Menu Close
manusmrithi page title
రెండవ అధ్యాయము (ఓ)

బ్రహ్మచారి పాటించవలసిన మరిన్ని నియమాలు

దూర ప్రదేశాల నుంచి ఏరి తెచ్చిన సమిధలను (చిదుగులను) నేలమీద కాకుండా వేరే ఏదైనా ప్రదేశంలో భద్రపరచి, ఉదయం మరియు సాయంత్రం సమిధాధానములో వాటిని పవిత్రాగ్నిని రగిలించడానికి  ఉపయోగించాలి.

ఆరోగ్యం సరిగా ఉన్నప్పటికీ ఎవడైతే వరుసగా ఏడు రోజులపాటు భిక్షాటన చేయకుండా, సమిధాధానము చేయకుండా ఏడు రాత్రులు ఉంటాడో అతడు అవకీర్ణి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.

ప్రతిదినము పలువురి ఇళ్ళనుండి సేకరించిన భిక్షాన్నాన్నే బ్రహ్మచారి తినాలి. రోజూ ఒకరి ఇంటి ఆహారాన్నే తినకూడదు. భిక్షాన్నం తినడం కారణంగా బ్రహ్మచారికి ఉపవాస ఫలం లభిస్తుంది.

ఒకరి ఇంట దేవతాప్రీతికో లేక పితృదేవతల ప్రీతికోసమో జరుపబడే ఏదైనా కార్యక్రమం సందర్భంగా బ్రహ్మచారి ఆ ఇంటి పక్వాన్నాన్ని, తాను పాటించే వ్రత నియమాలను అనుసరిస్తూ (అంటే మద్యమాంసాదులను వర్జించి) తిన్నా తన బ్రహ్మచర్య వ్రతమునకు ఎలాంటి దోషమూ ఉండదు.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య బ్రహ్మచారులలో కేవలం బ్రాహ్మణ బ్రహ్మచారులకు మాత్రమే ఇలా రోజూ ఒకే ఇంటి భోజనం తినడం నిషేధం. క్షత్రియ, వైశ్య బ్రహ్మచారులకు ఏకగృహాన్న భోజనము నిషేధము కాదు.

గురు శిష్య సంబంధాలు 

గురువు ప్రతిరోజూ చెప్పినా చెప్పకున్నా, ఒక బ్రహ్మచారి రోజూ వేదాధ్యయనము, గురు హిత కార్యములు (అంటే గురువుకు మేలు చేకూర్చే పనులు) తప్పక చేయాలి.

ఒక బ్రహ్మచారి తన దేహమును, బుద్ధిని, ఇంద్రియములను, మనస్సును బంధించి, చేతులు జోడించి, గురువు ఏ సమయంలో ఏమి ఉపదేశిస్తాడోనని కాచుకుని నిలబడి ఉండాలి. ఎట్టి పరిస్థితులలోనూ గురువు సమక్షంలో కూర్చొనరాదు.

శిష్యుడు ఎప్పుడూ తన శరీరాన్ని పూర్తిగా వస్త్రంతో కప్పుకుని, తన  కుడి భుజమును మాత్రం ఉత్తరీయమునకు వెలుపలనే ఉంచుకుంటూ, సంస్కారాన్నీ, సదాచారాన్ని పాటిస్తూ, గురువు తనను కూర్చొనమని ఆదేశించిన తరువాత మాత్రమే గురువుకు ఎదురుగా నేలపై కూర్చోవాలి.

హీనాన్న వస్త్రవేషస్స్యాత్సర్వదా గురు సన్నిధౌ |
ఉత్తిష్ఠేత్ప్రథమం చాస్య చరమం  చైవ సంవిశేత్ || ( 2- 194)

గురువు ఎదుట ఎప్పుడూ గురువు తినే ఆహారం కంటే హీనమైన ఆహారాన్నే శిష్యుడు తినాలి. ఆయన కట్టిన బట్టకంటే హీనమైన వస్త్రాన్నే శిష్యుడు ధరించాలి. శిష్యుని వేషధారణ గురువు వేషం కంటే హీనమైనదిగానే ఉండాలి. రోజూ ఉదయం గురువుకంటే ముందే నిద్రనుంచి లేవాలి. గురువు నిద్రించిన తరువాత మాత్రమే శిష్యుడు నిద్రకు ఉపక్రమించాలి.

శిష్యుడు గురువుతో సంభాషించడంలోనూ, లేక గురువు ప్రశ్నలకు బదులివ్వడంలోనూ కూడా కొన్ని నియమాలు పాటించాలి. పడుకుని ఉండి కానీ, కూర్చుని ఉండి కానీ, భోజనం చేస్తూ గానీ, గురువుకు పెడముఖంగా ఉండి గానీ (అవతలి పక్కకు తిరిగి ఉండి గానీ) గురువుతో మాట్లాడడం లేక గురువు ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వడం చేయరాదు.

గురువు తాను ఆసనంలో కూర్చుని శిష్యుడిని ఆజ్ఞాపిస్తే లేదా ఏదైనా ప్రశ్న అడిగితే, శిష్యుడు వెంటనే లేచి నిలబడి దానికి ప్రత్యుత్తరం ఇవ్వాలి. గురువు నిలబడి తనకు  ఏదైనా ఆదేశమిస్తే, శిష్యుడు గురువు దగ్గరకు ఎదురు వెళ్లి దానికి బదులివ్వాలి.

గురువు శిష్యుడున్న ప్రదేశానికి వస్తూ శిష్యుడిని ఆదేశిస్తే, శిష్యుడు ఎదురేగి ఆ ఆజ్ఞను పాటించాలి. గురువు పరుగిడుతూ తనను ఆదేశించడం లేక ప్రశ్నించడం చేస్తే, శిష్యుడు తానూ ఆయన వెంట పరుగిడుతూ గురువు ఆదేశాన్ని పాటించడం లేదా గురువు ప్రశ్నకు బదులివ్వడం చేయాలి.

గురువు తనకు పెడమోముతో ఉండి శిష్యుడిని ఆదేశిస్తే, శిష్యుడు గురువుకు అభిముఖుడై (గురువున్న వైపుకు తిరిగి) గురువు ఆజ్ఞను స్వీకరించాలి. గురువు దూరాన ఉండి తనను ఆజ్ఞాపిస్తే, శిష్యుడు గురువు సమీపానికి వెళ్లి ఆయన చెప్పేది విని, దానిని పాటించాలి. గురువు పడుకుని ఉండి తనకు ఏదైనా ఆదేశమిస్తే, శిష్యుడు గురువును సమీపించి నమస్కరించి, గురువుకు ప్రత్యుత్తరం ఇవ్వాలి. గురువు నిలబడి ఉండి శిష్యుడికి ఏదైనా ఆదేశమిస్తే శిష్యుడు కూడా గురువుకు దగ్గరగా నిలబడి బదులివ్వాలి.

గురువు సమక్షంలో శిష్యుడు ఎప్పుడూ గురువు కూర్చున్న ఆసనం కంటే తక్కువ ఎత్తున్న ఆసనంలోనే కూర్చోవాలి. గురువు పడుకున్న పడక కంటే తక్కువ ఎత్తున్న పడక మీదనే శిష్యుడు పడుకోవాలి. అది కూడా గురువు కూర్చున్న లేక పడుకున్న తరువాత, ఆయన ఆదేశం మేరకు మాత్రమే. గురువు చూస్తూ ఉన్నప్పుడు యథేష్టాసనంలో - అంటే కాళ్ళు  చాచుకుని కూర్చొనకూడదు. గురువు సమక్షంలో  శిష్యుడు ఎప్పుడూ బాసిక పట్టు (బాసి పట్టు) అంటే  పద్మాసన స్థితిలోనే కూర్చోవాలి.

శిష్యుడు గురువు లేనప్పుడు కూడా మా గురువులవారు, మా ఉపాధ్యాయులవారు అనే చెప్పాలి తప్పితే గురువు పేరును గురువు పరోక్షంలో కూడా చెప్పరాదు. గురువులాగా నడిచి, గురువులా మాట్లాడి, గురువు చేసిన పనులు చేస్తూ గురువును ఎగతాళి చేయరాదు.

గురువు మీద ఎవరైనా అపవాదు వేయడం, ఆయనను నిందించడం ఎక్కడైనా తాను విన్నప్పుడు  శిష్యుడు తన రెండు చెవులు మూసుకోవాలి. లేదా తక్షణం తాను ఆ చోటు వదలిపోవాలి.

పరీవాదా త్ఖరో భవతి శ్వా వై భవతి నిందకః |
పరిభోక్తా క్రిమిర్భవతి కీటో భవతి మత్సరీ  ||

గురువుపై అపవాదు మోపే శిష్యుడు మరు జన్మలో ఖరము (గాడిద) గా పుడతాడు. గురువును నిందించేవాడు ‘శ్వా వై భవతి’ అంటే కుక్కగా జన్మిస్తాడు. (శ్వా, శ్వానౌ, శ్వానః, శునః - ఇవన్నీ సంస్కృతంలో కుక్కకి పేర్లు) గురువు సొత్తును తిన్నవాడు క్రిమిగా పుడతాడు. గురువు పై ఈర్ష్యాసూయలు, ద్వేషము కలిగినవాడు కీటము (నీచమైన విషపు పురుగు) గా జన్మిస్తాడు.

శిష్యుడికి ఏదైనా అస్వస్థతగా ఉంటే తప్ప గురువుకు తానే స్వయంగా సేవలు చేయాలి. వేరేవారెవరిచేతనూ చేయించరాదు. శిష్యుడు తాను కోపంతో ఉన్నప్పుడుగానీ, గురువు సమీపంలో ఎవరైనా స్త్రీ ఉన్నప్పుడుగానీ గురువుకు సేవలు చేయరాదు. శిష్యుడు ఏదైనా బండిలో వెళుతున్నప్పుడు గురువు కనిపిస్తే వెంటనే అతడు ఆ వాహనం దిగి గురువుకు నమస్కరించాలి. అలాగే శిష్యుడు ఏదైనా ఉన్నతాసనం మీద కూర్చున్నప్పుడు తన గురువు అటుగా వస్తే శిష్యుడు వెంటనే ఆ ఆసనం దిగి గురువుకు వినమ్రంగా అభివాదం చెయ్యాలి.

ఎదురుగాలి వీస్తున్నప్పుడుగానీ, దిగు గాలి వీస్తున్నప్పుడుగానీ శిష్యుడు గురువుతో పాటు సమానాసనంలో కూర్చొనరాదు. గురువు విననప్పుడు శిష్యుడు గురువుని గురించి కానీ వేరొకరి గురించి కానీ మాట్లాడరాదు.

ఎడ్లబండి, గుర్రపు బండి, ఒంటె బండి మీద వెళ్ళేటప్పుడు, మేడ మీద, బండ మీద, రాయి మీద, చాప మీద, రాతి పలక మీద లేక ఏదైనా నావ మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం శిష్యుడు గురువుతో సమానంగా కూర్చోవచ్ఛు.

శిష్యుడు తాను గురువు సమక్షంలో ఉన్నప్పుడు తన గురువుయొక్క గురువు అక్కడికి వస్తే తాను తన గురువుకు ఎలా నమస్కరిస్తాడో, అదే విధంగా ఆయనకీ నమస్కరించాలి.  శిష్యుడు గురువు దగ్గర ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు అక్కడికి వస్తే గురువు అనుమతి తీసుకొనకుండా వారికి అభివాదం చేయకూడదు.

బ్రహ్మచారి తాను ఏరి తెచ్చిన ఎండు చిదుగులు నేల మీద పెడితే అవి తడిసే అవకాశం ఉంది కనుక,  తడి తగలకుండా ఆ చిదుగుల మోపును ఏదైనా ఎత్తైన అటకమీదనో లేక చెట్ల కొమ్మలమీదనో భద్రపరచాలి. బ్రహ్మచర్య  వ్రతము భంగపడిన బ్రహ్మచారిని అవకీర్ణి అంటారు. ఆరోగ్యం సరిగా ఉండికూడా ఒక బ్రహ్మచారి వరుసగా ఏడురోజులు భిక్షాటనకు వెళ్లకుండా, చిదుగులు ఏరుకొచ్చి సమిధాధానము చేయకుండా ఉంటాడో, అలాంటి బద్ధకస్థుడి  బ్రహ్మచర్య వ్రతం భంగపడినట్లే. అందుకే అలాంటి బ్రహ్మచారి అవకీర్ణి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. బ్రహ్మచారి ఎప్పుడూ సాత్వికాహారమే తినాలనే ఉద్దేశంతోనే భిక్షాటనకు కూడా కొన్ని నియమాలను ఏర్పరచడం జరిగింది. ఎప్పుడూ ఒకే ఇంట్లో భిక్ష స్వీకరిస్తుంటే బ్రహ్మచారికి ఆ గృహస్థుతో సాన్నిహిత్యం ఏర్పడి, ఆ ఇంటినుంచి అతడు అన్నిరకాల ఆహారాలు పొందే అవకాశం ఏర్పడవచ్చు. అందుకే భిక్షాటనకు కూడా కఠినమైన నియమాలు ఏర్పరచారు. ఇక గురుశిష్య సంబంధాల విషయానికొస్తే శిష్యుడు ఎల్లప్పుడూ గురువు కంటే వస్త్రధారణ, భోజనం వంటి వాటి విషయాలలో స్థాయి తక్కువగా,  హీనంగానే ఉండాలనే తరహా నియమాలు, గురువుపట్ల శిష్యుడు అత్యంత విధేయునిగా ఉండాలనే నియమం, నిత్యం శిష్యుడు గురువుకు శుశ్రూషలు చేయడం, గురుహిత కార్యాలు  చేయడం  విద్యార్థి దశలో ఆ బ్రహ్మచారికి అణకువ, వినయం, గురువు పట్ల భక్తిప్రపత్తులు ఏర్పడేందుకు దారితీస్తాయి. గురువు పట్ల తగినంత గౌరవం లేని పక్షంలో గురువు చెప్పే విద్య శిష్యుడికి  తలకెక్కదనేది వాస్తవం. అందుకే గురువుతో శిష్యునికి మర్యాదపూర్వకమైన, భయభక్తులు, వినయవిధేయతలతో కూడిన సంబంధాలే ఉండేవిధంగా ఈ తరహా నియమాలను రూపొందించారు. పాపపుణ్యాలు, స్వర్గనరకాలు వంటి వాటి మీద మన ప్రాచీనులకున్న విశ్వాసాల వంటిదే పునర్జన్మ మీది విశ్వాసం కూడా. అసలు మరుజన్మ అంటూ ఉందో లేదో, ఉంటే గురుద్రోహి మరుజన్మలో నీచమైన జంతువు / కీటకం గా జన్మిస్తాడో లేదో ఎవరు చెప్పగలరు? అదొక ఎలాంటి శాస్త్రీయత లేనట్టి ఒక విశ్వాసం. అంతే. అయితే శిష్యులలో ఇలాంటి విశ్వాసం ఉండే కారణంగా వారు తమ గురువును తిట్టడానికిగానీ, ఆయనకు ద్రోహం తలపెట్టడానికిగానీ భయపడతారనేది మాత్రం నిజం. అందుకే బహుశా ఈ విశ్వాసాన్ని స్మృతికారుడు బ్రహ్మచారుల మనసులలో పాదుకొల్పి ఉంటాడు. ఇక చివరిగా - మన ప్రాచీనులు తల్లి, తండ్రి తరువాత  మూడవస్థానాన్ని మాత్రమే గురువుకి కేటాయించారు. వేద సాహిత్యం కూడా ‘మాతృ దేవోభవ’, ‘పితృ దేవోభవ’  అన్న తరువాతనే ‘ఆచార్య దేవోభవ’ అన్నది. అయితే ‘మనుస్మృతి’ లో ( 2-205) శ్లోకం ప్రకారం శిష్యుడు తాను గురువు సన్నిధిలో ఉన్నప్పుడు గురువుయొక్క గురువు అక్కడికి వస్తే, ఆయనను తన గురువును గౌరవించిన తీరులోనే గౌరవించి ఆయనకు నమస్కరించాలి.  అదే ప్రదేశానికి తన తల్లిదండ్రులు వస్తే మాత్రం గురువు అనుమతి తీసుకోకుండా వారికి శిష్యుడు నమస్కరించరాదనే నియమం వేద సాహిత్యంలో తల్లిదండ్రులకు ఇవ్వబడిన సమున్నత స్థానానికి తగినట్లుగా మాత్రం లేదు. మరి ఈ నియమం మనువు ఎందుకు రూపొందించినట్లో బోధపడదు.

***సశేషం***

Posted in March 2021, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *