Menu Close
balyam_main

మన్మథా... నవ మన్మథా...

- డా. రావి రంగారావు

మనవ డింటిలో లేడు

మా దగ్గర గారాబం ఎక్కువని
బందరులో చదువు సరిగా రాదని
పన్నెండేళ్ళు మా దగ్గర పెరిగిన మనవణ్ణి
మా కూతురు, అల్లుడు తీసుకుపోయారు,
విజయవాడలో ఓ కార్పోరేట్ స్కూల్లో చేర్చుకున్నారు,
ఇప్పుడు మా ఇల్లు
గుండె లేని దేహం...

మా కుక్కపిల్ల చిక్కిపోతోంది
మా బుజ్జులు కనిపించటం లేదని...
మా పెరటిలోని మొక్కలు దిగులుపెట్టుకున్నాయి
రోజూ పలకరించే చిన్నారి దేవు డెక్కడని...

మా ఇంట్లోని బొమ్మ లన్నీ
ఓ మూల చచ్చినట్లు పడున్నాయి
ప్రాణాలు పోసే వాడు లేడని...

వాడు ఆడుకొనే సైకిలు
నన్ను వచ్చి గుద్దుకొంటున్నది
ఏడీ నా ఫ్రెండని...
ఎక్కడికి పంపించా వని...

 నా “ఆక్సిజన్ క్లబ్”
ఇప్పుడు కూతు రింట్లో ఉంది-
ఒక్క ఆదివారం వెళ్లివస్తే చాలు
మళ్ళా వారం దాకా బతగ్గలను.

Posted in January 2019, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!