Menu Close

Adarshamoorthulu

ఆంధ్రదేశ చరిత్ర చతురాననులు – మల్లంపల్లి సోమశేఖర శర్మ

మల్లంపల్లి సోమశేఖర శర్మడిగ్రీలు లేనిపాండిత్యంబు వన్నెకు
రాని యీ పాడుకాలాన బుట్టి
నీ చరిత్ర జ్ఞాన నిర్మలాంభ:పూర
మూషర క్షేత్రవర్షోదకమయి
చాడీలకు ముఖప్రశంసల కీర్షకు
స్థానమై నట్టి లోకాన నుండి
నీయచ్ఛతర కమనీయ శీల జ్యోత్స్న
అడవి గాసిన వెన్నెలగుచు చెలగి

ఎదిగే గుణం, ఎదగాల్సిన అవసరం ఏ మొక్కకైనా తప్పనిసరి. అలాగే మానవుడు ఏ పని చేసినా అందులో పరిపూర్ణత్వాన్ని సంతరించుకొంటే, ఆ పని వలన పదిమందికి మంచి జరిగితే, అతని కృషి కలకాలం అందరి హృదయాలలో నిలిచిపోతుంది. అట్టి కార్య సాధకులలో ముఖ్యులు, ఎన్నో చారిత్రాత్మక శిలా శాసనాలను పరిశోధించి శాసన పరిష్కర్తలుగా, భాషాకోవిదులుగా, పాతబడిన సాహిత్య గ్రంధాలను, తెలుగు చరిత్రలోని అద్భుత విషయాలను, వాస్తవాలను సంకలనాలుగా ముద్రించి, మన తెలుగు సాహిత్య చరిత్రకారునిగా పేరొందిన శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు నేటి మన సంచిక ఆదర్శమూర్తి.

శర్మ గారు 1891 డిసెంబర్ 24వ తేదీ, పశ్చిమగోదావరి జిల్లాలోని మినుమించిలిపాడు లో జన్మించారు. తల్లి నాగమ్మ, తండ్రి భద్రయ్య. బాల్యం నుండే శర్మ గారు అభ్యుదయ భావాల ఆలోచలనలతో ఉండేవారు. అందుకే నాటి ప్రముఖ అభ్యదయ వాది శ్రీ చిలకూరు వీరభద్రరావు గారి దృష్టి నాకర్షించారు. శర్మ గారు మదరాసు కన్నెమెరా గ్రంథాలయంలో వ్రాతపతులను కాపీ చేయడానికి మొదటగా నియమితులయ్యారు.

చిలుకూరు వీరభద్రరావు, కాశీనాథుని నాగేశ్వరరావు, కట్టమంచి రామలింగారెడ్డి వంటి మహానుభావుల సహాయసహకారాలతో మన శర్మ గారు ఒక గొప్ప పండితునిగా, చరిత్ర పరిశోధకునిగా, శాసన పరిష్కర్తలుగా, అధ్యాపకునిగా వివిధ రంగాలలో లబ్ధప్రతిష్ఠులయ్యారు.

స్వాతంత్ర్యానంతరం ఆ నాటి ఆంధ్రరాష్ట ప్రభుత్వం వారు ‘తెలుగు భాషా సమితి’ ని స్థాపించి మూడు సంపుటాలుగా ఆంద్ర విజ్ఞాన సర్వస్వము సంకలనాన్ని ప్రచురించగా, మూడవ సంపుటమైన తెలుగు సంస్కృతి కి మన శర్మ గారే ప్రధాన సంపాదకులుగా, సంగ్రాహకులుగా వ్యవహరించారు. 1940 నుండి 1946 వరకు, ఆంద్ర విశ్వవిద్యాలయంలో చరిత్ర పరిశోధకులుగా మరియు 1957 నుండి 1963 వరకు, ప్రాచీన శాసనాధ్యాపకులుగా పనిచేశారు.

మల్లంపల్లి సోమశేఖర శర్మశర్మగారి దొక విలక్షణమైన వ్యక్తిత్వం. తన చారిత్రిక రచనలన్నింటిలోనూ సాహిత్య గ్రంథ రచనా పద్ధతులను జోడించి పాఠకునికి చరిత్ర అధ్యయనం చెయ్యడానికి జిజ్ఞాసను కలిగించేవారు. శర్మ గారి రచనలలో ఇట్టివి “ఆంధ్రవీరులు” “రోహిణీ చంద్రగుప్తము” “ప్రాచీన విద్యాపీఠము” “అమరావతి స్తూపము” మొదలైనవి.

శాసన పరిశోధనలో శర్మ గారి కృషి అనన్య సామాన్యము. అందుకే ఆయనను అందరూ ‘శాసనాల శర్మ గారు’ అని పిలిచేవారు. బహుభాషాకోవిదుడైనందున, ఆశోకుని శాసనాల మొదలు విజయనగర శాసనాల వఱకు ఎన్నో శాసనాలను ఆయన పరిష్కరించి ఆ సమాచారాన్నంత ప్రచురణ రూపంలోకి తీసుకొనివచ్చారు.
శర్మ గారు సాహితీ వేత్తగా, చరిత్రకారునిగా మాత్రమే కాక మంచి నాటక కర్త కూడా. ఆయన రచించిన నాగశిల్పి, తెలంగాణము వంటి ఎన్నో ప్రఖ్యాత నాటకాలు ఆకాశవాణిలో ప్రసారితమైనాయి.

సోమశేఖర శర్మ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ప్రజ్ఞను గౌరవించి కళాప్రపూర్ణ డా|| విశ్వనాథ సత్యనారాయణ గారు తన ‘ఆంధ్రప్రశస్తి’ ని శర్మ గారికి అంకితం చేశారు. మరొక మహోన్నత వ్యక్తి కళాప్రపూర్ణ డా. సి నారాయణ రెడ్డి “రాగిరేకులలో, రాతి ఫలకాలలో కనుమూసిన తెలుగు చరిత్రకు ప్రాణం పోసిన మహా మనిషి” అని శర్మ గారిని స్తుతిస్తూ తన కర్పూర వసంతరాయలు కృతిని శర్మ గారికి అంకితమిచ్చారు. ఇలా ఎంతో మంది ప్రఖ్యాత ఆంధ్రకవులు తమ రచనలను ఆయనకు అంకితం చేశారు. శర్మ గారి ప్రజ్ఞాపాటవాలకు ఇంతకన్నా గుర్తింపు ఏమి కావాలి?

ప్రాచీన భారత దేశ చరిత్రకు భండార్కర్ లాగా, మహారాష్ట్ర చరిత్రకు నర్దేశాయ్ లాగా, దక్షిణ భారతదేశ చరిత్రకు నీలకంఠ శాస్త్రి వలె మన ఆంధ్రదేశ చరిత్రకు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు ప్రాతఃస్మరణీయులు.

శర్మ గారు శాంత స్వభావులు, గంభీరమూర్తి. అందుకే విశ్వనాథ వారు,

“కొదమ తుమ్మెద రెక్కల గుస్తరించు
మీసముల నీ ప్రసన్న గంభీర ముఖము
కన్నులంటగ గట్టినట్లున్న నిన్ను
మఱచిపోలేను జన్మ జన్మములకైనా”

అని తన పద్యపారిజాతాలతో శర్మ గారిని ప్రస్తుతించారు.

‘మేము శిలలమైనా మాకూ మనసులున్నాయి’ అంటూ శిలా శాసనాలు మూగగా రోదించిన రోజు -1963 జనవరి 7వ తేది, మన మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు స్వర్గస్థులైన రోజు. వారు భౌతికంగా లేకున్ననూ, వారు అందించిన ప్రాచీన సాహితీ సంపదలో వారు మనకు సదా కనిపిస్తూనే ఉంటారు.

మల్లంపల్లి సోమశేఖర శర్మ ను గూర్చిన వ్యాస మూలమైన వివరణ:

పూజ్యులు, సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు, డా. రాపాక ఏకాంబరాచార్యులుగారు రచించిన "ప్రసంగ తరంగిణి" గ్రంథ సౌజన్యంతో ఈ వ్యాసం రచించడమైనది వారికి మా మనఃపూర్వక కృతజ్ఞతలు.

Posted in September 2018, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *