Menu Close
Naasadiya Sooktham

సాటిలేని నాటి 'నాసదీయసూక్తం'

ఎగములో (ప్రపంచంలో) మానవజాతి యొక్క ప్రాచీనమైన మొదటి జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన వాగ్మయం (పలుకునెరవన) వేదము (మినుకు). సుమారుగా ఆరువేల ఏండ్ల క్రితమే మునిమతం (హిందూమతం) లోని ఋషులు విశ్వాన్ని గురించి, సృష్టి గురించి, ఆత్మ పరమాత్మల గురించి దివ్యదృష్టితో ఆలోచించి, శోధించి, సాధించి తెలుసుకొని, చెప్పబడినవి, వినబడినవి, ఆపై వ్రాయబడినవి మన వేదాలు. ఇవి మన మునుల మనోనేత్ర దర్శనముతో పొందిన దివ్యానుభూతుల సమాహారాలు. ఇవి మానవజాతి మనుగడకు మార్గదర్శకాలు. ఆచరణీయ మనో వికాస, విజ్ఞాన మార్గాలు.

వేదము, 'విధ్ (తెలుసుకోవడం) అనే ధాతువు నుండి వెలువడినదే 'వేదం' అనే మాట. దీనికి అర్థము (తెల్లము) తెలియజేసేది. ఇది మానవుల చేత రచింపబడలేదని విశ్వాసము. వీటిని దేవుడు (ఈవరి) నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు (వినబడినవి) అని కూడా అంటారు.

అయితే కొందరు ఇవి మునులే తెలుసుకొని, ఒకరినుంచి ఒకరికి, గురువుల నుండి శిష్యులకు పరంపరగా, శతాబ్దాలుగా కంఠస్థం చేయిస్తూ, నేటి తరానికి అందించారని అంటారు.

ఈనాడు ఆధునిక యంత్రాల సాయంతో, విజ్ఞాన శాస్త్రాల సహకారంతో కనుగొన్న అనేక పరిశోధన ఫలితాలను, ఆనాడే దివ్య తపస్సు శక్తితో, ఆ మహా ఋషులు తెలుసుకొని వేదాలలో పొందుపరిచారు.

ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్ద శాస్త్రం, గణిత, ఖగోళ, నక్షత్ర, వ్యవసాయ, రసాయన, వృక్ష కిరణ, లోహయంత్ర, తంత్ర, మంత్ర, పశు, వాస్తు, కామ శాస్త్రాల వంటి అనేక విజ్ఞాన శాస్త్ర విషయాలను, వేదాలలో పొందుపరిచారు.

నేడు మనం ఆధునికమని, కనుగొన్న అనేక విషయాలు, విశేషాలు అనేకం మన వేద, ఇతిహాస, పురాణ కావ్యాలలో ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

నాస్తికులు, చార్వాకులు, హేతువాదులు, భౌతికవాదులు ఎవరైనా "ఇది నా జాతి, నా మాతృభూమి, నా జాతి వేద వాగ్మయం" అని ఒక్కసారైనా సగర్వంగా చెప్పుకొని, మన వేద ఋషులు దర్శించిన సత్యశకలాలను, వేద నిత్యా సకలాలను విని విస్మయం చెందని, అచ్చెరువు పొందని భారతీయులు ఉంటారా?!

అనేక ఊహకందని శాస్త్రీయ విషయాలను ఆనాడే వెల్లడించిన మన ఋషులనుండి విన్న "నాసదీయ సూక్తం" గురించి వివరంగా తెలుసుకుందామా...

వేదాలు మొదట్లో మూడుగా ఉండేవి. తరువాత నాలుగుగా విభజించారు.

  1. ఋగ్వేదం (ఛందోబద్ద మంత్రాలు)
  2. యజుర్వేదం (గద్యంగా ఉండే సూక్తాలు)
  3. సామవేదం (గానానికి అనుకూలంగా ఉండే మంత్రాలు)
  4. అధర్వణ వేదం (యజ్ఞ యాగాదులకు చెందిన మంత్రాలు)

వేదాలలో మొదటిది ఋగ్వేదం. ఇది వేద వాఙ్మయానికి తలమానికం. 'ఋక్' అనగా దేవతలను పొగడుతూ చెప్పే మంత్రం. ఋగ్వేదంలో ఆనాటి ఆర్యులు అనేకమంది దేవతలను స్తుతిస్తూ సాగిన మంత్రాలెన్నో ఉన్నాయి. వాటిలో విశిష్టమైన, ఒక గొప్ప సూక్తం, పదవ మండలంలోని, 129 వ సూక్తం. అదే సృష్టిసూక్తం లేదా నాసదీయ సూక్తం అంటారు. దీనిలో '7' మంత్రాలున్నాయి.

ఈ సూక్తం "నసదాసీత్"  (అప్పుడు ఉండటం అక్కడ లేదు) అని మొదలవుతుంది. అందుకే దీనిని "నాసదీయ సూక్తం" అన్నారు. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక విశిష్టమైన ఆలోచన, ఈ నాటికీ అచ్చెరువుపొందే అంతగొప్ప తత్వ వివేచన. అంత గంభీరమైన అర్వచనీయ మనోభావన, ఆనాటి మన మునులు, ఆ ఆశ్రమ వాటికలలో, సూర్యునికి నమస్కారం చేస్తూ, విశ్వ రహస్య ద్వారాలు తెరవడానికి, తెరమరుగున దాగిన సత్యాలను కనుగొనడానికి ఎంత తహతహలాడారో అనిపిస్తుంది.

 

..సశేషం..

Posted in April 2019, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *