Menu Close
Kadambam Page Title
నేను ...... కాలపురుషుడిని..!
- కామిశెట్టి చంద్రమౌళి

నేను ...... కాలపురుషుడిని..!
రాలిపడే నక్షత్రాలకు జాలిపడే గుండెలకు
తూలిపడే అక్షరాలకు వాలిపడే జీవితాలకు
కరిగిపోయిన గతానికి చెరిగిపోయిన మంచితనానికి
విరిగిపోయిన మానవత్వపు మహావృక్ష కాండానికి
పగిలిపోయిన నిష్కల్మష ప్రేమామృత భాండానికి
అక్షరసాక్షీభూతమై కలమై గళమై నిర్గమమై
నిశ్చల నీరవమై నిరంతర ప్రవాహమై
ఆగిపోని కాలమై ఆరిపోని దీపమై
ప్రజ్వలించు ప్రభాతమై నిశితో కసిగా పోరుతూ
నిత్యం నూతనమై నిన్ను దర్శిస్తాను
నేను .... కాలపురుషుడిని..!

చరిత్ర చెక్కిన చెంఘిజ్ ఖాన్ లను
హిట్లర్ ముస్సోలినీ ఈదీఅమీన్ లను
నరకానికి నకళ్ళుగా ఈ ప్రశాంత ప్రపంచాన్ని మార్చినోళ్ళను
నియంతృత్వపు నీడలో అమాయక ప్రజలను ఏమార్చినోళ్ళను
శాంతి సౌఖ్యాలకు శాశ్వతంగా ఆరని చితిని పేర్చినోళ్ళను
కుత్సిత కుతంత్రాలతో జనజీవితంలో కుమ్ములాటలు కూర్చినోళ్ళను
చెరుపు కురుపులతో చరిత్రకు చెదలు పట్టేలా చేటును చేకూర్చినోళ్ళను
తిరిగిరాని తిమిరలోకాలకు త్రిప్పి పంపిన త్రికాలాతీతుడిని
నేను ...... కాలపురుషుడిని ...!

ప్రకృతిశక్తుల ప్రకోపం గర్భవిచ్చిత్తితో ఘనమైన పుడమితల్లికి శోకం
విలయాగ్నుల ప్రళయాగ్నుల అగ్నిపర్వత వికృత వికటాట్టహాసాలు
మౌంట్ ఫ్యూజియామా వెసూవియస్ ఘోరాగ్నుల విలయాలు
మాడిమసైన జీవకీకారణ్యాలు నా మస్తిష్కంలో చెదరని జ్ఞాపకాలు
సాగరగర్భంలో సునామీలు భూకంపాలు అంతరిక్ష తారావిస్ఫోటనాలు
భయోత్పాతాల మృత్యుపరిష్వంగంలో జీవకోటి ఆర్తనాదపు ఆక్రందనలకు
డొక్కల కరువులతో బిక్కుబిక్కున జీవుల బరువు బ్రతుకు చావులకు
గళమెత్తని గంభీరమౌనసాక్షిగా నిలిచిన నిర్జరమంత్రాక్షరిని
నేను ..... కాలపురుషుడిని...!

విశ్వశాంతి కపోతాలు ఐక్యరాజ్యాల కళ్ళెదుటే విలవిలలాడుతూ నేలకూలుతున్న వేళ
హింసారాజ్యం దురహంకారంతో జనహననానికే కత్తులు ఝళిపిస్తున్న హేల
క్షమ ప్రేమ త్యాగం నడివీధుల్లో శిలువ సాక్షిగా నెత్తుటి తిలకమైనప్పుడు
అహింస సౌభ్రాతృత్వం మానవత్వం తుపాకీ తూటాలకు నేల కూలినప్పుడు
నిర్దాక్షిణ్యం సిగ్గువిడిచి సామ్రాజ్యవాద సర్పమై బలహీనులను కాటేసినప్పుడు
పేదవాడి స్వఛ్ఛమైన స్వేదం రక్తం పెద్దవాడి మందుపెగ్గుల్లో అమృతంగా మారినప్పుడు
ఆత్మరక్షణకై అబల చేస్తున్న ఆర్తనాదాలు కామాంధుల పబ్బుల్లో డీజేల హోరైనప్పుడు
కనిపెంచిన అమ్మానాన్నలను కలలో సైతం తలవకపోవడం ఆధునికత అయినప్పుడు
నిశ్శబ్ద వీక్షకుడిని మార్పునాశించే నిరీక్షణా దక్షుడిని
నేను ...... కాలపురుషుడిని ....!

మానవత్వం మంటగలిసిపోతున్న యమయాతనల యాంత్రిక యుగంలో
అల్ట్రామాడరన్ రోబోటిక్స్ ఫ్యాషన్ పెరేడ్ ల జిలుగు వెలుగుల ర్యాంపులపై
కురచ దుస్తుల కుర్రకారు చూపుతున్న జోరు హుషారు
బిలియన్ డాలర్ల డ్రీములు బిగుతు పరువాల కోసం క్రీములు
బీచులపై నీచత్వపు విన్యాసాలు కాదంటే మాడరన్ సన్యాసాలు
పిజ్జా బర్గర్ లు పేస్ట్రీ మంచూరియాల డెలివరీ కోసం ఆర్డర్ వేయక
ఇంకా పప్పన్నాలు దద్ద్యోజనాల వంటల్లో తలమునకలైన నిన్నటితరానికి
అమాయకత్వపు అనురాగాలకు వీడ్కోలిచ్చేందుకు సిద్ధంగా ముస్తాబైన

నేను ..... కాలపురుషుడిని ...!

Posted in April 2018, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!