Menu Close
Adarshamoorthulu
-- డా. మధు బుడమగుంట
‘మహానటి’ శ్రీమతి సావిత్రి
Mahanati Savithri

మనుషులు నిజజీవితంలో ఏర్పడిన ఒడిదుడుకులు, సంతోష సమయాలు, ఉద్వేగాలు ఇలా అన్ని రసాలను కలిపి జీవిత సారాన్ని అనుభవిస్తున్నారు. నిజజీవితంలో జరిగిన కొన్ని అంశాలను ఆధారంగా తీసుకొని మొదట్లో నాటకాలను ప్రదర్శించేవారు. కాలక్రమేణా చలనచిత్ర రంగం ఏర్పడి తద్వారా చిత్రాలను నిర్మించి మనిషి జీవితంలోని భాగాలను మరింత కళ్ళకు కట్టినట్లు చూపించడం జరుగుతున్నది. అయితే సినిమా అనేది కేవలం నటన, కృత్రిమము అని మనకు తెలుసు. కానీ కొంతమంది నటీనటుల నటనా చాతుర్యం ఎంతో సహజసిద్ధమై ఆ చిత్రాన్ని వీక్షిస్తున్నంత సేపు మనం కూడా ఆ అనుభూతులకు లోనౌతూ అందులో మునిగిపోతాము. అటువంటి వారిని తలచుకోగానే మనకు వెంటనే స్ఫురించేది, మన తెలుగింటి ఆడపడుచు, తన అసమాన నటనతో ఎంతో మంది చలనచిత్ర నటీ నటులకు స్పూర్తినందించిన ‘అన్ని తరాల’ అభిమాన తార, వెండితెరపై తన ముద్రను స్థిరంగా వేసుకున్న సామ్రాజ్ఞి,  దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రకాశించిన ధృవతార, కేవలం అందం, అభినయంతో నటనకే భాష్యం చెప్పిన, మహానటి ‘శ్రీమతి నిశ్శంకర సావిత్రి’ నేటి మన ఆదర్శమూర్తి.

Mahanati Savithriకేవలం తన ముఖకవళికలతో నవరసాలను అవలీలగా పలికిస్తూ తన హావభావ విన్యాసాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి కోట్లమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న సహజనటి మన సావిత్రి గారు. నాడు, నేడు, ఏనాడైనా ఆవిడకు ఆవిడే పోటీ కానీ వేరెవ్వరూ ఆవిడ నటనకు సరితూగే పోటీ ఇవ్వలేరు. అందుకే ఆవిడ మహానటి అయ్యారు. నేటికీ ఆమె నటనను ఒక గ్రంధాలయం గా ఊహించుకొని అందులోని మెళుకువలను చదివి, గ్రహించి, నేర్చుకుని తమ నటనా కౌశలాన్ని ఇనుమడింప జేసుకొని మంచి నటులుగా నటీమణులుగా వెలుగొందుతున్న ఎంతోమందికి ఆవిడే అభిమాన నాయకి. ఆవిడ కారణ జన్మురాలు. దక్షిణ భారత సినీ కళామతల్లికి లభించిన ఒక జాతి రత్నం.

గుంటూరు జిల్లాలోని చిర్రావూరు లో 1936, జనవరి 4న, ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో సావిత్రి గారు జన్మించారు. పిమ్మట విజయవాడ లోని వారి పెదనాన్న గారి ఇంట పెరిగారు. ప్రాధమిక విద్యను అభ్యసించే సమయంలోనే నటన మీది ఆసక్తితో సంగీతం, నాట్యం తదితర కళలలో శిక్షణ పొందారు. తన 13 ఏట ఆంధ్రనాటక పరిషత్, కాకినాడ వారు నిర్వహించిన నృత్యనాటక పోటీలలో గెలిచి నాటి ప్రముఖ హిందీ నటుడు పృధ్వీరాజకపూర్ గారి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నది. ఆ పిమ్మట ఆమెకు కళలపట్ల మరింత ఆసక్తి ఏర్పడి అదే ఆరాధనగా మారి, నటనే తన జీవితం అని నిర్ణయించుకొని చలనచిత్ర రంగంలో ప్రవేశించాలనే కోరికను పెంచింది.

సావిత్రి గారు సినీ ప్రపంచంలోకి పిన్న వయస్సులోనే వచ్చి తన ప్రతిభను నిరూపించుకోవాలని ఆశ పడ్డారు. కానీ వయసులో చిన్నదైనందున ప్రధానమైన పాత్రలను ఇవ్వడానికి దర్శక నిర్మాతలు నిరాకరించారు. అలా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఓపికతో తనకు రాబోయే మంచి పాత్రకోసం వేచిచూశారు. ఆ అదృష్టం ఆమెను దేవదాసు చిత్రం రూపంలో వరించింది. 1953 విడుదల అయిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ముఖ్యంగా సావిత్రి నటనకు గుర్తింపు లభించి తద్వారా ఆమెకు ఎంతో పేరు ప్రఖ్యాతులు లభించాయి. నవరసాలను అలవోకగా పండించడంలో సావిత్రి గారు ఎంతో నేర్పును సాధించారు. ఏపాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేయడం ఆమెకు దేవుడిచ్చిన వరం. కనుకనే అనతికాలంలోనే NTR, ANR వంటి నాటి ప్రముఖ నటులకు సరిసమానంగా పారితోషికం తీసుకొంటూ వారికి దీటుగా తనకంటూ ఒక స్థానాన్ని అటు తెలుగు, ఇటు తమిళ చలన చిత్ర రంగంలో సంపాదించారు. ఆవిడ నటించిన సినిమాలు చరిత్రలో ఘన చిత్రాలుగా నిలిచిపోయాయి. దాదాపు 90 చిత్రాలలో నటించిన ఈ మహా నటి దాదాపు రెండు దశాబ్దాలు దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రకాశించి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. సహజనటిగా పేరు గడించి ఎంతోమందికి మార్గదర్శిని అయిన సావిత్రి గారు ఆ తరువాత తనకు పరిచయం మరియు అనుభవం లేని దర్శక నిర్మాణ రంగంలోకి అడుగిడి ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొనడం జరిగింది. అదే ఆవిడ జీవితంలో పెద్ద అఖాతమై ఆవిడ మానసిక స్థితిని పూర్తిగా మార్చివేసింది. అతి చిన్నవయసులోనే కష్టాల కడలిలో కడతేరే మార్గం కనుమరుగైపోయింది. పర్యవసానం విదిలిఖితమై పోయింది.

Mahanati Savithriరాచరికపు వ్యవస్థ వున్న రాజ్యాలలో ఎవరైనా నిండు సభలో రాజును గాని, రాణిని గాని తమ పాండిత్య పటిమతో మెప్పిస్తే, లేక ఏదైనా మంచి కార్యాన్ని నిర్వహిస్తే, వారు ఆ పండితుణ్ణి తమ మెడలోని హారంతో గాని, చేతికున్న అంగుళీయకమును ఇచ్చి గాని వారిని అభినందించడం జరుగుతుంది. కానీ, నిజమైన దేశభక్తిని కలిగి తన ఒంటిమీద ఉన్న ఆభరణాలు అన్నింటినీ ఒలిచి  (తాళిబొట్టు తప్ప) దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సైనికుల కోసం, నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి సమక్షంలో నిస్సంకోచంగా ఇచ్చేసిన మహాసాధ్వి మన సావిత్రి గారు. ఇది ఆవిడ చేసిన దానాలలో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అన్న ఆత్మపరిజ్ఞానం ఆవిడకు అంత చిన్న వయసులోనే కలిగింది. కనుకనే తన వద్దకు వచ్చి చేయి చాచిన ఏ వ్యక్తిని కూడా నిరాదరణకు గురి చేయలేదు.

Mahanati Savithri‘మహానటి సావిత్రి-వెండితెర సామ్రాజ్ఞి’ అనే పేరుతో పల్లవి గారు సావిత్రి గారి జీవిత చరిత్రను వ్రాసి 2007 సంవత్సరంలో ప్రచురించారు. లక్షల సంఖ్యలో అమ్ముడుపోయిన ఆ ప్రతులు, తెలుగు ప్రజలకు సావిత్రి గారి మీద ఉన్న అభిమానాన్ని తెలియజేస్తున్నాయి. అందులో సావిత్రి గారి నిజజీవిత ఘట్టాలను రచయిత్రి గారు చాలా చక్కగా ఆవిష్కరించారు. ఆ తరువాత 2018 లో శ్రీ నాగ్ అశ్విన్ గారు సావిత్రి గారి జీవిత చరిత్రను ‘మహానటి’ పేరుతో తెలుగు తమిళ భాషలలో చిత్రాన్ని నిర్మించారు. సావిత్రి గారి వాస్తవ జీవితాన్ని కనులకు కట్టినట్లు చక్కగా చూపించి, ఆ మహా సాధ్వి జీవితంలోని చీకటి వెలుగులు రెండింటినీ ఆవిడ అభిమానులకు, అశేష తెలుగు మరియు తమిళ ప్రజలకు పూర్తిగా అవగతమయ్యేటట్లు మహానటి చిత్రాన్ని ఎంతో కృషితో, నిబద్ధతతో నిర్మించారు. అందుకు ఆయన కృషిని మనందరం తప్పక అభినందించాలి. ఆ చిత్రంలో సావిత్రి పాత్రలో  నటించిన కీర్తీ సురేష్ నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారం లభించింది. సావిత్రి గారి జీవితం గురించి వాస్తవం తెలియని ప్రజల సందేహాలు, అపోహలు ఈ పుస్తకం మరియు చిత్రం ద్వారా తొలగిపోయి ఆవిడ మీద మరింత అభిమానం, గౌరవం పెరిగాయి.

Mahanati Savithriనటనే జీవితంగా బతికి ఎంతోమంది చలనచిత్ర నటులకు, నటీమణులకు మార్గదర్శిని గా నిలిచిన ఈ విదుషీమణి నిజజీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపిన ఈ మహాసాధ్వి తన జీవితంలో మరో చీకటికోణాన్ని అనుభవిస్తూ డిసెంబర్ 26, 1981 సంవత్సరంలో తనువు చాలించారు. కారణం విధిలిఖితం. సరైన దిశానిర్దేశం చేసే ఆప్తమిత్రులు, గురువుల సాంగత్యం లోపించడం... నిజజీవితం మీద సరైన అవగాహన లోపించడం.. అంతా తెలుసుననే అనుభవశూన్య అజ్ఞానం... అందరు నా శ్రేయోభిలాషులే అనే కించిత్ అమాయకత్వం...ఇలా ఎన్నో కారణాలు. ఆవిడ ఈ భువిని వదిలి దివికేగిననూ ఆవిడ ప్రతిష్టించిన నటనాకౌశల మైలురాళ్ళు మన చలనచిత్ర రంగం ఉన్నన్నాళ్ళు నిత్య నూతనమై విరాజిల్లుతూ ఎంతో మంది భావి నటీనటులకు ఒక  ప్రశస్త ప్రమాణాలుగా ఉండిపోతాయి.

Posted in October 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!