Menu Close
manusmrithi page title
మూడవ అధ్యాయము (అ)

షట్ త్రింశదాబ్దికం చర్యం గురౌ త్రైవేదికం వ్రతమ్ |
తదర్ధికం పాదికం వా గ్రహణాంతిక మేవ వా  || ( 3 -1 )

మూడు వేదాలూ అంగములతో సహా అధ్యయనం చేయాలనుకునే వ్యక్తి ‘షట్ త్రింశత్ ఆబ్దికం’ అంటే 36 సంవత్సరాలపాటు గురువు ఇంట బ్రహ్మచర్యం పాటిస్తూ త్రైవేదిక వ్రతాన్ని ఆచరించాలి. తదర్దికం (దానిలో సగము అంటే 18 సంవత్సరాలపాటు) లేక పాదికం (దానిలో నాల్గవ వంతు అంటే 9 సంవత్సరాల పాటు) లేక గ్రహాణాంతికం (పూర్తిగా పట్టుబడే వరకు) బ్రహ్మచర్యం పాటిస్తూ వేదాధ్యయనం కొనసాగించాలి. (అంటే ఒక్కొక్క వేదాన్ని అంగాలతో సహా చదవడానికి పన్నెండేళ్ల కాలం పడుతుందని భావించారన్నమాట.)

ఈ స్మృతిలోని మరికొన్ని ఇతర శ్లోకాలలో వలెనే ఈ శోకంలో కూడా మనువు వేదాలను మూడుగానే ప్రస్తావించాడు. దీనినిబట్టే ‘మనుస్మృతి’ అథర్వ వేదానికి ముందరి కాలపు రచనగానే కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఇంకొందరు ‘మనుస్మృతి’ మరీ అంత ప్రాచీనకాలపు సంకలనం కాదనీ ‘మనుస్మృతి’ సంకలనం జరిగే నాటికి అథర్వ వేదం కూడా ఉందనీ పేర్కొన్నారు. ఒక్క బౌధాయనుడు (క్రీ.పూ. 800 - 740) మాత్రమే బ్రహ్మచారి వేదాధ్యయనం 48 సంవత్సరాలపాటు చేయాలనీ, అతడు అథర్వవేదం కూడా చదవాలనీ అభిప్రాయపడ్డాడు. వేదాల కాలనిర్ణయం గురించిన చర్చను ప్రత్యేకానుబంధంలో వివరించాను.

ప్రతి బ్రహ్మచారి మొత్తం మూడు వేదములను అంగములతో సహా అధ్యయనం చేయాలి. లేకుంటే రెండు వేదములను, లేక తాను ఏ వేదశాఖకు చెందినవాడో ఆ ఒక్క వేదాన్ని అయినా సరే సాకల్యంగా అధ్యయనం చేసి, అది పూర్తయిన తరువాత మాత్రమే గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి.

తన తండ్రి వద్ద కానీ లేక ఆచార్యుని వద్ద కానీ వేదాధ్యయనము పూర్తిచేసి బ్రహ్మచర్య వ్రతం చేత ప్రసిద్ధుడైన ఒక విద్యార్థిని తండ్రిగానీ, గురువుగానీ తల్పము (ఉత్కృష్టాసనము) మీద కూర్చోబెట్టి, మాలతో అలంకరించి, గోదాన వ్రతము చేయించి, మధుపర్కముతో సత్కరించాలి.

‘మధుపర్కము’ అనే పదానికి అర్థం ‘తేనెతో మిళితమైనది’ అని. ఒక ప్రత్యేకమైన అతిథికి లేక ఒక వరునికి ఒక గృహస్థు లేక కన్యాదాత తన ఇంటికి వచ్చినప్పుడు చేసే గౌరవపూర్వకమైన సత్కారాన్నే మధుపర్కము అంటారు. మధుపర్కములో ఐదు అంశాలుంటాయి.

‘దధి సర్పిర్జలం క్షౌద్రం సితా చైతైశ్చ పంచభి : | ప్రోచ్యతే మధుపర్కః’

దధి - పెరుగు, సర్పిస్ - నెయ్యి, జలం - నీరు, క్షౌద్రం - తేనె, సితా - పటిక బెల్లం. సితా అంటే మద్యం అనే అర్థం కూడా ఉంది. ప్రాచీనకాలంలో మద్యమాంసాలు లేకుండా అతిథికి ఇచ్చే మధుపర్కం ఉండేది కాదట. ప్రత్యేకించి మాంసం లేకుండా మధుపర్కం అసలు ఉండేదే కాదు. ‘ఉత్తర రామచరిత’ లో ‘సమాంస మధుపర్కం’ గురించిన ప్రస్తావనలున్నాయి. బౌద్ధం ప్రభావం కారణంగా మధుపర్కంలో మాంసం ఇచ్చే ఆచారం క్రమంగా వెనుకపట్టు పట్టింది. మధుపర్క సహితమైన ఆతిథ్యాన్ని స్వీకరించే ప్రత్యేక అతిథి ఎవరన్న వివరణ ‘మనుస్మృతి’(3- 119) శ్లోకంలో ఇవ్వబడింది. రాజు, ఋత్విజుడు, స్నాతకుడు, గురువు, మిత్రులు, మామగారు, మేనమామ - వీరు ఒక సంవత్సరకాలానికి గానీ, అంతకంటే ఎక్కువ కాలం తరువాత గానీ తన ఇంటికి వచ్చినట్లయితే ఆ ఇంటి యజమాని వారిని మధుపర్కంతో సత్కరించాలి.

ద్విజుడు గురువు అనుమతి తీసుకుని, స్నాతకము (విద్యా పరిపూర్తికి సూచనగా చేసే స్నానము)ను, సమావృత్తము (వేదాధ్యయనము తరువాత బ్రహ్మచర్య వ్రతమును గురువు అనుమతితో ముగించి గృహస్థాశ్రమం స్వీకరించడానికి సూచనగా చేసే కార్యక్రమం) ను యథావిధిగా పూర్తిచేసుకుని,  లక్షణాన్వితా (శుభలక్షణములతో కూడినది), సవర్ణా (తన వర్ణములో పుట్టినది) అయినట్టి కన్యను ఉద్వాహము (వివాహం) చేసుకోవాలి.

వివాహానికి ఎంచుకోబడే కన్యకు ద్వాత్రింశత్ (32) శుభ లక్షణాలు ఉండాలట. కళ్ళు, చేతులు, నడుము, ముక్కు, చెవులు, మోకాళ్ళు, శిరోజములు, కాలి వేళ్ళు, గోళ్లు, చర్మము, పళ్ళు, పొట్ట, వక్షోజములు, అరచేతులు, చేతి వేళ్ళు, గోళ్లు, ముఖము, నోరు, పెదవులు, మెడ, పిక్కలు, బొడ్డు, మర్మావయవములు మొదలైన 32 శరీరాంగముల విషయములో అగస్త్య సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన విధంగా ఉంటే ఆ కన్య శుభలక్షణాలు కలిగినదనే విశ్వాసం మన ప్రాచీనులకు ఉండేది. ఇక సవర్ణ కన్య (తన వర్ణంలో జన్మించిన కన్య) ను వివాహం చేసుకొనడం ద్విజుడికి ప్రశస్తమైనదని భావించేవారు.

తన తల్లికి అసపిండా (సపిండురాలు కానిది), తన తండ్రి గోత్రికురాలు కానిది అయినట్టి ద్విజకన్య ఒక ద్విజుడికి వివాహానికి అంటే దారకర్మలు (భార్య చేయవలసిన విధులు) నిర్వర్తించడానికి, మైథునానికి (సంతానం కోసం) ప్రశస్తమైనది.

శ్రాద్ధ కర్మలలో తనతో ఉమ్మడిగా ఒకే పితృదేవతలకు పిండం పెట్టే సన్నిహిత పురుష బంధువు (Kin) ను సంస్కృతంలో ‘సపిండః’ (సపిండుడు) అనీ, అలాంటి స్త్రీని ‘సపిండా’ (సపిండురాలు) అనీ అంటారు. సపిండుడు కాని పురుషుడిని అసపిండః (అసపిండుడు) అనీ, అలాంటి స్త్రీని అసపిండా (అసపిండురాలు) అనీ అంటారు.

ప్రకృతిలో లక్షల ఏళ్ల నుంచీ జరుగుతున్న పరిణామక్రమంలో భాగంగా పలు వృక్ష జాతులు స్వపరాగ సంపర్కం (Self Pollination) కంటే పర పరాగ సంపర్కం (Cross - Pollination) ఫలదీకరణకు ఎంతో మేలైనదనే గ్రహింపు పొంది, తమకు తామే తమ పుష్ప నిర్మాణాన్ని పర పరాగ సంపర్కానికి అనువుగా మలచుకున్నాయి. ఇదే ఎరుకతోనే మన ప్రాచీనులు కూడా ఒక వరుని తల్లి వైపు, తండ్రి వైపు సన్నిహిత బంధువైన కన్యను వివాహం చేసుకునేవారు కాదు. ఒక ద్విజునికి తల్లి వైపు సపిండురాలు కానట్టి, తండ్రి గోత్రానికి చెందనట్టి స్త్రీ మాత్రమే వివాహానికి, మైథునానికీ ప్రశస్తమైనదని మనువు ఇక్కడ పేర్కొనడం దానిలో భాగమే. మన ప్రాచీనులు సన్నిహిత బంధువులను పెళ్లి చేసుకోవడం( Endogamy) కంటే స్త్రీపురుషులు బందుత్వంలేని బయటి సంబంధాలు చేసుకోవడం( Exogamy) ఎంతో ఆరోగ్యప్రదమని ఎంతో ప్రాచీనకాలంలోనే గుర్తించారు. అయితే అనంతరకాలపు సామాజిక పరిణామంలో భాగంగా వధువుల తండ్రులు కుటుంబ ఆస్తుల పట్ల మమకారం పెంచుకుని, తమ కుటుంబ ఆస్తి వేరొక బయటి వ్యక్తికి కాక తమ సన్నిహిత బంధువులకు మాత్రమే దక్కాలని భావించి, క్రమంగా  మేనరికపు వివాహాల పట్ల మొగ్గు చూపారు. దీనివలన పుట్టే సంతానంలో అధికసంఖ్యాకులు ఏదో ఒక లోపంతో జన్మించడం, బాలారిష్టాలతో మరణించడం సర్వసామాన్యం అయిపోయింది. మేనరికపు వివాహాలలో పుట్టినవారు కూడా అక్కడక్కడా చాలా అరుదుగా ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ, ఎక్కువ శాతం పిల్లలలో కనిపించే ఊబకాయం (Obesity). గుండెకు చిల్లులతో పుట్టడం, బొల్లి, వెలుతురు భరించలేకపోవడం, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండడం, అంధత్వం వంటి లోపాలు వారి తల్లిదండ్రులు చేసుకున్న మేనరికపు వివాహాల కారణంగానేనని శాస్త్రజ్ఞులు తేల్చారు. మరోవైపు ముస్లింలలో అనాదిగా వరుడు తన తండ్రి వైపు సన్నిహిత బంధువైన స్త్రీ ని వివాహమాడే ఆచారం ప్రబలింది. మేనరికం లేక దగ్గర బంధువైన స్త్రీతో వివాహం (Endogamy) అంతగా శ్రేయస్కరం కాదని ఇటీవల దాదాపు అందరూ గుర్తించి, వివాహాలకోసం బయటి సంబంధాలనే (Exogamy) ఖాయపరచుకుంటున్నారు.

ఒక కన్య కుటుంబానికి గో (గోవులు), అజా (మేకలు), అవి (గొర్రెలు), ధనధాన్యములు ఎంత సమృద్ధిగా ఉన్నప్పటికీ, వివాహం విషయంలో ఈ కింది పది కుటుంబాలకు చెందిన  కన్యలను వర్జించాలి అంటే ఆ యా కుటుంబాలకు చెందిన కన్యలను ఎట్టి పరిస్థితులలోనూ వధువుగా ఎంచుకొనరాదు.

షోడశ సంస్కారాలు మొదలైన పవిత్ర కర్మలు ఆచరించకుండా క్రియా రహితమైన కుటుంబం, మగ సంతతి లేని (నిష్పురుష) కుటుంబం, వేదాధ్యయనము చేయని (నిశ్ఛంద) కుటుంబం, శరీరం మీద ఒత్తైన, పొడవాటి వెంట్రుకలు కలిగినవారితో కూడిన (రోమశ) కుటుంబం, అర్శస్సు అంటే మూలవ్యాధి కలిగినట్టి కుటుంబం, క్షయ వ్యాధి కలిగిన కుటుంబం, అజీర్ణరోగము, అపస్మారము (మూర్ఛరోగము) ఉన్న కుటుంబము, బొల్లి ( శ్వేత కుష్ఠు), కుష్ఠు మొదలైన వ్యాధులు కలిగిన కుటుంబాలకు చెందిన కన్యను ఎట్టి పరిస్థితులలోనూ వధువుగా ఎంచుకొనకూడదు.

నోద్వహేత్కపిలాం కన్యాం నాధికాంగీ సరోగిణీమ్ |
నాలోమికాం  నాతిలోమాం న వాచాటాం న పింగలామ్ || ( 3- 8 )

(న + ఉద్వహేత్ - నోద్వహేత్ ) ఎలాంటి కన్యలను ఉద్వాహము (వివాహము) చేసుకొనరాదు? కపిల వర్ణపు కేశములు కలిగిన కన్య, అధికాంగీ (అవసరానికి మించిన శరీరాంగము / మర్మాంగము కలిగినది), సరోగిణీ (రోగము కలిగిన స్త్రీ), నాలోమికా - న + అలోమికా (ఒంటి మీద వెంట్రుకలు లేని స్త్రీ  పనికిరాదు), నాతిలోమాం (న + అతిలోమాం) విపరీతంగా వెంట్రుకలు కలిగిన స్త్రీ కూడా వివాహం చేసుకొనేందుకు యోగ్యురాలు కాదు. వాచాటాం అంటే వాగుడు కాయ (ఎక్కువగా మాట్లాడే) స్త్రీ, పింగలామ్ (పింగళ వర్ణపు అంటే ఎరుపు, గోధుమ వన్నెల మిశ్రమ వర్ణపు) కళ్ళు కలిగిన స్త్రీని వివాహం చేసుకోరాదు.

అందరిలా నల్లని వెంట్రుకలు కాకుండా ఎర్రని వెంట్రుకలున్న స్త్రీని వివాహ సంబంధాల విషయంలో నేటికీ పట్టి పట్టి అనుమానంగా చూస్తారు. మంచి గోవు లేక మంచి గేదెకు ఉండవలసిన లక్షణాలలో తోక వెంట్రుకలు నల్లగా, బిరుసుగా ఉండడం ఒకటని  గోసాముద్రిక శాస్త్రం కూడా చెపుతుంది (‘అనుభవ పశువైద్య చింతామణి’ - కీ.శే యేజెళ్ల శ్రీరాములు చౌదరి). మనువు ఒక వధువు ‘అధికాంగి’ (పెద్ద మర్మాంగం కలిగినది) కాకూడదన్నట్లే గేదె లేక ఆవు యొక్క మర్మాంగం ఉండవలసిన పరిమాణం కంటే ఎక్కువగా ఉండడం కూడా అభిలషణీయం కాదని సంప్రదాయ పశువైద్య నిపుణులు భావిస్తారు.

లోమము అన్నా రోమము అనే అర్థమే. (రలయోరభేదః - ర, ల శబ్దాల మధ్య భేదం లేదు). అలోమికా అంటే తల మీద ఒంటిమీద వెంట్రుకలు అసలు లేకుండానో లేక పల్చగానో ఉన్న స్త్రీ. ఇలాంటి వారిని ‘మాచకమ్మ’ అని అంటారు. వీరిలో కొందరికి ఈస్ట్రోజెన్ (estrogen), ప్రొజెస్టెరాన్ ( Progesteron) వంటి స్త్రీ హార్మోన్లు లోపించిన కారణంగా రొమ్ములు లేకుండా ఉండడమే కాక, ఇంకొందరిలో పురుషుల వలె మీసాలు, గడ్డాలు కూడా పెరుగుతాయి. ఈ తరహా స్త్రీని ‘పోట’ అంటారు. ఇలాంటి స్త్రీలకు సంతానం కలిగే అవకాశం లేని కారణంగా మనువు ఈ తరహా కన్యలను వివాహమాడరాదని పేర్కొన్నాడు.

కొందరు స్త్రీలు వాచాటలు (వాగుడు కాయలు) గా ఉండి, అందరితో ఎక్కువగా మాట్లాడుతూ, పురుషులతోనూ అతి చనువుగా, చొరవగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి స్త్రీలను వారు తమ భర్తలకు ద్రోహం చేసే అవకాశాలు ఎక్కువని భావించిన కారణంగానేనేమో అలాంటి వారిని కూడా వివాహమాడరాదని సూచించాడు మనువు.

పింగళ వర్ణం అంటే ఎరుపు గోధుమ వన్నెల మిశ్రమం. కొందరు దీనినే గచ్చకాయ రంగు అని కూడా అంటారు. ఇలాంటి కళ్ళను పిల్లి కళ్ళు అని కూడా అంటారు.యక్షుల అధిపతి కుబేరుడు పింగళాక్షుడిగా పేరొందాడు. యక్షులు లేక జక్కులలో నేటికీ పింగళాక్షులుండడం గమనార్హం. ఈ పిల్లి కళ్ళు తల్లి నుంచి పిల్లలకు కూడా వారసత్వంగా సంక్రమించే అవకాశం ఉన్న కారణంగా మనువు పిల్లి కళ్ల కన్యలను వివాహం చేసుకోవద్దని సూచించి ఉంటాడు.

నక్షత్రములు, వృక్షములు లేక నది పేర్లు కలిగిన స్త్రీని, అంత్య (హీన) జాతిని సూచించే పేరు కలిగిన స్త్రీని, ఏదైనా పర్వతాన్ని సూచించే పేరు కలిగిన స్త్రీని, లేక ఒక పక్షిని సూచించే, లేక అహి (పాము) ను సూచించే పేరు కలిగిన స్త్రీని,(ప్రేష్య) దాస్య లేక సేవావృత్తిని సూచించే పేరు కలిగిన స్త్రీని, భీషణనామికామ్ (భయంకరమైన పేరు కలిగిన స్త్రీ ని) వివాహం చేసుకొనరాదు.

ప్రేయసీ ప్రియులు అనుకోకుండా అప్పటికప్పుడు కలుసుకుని, గాంధర్వ రీతిలో వివాహం చేసుకొనే సందర్భంలో ఒకరి గురించి మరొకరు పేరు మినహా ఇతర వివరాలు ఏవీ తెలుసుకోగలిగే అవకాశం ఉండనిమాట నిజం. బహుశా అలాంటి సందర్భాలలో పేరునుబట్టి వధువు కుటుంబం యొక్క పూర్వాపరాలు, గుణగణాలు గ్రహించి వరుడు ఎవరిని  వధువుగా ఎంచుకొనకూడదో సూచించడం ఇక్కడ మనువు ఉద్దేశం కావచ్చు. అయితే ఈ శ్లోకంలోని నియమాలలో ఎక్కడా శాస్త్రీయత మాత్రం కనిపించదు. అశ్విని, రోహిణి, ఉత్తర, స్వాతి, అనూరాధ, రేవతి వంటి నక్షత్రాల పేర్లు అనాది కాలం నుంచి ఇప్పటివరకూ అందరూ ఎక్కువగా పెట్టుకొంటున్నవే. ఆ పేర్లు పెట్టుకున్న కన్యలు వివాహానికి పనికిరారంటే ఎలా? ఇందులో హేతుబద్ధత ఏమైనా ఉందా? శిరీష (దిరిసెన), పారిజాతం, చంపకం (సంపెంగ), మల్లిక, కమల, పద్మ వంటి వృక్షసూచకమైన పేర్లూ చాలానే ఉన్నాయి. స్త్రీలు కృష్ణవేణి, గోదావరి, కావేరి, నర్మద, గంగ, యమున వంటి నదుల పేర్లు పెట్టుకోవడం కూడా అనాది నుంచీ ఉన్నదే. స్త్రీలలో వృత్తిసూచకమైన సైరంధ్రి (విరాటపర్వంలో మానిని) వంటి పేర్లలాగా పేరు చెప్పగానే ఆమె అంతఃపుర కావలికత్తె అని కనిపెట్టగలిగే పదాలు చాలా తక్కువ. సేవా వృత్తిలో ఉన్న చెలికత్తెల పేర్లు సైతం రాకుమార్తెల పేర్లలాగే మనోరమ, మంజరి, చిత్రలేఖ అని ఉండడం మన పురాణాలలోనే చాలా సందర్భాలలో ఉంది. అలాగే పురుషుల్లోనూ కుంతీపుత్రులైన యుధిష్ఠిర, భీమార్జునులను ముగ్గురినీ ‘కౌంతేయ’ అనే పేరుతో పిలిస్తే, దాస్య (శూద్ర) వృత్తిలో ఉన్న రాధ పెంపుడు కుమారుడైన కర్ణుడిని ‘రాధేయ’ అని పిలిచారు. ఇక్కడ మరి ఆ పేర్లలో వ్యత్యాసం ఏముంది? ఇక కోకిల, శారిక, హంస వంటి పక్షులను సూచించే పేర్లు కూడా స్త్రీలకు అనాదిగా ఉంటూ ఉన్నవే. భారత జాతికి మూలపురుషుడని భావిస్తున్న భరతుడి తల్లి శకుంతల విశ్వామిత్ర మహర్షికీ, దేవవేశ్య మేనకకూ పుట్టిందని మనకు తెలుసు. మేనక ఆ పసిపాపను వదిలేసి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఆ పాపను శకుంతములు (భాస పక్షులు లేక చమురుకాకులు) ప్రేమగా సాకాయట. అందుకే ఆమెకు శకుంతల అనే పేరు వచ్చిందట. కనుక శకుంతల పేరు కూడా పక్షిని సూచించేదే కదా? వింధ్య, అంజన, పార్వతి, గిరిజ, హైమవతి వంటి స్త్రీల పేర్లన్నీ పర్వతాలను సూచించేవే కదా? నాగిని, నాగవేణి, భోగిని, భోగవతి  మొదలైన ఎన్నో పేర్లు పాములను సూచించేవే. కాళి, రుద్రాణి, చండి, చాముండి వంటి భయానకమైన పేర్లు సైతం అవి పార్వతీదేవి పేర్లైన కారణంగా అనాదిగా అందరూ పెట్టుకుంటూనే ఉన్నారు. అయినా పేరులో ఏముంది? మృదుల, కోమలి అనే పేర్లు పెట్టుకున్నవారు శారీరక లేదా మానసిక కాఠిన్యం కలిగి ఉండవచ్చు. సుమతి, సుగుణ అని పేరు పెట్టుకున్నవారు దుర్మతులుగానూ, దుర్గుణాల పుట్టలుగానూ ఉండవచ్చు. ఈ శ్లోకంలో చెప్పబడిన విధంగా ఆ యా స్త్రీల గుణగణాలను కేవలం వారి పేర్లనుబట్టే నిర్ణయించబూనడం ఎంతమాత్రం శాస్త్రీయం కాదు. తన ఆలోచన ఎలా హేతుబద్ధమో, ఎందుకు సమర్థనీయమో ఈ సందర్భంగా మనువు వివరించి ఉండాల్సింది.

***సశేషం***

Posted in June 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!