Menu Close
మరబొమ్మ
-- అన్నపూర్ణ.ఏ --

'అనూష కి కళ్ళముందు జరిగిన ప్రమాదం ఏమిటో తెలియలేదు కానీ తండ్రి కారు కింద పడిపోడం మాత్రం చూసింది ఏడేళ్ల వయసులో.

''నాన్న...అంటూ గట్టిగా పిలిచింది.....కంగారుగా! భయంగా....

ఆ పిలుపు విన్న రాజేంద్ర తన గదిలోంచి బైటికి వచ్చి ఆదృశ్యం చూసి జరిగిందేమిటో గ్రహించి మెరుపులాంటి వేగంతో అనూష నోరు మూసి మేడమీద గదిలో కూర్చోపెట్టి, తలుపు గడియవేసి తిరిగి కింద గేటు దగ్గిరకి వచ్చాడు. ఆడుకుని అలసిపోయిన అనూష అంతకుముందు చూసిన దృశ్యం మరిచిపోయి అక్కడే తివాచి మీద పడుకుని నిద్రపోయింది.

కేతన్ కారు దగ్గిరకి పరుగున వచ్చాడు గేటు దగ్గర కాపలావుండే మాలిక్. ఎప్పుడూ ఇద్దరు గూరఖాలు కాపలాగా వుంటారు. ఆరోజు రెండవతను సెలవు తీసుకున్నాడు.

ఆ రాజభవనంలో ఏమూల ఎవరున్నారో తెలియదు. రెండంతస్తుల మేడే కానీ అర మైలు పొడవుంది. చుట్టూ విశాలమైన స్థలం. ఇంటినుంచి గేటుకి ఇంకో అర మైలు దూరంవుంది.

ఆరోజు సావిత్రి ఏదో పూజ చేసి పేదవారికి భోజనాలు పెట్టింది. దానాలు చేసింది. తర్వాత తులసి ఇల్లు కడగటం సర్దుకోడం పనులు పూర్తి ఐయ్యేసరికి రాత్రి తొమ్మిది ఐనది. సావిత్రి మిగిలిన వంటలు ఆమెకు ఇచ్చి ''ఇంటికి తీసుకెళ్ళు. రేపు రెస్టు తీసుకో....పనేమీ లేదులే ...అంటే వాటిని కవరులో సర్దుకుంటోంది.

తులసి. .....సావిత్రిదగ్గిర కొత్తగా పనిలో చేరింది. వాళ్ళ ఇంటి అవుట్ హౌస్లో తులసి భర్త నాగులు, ఇద్దరు కూతుళ్లతో ఉంటుంది.

''సాబ్! చినబాబు.....అని రాజేంద్రతో ఏదో చెప్పబోతే మాలిక్ ని అడ్డుకున్నాడు .. .

''ఏమైంది కేతన్? చూసుకోలేదా.... అన్నాడు. .....రాజేంద్ర.....ఆదుర్దాగా కొడుకుతో.

జరిగిన సంఘటన వివరించాడు.....కేతన్.

ఆ పరిసరాలలో ఎవరూ లేరు. చుట్టూ బలమైన గోడ వుంది.అక్కడ జనం ఎవరూ వుండరు. చుట్టూ తోటలు మధ్య ఉన్న భవంతి అది. సాయంకాలం ఐతే అటువైపు ఎవరూరారు. ఇరవై కిలో మీటర్ల దూరంలో ఉన్న సినిమా ధియేటర్కి వెళ్లాలని బయలుదేరాడు కేతన్.

''నాగులు చాల చిరాకు తెప్పించాడు..... బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. తాగివున్నాడు. ఇప్పుడు పాతికవేలు ఇవ్వాలట. ఇవ్వను అన్నాను. దూరంగా పోయాడు. తీరా కారు స్టార్ట్ చేసాక అడ్డుగావచ్చి ఏభైవేలు అన్నాడు.....రాష్గా డాషిచ్చాను. కారుకింద పడ్డాడు. అక్కడే ఆడుకుంటున్న అన్ను చూసింది.....అంటూ జరిగింది ఏమిటో చెప్పాడు కేతన్.

''సరే నువ్వు నీరూములోకి వెళ్ళు....అంటూ కేతన్నీ పంపేసి.....మాలిక్ తో మాటాడాడు.

అంతలో వచ్చింది తులసి. అక్కడ ఒక్కటే లైటు మసగ్గా వెలుగుతోంది. అందువలన కారుకింద పడిపోయిన భర్త నాగులు కనిపించలేదు.

''అనూ పద ఇంటికివెడదాము ... అంటూ పిలిచింది కూతుర్ని అనూ అక్కడే ఉందనుకుని.

రాజేంద్ర తులసికి దగ్గిరగా వచ్చి ''తులసీ నాగులు మరీ చెడిపోయాడు. డబ్బుకోసం చినబాబునికూడా వేధిస్తున్నాడు....అడిగినప్పుడు అయిదువందలు ఇచ్చినా చాలదు అన్నాడు....నీకు పని ఎక్కువ చెబుతున్నామట...జీతం పెంచాలట .....సరే అదిబాగానేవుంది....చినబాబుకీ నీకూ మధ్య సంబంధం ఉందని నిందవేసాడు. అందుకే ఇప్పుడు ఇంతదాకా ఇక్కడే ఉందన్నాడు...నాకు కోపమొచ్చింది.

నాలుగు దెబ్బలువేసెను. దూరంగా నెట్టివేసాను. నేను బయటికి వెళ్లాలని కారు తీస్తుంటే ఎక్కడనుంచో అడ్డుగా వచ్చాడు.....ఈ చీకటిలో సరిగా చూడలేదు...కారు స్టార్టు చేశాను తాగివున్నాడుకదా.....కారుకింద తూలీ పడినట్టున్నాడు.....అంటూ కారు పక్కగా తీసాడు...రక్తం మడుగులో కనబడ్డాడు నాగులు. తులసికి కళ్ళుతిరిగాయి. అమాంతం నేలమీద పడిపోయింది.

రాజేంద్ర భార్య సావిత్రిని పిలిచి తులసికి ఉపచారాలు చేసాడు. మందులు ఇచ్చి తేరుకున్నాక సావిత్రిని అవుట్ హౌస్ ఇంటోకి తీసుకెళ్ళమన్నాడు......గుట్టు చప్పుడు కాకుండా....నాగులు శవాన్ని ....మాలికసాయంతో..... దహనం చేసాడు. మాలిక్ చాల నమ్మకస్తుడు. ఈవిషయం ఎన్నటికీ బయటకు రాదు అని రాజేంద్రకు తెలుసు.

నాలుగు రోజుల తరువాత తులసి ఇంటికి వెళ్ళి ''తులసీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. పొరబాటు జరిగింది. ఏమి చేస్తావు? కేసు పెడతావా? అన్నాడు రాజేంద్ర.

''ఎవరి మీద... మీ మీద..కేసా ..ఎంత మాట బాబూ....వాడు ఎప్పుడో రోడ్డుమీద ఇలాగె చచ్చిపోతాడని అనుకున్నాను. తాగుబోతు ఎదవకి అంతకంటే గొప్ప చావు వస్తదా బాబూ....అంది తులసి.

''ఏమో ఎవరికీ ఎలా మూడుతుందో నువ్వు చెప్పేది నిజమే అనుకో నా వలనా తప్పు...జరిగిందేమో....నువ్వు చాల మంచిదానివి....నీ శీలాన్ని శంకిస్తే సహించలేకపోయాను.''నన్ను మన్నించు తులసి...నా చెల్లి లాంటి దానివి...అన్నాడు ప్రాధేయ పడుతూ..

''ఇపుడు కొత్తకాదు బాబుగారూ నాగులు నన్నీలావేధించడం ....ఇద్దరు ఆడపిల్లలతో తప్పక ఓర్చుకుంటున్న ఏ ఇంట్లో పనికి వెళ్ళినా ఇదే గొడవ. మీవంటి పెద్దల అండ దొరికింది చాలని బతుకుతున్నదాన్ని. అంతమాట అనకండి.''

''సరే సావిత్రి నీతో మాటాడుతుంది.” ...అంటూ వెళ్ళిపోయాడు రాజేంద్ర.

''అవును తులసీ .....మావలన నీకు అన్యాయం జరిగింది. పోలీసులూ కేసులూ అంటూ గొడవ ఎందుకు? నీ పిల్లలను చదివిస్తాను. నువ్వు మాదగ్గిరే ఉండిపో....పనిలో చేరి రెండునెలలు అయింది నీ విషయాలు నాకు తెలియవు. నీవాళ్ళు ఎవరైనా వున్నారా? అడిగింది సావిత్రి.

''లేరమ్మ ...దూరపు బంధువు వున్నాడు వాడేమీ ఆదుకునేవాడు కాదు. రాఁడుకూడా.'' చెప్పింది తులసి.

సావిత్రి ఆరోజునుంచి తులసిని అన్నివిధాలా ఆదుకుంది. ఉషని, అనూషని స్కూల్లో చేర్చింది. ఇంటి తోటలో కూరగాయలు పూల మొక్కలు వేసి వాటిని అమ్మి ఆ డబ్బు నువ్వే తీసుకోమంది. నెలకి పదివేలు జీతం ఇస్తుంది. నాగు తులసి సంపాదన తాగుడికి తగలేయడంతప్ప వాడివలన ఏ ఉపయోగమూలేదు. అందువల్ల నాగు లేడని ఎవరూ బాధపడలేదు. నిజానికి వాడి పీడా విరగడ ఐనది అనుకున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా రోజులు గడుస్తున్నాయి. వాళ్ళకి భద్రతా ఏర్పడింది.

ఉష ఇంటర్ చదువుతోంది. అనూష ఏడోక్లాసు. తులసి ఉదయం లేవగానే కూరగాయలు సావిత్రి పూజకి పూలు ఉషాకిచ్చి పంపుతుంది బంగ్లా లోకి.

కార్తీకమాసం రావడంతో సావిత్రి త్వరగాలేచి గుడికి వెళుతుంది. కనుక ఈనెల అంతా చీకటినే పూలు పంపాలి.

''లేమ్మా ఉష.. అమ్మకి పూజకి పూలు ఇచ్చిరా....అంటూ లేపింది.

''అబ్బా చలిగా ఉందమ్మా ...నువ్వెళ్లు .....బద్ధకంగా చెప్పింది ఉష.

''గేటుదగ్గిర పెట్టేసిరా... అమ్మకి నేను ఫోనుచేస్తా...మాతల్లికాదూ...అని బతిమాలి పంపింది.....విసుక్కుంటూ ...లేచివెళ్ళింది ఉష.

ఆ మరునాడు లేపక్కరలేకుండానే నిద్ర లేచిపోడం చూసి 'నా కూతురు నన్ను అర్థం చేసుకుంది. నా బంగారుతల్లి...రోజూ విసుక్కునే ఉష తనంత తానే త్వరగా లేచి పుస్తకాలూ పట్టుకుని కూర్చుంటే చదువుమీద శ్రద్ధ అని మురిసింది తులసి. కానీ కారణం ఆ భవంతిలో వున్న చినబాబు ఆకర్షణ అని అర్థం చేసుకో లేకపోయింది.

ఉష తెచ్చిన పూలు తీసుకుని సావిత్రి ఆలా గుడికి వెడుతుంది... ఉషని చినబాబు తన గదిలోకి తీసుకు వెడతాడు. ఇంద్రభవనంలో పెద బాబుగారు రాజేంద్ర ఈమూల ఉంటాడు. కేతన్ పడకగది ఆమూలా ఉంటుంది. ఎనిమిది ఐయ్యేదాకా పనివాళ్ళు రారు. సావిత్రి భక్తిలో రాజేంద్ర నిద్రలో చినబాబు రక్తిలో ఎవరికివారు వారి కార్యక్రమాల్లో మునిగి తేలుతూ వుంటారు.

తులసి పూర్తిగా అమాయకంగా యజమానులను నమ్మింది. ఆశ్రయం ఇచ్చారనే గౌరవంతో. ఉషకి ఆ గొప్పింటి అందాల రాజకుమారుడు కొత్తవాడుకాదు. ఆ ఇంట్లో వారి మనిషిలా స్వేచ్ఛ ఇచ్చారు కనుక సులువుగా మైకంలో పడిపోయింది. పర్యవసానంకాని అంతరాలుకాని తెలుసుకోలేని వయసు. ఇదీ యజమానుల ‘సేవలో' భాగం అనుకుంది.

కార్తీకమాసం ముగిసింది. సావిత్రి ఉదయం అంత త్వరగా లేవదు కనుక పూజకి పూవులు అనూష ఇవ్వవచ్చు....అని తులసి ఉషని వెళ్ళమనలేదు. అన్నూ నువ్వెళ్ళమ్మ అంటూ కూరగాయలు పూలు ఇచ్చింది. అప్పటికే పనివాళ్ళు వచ్చారు. వాళ్ళ పనులు మొదలుపెట్టారు....

''ఇలాఇవ్వమ్మా నేను వెడతా... అంటూ అమాంతం లాక్కుంది.....ఉష. కానీ ....చినబాబు అప్పటికే బైటికి వెళ్ళిపోయాడు....కారుతీసుకుని . అంటే....ఇక నేను ....వెళ్లాల్సిన అవసరంలేదా....భవంతిలోకి అనుకుంది ఉష. అప్పటినుంచి చినబాబు దర్శనం లేదు. బిజినెస్ పనిమీద దుబాయి వెళ్ళాడని వంటావిడ చెప్పింది.

''అమ్మ చినబాబు బిజినెస్ చేస్తాడా... అని అడిగింది నిర్ధారణ చేసుకోడానికి.

''అవునమ్మా! పెద్ద బాబుగారు దుబాయి పంపారుట. అంది తులసి యధాలాపంగా.

''ఏమి బిజినెస్?

''మనకెందుకు ఉష....పెద్దవాళ్ళ సంగతి మనకు చెబుతారా? నీకు పరీక్షలు దగ్గిరకు వస్తున్నాయి చదువుకో.'' అంది మందలిస్తూ.

నెలరోజులకు వచ్చాడు కేతన్. ఈ నెల రోజులూ ఉషకి నిద్ర హారాలు లేవు. నాతో చెప్పవచ్చుగా..... అని కోపగించుకుంది. ఏదో తెలియని బాధపడింది. ఎలాగైనా వెళ్లి అడుగుతా... అని పెదబాబు గారూ సావిత్రి బయటకు వెళ్ళినప్పుడు వీలు చూసి కేతన్ గదికి వెళ్ళింది.

''ఏమిటి చినబాబూ చెప్పకుండానే వెళ్ళిపోయావు? నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా...బెంగగా అనిపించింది....అంటూ అతన్ని చుట్టుకుపోయి బావురుమంది.

''ఆగాగు ఎవరైనా చూస్తారు....నీతో చెప్పడానికి నువ్వు నాకేమవుతావు? పనిపిల్లవి అంతే!..అంటూ దూరంగా నెట్టాడు. ఆమెని తప్పించుకుని బయటికి వెళ్ళిపోయాడు.

''అమ్మకి ... కడుపు ...నొప్పి వచ్చింది పెద్దమ్మగారూ మిమ్మల్ని అడిగి టాబ్లెట్ తెమ్మంది ....అంటూ ...అనూష సావిత్రిని అడుగుతూంటే చెల్లి మాటవిని కళ్ళు తుడుచుకుని కిందకి వచ్చింది మేడమీద నుంచి. అప్పటికే అమ్మగారు పెదబాబుగారూ వచ్చారు అన్నమాట.....అనుకుంటూ .....టాబ్లెట్ అడిగి తీసుకుని వచ్చేసింది ఇంటికి చెల్లితోబాటు.

ఉష మనసు బాగా గాయపడింది. ఆ యిల్లు ఆ ఇంటి మనుషులూ తనకు ఆప్తులని భ్రమ పడింది. మొదటిసారి మోసపోయానని గ్రహించుకుంది. పెద్దవారి ప్రేమలు అవసరానికి తప్ప శాశ్వతాలు కావని అర్థం అవుతోంది. తప్పు నాదే! చినబాబు యువరాజు ఐతే నేను పనిమనిషిని. అంతే నాహద్దుదాటేను. పెద్దమ్మకు తెలిస్తే మమ్ములను పంపేస్తుంది. ఈ ఆధారం లేకుండా పోతుంది. చెల్లి చదువు ఆగిపోతుంది.

అందువల్ల నేను మళ్ళీ భవనంలోకి వెళ్ళకూడదు. ......అని నిర్ణయం తీసుకుంది. చదువు వైపు దృష్టి పెట్టింది. ఇంటర్ పూర్తిచేసింది. ఎప్పటిలా తులసి చెప్పింది. ఉషా వెళ్లి అమ్మగారికి పూలుకోసి ఇవ్వమ్మా ....మరిచిపోయావా....?

''లేదమ్మా నేను వెళ్ళను. అన్నూని పంపు.....అంది.

''స్కూల్లో వచ్చే వారం డాన్స్ పోటీలున్నాయిట. ఈరోజు ప్రాక్టీసు అని త్వరగా వెళ్ళింది.” చెప్పింది తులసి.

''నేను మాత్రం వెళ్ళను... రేపటి నుంచి వంటావిడను త్వరగావచ్చి తీసుకువెళ్ళమని చెప్పు..ఈరోజు నువ్ తీసుకు వెళ్ళు నేను వెళ్ళను...అంటూ గదిలోకివెళ్ళి తలుపు మూసుకుంది.

ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా చెప్పిందో తెలియలేదు తులసికి. తానేవెళ్లి ఇచ్చింది.....''కూర్చో తులసి నీతో మాటాడాలి.....అంది సావిత్రి. తులసి నేలమీద కూర్చుంది.

''తులసి, ఉషకి పెళ్లి చేయాలంటే త్వరగా పెళ్ళిచేయి....ఉద్యోగంలో చేరుస్తావా! పెదబాబుగారు వేయిస్తారు....''

హఠాత్తుగా ఉష పెళ్లి గురించి ప్రస్తావన తెస్తే కంగారుపడింది తులసి. ఇంకా చదివించాలనుకుంది.....సావిత్రి ఇలా అడిగితె ఏమి చెప్పాలో తోచలేదు.

''ఏమోనమ్మా ఇంతవరకూ ఆలోచించలేదు. అంతా మీ చేతులో వుంది.'' వినయంగా చెప్పింది.

''మీ బంధువులెవరూ లేరంటున్నావు......ఉషకి వుద్యోగం వేయిస్తే ఈవూరు వదిలి వెళ్ళాలి. .....పంపుతావా? ఉషతో మాటాడి చెప్పు. పూజకి పూవులు వంటావిడ తెస్తారులే.....'' ఎవరూ రావద్దు అన్నట్టు చెప్పింది సావిత్రి.

తులసికి అయోమయంగా వుంది. ఇంతవరకూ నిశ్చింతగా జరిగిపోతోంది. ఉష గురించి అంతా అమ్మగారే నిర్ణయిస్తున్నారు. అనూ ఇంకా చిన్నపిల్ల. ఇప్పుడు ఈ ఇల్లు వూరు వదిలి ఇద్దరు అమ్మాయిలతో కొత్త చోటు ఒంటరిగా ఎలా నెగ్గుకురావాలి? అనే భయపడింది.

''ఉషా, పెద్దమ్మగారు నీకు వుద్యోగం వేయిస్తారు. సిటీకి వెళ్ళాలి అన్నారు. వెడదామా ఏమంటావు? అని కూతుర్ని అడిగింది. ఉషకి ఈమాట సంతోషం కలిగించింది. వరదలో కొట్టుకు పోతుంటే ఆధారం దొరికినట్టు ఐనది.

''అలాగే వెడదాం.....మనదారి మనం చూసుకోవాలి. ఎంతకాలం పెదబాబుగారిమీద ఆధారపడటం?

''కానీ కొత్త సిటీ ఖర్చులు ఎక్కువ......నాకు పని ఇచ్చే మంచి యజమానులు దొరకాలి. కాస్త భయంగా వుంది.''

''ఏమీ పర్వాలేదు. వెళ్ళాక అదే అలవాటు అవుతుంది.'' ధైర్యంగానే చెప్పింది ఉష.

నెలరోజులలో ఉషకి వుద్యోగం ఇచ్చారని సావిత్రి కబురు చేసి సామాను సర్దుకోమంది. వెళ్లేరోజు తులసి పిల్లలతో చెప్పడానికి వెడితే కొత్త చోట ఇబ్బంది పడకుండా కొంత డబ్బు, చీరలు పిల్లలకు డ్రెస్సులు, బియ్యం పప్పులూ..కూడా ఇచ్చి పెద్ద వానుతో పంపింది.

''తులసీ నాకు సోదరిలా చేదోడుగా వున్నావు. ఇది చిన్నఊరు ఎదిగే పిల్లలకు లోకజ్ఞానం తెలియాలి. సిటీలో ......ఎన్నోఅవకాశాలు ఉంటాయి. నీకూ ఏదో బతుకుతెరువు లభిస్తుంది. ధైర్యంగా జీవితాన్ని ఎదురీదాలి. నీకు ఏ అవసరంవున్న నేను ఉన్నానని మరచిపోవద్దు. నేను ఫోను చేస్తూవుంటాను.'' అని సాగనంపింది.

హఠాత్తుగా సావిత్రి ఈనిర్ణయం ఎందుకు తీసుకుందో తులసికి అర్థంకాలేదు. కానీ ఉషకి మాత్రం తెలుసు. తన కారణంగా ఆశ్రయం కోలుపోయామా ....అనుకున్నప్పటికీ ఇదే మంచిది. తెలివైన పెద్దమ్మగారు నన్ను చినబాబునీ చూసివుండాలి అని గ్రహించింది.

సిటీలో కొత్త జీవితం ప్రారంభమైంది. ఇంటర్ చదివిన ఉషకి వుద్యోగం అంటే పెదబాబుగారి స్నేహితుడు వెంకటరావుగారి కంపెనీలో అకౌంట్స్ చూడటం.....అంతదాకా పనిచేసే రాఘవయ్యగారికి ఆరోగ్యం బాగాలేక మూడునెలలు సెలవు పెట్టారు. పనినేర్చుకుంటే ఆ తరువాత సంగతి చూద్దాం అన్నారు....వెంకటరావుగారు.

ఆయన ఇంట్లోనే ఉండమన్నారు. అదృష్టం ఆయనకు ఇద్దరూ అమ్మాయిలే.... ! వెంకటరావు గారి ఇంటికి ఆయన భార్య పంకజం తమ్ముడు భగీరధ తరచుగా వచ్చేవారు. ఆయన అమెరికాలో చాల ధనవంతుడు. ఉషను చూసి....''అక్క...అమ్మను చూసుకోడానికి కష్టంగా వుంది. అక్కడ పనివాళ్ళు అమ్మకి నచ్చరు. పైగా భాష రాదు. ఆవిడ ఉషను బాగా ఇష్టపడుతుంది. నేను తీసుకువెడతాను. నాతో పంపు....నీకు పుణ్యం ఉంటుంది.....''అన్నాడు ఉషను చూసి మెచ్చుకుంటూ.

''నిజమేరా...నాకు తోచనేలేదు. తులసిని అడుగుతాను ఏమంటుందో?.... అంది పంకజం.

''తులసీ నువ్వు ఉషని మాతమ్ముడితో పంపు....మా అమ్మను కనిపెట్టివుంటే చాలు.....మేము ఇచ్చే జీతం ఏం చాలుతుంది....వాడు నెలనెలా నీకు లక్ష రూపాయలు పంపుతాడు.....అక్కడ ఉష ఖర్చు భరిస్తాడు. ఇక్కడ అనూషను బాగా చదివించు. నీకంటూ ఒక జీవితం ఏర్పడుతుంది.

తులసికి బాగానే అనిపించింది.....ఈ అవకాశం. డబ్బు రుచి మమకారానికి సాటికాదుగా మరి.

''ఏమంటావు ఉష వెడతావా? అడిగింది.

ఉష ఆలోచించింది.....ఎక్కడికైతేనేం .....నేను సంపాదించాలి అమ్మను, చెల్లినీ పోషించాలి. ఇంతకంటే గొప్ప అవకాశం ఎవరికి దొరుకుతుంది? పనిచేయడానికి ఏ దేశం అయితేనేం? ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారింటికి వెళ్లడం. అక్కడి పరిస్థితులకు తలవంచడం. అమ్మకీ పంపడం ఇష్టమే. నన్నువిడిచి ఉండాలి అని ఏమీ బెంగపడటం లేదు. లేకుంటే 'పంపను...వదిలి ఉండను' అనేదే!

వెంకటరావుగారు ఎలాటివారూ ఇంకా తెలియదుకాని అమ్మ-చెల్లి ఇక్కడ ఉండక తప్పదు. మా జీవితాలు ఇంతే.....పేదరికం, నాన్న వ్యసనము ఈ దుస్థితిని తెచ్చిపెట్టాయి. చినబాబుకు లోకువ అయ్యాను.....అనుకుంది. ఒక యంత్రంలా మరబొమ్మలా (మరోఇంటి పనిమనిషిగా) భగీరధతో అమెరికా ప్రయాణం ఐనది. ఉషా ఖరీదు ఇప్పుడు నెలకి లక్ష రూపాయలు. ఖరీదైన పనిమనిషి ఆమె.

(సమాప్తం)

Posted in September 2021, కథలు

1 Comment

  1. Annapurna

    enni kathalu rasina patrikalo vachhina santosham cheppalenidi. ‘SARANGA”patrikalo vachhinan ee katha antaku minchina aanandam ichhindi.
    prachurinchina patrika variki THANKS ALOT!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!