Menu Close
మనిషి-మానవత్వం

మానవతా విలువలను మనసుకు హత్తుకునే విధంగా మలిచిన ఈ కథ నాకు ఒక మిత్రుడు పంపించాడు. ఈ కథ వ్రాసిన రచయిత ఎవరో తెలియదు. కథకు పేరుకూడా లేదు. కానీ అంతర్జాల మాధ్యమంలో ఈ కథకు ఎంతో ప్రాచుర్యం లభించింది. ఎందుకంటే కథకు ఉన్న ఆయువుపట్టు అంత ఘనమైనది. నా ఆలోచనా పరిధిలో నిర్ణయించి ఈ కథకు ఒక పేరును కూడా పెట్టాను. ఆ అజ్ఞాత రచయిత/రచయిత్రి కి మనః పూర్వక కృతజ్ఞతలతో ఈ కథను మన సిరిమల్లెలో మీ కొఱకు ప్రచురిస్తున్నాను. – మధు బుడమగుంట

ఆయన బేలచూపులే నాకు గుర్తుకొస్తున్నాయి.

ఎంతో గొప్ప స్థితిలో ఉన్నాననుకున్న నేను, నాన్న కోరిన ఆఖరి చిన్న కోరికను తీర్చలేకపోవడమా?... బాధగా ఉంది...భయమేస్తోంది... నామీద నాకే జాలి కలుగుతోంది.

అలా ఆలోచిస్తుంటే రామ్మోహన్‌ గుర్తుకొచ్చాడు. తను నాకు క్లాస్‌మేటేగానీ ఎప్పుడూ అంత క్లోజ్‌గా ఉండలేదు. కాకపోతే తను సేవా కార్యక్రమాలలో చురుగ్గా ఉంటాడని తెలుసు.

రామ్మోహన్‌కి ఫోన్‌ చేశాను. ఒక విధంగా అతడిని బ్రతిమలాడుకుంటున్నట్టుగా మాట్లాడాను. ‘‘ఇది నాన్నగారి ఒకే ఒక కోరిక రామ్మోహన్‌! చాలా చిన్న కోరికే అనుకున్నాను. కానీ, అది చాలా పెద్ద కోరిక అనీ, నా శక్తికి మించినదనీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మర్చిపోయిన పుట్టిన వూరి మట్టిలో కలవడం ఎంత కష్టమో అర్థమవుతోంది. ఇందులో నాన్న తప్పేంలేదు. నేనే బలవంతంగా ఆ వూరితో ఆయనకు సంబంధాలు తెంచేశాను. ఇల్లు అమ్మొద్దన్నా, ‘మనం ఆ వూరు వెళ్తామా ఏంటి?’ అంటూ అవసరంలేకున్నా ఇంటిని అమ్మేశాను. కొత్త రిలేషన్స్‌ మధ్య పాత బంధుమిత్రులను పట్టించుకోవటం మానేశాను. ఇప్పుడు ఆ పల్లె జ్ఞాపకాలే తప్ప ఏవిధమైన బంధం లేకపోయింది. చివరికి నాన్నను సంప్రదాయబద్ధంగా సాగనంపడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.’’

నా మాటకు వాడు కదిలిపోయినట్టున్నాడు. ‘‘సరే, ఓ పని చేస్తాను. వూరి ప్రెసిడెంట్‌ని అడిగి కాసేపు శవాన్ని పంచాయితీ ఆఫీసులో ఉంచుదాం. అక్కడినుంచి లాంఛనాలతో... అదే పాడె కట్టి వూరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్దాం.’’

అంతకుమించి మరోమార్గం లేదు. ప్రముఖ నాయకులను పార్టీ కార్యాలయంలో కాసేపు ఉంచినట్టు... అలా ఆయనను సాగనంపాలి.

తను కోరుకున్న చోటుకు చేరబోతున్నానని ఎలా తెలిసిందో... అరగంట తర్వాత డాక్టర్‌ మా దగ్గరకు వచ్చి డెత్‌ కన్‌ఫర్మ్‌ చేశాడు.

* * * * * * * * * * * *

అంబులెన్స్‌ పల్లెను సమీపిస్తోంది.

వెనుకే కారులో నా కుటుంబంతో నేను ఫాలో అవుతున్నాను.

హైదరాబాద్‌లో ఉన్న నా సర్కిల్‌ నుంచి ఫోన్స్‌ వస్తూనే ఉన్నాయి.

‘‘ఇప్పుడే విషయం తెలిసింది... ఎలా జరిగింది? సారీ, అంత దూరం రాలేకపోతున్నాను. ఇక్కడికి రాగానే ఇంటికొచ్చి కలుస్తాను.’’

కమ్యూనికేషన్‌ పెరిగిన ఈ కాలంలో ఈ తరహా ఓదార్పుకు మించి ఎక్కువ ఆశించడం అత్యాశే!

అంబులెన్స్‌ పంచాయితీ ఆఫీసు సమీపించింది. అప్పటికే అక్కడ నేను ఎప్పుడూ పట్టించుకోని బంధుమిత్రులు పదిమంది వరకూ ఉన్నారు.

వాళ్ళలో ఒకరిద్దరు అంబులెన్స్‌ దగ్గరకొచ్చి ఫ్రీజర్‌ని కిందికి దించడానికి ప్రయత్నిస్తున్నారు.

అప్పుడు...అప్పుడు ముందుకొచ్చాడు...రమేష్‌!

‘‘ఆగండి...’’

అందరం అతడికేసి చూశాం.

‘‘మాస్టార్ని ఇక్కడ దించొద్దు.’’

‘‘ఎ... ఎందుకని?’’ నా గొంతు వణికింది.

‘‘ఏ పార్థివ దేహమైనా ఇంటినుంచి లాంఛనాలతో శ్మశానం చేరుకోవాలి. కేవలం అనాధశవాలు మాత్రమే మార్చురీ నుంచో, పంచాయితీ ఆఫీసుల నుంచో శ్మశానానికి చేరుకుంటాయి.’’

నాలో... భయం, బాధ, దుఃఖం, కోపం కలగలిసిన నిస్సహాయత. ‘మా నాన్న దగ్గర చదువుకున్న వీడు... చివరికి ఆయనను అనాధశవంలా కూడా సాగనంపకుండా అడ్డుపడుతున్నాడా?’

నేనేదో అనబోయేంతలో రామ్మోహన్‌ వాడిని అడిగాడు ‘‘అయితే ఇప్పుడేమంటావ్‌?’’

‘‘ఆయన నాకు చదువు చెప్పారు. ‘తల్లీ తండ్రీ గురువూ దైవం’ అన్నారు. తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యత ఉంటుందో, గురువు పట్ల కూడా అంత బాధ్యత చూపించడం ధర్మం. అందుకే ఆయన పార్థివ దేహాన్ని మా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను.’’

అక్కడున్న వాళ్ళందరూ వాడికేసి నమ్మలేనట్టు చూశారు.

నాకు మాత్రం అదో అద్భుతంలాగే అనిపించింది. అంతకుమించి ‘మనిషి మరణించలేదు’ అనుకున్నాను.

ఎందుకంటే, ఏ రక్త సంబంధమూ లేకుండా శవాన్ని తన ఇంటినుంచి సాగనంపే మానవత్వం ఎందరికుంటుంది.

శవం రమేష్‌ ఇంటికి చేరుకుంది.

అప్పటివరకూ పట్టుమని పదిమంది లేరు. కానీ, శవం శ్మశానానికి బయలుదేరగానే వూరు వూరంతా వెనుక నడిచొచ్చింది.

నా స్థితీ, హోదాల కారణంగా వారెవరూ రాలేదు.

అది మా నాన్న చేసుకున్న పుణ్యం!

మనిషి బతికుండగా ఇష్టమైన ప్రదేశాలు చూడాలని యాత్రలు చేస్తాడు. కానీ, మరణం సమీపించాక తనకిష్టమైన చోటే తనువు ఆగిపోవాలని ఆశిస్తాడు. అయితే చాలా కొద్దిమందికే ఆ కోరిక తీరుతుంది, తనకత్యంత ఇష్టమైనచోట శాశ్వత విశ్రాంతి తీసుకునే అవకాశం లభిస్తుంది.

మా నాన్న ఆ విధంగా అదృష్టవంతుడు!

* * * * * * * * * * * *

కర్మకాండలన్నీ పూర్తిచేసుకుని హైదరాబాద్‌ తిరిగొచ్చాం.

ఆ రాత్రి ప్రమద్వర నా భుజంమీద తల వాల్చి, గుండెల మీద చెయ్యేసింది. ఆ చేతి స్పర్శలో మునుపెన్నడూ లేనంత ఆప్యాయత కనిపించింది.

‘‘ఏమండీ...’’

‘‘వూ...’’

‘‘నేను చనిపోతే మీరు నన్ను వదిలి వెళ్ళిపోరుగా! అత్తయ్యగారి పక్కన మామయ్య ఉన్నట్టు మీరూ నా పక్కనే ఉంటారుగా...’’

ఒక సంఘటన ఎందరికో ఉత్తేజాన్నిస్తుంది. ‘నాన్న శవాన్ని అమ్మ దగ్గరకు చేర్చనవసరంలేదన్న’ ఆమె, మరణించాక కూడా నాతో కలసి గడపాలనుకుంటోంది.

నేను తనచుట్టూ చేతులేసి ‘‘అలాగే’’ అన్నాను.

* * * * * * * * * * * *

ఆ రాత్రి నాకో కల వచ్చింది...

అమ్మ నిద్ర లేచింది. పక్కనే పడుకుని ఉన్న నాన్నను నిద్ర లేపుతోంది. ‘‘ఏమండీ... ఏమండీ...’’

నాన్నకు మెలకువ వచ్చింది. ‘‘సారీ జానకీ, శాశ్వత నిద్ర కదా...త్వరగా మెలకువ రాలేదు.’’

‘‘ఫరవాలేదులెండి... ఏదో పక్కనే ఉన్నారు కనుక మిమ్మల్ని పిలవగలిగాను... అదే ఎక్కడో దూరంగా ఉంటే ఏం చేసేదాన్ని. ఏదో మన పుణ్యం కొద్దీ ఇద్దరం ఒక్కచోటే ఉండే అదృష్టం దక్కింది.’’

‘‘మనిద్దరం కలిసే ఇకపై మన పిల్లల్ని దీవించొచ్చు’’ నాన్న ఆనందంగా అన్నాడు.

వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోసాగారు.

నాకు మెలకువ వచ్చింది. మనసంతా ఏదో తెలియని ఆనందం.

అరవై ఏళ్ళు కలసి జీవించి ఆరేళ్ళుగా దూరమైన ఆ తనువులు... ఒకేచోట మట్టిలో కలసిపోవడం... బిడ్డలు తలచుకుంటే సాధ్యమేనేమో!

నాకు జీవితంలో గొప్ప విజయం సాధించిన సంతృప్తి లభించింది.

…. సమాప్తం ....

Posted in May 2018, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *