Menu Close
మర్మదేశం (ధారావాహిక)

ఘాలి లలిత ప్రవల్లిక

ఘాలి లలిత ప్రవల్లిక

"హాయ్......అటు  చూడండి!” ఆశ్చర్యంగా ఓ వేపు వేలుపెట్టి చూపించాడు కౌషిక్.

అందరూ అటు చూసారు. సూర్యగోళం నుంచి వీరి వైపుకు దూసుకొస్తున్న సప్తాశ్వరథమది. ఆ ఏడు గుర్రాలు బంగారు కాంతి లో మెరిసిపోతున్నాయి. దివ్య లోకాల నుంచి దిగివచ్చిన పసిడి తురగాలులా ఉన్నాయి అవి. ఆ రథం యొక్క పొందిక, అమరికా ఎంతో అద్భుతంగా ఉంది.

"మనందరం సూర్యలోకం చూడటానికి రధం వచ్చేసింది. మీరంతా కళ్ళు మూసుకోండి. మిమ్మల్ని అందులోకి షిఫ్ట్ చేస్తాను." అన్నాడు మేథా.

"మరి మేమో” అన్నాడు డింగూ.

"మనం అందరం వెళుతున్నాం. మన ఈ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ మనం తిరిగి వచ్చేవరకూ ఇక్కడే ఉంటుంది గాల్లో" అని చెప్పాడు మేథా. అందరూ సప్తాశ్వరథాన్ని అధిరోహించారు.

అందరి మనసులలోనూ ఈ రథం ఎలా వచ్చింది? సూర్యుని వాహనం కదా! మేథా దగ్గరికి ఎలా వచ్చింది? అనే ప్రశ్నలు. వారి ప్రశ్నలకు జవాబుగా మేథా గొంతు సవరించుకుని ......

"నేను ఒకసారి ఆకాశయానం చేస్తుండగా సూర్య భగవానుడు అనుకోకుండా కలిసాడు. దిగులుగా ఉన్న సూర్యుని మనసులోని బాధ తెలుసుకొని ఆయనకు బాధ లేకుండా చేశా. ఎంతో సంతోషించిన సూర్యుడు నన్ను వాళ్ల లోకానికి రమ్మని ఆహ్వానించాడు. నేను ఇప్పుడు భూలోకాన్ని సందర్శించడానికి వెళుతున్నాను. ఎప్పుడైనా మీలోకం చూడాలనిపిస్తే వస్తాను అని చెప్పా. అప్పుడు సూర్య భగవానుడు నాకు మంత్ర ఉపదేశించి ఈమంత్రం జపించు రథాన్ని పంపిస్తాను. అని చెప్పి అదృశ్యమయ్యాడు. తర్వాత ఆ విషయం మర్చిపోయాను. ఇప్పుడు అనుకోకుండా అది గుర్తుకొచ్చి ప్రార్థించాను." చెప్పాడు మేథా.

"ఎలాగైతేనేం మన దినేష్ కోరిక తీరబోతోంది." అన్నాడు డింగూ.

మనోవేగంతో రథం ముందుకు సాగింది. సూర్యమండలం చేరుకున్నారు అందరూ.

"మీ భూమి పై ఋతువులు ఏర్పడడానికి, వర్షం, వేడి, చలి వంటి వాతావరణ పరిస్థితులు అవతరించడానికి, మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోవడానికి, మంచు పర్వతాలు, కొండలు, శిలలు కరగడానికి సూర్యకాంతి, వేడేకారణం. భూగోళంపై అన్నిరకాల క్రియ కారణాలకు సూర్యుడే ఆధార కేంద్రం. రాత్రింబవళ్ళు ఏర్పడటానికి భూభ్రమణం ఎంత అవసరమో సూర్యుని ఉనికీ అంతే ముఖ్యం. కాలుష్య ప్రమాదం లేని నిరంతర విద్యుదుత్పాదనకు సౌరశక్తిని మించిన సాధనం లేదు. సౌర బ్యాటరీలు వీటిలో కీలకమైనవి." సూర్యుని గురించి సంక్షిప్త సమాచారం ఇచ్చాడు మేథా.

వీరు ఎక్కిన రథం ఓఇంటి ఆకారం ముందు ఆగింది. ఆ ఇంటికి గోడలు లా కనిపిస్తున్న అగ్ని జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఎటు చూసినా అంతా వేడి. వేడి సెగలు, వింత వాసనలు. ఎత్తయిన మండుతున్న జ్వాలే వీరికి భవనంలా కనిపిస్తోంది. విచిత్రం ఏమిటంటే అక్కడ వీరికి ఏ సెగ తగలడం లేదు ఆక్సిజన్ కూడా వీరికి అందుతోంది. తలుపులు తెరిచినట్లుగా ఓ దగ్గర అగ్ని జ్వాలలు పక్కకి తొలగాయి. అక్కడ తెల్లని పట్టు పీతాంబరాలు ధరించిన, పసుపు, ఎరుపు, తెలుపు రంగులతో నుదుటిన తిలకం దిద్దుకుని, శంఖు చక్రాలు చేత ధరించి, కవచకుండలాలు ఆభరణాలతో, అద్వితీయ సౌందర్యంతో మిల మిలా మెరిసి పోతున్న దివ్య మంగళ తేజోమూర్తి 32 అడుగుల ఆజానుబాహుడు ప్రత్యక్షమయ్యాడు.

"ఓం శ్రీ సూర్యనారాయణ, వేద పారాయణ, లోక రక్షామణీ, దైవ చింతామణి........." అంటూ భక్తి పారవశ్యంతో భాస్కర దండకం చదివాడు దినేష్. అందరూ మిరిమిట్లు గొలిపే ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తూ తన్మయత్వంతో విన్నారు.

"దీర్ఘాయుష్మాన్ భవ"! అని దినకరుడు దీవించాడు. "ఇంత చిన్న వయసులోనే ఎంత భక్తిపారవశ్యం నిన్ను ఇలా తీర్చిదిద్దిన మీ తల్లిదండ్రులను అభినందించకుండా ఉండలేకపోతున్నాను." అన్నాడు సూర్యుడు.

"మా తాతయ్య నాకు నేర్పించాడు" గొప్పగా కళ్ళెగరేస్తూ చెప్పాడు దినేష్.

"ఓహోఅయితే మరీ మంచిది. పెద్దలను అనాధాశ్రమాలలో వదిలేయకుండా ఇంట్లో ఉంచుకుని చూసుకునేవారు అంటే నాకు చాలా ఇష్టం. రండి అందరూ లోపలికి." అంటూ వారిని లోపలికి ఆహ్వానించాడు సూర్యుడు.

అందరూ లోపలికి వెళ్లారు. ప్రవహిస్తున్న ఎర్రనిద్రవాన్ని చూపిస్తూ...." దీనిపై ఆసీనులు కండు" అని అన్నాడు సూర్యుడు.

పిల్లల సంశయంగా చూశారు. మేథా క్కూర్చోమన్నట్టు సైగ చేసాడు. పిల్లలు భయం భయంగా కూర్చున్నారు. వారు కుషన్ సోఫాలో కూర్చున్నట్లు ఫీల్ అవ్వడం తో ఆశ్చర్యపోయారు పిల్లలు.

"ఇదేనేమో కోర్ అంటే. సూర్యుని యొక్క మధ్య భాగం. హైడ్రోజన్ హీలియం గా మారే ప్రదేశం ఇదే అయి ఉంటుంది." అని మనసులో అనుకున్నాడు చరణ్.

"పిల్లలు నా గురించి తెలుసుకోవాలని వచ్చారా?" ప్రశ్నించాడు సూర్యుడు.

"ఊ...ఉహూ..." అంటూ తల అడ్డదిడ్డంగా ఊపారు పిల్లలు.

మేథా వారి మనసులో ఉన్నది గ్రహించి "దినకరా! ముందుగా దినేష్ నిన్నేదో అడగటానికి వచ్చాడు. వాడికి జవాబు చెప్పు తర్వాత నీ గురించిన సమాచారం పిల్లలకు తెలియజేయి సంతోషిస్తారు." అన్నాడు.

"నన్ను ఏం అడగాలి అనుకుంటున్నావ్?" అంటూ అడిగాడు దినేష్ వంక చూస్తూ సూర్యుడు.

"మన్నించండి అడగొచ్చో .... అడగకూడదో..తెలియదు. కానీ నా మనస్సును వేధిస్తున్న ప్రశ్న ఇది. నిన్ను కొలిస్తే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు మా ఇంట్లో వాళ్ళు. అందువలన అడుగుతున్నాను. అదే మా తాతయ్య నిన్ను రోజు కొలుస్తారు కదా! మరి మా తాతయ్యకు రోగం ఎందుకు వచ్చింది?" అమాయకంగా అడిగాడు దినేష్.

"అది మీ చేజేతులారా చేసుకున్నారు. దైవం గా ఆరాధించాల్సిన ప్రకృతి తో చెలగాటాలాడారు. పచ్చని అడవులను తెగనరికారు. అతి తెలివితో మీ విజ్ఞానాన్ని వినాశహేతు తయారీకి ఉపయోగించారు. భూమిని దాని పై నున్న వాతావరణాన్ని కలుషిత పరిచారు. అటువంటి కలుషిత వాతావరణం అనారోగ్యహేతువు. దేవుని ఎప్పుడూ భక్తితో కొలవాలి గాని కోరికలతో కాదు. మనసులో కోరికలతో కొలిచేటప్పుడు ఏకాగ్రతకు తావేది? మొక్కుబడిగా, వేళాపాళా లేకుండా, ఎవరి దృష్టిలోనో పడాలని చేసే పూజలు సత్ఫలితాలను ఇవ్వవు. అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. దైవ అనుగ్రహం పొందాలంటే ప్రకృతి ని ముందు కాపాడుకోవాలి. మనో నిగ్రహంతో, భక్తిపూర్వకంగా కొలవాలి." చెప్పాడు సూర్యుడు.

అర్థమైంది అన్నట్లుగా తల ఊపాడు దినేష్.

మేము మా లోకానికి వెళ్ళాక మా వంతు కృషిగా మేము మొక్కలు నాటుతాము సూర్య దేవా. మా తాతయ్యకు చెబుతాను కాన్సన్ట్రేట్ చేసి పూజ చేయమని. ధన్యవాదాలు ఆదిత్య నాకు జవాబు చెప్పినందుకు". అంటూ ఆదిత్యునికి నమస్కరించాడు దినేష్.

"పిల్లలూ నా వయసెంతో తెలుసా మీకు?" అడిగాడు సూర్యుడు.

"ఊహూ ...తెలియదు మాకు చెప్పవా నీ గురించి?" అడిగారు పిల్లలందరూ కలిసి.

దాదాపు 5 బిలియన్ సంవత్సరాలు నాకు. ఇంకా నాకు పది బిలియన్ సంవత్సరాల ఆయువు వుంది. నా కిరణాలు సెకండ్ కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి." చెప్తున్నాడు సూర్యుడు.

"నీకు మా భూమిని చేరడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది కదా!" అన్నాడు చరణ్.

"అవును నేను మీకు 149.8 మిలియన్ కిలోమీటర్ల దూరం లో ఉన్నాను. నా కాంతి ఆవరణ ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్. నా వ్యాసం 13,91,980 కి.మీ. మీ భూమి నుంచి చూస్తే నా భ్రమణ కాలం 25 రోజుల 9 గంటల 7 నిమిషాలు. భూమధ్య రేఖ దగ్గర ధృవాల దగ్గర 33 రోజులు. నా నుండి వేడిగాలులు 450 కిలోమీటర్లు సెకండ్ కి 280 మైల్స్ సెకను కి వీస్తాయి. ఈ వాయు గాలులు భూమి నుంచి చూసే వారికి రంగురంగుల కాంతులతో కనిపిస్తుంది దీన్నే అరోరా అంటారు." అంటూ తన గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడుసూర్యుడు.

"మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు." అన్నాడు క్రేన్. సంజ్ఞా దేవి వారికి చిక్కుడు ఆకులతో కుట్టిన విస్తరిలో పాయసం పెట్టి, త్రాగడానికి గోక్షీరం ఇచ్చింది.

"మీ ఆతిధ్యం మాకెంతో నచ్చింది. ఇక మాకు సెలవు ఇప్పించండి." అన్నాడు మేథా.

"ఇప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారు?" అడిగాడు సూర్యుడు.

"మా ఫ్లయింగ్ సాసర్ దగ్గరికి." టపీమని జవాబు చెప్పాడు డింగూ.

అందరికీ వీడుకోలు ఇచ్చారు సూర్యుడు, సంజ్ఞ కళ్ళు మూసి తెరిచే లోపల వారంతా ఫ్లయింగ్ సాసర్ లో ఉన్నారు.

"ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మేథా అంకుల్?" కుతూహలంగా అడిగాడు కౌషిక్.

"అలా మీ సౌర కుటుంబం లోని గ్రహాల మీద ఓ రౌండ్ వేద్దాం. మీరు చూడాలనుకునే గ్రహాలలో దిగి చూద్దాం." అన్నాడు డింగూ.

"అయితే అన్ని గ్రహాలు చూసి వచ్చేద్దాం!" అన్నాడు సంభ్రమంగా దినేష్.

"మనమేం సమ్మర్ వెకేషన్ కు బయలుదేరి రాలేదు. ఇంట్లో వాళ్ళెవరికీ చెప్పకుండా వచ్చాము. వాళ్ళేం కంగారుపడుతున్నారో ఏమో!" దిగులుగా అంది శర్వాణి.

"మీకు ముందే చెప్పాము కదా! వాళ్లేం కంగారు పడరు. వాళ్ళ కసలు మీరు అక్కడ లేరన్న విషయం కూడా తెలియదు." అన్నాడు క్రేన్.

"చెప్పారు కానీ మాకు ఎలా నమ్మకం కలుగుతుంది. మేము వాళ్లను చూడలేదు కదా!" అన్నాడు చరణ్.

"ఓహో.... మీకు మీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూడాలనే కోరిక కలిగింది కదూ! నాకు అర్థమైపోయింది. అంతేగా?" అన్నాడు డింగూ.

పిల్లలు అవునన్నట్లు తలలుఊపారు.

"అటు చూడండి "...అంటూ వేలుపెట్టి క్రిందకు చూపించాడు మేథా.

భూలోకంలో వాళ్ళ వాళ్ళు అంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఎవరూ వీళ్ళను తలుచుకోవడం లేదు.

"హమ్మయ్యా....ఇకమనం ఎక్కడికైనా తిరిగేయొచ్చు ధైర్యంగా." గుండెల మీద చెయ్యి వేసుకుని అన్నాడు కౌషిక్.

"అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం?" అడిగాడు డింగూ ఉత్సాహంగా.

"నువ్వు చెప్పినట్లే నవగ్రహాల మీంచి వెళదాం. చూడాలనిపించిన గ్రహం మీద ల్యాండ్ అవుదాం". అంది శార్వాణి.

ఫ్లయింగ్ సాసర్ బయల్దేరింది. బుధగ్రహం మీద చక్కెర్లు కొడుతుంది.

"ఇదేం గ్రహం?" అడిగాడు దినేష్.

"సూర్యుని దాటగానే వచ్చిన మొదటి గ్రహం కాబట్టి బుధుడు అయి ఉంటాడు యాం ఐ రైట్?" క్రేన్ వంక చూస్తూ అన్నాడు చరణ్.

"చూసేద్దామా! ఆశగా అడిగాడు కౌషిక్.

"ఏమిటి నీ మొహం చూసేది. సూర్యుడికి దగ్గరగా ఉండటంతో అతి వేగంగా తిరిగేస్తుంది. అలా తిరగలేదు అనుకో సూర్యుడి లోకి కూలిపోయి పేలిపోయి తన ఉనికినే కోల్పోతుంది. 88 రోజులు తిరిగేస్తే చాలు దానికో సంవత్సరం అయిపోతుంది. దాన్లో చూడటానికి ఏముంటాయి మాడి మసి బొగ్గు అవడం తప్పించి". అన్నాడు చరణ్.

"మనం సూర్యుడు దగ్గరికి వెళ్లి వచ్చిన వాళ్ళం. దీని దగ్గరికి వెళ్లలేమా?!?" అన్నాడు కౌశిక్.

"అది వేరు ఇది వేరు. మేథా అంకుల్ దగ్గర సూర్యుడిచ్చిన వరం ఉంది కాబట్టి చూడగలిగాం. ఇక్కడ అలా కాదుగా "....అంది శార్వాణి.

***సశేషం***

Posted in September 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!