ విషయంలో సరిపోతుందో నీవు స్వయంగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి.

నీ శరీరానికి సంబంధించిన స్పందనలు నీకు మాత్రమే తెలుస్తాయి. నీవు చెబితేనే అది ఇతరులకు అర్థమౌతుంది. అంతేకాదు నీ దేహానికి, మనసుకు సంబంధించిన సర్వహక్కులూ నీకు మాత్రమే సొంతం. అందుకే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి చేసే ఏ ఆరోగ్య చికిత్సలకైనా consent decree అని నీచేత సంతకం చేయించుకొని మాత్రమే ఏ డాక్టర్ అయినా నీకు చికిత్స అందిస్తారు. అటువంటి సంబంధ అనుబంధాలతో ముడిపడి సదా నిన్ను పరిరక్షిస్తూ, నీకు ఆనందాన్ని అందిస్తూ, నీ మనసుకు మంచి స్థానాన్ని కల్పించిన నీ భౌతిక దేహాన్ని పరిరక్షించుకోవాల్సిన  కనీస బాధ్యత నీకు వున్నది. నీ ఆహారపు అలవాట్లు, నీ దైనందిన కర్మలు, నీవు నిర్వర్తించవలసిన విధుల పట్ల నీవు చూపిన నిబద్ధత తదితర అంశాలు నిన్ను మానసికంగా సంతోషంగా ఉంచడమే కాకుండా నిన్ను సమాజంలో ఒక స్థానంలో నిలుపుతాయి.

అత్యంత మేధోసంపత్తి సంపత్తిని కలిగివున్న మానవజన్మ మనకు లభించినందులకు దానికి తగిన సార్థకతను కలిగించాల్సిన బాధ్యత మనుషులమైన మనదే. మనం నిర్వర్తించవలసిన సత్కర్మలను నిష్టతో పూర్తి చేయాలి. ఈ కార్యానికి కర్మ సిద్ధాంతాన్ని ఆపాదించకూడదు. మనముందు ఉన్న కార్యాన్ని ఎటువంటి ఫలితాలను ఆశించకుండా ముందు పూర్తిచేస్తే పిమ్మట ఆ ఫలితాలు వాటంతట అవే మన దరికి వస్తాయి. అందుకే నేను మా పిల్లలకు ఎప్పుడూ “do your best and leave the rest” అని చెబుతుంటాను.

“కృషితో నాస్తి దుర్భిక్షం” అనే స్ఫూర్తితో మహాపురుషుడైన వాల్మీకి నేటికీ మనకు ఆదర్శమూర్తి. ఆయన జీవితాన్ని మనందరం ఒక మంచి ఉత్ప్రేరక ఔషధంగా స్వీకరిస్తాము. అయితే ఆయన సమకాలీన సంబంధీకులు ఎంతమంది ఆయనను చూసి స్ఫూర్తిని పొందారో చెప్పడం కష్టం. నేడు మాత్రం మనతో, మనలోనే ఉన్న మనతరం వారు ఎవరైనా అటువంటి కృషితో వారి జీవన విధానాన్ని మార్చుకొని, సమాజ శ్రేయస్సుకు, మంచి అభివృద్ధికి పాటుపడుతుంటే  వారిని చూసి, వారి ఎదుగుదలకు అసూయచెంది, తాము ఏదో కోల్పుతున్నామనే భావంతో వారిని నిస్సహాయులను చేయాలనే తలంపుతో వారి సంబంధీకులే వారి ఎదుగుదలకు అడ్డు తగులుతున్నారు. అందువలన నష్టపోయేది ఆ వ్యక్తి కాదు, మన వ్యవస్థ మరియు చెడు ఆలోచనలతో కలిగిన మానసిక వత్తిడుల వలన ఆ వ్యక్తికి నష్టం కలిగించాలనుకొన్నవారే. ప్రతి వ్యక్తి లోనూ మంచి, చెడు లక్షణాలు ఉంటాయి. మనకు, లేక మనవలన ఇతరులకు హాని కలగనంతవరకు ఎదుటివారిలోనే మంచిని మాత్రమే పరిగణించి ముందుకు సాగాలి. చేతలలో అది అంత సులభం కాదు. దానికొరకు మనం మహా పురుషుల జీవితాలను పరిశీలించాలి. మనసు ఆరోగ్యంగా ఉంటె మన ఆలోచనలు అందరి శ్రేయస్సు కోరేవిగా ఉంటాయి తద్వారా మన శరీరం కూడా ధృడంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మనం చేయలేని మంచి పనిని వేరొకరు చేస్తున్నప్పుడు మనసారా అభినందించాలి, ప్రోత్సహించాలి. ఒకవిధంగా అది మనకు కూడా గౌరవాన్ని ఆపాదించిపెడుతుంది.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in May 2021, ఆరోగ్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!