Menu Close
manusmrithi page title
మూడవ అధ్యాయము (ఈ)

స్త్రీలకు గౌరవం

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః |
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియా : || ( 3- 56)

ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు కూడా సంతృప్తిగా ఉంటారు. అంటే అక్కడి ప్రజలు చేసే యజ్ఞయాగాలతో దేవతలు సంతృప్తి చెందుతారు. స్త్రీలు ఎక్కడైతే పూజించబడరో అక్కడివారు చేసే యజ్ఞయాగాది క్రియలన్నీ అఫలములే (నిష్ఫలములే). ఆ క్రియలవల్ల దేవతలు తృప్తి చెందరు కనుక అవి చేసినవారికి ఆ దేవతలు ఎలాంటి ప్రయోజనాన్నీ చేకూర్చరు.

నాటి పురుషాధిక్య సమాజంలో స్త్రీకి ఎన్నో పరిమితులు విధించి, వారిని రెండవ తరగతి పౌరులుగానూ, స్వభావరీత్యా చంచల మనస్తత్వం కలవారిగానూ, వివేకముగల పురుషులను కూడా చెరుపగల స్వభావం కలవారిగానూ ఈ గ్రంథంలో పలు సందర్భాలలో పేర్కొన్న మనువు ఈ శ్లోకంలో మాత్రం స్త్రీలు పూజనీయులని పేర్కొనడం చిత్రం.

ఆర్యులు దేవతల ప్రీత్యర్థం యజ్ఞయాగాది క్రియలు నిర్వహించేవారు. యజ్ఞాలలో వారు దేవతలకు హవిస్సులు సమర్పించేవారు. ఆహారంగా దేవతలకిచ్చే ఈ హవిస్సులను హవ్యములు అని కూడా అంటారు.

ఋగ్వేదం లో ఒక ఋషి ‘నేను ఈ హవిస్సులను ఎవరికి సమర్పిస్తున్నాను?’ అంటూ తనను తాను ప్రశ్నించుకుని ‘నాకు ఆత్మనీ, శక్తినీ ఎవరు ఇచ్చారో, ఎవరిని ఈ సమస్త విశ్వం ఉపాసిస్తుందో, ఎవరి ఆజ్ఞ దేవతలందరికీ శిరోధార్యమో, ఎవరి నీడ అమృతప్రాయమూ, మృత్యుసమానమైనదీకూడానో, ఆ దేవదేవుడికి ఈ హవిస్సులు( హవ్యములు) సమర్పిస్తున్నాను’ అంటాడిలా --

య ఆత్మదా బలదా యస్య విశ్వ
ఉపాసతే ప్రశిషం యస్య దేవాః  |
యస్య ఛాయామృతం యస్య మృత్యు :
కస్మై దేవాయ హవిషా విధేమ ||   ( ఋగ్వేదం 10 - 121 - 2)

పవిత్రమైన యాగాగ్నికి సమర్పించే హవ్యములైన ‘తిల మాషా వ్రీహ్యవా’ (తిల - నువ్వులు, మాషా - మినుములు, వ్రీహి - వరి ధాన్యం, యవా - యవలు లేక బార్లీ) వంటి ఆహారధాన్యాలనూ, అన్నాన్నీ, నెయ్యి మొదలైన ఇతర పదార్థాలనూ అగ్ని తాను స్వయంగా స్వీకరించి సంతృప్తి చెందడమే కాక వాటిని మోసుకెళ్లి మిగతా దేవతలకు అందిస్తాడని  ప్రాచీనులు నమ్మారు. అందుకే అగ్నిని హవ్యవాహనుడు, హవ్యవహుడు, హుతవహుడు, హుతభుక్కు, హుతాశనుడు అని వారు పిలిచారు. హవిస్సులను మోసుకువెళ్ళేవాడు, హవిస్సులను ఆహారంగా భుజించేవాడు అని ఆ పదాలకు అర్థం. ఈ హవిస్సులు స్వీకరించి, సంతృప్తి చెందే దేవతలు వాటికి ప్రతిగా తమకు సకల సంపదలూ ఇస్తారని ఆర్యులు నమ్మారు. ఋగ్వేదంలో మొదటి మండలంలోని మొదటి మంత్రంలో అగ్నిని పురోహితునిగా, యజ్ఞానికి అధిదేవతగా, ఋత్విజునిగా, హోత (యజ్ఞ నిర్వహణ చేసే నలుగురు ప్రధాన ఋత్విజులలో హోత ఒకడు. ఇతడు అగ్నికి ఆహుతులు సమర్పించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాడు) గా సంభావించి, తాను స్వీకరించిన హవిస్సులకు  ప్రతిగా అగ్ని రత్నాలను (సంపదలను) తిరిగి ఇస్తాడని ఋగ్వేద ఆర్యులు నమ్మేవారు యిలా --

అగ్నిమ్ ఈళే  పురోహితం
యజ్ఞస్య దేవమ్ ఋత్విజమ్ |
హోతారం రత్నధాతమమ్ ||  ( ఋగ్వేదం 1- 1- 1 )

అయితే ఇది కేవలం వారి నమ్మకం మాత్రమే. యాగాగ్నిలో వేసిన పలు హవ్యములలోని కర్బన పదార్ధం గాలిలోని ప్రాణవాయువు (ఆక్సిజన్) లో మండి కార్బన్ మోనాక్సయిడ్ (CO) మరియు కార్బన్ డయాక్సయిడ్ (CO2) గా మారతాయి. మండే గుణం కలిగిన కార్బన్ మోనాక్సయిడ్ మరింతగా మండి కార్బన్ డయాక్సయిడ్ గా రూపొందుతుంది. గాలికంటే తేలికైనవైన కారణంగా ఆ రెండు వాయువులు వెంటనే వాతావరణంలోని పై పొరలలోకి వెళ్లిపోతాయి. మంటలలో వెలువడే అగ్నికీలలు ఎప్పుడూ పైకే నాల్కలు సాచేది ఈ తేలికైన, పైకి వెళ్లే వాయువుల కారణంగానే. ఋగ్వేద ఆర్యులు మండే అగ్ని కీలలు అగ్నికి తాము సమర్పించిన హవిస్సులను ఊర్ధ్వ లోకాలలో ఉన్న దేవతల వద్దకు తీసుకెళ్లి వారిని సంతృప్తి పరుస్తాయని, తృప్తి చెందిన దేవతలు తమకు రక్షణ, పోషణ కల్పిస్తారనీ నమ్మారు. అయితే అన్నం, ఆహారధాన్యాలు వంటివన్నీ హోమకుండంలోనే కాలి బూడిదవుతాయి. కేవలం ఆ వాయువులే పైకి వెళతాయి. కనుక దేవతలు ఆ ఆహారాలు స్వీకరించి సంతృప్తి చెందడమనేది కేవలం మన ప్రాచీనుల విశ్వాసం మాత్రమే. ఇది కూడా సత్యలోకం దిశగా పురోగమిస్తున్న పితృదేవతలు మనం పెట్టే పిండాలు తిని, మనం విడిచే తర్పణలు త్రాగి సంతృప్తి చెందుతారని నమ్మడం వంటిదే.

ఏ కులంలో తోబుట్టువులు, భార్యలు, కోడళ్ళు, దాయాదులైన స్త్రీలను వారి తండ్రులు, అన్నలు, తమ్ముళ్లు మొదలైన పురుషులు పూజించరో, ఆ కులం శీఘ్రంగా నశిస్తుంది. పైన తెలిపిన స్త్రీలంతా ఏ కులంలో బాధ, కన్నీరు వంటివి లేకుండా సుఖంగా పూజలందుకుంటారో, ఆ కులం సర్వదా వృద్ధి చెందుతుంది. స్త్రీలను ఇబ్బంది పెట్టి వారి శాపానికి గురైన కులం, ఏదో బలీయమైన శక్తిచేత కొట్టబడినట్లుగా, నశించిపోతుంది.

కనుక ఐశ్వర్యములు కోరుకునే గృహస్థులు తమ ఇంట్లో శుభకార్యాలు, ఉత్సవాలు జరిగినప్పుడల్లా తమ ఇంటి ఆడపడుచులను మంచి ఆహారం, నూతన వస్త్రాలు, నగలతో సత్కరించాలి. ఏ కులంలో భర్త వల్ల భార్య, భార్య వల్ల భర్త సంతృప్తిగా, సుఖంగా ఉంటారో ఆ కులంలో సంపద ఎప్పుడూ స్థిరంగా,  తాండవమాడుతూ ఉంటుంది. ఏ స్త్రీ వస్త్రములు, ఆభరణములతో వెలుగొందదో, అలాంటి స్త్రీ తన పురుషుని ఆకర్షించలేదు. పరస్పర ఆకర్షణ లేని కారణంగా వారికి సంతానమూ కలగదు.

భర్త ఆదరణ పొంది రోచిస్సు (కాంతి) తో వెలుగొందే స్త్రీ తన కులానికంతటికీ వెలుగును తెస్తుంది. భర్త ఆదరణకు నోచుకోని కాంతిహీనమైన స్త్రీ భర్తను రమింపజేయలేక, పరపురుష సాంగత్యం మరిగి కులాన్ని చెరుస్తుంది. ఎవరైతే తమ వర్ణములకు తగని ఆసుర వివాహాలవంటి కువివాహాలు(చెడ్డ వివాహాలు) చేసుకుంటారో, జాతకర్మ మొదలైన షోడశ (16) సంస్కారాల వంటి క్రియలను ఎవరైతే  ఆచరించరో, వేదములు ఎవరైతే అధ్యయనం చేయరో, ఎవరైతే బ్రాహ్మణులను గౌరవించక, వారిని అతిక్రమించి ప్రవర్తిస్తారో, వారి కులములన్నీ హీనస్థితిని పొందుతాయి.

శిల్పేన వ్యవహారేణ  శూద్రాపత్యైశ్చ కేవలై : |
గోభిరశ్వైశ్చ యానైశ్చ కృష్యా రాజోపసేవయా ||
అయాజ్యయాజనైశ్చైవ నాస్తిక్యేన చ కర్మాణాం |
కులాన్యాశు వినశ్యంతి యాని హీనాని మంత్రతః ||  ( 3- 64, 65)

శిల్పకళ, చిత్రలేఖనం మొదలైన చేతివృత్తులు అవలంబించడం వల్ల, వ్యవహారం (ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించడం) కారణంగా, శూద్రాపత్యశ్చ కేవలై: (కేవలము శూద్ర స్త్రీ ద్వారా సంతానం పొందినంత మాత్రం చేతనే), గోవులు, అశ్వముల, వాహనముల కొనుగోలు మరియు అమ్మకముల నిర్వహణ వల్ల,  కృషి (వ్యవసాయం) వల్ల, రాజును సేవించడం వల్ల, అయాజ్యయాజనైశ్చైవ (యజ్ఞము చేయించడానికి అర్హతలేనివారితో యజ్ఞ నిర్వహణ చేయించడం వల్ల), నాస్తిక్యంతో చేసే పనుల కారణంగా, కులములు (అగ్రకులాలు) నశించిపోతాయి. వేదాధ్యయనము లేక మంత్రహీనములైన కులములన్నీ కూడా నశించిపోతాయి.

ఈ శ్లోకాలలో మనువు వైదికేతరమైన వృత్తులు, వ్యాపారాలు, వ్యవహారాలకు దూరంగా ఉండమని బ్రాహ్మణులను హెచ్చరిస్తున్నాడు. సుస్పష్టమైన వర్ణ విభజన చేసిన మనువు బ్రాహ్మణ వర్ణానికి షట్కర్మలు విధించాడు. అవి ఆరూ ఇవి: అధ్యయనము, అధ్యాపనము, యజనము, యాజనము, దానము, ప్రతిగ్రహము. వీటిలో అధ్యాపనము, యాజనము, ప్రతిగ్రహము మాత్రం కేవలం బ్రాహ్మణులకే హక్కు భుక్తాలు. వేదాధ్యయనం చేయడం, అర్హులకు అధ్యాపన చేయడం, యజ్ఞం చేయడం, చేయించడం, దానం చేయడం, ఇతరుల దానాలు స్వీకరించడం మినహా ఒక బ్రాహ్మణునికి వేరే కార్యకలాపాలేవీ ఉండకూడదనీ, అప్పుడే సామాజిక వ్యవస్థ సక్రమంగా నడుస్తుందనీ మనువు అభిప్రాయం. ఎవరి వృత్తులు, వ్యాపకాలు వారికి సుస్పష్టంగా నిర్దేశించిన కారణంగా బ్రాహ్మణులు తమ నియమిత వేద సంబంధమైన  కార్యకలాపాలు కాక, వ్యాపారం, వ్యవసాయం వంటి వైదికేతరమైన కార్యకలాపాలలో కూడా తలదూర్చడం శ్రేయస్కరం కాదని మనువు భావించాడు. వర్ణాంతర వివాహాలకు అగ్రవర్ణాలను దూరంగా ఉంచేందుకే శూద్ర స్త్రీతో సంతానం పొందినవారి కులం నశిస్తుందని హెచ్చరించాడు. ఇక్కడ ద్విజన్ములైన అగ్ర వర్ణాలు మూడింటినీ ఉద్దేశించిన మనువు వర్ణాలు అని పేర్కొనకుండా కులాలు అనడానికి కారణం మనువు కాలం నాటికే వర్ణవ్యవస్థ ఘనీభవించి, వర్ణం కులంగా రూపొందడమే కాక శూద్రవర్ణంలో అనేక కులాలు, ఉపకులాలు రూపుదాల్చడమే. మనువు అసంఖ్యాకమైన ఆ కులాలు, ఉపకులాలకు సుస్పష్టమైన పరిమితులను విధించడానికి, పనిలో పనిగా సమాజంలో అగ్రవర్ణాల, ప్రత్యేకించి బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని సువ్యవస్థితం చేయడానికి ఈ ధర్మశాస్త్రం రూపొందించాడు. యజ్ఞము చేయించే బ్రాహ్మణుల హక్కును కాపాడే ఉద్దేశంతోనే ఎవరైనా యాజనార్హత లేనివారిచే యజ్ఞం చేయిస్తే అలా చేయించినవారి కులం నాశనమౌతుందని విధించడం. అలా ఒకవైపు బ్రాహ్మణులను సంపద ఉత్పత్తి క్రమంలో పాల్గొనకుండా వారిని షట్కర్మలకే పరిమితం చేయడం, మరో వైపు వారికి ఉద్దేశించిన వేద సంబంధితమైన పనులు వేరొకరు చేయకుండా కట్టడిచేసి, వారి ఆర్ధిక పరిపుష్టికి మార్గం సుగమం చేయడం ఈ విషయంలో మనువు అవలంబించిన ద్విముఖ వైఖరి.

వేదములు, వేదాంగముల పరిజ్ఞానం కలిగిన కులాలు సంపదల కారణంగా కీర్తి పొందకపోయినా, వేద పరిజ్ఞానంతో మహద్యశమును (గొప్ప కీర్తిని)  పొందుతాయి.

గృహస్థు ధర్మాలు - పంచ మహా యజ్ఞాలు

వివాహం సందర్భంగా రగిల్చిన పవిత్రాగ్నితోనే గృహస్థు వేదవిహితములైన తన రోజువారీ క్రియలను, వైశ్వదేవము మొదలైన పంచ మహా యజ్ఞములను నిర్వహించాలి. రోజూ తన ఆహారాన్ని కూడా ఆ అగ్నితోనే వండుకోవాలి.

పంచ సూనా గృహస్థస్య చుల్లీ పేషణ్యోపస్కరః |
కండనీ చోదకుంభస్య  బధ్యతే యాస్తు వాహయన్ || (3 - 68)

సూనా అంటే వధ్యస్థలి (వధ చేసే కమేలా లేక కబేళా). గృహస్థు ప్రతి రోజూ హింసాస్థానాలైన ఐదింటిని తన వ్యక్తిగత ప్రయోజనం కోసం వాడుకుంటున్నాడు.

ఒక గృహస్థు చుల్లీ (పొయ్యి), పేషణి అంటే తిరగలి లేక నూరటానికి ఉపయోగించే సన్నికల్లు (the pestle and mortar), ఉపస్కరః - ఉపస్కరము అంటే సమ్మార్జనమునకు (ఇంటిని శుభ్రపరచేటందుకు) వాడే  చీపురు లేక అలుకు చుట్ట లేక గృహోపకరణములను శుభ్రపరచడానికి లేక కుండసమ్మార్జనమునకు (పాత్రలు శుద్ధి చేయడానికి) వాడే పీచు. (కండనీ చ ఉదకుంభస్య) కండనీ (ఉలూఖలము - ముసలము అంటే రోలు - రోకలి) మరియు ఉదకుంభము (నీళ్ల కుండ) వంటి వాటిని ఐదింటీనీ స్వకార్యం కోసం వాడుతూ పంచ హత్యా పాతకాలలో చిక్కుకుంటున్నాడు. ఆ ఐదు పాతకములు పోవడం కోసం ఋషులు ఒక గృహస్థుకు పంచ మహాయజ్ఞాలను పరిహారంగా విధించారు.

అన్నము, కూరలు పొయ్యి మీద వండుకోవడం, తన వంటకు అవసరమైన అన్నిటినీ సన్నికల్లులో నూరుకోవడం లేక తిరగలితో విసురుకోవడం, ఇంటిని శుభ్రపరచుకొనడం కోసం చీపురుతో ఊడ్చుకోవడం, అలుకు చుట్టతో అలకడం, వంట పాత్రలను శుభ్రపరచడానికి పీచుతో వాటిని తోమడం, ధాన్యం, పప్పులు మొదలైనవాటిని రోటిలో రోకలితో దంచుకోవడం, ఉదకుంభంతో నీటిని తెచ్చుకోవడం పాపకార్యాలు ఎలా అయ్యాయో, జీవనవ్యాపారంలో ఒక అంతర్భాగమైనట్టి ఈ కార్యకలాపాలు చేసి, ఒక గృహస్థు పంచమహా పాతకాలలో ఎలా ఇరుక్కుంటాడో మూలంలో మనువు వివరించనప్పటికీ కుల్లూకభట్టు తన వ్యాఖ్యానంలో ‘స్వకార్యే యోజయన్ పాపేన సంబధ్యతే’ (ఒక గృహస్థు పై పనులను స్వకార్య నిమిత్తం చేసి పాపాలలో బంధించబడుతున్నాడు) అని వివరించాడు. ఇవే పనులను స్వప్రయోజనం కోసం కాక దైవ కార్యం నిమిత్తం చేస్తే ఎలాంటి పాపమూ అంటుకోదని భావం. యజ్ఞాలలో చేసే జంతుబలి వల్ల, పితృదేవతలకు చేసే శ్రాద్ధ కర్మలలో మాంస వినియోగం వల్ల ఒక గృహస్థుకు అంటుకోని పాపం స్వప్రయోజనం కోసం హింసకు తావులేకుండా శాకములతో వండుకున్నా ఎందుకు, ఎలా చుట్టుకుంటుందో మనువు ఎక్కడా చెప్పలేదు. పై పెచ్చు పితృదేవతల ప్రీతికోసం నెలనెలా చేసే అన్వాహార్యము అనే శ్రాద్ధ క్రియలో ప్రశస్తమైన మాంసాన్ని వినియోగించాలని మనువు ఇదే స్మృతి (3 - 123) లో పేర్కొనడం గమనార్హం. జంతు వధకు అంటుకోని పాపాలు తనకోసం, ఇతర కుటుంబ సభ్యులకోసం శాకాహారపు వంట చేసినా, రోట్లో రోకలితో వేటినైనా దంచినా, ఇల్లు ఊడ్చి, అలికినా, సన్నికల్లులో ఏమైనా నూరినా, నీటి కుండతో నీటిని తెచ్చినా పంచ మహా పాపాలు ఎందుకు, ఎలా తగులుకుంటాయో మనువు వివరించి ఉండాల్సింది.

అధ్యాపనం బ్రహ్మయజ్ఞః పితృయజ్ఞస్తు తర్పణం |
హోమో దైవో బలిర్భౌతో నృయజ్ఞో అతిథి పూజనమ్ || ( 3 - 70 ) 

బ్రహ్మ యజ్ఞము, పితృ యజ్ఞము, దేవయజ్ఞము, భూత యజ్ఞము, నృ యజ్ఞము (మనుష్య యజ్ఞము) - వీటిని ఐదింటీనీ పంచ మహా యజ్ఞములు అంటారు.

ఒక గృహస్థు వేదాలను తాను అధ్యయనం చేసి, ఇతరులకు అధ్యాపనం చేయడం బ్రహ్మయజ్ఞం. పితృదేవతలకు తర్పణలు విడవడం పితృయజ్ఞం. హోమం చేయడం దైవయజ్ఞం. కాక బలి (కాకులకు పిండం పెట్టడం) భూత యజ్ఞం. అతిథి పూజలు (అతిథి అభ్యాగతులను ఆదరించడం) నృ యజ్ఞం. ఇలా ఒక గృహస్థు పంచ యజ్ఞాలు చేయడం ద్వారా ఈ ఐదు పాతకాలను పోగొట్టుకుంటాడు. ఏ గృహస్థు ఈ పంచ యజ్ఞాలనూ నియమం తప్పక ఆచరిస్తాడో, అతడిని పైన తెలిపిన  పంచ సూనాలు అనే దోషాలు అంటవు. దేవతలకు, అతిథులకు, భృత్యులకు (తన సేవకులకు) ఏ గృహస్థు అన్నం పెట్టడో వాడు జీవించివున్నా మరణించినవాడి కిందే  లెక్క!

అహుతం చ హుతం చైవ తథా ప్రహుతమేవ చ |
బ్రాహ్మ్యం హుతం ప్రాశితం చ పంచ యజ్ఞాన్ ప్రచక్షతే || ( 3 - 73)

అహుతము, హుతము, ప్రహుతము, బ్రాహ్మ్య హుతము, ప్రాశితము అనే ఐదింటీనీ పంచ యజ్ఞాలంటారు.

అహుతము అనగా హోమం చేయకుండా చేసే జపయజ్ఞం. హుతము అంటే అగ్నిహోత్రంతో చేసే హోమము. ప్రహుతము అనగా భూతముల కోసం చేసే కాకబలి వంటి భూత యజ్ఞం. బ్రాహ్మ్య హుతము అంటే బ్రాహ్మణోత్తమునికి చేసే పూజ. ప్రాశితము అంటే పితృదేవతలకు ఇచ్చే తర్పణము.

హుతము అంటే యజ్ఞం సందర్భంగా యాగాగ్నికి సమర్పించేది అని అర్థం. అగ్ని రగుల్పకుండా చేసే యజ్ఞం జప యజ్ఞం. అగ్ని ఉండదు కనుక జపయజ్ఞంలో హుతము కూడా ఉండదు. అందుకే అది అహుతము. అగ్ని రగిల్చి చేసే యజ్ఞం హుతము. దీనిలో అగ్నికి హుత సమర్పణ( ఆహుతి)  జరుగుతుంది. ప్రహుతములో అదే అన్నం లేక ఆహారాన్ని యాగాగ్నిలో కాక  భూతదయతో, కాకులు మొదలైన వాటికోసం నేల మీద వేస్తారు. బ్రాహ్మ్య హుతంలో అదే ఆహారం బ్రాహ్మణుడి మండే జఠరాగ్నిలో వేయబడుతుంది. అంటే బ్రాహ్మణ అతిథులను ఆహ్వానించి, వారి ఆకలి తీర్చడం బ్రాహ్మ్య హుతం అన్నమాట. ప్రాశితము అంటే పితృదేవతలకు రోజువారీ సమర్పించే తర్పణము. అప్పటికే అహుతము ( అగ్నికి హుత సమర్పణ చేయని యజ్ఞము) ప్రస్తావించబడినందున ఇది ‘ మనుస్మృతి’ కాల నిర్ణయానికి తోడ్పడే విషయం.

ఇలాగే ‘ భగవద్గీత’ విభూతి యోగంలో కూడా శ్రీకృష్ణుడు అన్నిట్లో గొప్పవి తానేనని చెప్పే సందర్భంలో మహర్షులలో తాను భృగువుననీ, వాక్కులలో తాను ఏకాక్షరమైన ఓంకారాన్ననీ, యజ్ఞాలలో జపయజ్ఞాన్ననీ, పర్వతాలలో హిమాలయాన్ననీ అంటాడు.(10 - 25) కనుక అప్పటికే యజ్ఞనిర్వహణలో జీవహింసకు వ్యతిరేకంగా బౌద్ధ, జైన మతాలు నిర్వహించిన ఉద్యమాల ప్రభావం కారణంగా, హింసాత్మకంగా నిర్వహించే శ్రౌత యజ్ఞాలు క్రమంగా జనాదరణ కోల్పోయి, వాటి స్థానంలో జపయజ్ఞాలకు ఆదరణ పెరిగివుంటుందని మనం గ్రహించవచ్చు. ఆ కారణంగా ‘భగవద్గీత’ లాగే ‘మనుస్మృతి’ కూడా బౌద్ధయుగానంతర రచనేనని గ్రహించవచ్చు.

దరిద్రం కారణంగా నిత్య అతిథి పూజలు చేయలేని బ్రాహ్మణుడు సైతం రోజూ వేదాధ్యయనం చేయడం మాత్రం మానరాదు. నిత్యం అగ్నిహోత్రం మీద, దైవ కర్మల మీద శ్రద్ధ చూపే విప్రుడు ఈ చరాచర ప్రకృతినంతా పోషించగలడు.

అగ్నౌ ప్రాస్తాహుతి స్సమ్యగాదిత్యముపతిష్ఠతే |
ఆదిత్యాజ్జాయతే వృష్టిర్వృష్టేరన్నం తతః ప్రజా : || ( (3- 76)

యాగాగ్నిలో చక్కగా వేల్వబడిన హుతము నేరుగా సూర్యుడిని చేరుతుంది. సూర్యుడి నుంచి వర్షం వస్తుంది. వర్షం నుంచి అన్నం (ఆహారం), దానివలన జనం పుడతారు.

ఇదే విధంగా ‘భగవద్గీత’ (3- 14) లో కూడా శ్రీకృష్ణుడు అన్నము వలననే ప్రాణులు పుడుతున్నాయని, పర్జన్యము (వర్షుకాభ్రము లేక వాన మేఘము) వలన  ఆహార ధాన్యములు (అన్నము) పుడతాయని, యజ్ఞం వలన పర్జన్యం పుడుతుందనీ, యజ్ఞం కర్మ నుంచి పుట్టుకొస్తుందనీ పేర్కొన్నాడు.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః  ||  ( భగవద్గీత  3- 14)

భూమి మీది నీరు సూర్యుడి కాంతిలోని ఉష్ణాన్ని గ్రహించి ఆవిరై, ఆ నీటియావిరి మేఘంగా రూపొందడం, ఆ మేఘం వర్షుకాభ్రముగా రూపొంది, చల్లని అనుకూల పవనాలు వీచినప్పుడు వర్షం గా మారి భూమిపై కురవడం, ఆ వర్షం కారణంగా ఆహారధాన్యాలు (అన్నం) పండడం వరకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా సమ్మతించే విషయాలే. మిగతా అశాస్త్రీయ విశ్వాసాలను అటుంచి, అన్నం వలననే జనం పుడతారని మనువు చెప్పినా, అన్నము వలననే ప్రాణులు పుడుతున్నాయని శ్రీకృష్ణుడు చెప్పినా అవి అంగీకార యోగ్యాలు కావు. జీవులు/మానవుడు ఆహారధాన్యాల నుంచి పుట్టలేదు. పుట్టరు. ఈ భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాలు ఎలాంటి జంతువులు/మానవులు లేకుండా కేవలం వృక్షసంపద మాత్రమే ఉంది. ఆ తరువాత ఆవిర్భవించిన జంతుజాతులు, మానవుడు తమ ఆకలి తీర్చుకొనడాని వృక్ష సంపదపై ఆధారపడడం జరిగింది. అంతేగానీ అన్నం నుంచి ప్రజలు పుట్టారనడం ఏ రకంగా చూసినా సరికాదు. బహుశా నిల్వ ఉంచిన బియ్యం మొదలైన ఆహార పదార్థాలు పురుగుపట్టడం గమనించిన మన ప్రాచీనులు ఆహారం నుంచి జీవులు పుట్టుకొస్తాయనే నమ్మకాన్ని ఏర్పరచుకుని ఉంటారు. ఆహారధాన్యాలలో కొన్ని క్రిములు, కీటకాలు పెట్టే గుడ్ల నుంచి అనుకూల వాతావరణంలో లార్వాలు వెలువడి పప్పులు, బియ్యం వంటి ఆహార ధాన్యాలను అవి తినేస్తాయి. బయట పారేసిన ఆహారపదార్థాలపై, వాటిని ఆశించిన కీటకాలు పెట్టే గుడ్లనుంచి వెలువడే  ముక్కపురుగులు, లద్దెపురుగుల వంటి లార్వాలు ఆ ఆహారాలను తినేసి, అక్కడే విసర్జించి, వాటిని పాడుచేస్తాయి.

అలాగే యజ్ఞంలో అగ్నికి సమర్పించిన ఆహుతులు నేరుగా సూర్యుడిని చేరతాయనడమూ శాస్త్రీయంగా నిరూపించలేని ఒక నమ్మకం మాత్రమే. యాగాగ్నికి సమర్పించబడే ఆహార ధాన్యాలు, అన్నం వంటి ఆహుతులలోని కర్బన పదార్ధం మనం గతంలో చెప్పుకున్నట్లే ప్రాణవాయువు సమక్షంలో మండి, బూడిదవుతుంది. యాగాగ్ని నుంచి వెలువడే కార్బన్ మోనాక్సయిడ్, కార్బన్ డయాక్సయిడ్ వంటివి తేలికైన వాయువులైన కారణంగా వాతావరణపు పై పొరలలోకి చేరతాయి. భూ ఉపరితలం నుంచి కొన్ని మైళ్ళ మందం ఉండే ఈ వాతావరణపు పొర భూమ్యాకర్షణ శక్తి కారణంగా భూమిని వీడకుండా భూమి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి యాగాగ్నికి సమర్పించిన ఆహుతుల నుంచి  సూర్యునికి చేరేది ఏమీ ఉండదు.

***సశేషం***

Posted in September 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!