Menu Close
నూరబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలి
- వెంపటి హేమ (కలికి)

"అత్తయ్యా! అటు చూడు, ఆ మోటార్ బైక్ పక్కన నిలబడిన అతన్ని చూడు, చక్కగా ఠీవిగా ఒక రాజకుమారుడులా లేడూ?" హఠాత్తుగా మేనత్త సుబ్బులమ్మ చెయ్యపట్టుకుని నిలబెట్టి మరీ అడిగింది కామాక్షి. సుబ్బులమ్మ కామాక్షి చూపించినవైపుగా చూసి, అతన్ని గుర్తుపట్టింది.

"ఓ! నువ్వు చెప్పేది ఇతగాడిని గురించా! ఇతడు ఎవరో కాదు, మన వరలక్ష్మమ్మగారి ఇంట్లోని పెద్దవాటాలోకి కొత్తగా అద్దెకొచ్చిన బ్యాంక్ మేనేజర్ గారి అబ్బాయి. అదేదో ఊళ్ళో, ఏదో చాలా పెద్దచదువే చదువుతున్నాడుట, శలవులకని ఇంటికి వచ్చాడుట. మళ్ళీ త్వరలోనే వెళ్ళిపోతాట్ట. మొన్న ఊరికే పలకరిద్దామని వెడితే తెలిసింది. వాళ్ళు చాలా మర్యాదస్తులు."

అంతలో ఆ అబ్బాయి వీళ్ళ ముందునుండే వెళ్ళిపోయాడు బైక్ మీద. మేనత్త చేతిని పట్టుకుని ఉన్న కామాక్షి పట్టు బిగిసింది అప్రయత్నంగా. వెంటనే సుబ్బులమ్మ అర్థం చేసుకుంది. "కన్యా వరయితే రూపం!" ఆ అబ్బాయి స్ఫురద్రూపి. ఆరడుగుల అందగాడు. ఇకనేం కావాలిట! తొలి చూపులోనే తన మేనకోడలు ఆ అబ్బాయి మీద మనసు పారేసుకుంది, సందేహంలేద్ - అనుకుని చిన్నగా నవ్వుకుంది సుబ్బులమ్మ. మెల్లగా అడిగింది,"కామాక్షీ! ఆ అబ్బాయి నీకు నచ్చాడు కదూ?"

పైటకొంగు కొస నోటిలో ఉంచుకుని మునిపంటితో కొరుకుతూ, సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది కామాక్షి. ఆమె కళ్ళు రెపరెపలాడాయి. సిగ్గు బరువున కళ్ళు వాలిపోతూండగా మేనత్తవైపు ఓరగా చూస్తూ, ఔనన్నట్లు తలాడించింది కామాక్షి.

సుబ్బులమ్మ సరదాగా కామాక్షిని బెల్లించింది, "ఆ అబ్బాయి అచ్చం పంచకల్యాణి గుర్రం మీద స్వయంవరానికి వచ్చిన రాకుమారుడులా ఉన్నాడు కదూ. వాళ్ళింట్లోవాళ్ళు అతన్ని "ప్రిన్సు" అనే అంటున్నారు. అచ్చం అలాగే ఉన్నాడు కదూ! ఈ రోజే మీ నాన్నతో చెప్పి వాళ్ళింటికి పెళ్ళిమాటలకి వెళ్ళమంటా. "ఆలస్యం అమృతం విషం" ఆంటారు. మనం ఆలస్యం చేస్తే ఎవరైనా వచ్చి ఇట్టే గద్దలా తన్నుకుపోగలరు. వాళ్ళూ మనవాళ్ళే, అన్నివిధాలా అనువైన సంబంధం" అంటూ మురిసిపోయింది. అంతలో ఖాళీ ఆటో కనిపించింది. ఆపి ఇద్దరూ ఎక్కి కూర్చుని ఇంటి అడ్రస్ చెప్పారు.

అంతలో కామాక్షి నీరసపడింది. "అత్తయ్యా! వాళ్ళు మహానగరమైన ముంబాయి నుండి వచ్చారు, మనం చూస్తే పల్లెటూరి వాళ్ళం. వాళ్ళకి మనం నచ్చుతామంటావా?"

మేనకోడలు అలా డీలా పడిపోడం సుబ్బులమ్మ భరించలేకపోయింది. "నచ్చకపోడానికి నీకేం తక్కువే? అలా బీదార్పులు వద్దు. నీకు కన్నొంకరా కాలొంకరా - చక్కగా ఉంటావు, పది క్లాసులు చదివావు! సంసారికి ఆ చదువు చాలదా ఏమిటి? నలుగురు మగపిల్లల తరవాత పుట్టావని మీనాన్న నీకోసం నువ్వు పుట్టినది మొదలు డబ్బు కూడబెడుతున్నాడు, నీ పెళ్ళి అంగరంగవైభోగంగా చెయ్యాలని! అసలు, నీకు తనపేరు పెట్టారన్న సంతోషంతో మీ అమ్మమ్మ నీపేర రాసిన మూడెకరాల మాగాణి భూమీ చాలు, ఎవరికైనా నువ్వు నచ్చడానికి. లక్ష్మీ ప్రసన్నం గల పెళ్ళికూతురివి, నువ్వు నచ్చకపోవడమేమిటి! సిరి రాగా మోకాలడ్డంపెట్టే వాళ్ళెవరైనా ఉంటారా... ఐనా నీకెందుకు, అదంతా నేను చూసుకుంటా, నువ్వు నిశ్చింతగా ఉండు" అంటూ భరోసా ఇచ్చింది సుబ్బులమ్మ.

కామాక్షి ఉప్పొంగిపోయింది. "మా అత్తయ్య ముద్దబంగారం" అంటూ ఆటోలోనే పక్కకు తిరిగి ఆమెను గట్టిగా కౌగిలించుకుంది.

### ### ### ###

సుబ్బులమ్మ ఆ ఊల్లోని పెద్దమనుష్యుల్లో ఒకడైన సుబ్బరామయ్యకి చెల్లెలు. బాలవితంతువైన ఆమె అన్నగారి ఇంట్లోనే ఉంటుంది. అన్నకూతురు కామాక్షి అమెకు చాలా చేరిక. ఒకే కంచంలో తిండి తినకపోయినా రాత్రులు ఇద్దరూ ఒకేమంచం మీద పడుకుని, కళ్ళమీదకు నిద్రవచ్చేవరకూ కబుర్లు చెప్పుకుంటారు. కామాక్షి వదినల్ని అడిగితే మాత్రం, "ఇద్దరివీ బొందెలే వేరుగాని ప్రాణం ఒకటే" అంటారు నవ్వుతూ. ఎలాగైనా మేనకోడలికి కోరిన వరుడితో వివాహం జరిపించాలి - అనుకుంది సుబ్బులమ్మ. చెవిలో ఇల్లుకట్టుకుని పోరి, మొత్తానికి ఎలాగైతేనేం అప్పటికప్పుడు, అన్నగారిని బ్యాంక్ మేనేజర్ రామేశం గారి ఇంటికి పంపించగలిగింది.

ఆరోజు ఆదివారం కావడంతో తీరికగా కూర్చుని పేపర్ చడువుకుంటున్న రామేశం దగ్గరకు వచ్చాడు ప్రిన్సు, బైక్ తాళాలకోసం. "నాన్నా! నేనొకసారి అలా వెళ్లి బైక్ మీద ఊళ్ళో తిరిగి వస్తా..." అంటూ అడిగాడు తండ్రిని. వెంటనే రామేశం టీపాయ్ మీదున్న తాళాలు తీసి కొడుకు చేతిలో పెట్టాడు. "ప్రిన్సు" అని పిలవబడే ఆ అబ్బాయి అప్పటికే ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉన్నాడు. ఇప్పుడు అహమ్మదాబాద్లో MBAకి చదువుతున్నాడు. సెలవులు పూర్తవ్వగానే మళ్ళీ చదువుకునేందుకు వెళ్ళిపోతాడు.

మెట్లెక్కి లోపలకు వస్తున్న సుబ్బరామయ్యకు గుమ్మంలో ఎదురయ్యాడు ప్రిన్సు. తల పైకెత్తి అతన్ని ఆశ్చర్యంగా చూశాడు. ప్రిన్సు అదేం పట్టించుకోకుండా బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. సుబ్బరామయ్యకు అతడు బాగా నచ్చడంతో సంతోషంగా చిరునవ్వు నవ్వుకున్నాడు. గుమ్మంలో ఎవరో గొంతుకు సవరించుకోడం విని రామేశం తలెత్తి చూశాడు. గుమ్మంలో అటూ ఇటూ తచ్చాడుతున్న సుబ్బరామయ్యను చూసి లోపలకు ఆహ్వానించాడు. సుబ్బరామయ్య తనను ఆ ఊళ్ళో ఉన్న లాండ్లార్డుల్లో ఒకనిగా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ కూర్చుని ప్రస్థుతం నడుస్తున్న రాజకీయాలపై మాటాడుకోడం మొదలుపెట్టారు. అంతలో రామేశంగారి అమ్మాయి టీ తీసుకుని వచ్చింది ఇద్దరికీ.

"ఈమె మా అమ్మాయి వకుళ. తనకన్నా పెద్దవాడు అబ్బాయి. అహమ్మదాబాదులో MBA చదువుతున్నాడు." అంటూ తన పిల్లల పరిచయం చెప్పాడు రామేశం. అవకాశంకోసం ఎదురుచూస్తున్న సుబ్బరామయ్యకు సంతోషమయ్యింది. వెంటనే ఎత్తుకున్నాడు, "నాకూ ఇంత కూతురు ఉంది. పేరు కామాక్షి. వాళ్ళ అమ్మమ్మ పేరుపెట్టామని, ఆమె దీనిపేర మూడెకరాల సుక్షేత్రమైన మాగాణీ భూమి రాసింది. నాకూ తక్కువలేదు, నేనూ తన పెళ్ళి కట్నకానుకలతో అంగరంగ వైభోగంగా చెయ్యాలనుకుంటున్నా. నలుగురు మగపిల్లల తరువాత అపురూపంగా పుట్టిన ఒక్క ఆడపిల్ల. ముద్దుముచ్చట్లకూ ఏ లోటు ఉండదు. దేనికీ వెనకాడే పనిలేదు" అంటూ తను వచ్చిన పనికి నాంది పలికాడు సుబ్బరామయ్య.

"ఎవరో అదృష్టవంతుడు పుట్టే ఉంటాడు ఎక్కడో, ఈ లక్ష్మీ పుత్రికను పెళ్ళాడేందుకు! ఇంక నేనూ మా అమ్మాయికి సంబంధాలు చూడాలనే అనుకుంటున్నాను. నేను మీ అంత ఘనంగా చెప్పలేనుగాని, ఉన్నంతలో మేమూ ఏలోటూ రానియ్యం. మా అమ్మయి అద్భుతంగా వీణ వాయిస్తుంది."

"రామేశం గారూ! మనమిలా అనుకోకుండా కలుసుకోడం దైవ నిర్ణయం అనిపిస్తోంది. ఈ బంధం శాశ్వతం కావాలంటే మనం సంబంధం కలుపుకోడం బాగుంటుంది" అన్నాడు సుబ్బరామయ్య. కాని వచ్చిన చిక్కల్లా ఏమిటంటే సుబ్బరామయ్య దృష్టి తన కూతురు పెళ్ళిమీద ఉంటే, రామేశంగారి దృష్టి తన కూతురు వకుళ పెళ్ళిమీద ఉంది. అందుకే సుబ్బరామయ్య మాటలు ఆయనకు వేరేగా అర్థమయ్యాయి.

కొంచెం ముందుకి వంగి ,"సుబ్బరామయ్యగారూ! మీ సలహా బాగుందండీ... అలాగే చేద్దాం అన్నీ కుదిరితే....  ఇంతకీ మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు" అని అడిగాడు. తెల్లబోయాడు సుబ్బరామయ్య. "ఇదేమిటి, మీరు నన్నడుగుతున్నారు? నేనడగవలసిన మాటది! మా కింక పెళ్ళికావలసిన కొడుకులెవరూ లేరు. నలుగురికీ పెళ్ళిళ్ళయి పిల్లలుకూడా ఉన్నారు. ఇంక ఈ ముసుకులో గుద్దులాట వద్దు. నేరుగా మాటాడుకుందాము. నిజానికి నేను మా అమ్మాయి కామాక్షికి మీ అబ్బాయితో  పెళ్ళిమాటలు మాటాడడానికి వచ్చాను" అన్నాడు.

రామేశం నవ్వాడు. "బలే వారండి మీరు! ఇంట్లో పెళ్ళికెదిగిన ఆడపిల్లను పెట్టుకుని, ఇంకా చదువైనా పూర్తికాని కొడుక్కి పెళ్ళిచెయ్యాలని ఏ తండ్రి అనుకుంటాడు చెప్పండి! మీ ఎరుకలో ఏవైనా తగిన సంబంధాలుంటే చెప్పండి, మీ పిల్లతోపాటుగా మా పిల్లకు కూడా" అన్నాడు.

సుబ్బరామయ్యకు చాలా కోపం వచ్చింది. కాని తమాయించుకుని, "ఏమో అనుకున్నా గాని, బావగారు గొప్ప లౌక్యులేనే" అంటూ ఓ పెడనవ్వు నవ్వాడు. ఆ తరవాత అతడు అక్కడ క్షణం ఆగలేదు.

### ### ### ###

ఇంటికివస్తూనే సుబ్బరామయ్య చెల్లెలు సుబ్బులమ్మ మీద విరుచుకుపడ్డాడు. అంత కొరమాలిన సంబంధం మాటాడిరమ్మని తరిమితరిమి పంపించినందుకు చెడామడా తిట్టాడు. నానా హడావిడీ చేసి చివరకి "చూస్తూ ఉండండి, త్వరలోనే దీని బాబులాంటి గొప్ప సంబంధం తెచ్చి దీని పెళ్ళి ఎంతో వైభవంగా జరిపించకపోతే నాపేరు సుబ్బరామయ్యేకాదు" అంటూ కఠోర ప్రతిజ్ఞ చేశాడు.

ఆ రాత్రి తన ప్రియమైన మేనత్త ఒడిలోచేరి గోడుగోడున ఏడ్చింది కామాక్షి. "అత్తాయా! నీకు తెలుసుకదా, నాన్న తెచ్చే సంబంధాలు ఎంత వైభోగంగా ఉంటాయో! వాళ్ళలో ఏ ఒక్కరూ ఈ ప్రిన్సు కాలిగోరుకి కూడా పోలరు కదూ" అంటూ. అంతేకాదు, "నా మాట ఉట్టిదంటావా ... నువ్వుచెప్పు అత్తయా" అంటూ ముక్తాయించింది.

గుండె తరుక్కుపోతూండగా సుబ్బులమ్మ మేనకోడల్ని లేవదీసి దగ్గరగా హత్తుకుంది. అప్పుడు ఆమెకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది, "నూరబద్దాలాడైనా ఒక పెళ్ళి జరిపించమని సామెత! ఎలాగో ఓలాగ ఆ పిల్లాడిని ముగ్గులోకి లాగి, మూడు ముళ్ళూ వేయించేస్తే ఆ తరవాత అన్నీ ఇబ్బందులూ వాటంతట అవే సద్దుబాటైపోతాయ్. ఇంక ఆలస్యం చెయ్యకూడదు, మళ్ళీ ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు" అనుకుంది ఆమె.

ఒక నిర్ణయానికి వచ్చిన సుబ్బులమ్మ కామాక్షిని దగ్గరగా తీసుకుని, ఆమె చెవిలో చెప్పింది, "ఇంక బాధపడకురా బంగారూ! నేనున్నా కదా నీకు! నేను చెప్పినట్లు నువ్వు చేస్తివా, నీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే! ఈ వేళ ఫష్టా, కేలండర్లో మరో కాగితం చిరిగే సరికి - చూడు, మీ కొంగులు ముడిపడిపోతాయి, ప్రిన్సు నీకు పెనిమిటైపోతాడు" అంది గుసగుసగా.

ఆ రోజునుండి వకుళతో స్నేహానికన్న పేరుతో, కామాక్షి రామేశంగారి ఇంటికి రాకపోకలు సాగించింది. ముంబాయి మహా నగరంలో ఉండి వచ్చినవాళ్ళేమో, ఆ పల్లెటూరి పద్ధతులూ కట్టుబాట్లూ, ఏమీ తెలియవు వాళ్ళకి. కొత్తగా రావడం వల్ల ఇంకా ఇరుగుపొరుగులతో అంతగా పరిచయాలు కూడా ఏర్పడలేదు. ఎప్పుడూ వకుళ వెంట నుండే కామాక్షితో, వకుళతో మాటాడినట్లే చనువుగా మాటాడేవాడు ప్రిన్సు. వాళ్ళు ముగ్గురూ కలిసి వీలైనప్పుడల్లా పేకాట, కేరంమ్స్ లాంటి ఇండోర్ గేంమ్స్ ఆడుకునే వారు. అప్పుడప్పుడు రామేశంగారి భార్య రాజేశ్వరి కూడా పిల్లలతో కలిసి ఆడేది.

కామాక్షి తండ్రి సుబ్బరామయ్య రామేశం గారి ఇంటికి పెళ్ళిమాటలకొచ్చాడన్న సంగతి ఇంట్ళో ఎవరికీ తెలియదు. వాషింగ్ మిషన్ చేస్తున్న చప్పుడులో వకుళకుగాని, రాజేశ్వరికిగాని వాళ్ళ సంభాషణ వినిపించలేదు. రామేశం ఆ సంభాషణకు ఏ ప్రాముఖ్యమూ ఇవ్వకపోడంతో సుబ్బరామయ్య వచ్చి వెళ్ళిన మరుక్షణం, ఆయన వచ్చాడన్న సంగతే మరిచిపోయాడు. వాళ్ళు కామాక్షిని మరే ఇతర ఆలోచనా లేకుండా ఒక స్నేహితురాలిగానే చూశారు. కామాక్షి ఆ ఇంటికి నిరాటంకంగా తరచూ వచ్చి, వెడుతూండేది.

…. సశేషం ....

Posted in April 2018, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!