Menu Close

singanamathyudu page title

ముందు భాగములు »

 
ఈ విధంగా శ్రీకైవల్యపదప్రాప్తికై బమ్మెర పోతన గారు మొదలుపెట్టిన భాగవత స్వర్ణమందిరపు దివ్యదీధితులు తెలుగు సాహిత్య క్షితిజరేఖల ఆవలి అంచుల దాకా వ్యాపించి మిరుమిట్లు గొలుపుతున్నా, అందులో ఆరవ స్కంధం ఒక్కటీ లేకపోవటం వల్ల ఆ మహానిర్మాణం బంగారు పూత లేని గోపురశిఖరం వలె వెలవెలపోతుందని శంకించి, క్రీస్తుశకం పధ్నాలుగవ శతాబ్ది – పదిహేనవ శతాబ్దుల సంధియుగంలో పెక్కుమంది మహాకవులు ఆ లుప్తశేషపూరణ మహోద్యమానికి ఉపక్రమించినట్లు కనబడుతుంది. వీరందరూ ఒక ప్రాంతానికి కాని, ఒకే కాలానికి కాని చెందినవారు కాకపోవడం వల్ల – వెలిగందల నారాయణామాత్యునిచే ద్వితీయ స్కంధంలోని పరిశిష్టపూరణమూ, దశమ స్కంధం ఉత్తర భాగంలోని పరిశిష్టపూరణమూ, ఏకాదశ ద్వాదశ స్కంధాల స్వతంత్ర రచనమూ పూర్తయి; బొప్పన గంగనామాత్యునిచే పంచమ స్కంధ రచనమూ జరిగి మొత్తంమీద షష్ఠ స్కంధం ఒక్కటే లేదన్న విషయం అప్పటికి లోకవ్యాప్తమైనదని ఊహింపవచ్చును. దానిని పరిపూర్ణించడం తమకు ఇహపరతారకమని వీరందరూ భావించి ఉంటారు. ఆ కవిపారంపరిలో పంక్తిపావనుడైన మహాభాగ్యశాలి మహాకవి ఏర్చూరి సింగనామాత్యుడు.

భాగవతాన్ని అనువదింపబూనినప్పుడు సింగనామాత్యునికి ఆ మహాగ్రంథం భక్తకోటి హృదయాలలో నెలకొన్న దివ్యమంత్రమన్న పూర్ణాభిజ్ఞానం ఉన్నది. సర్వమంత్రాలకు భాగవత మంత్రమొక్కటే ఏలిక అని గ్రహించాడు. ఈ జన్మలో గాని, పూర్వజన్మలో గాని స్వార్థనిర్ముక్తుడై లోకక్షేమార్థమై యజ్ఞాదిసత్కర్మలను ఆచరించినవాడు, పాపరహితుడు, ఇంద్రియనిగ్రహంతో మనస్సును విషయలోలుపత్వం నుంచి ఉపశమింపజేసిన శాంతస్వభావుడు, పుత్త్రైషణ విత్తైషణ లోకైషణ రూపమైన మోహాన్ని జయించిన వైరాగ్యసంపన్నుడు, ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక తాపత్రయ ఫలమైన దుఃఖమునందు సహనశీలుడు, ఆస్తిక్యబుద్ధిని కలిగి తత్తత్కాలోచిత నిత్య నైమిత్తిక ధర్మకార్యాలను నిర్వర్తించటంలో శ్రద్ధ వహించినవాడు, నిత్యానిత్యవస్తువివేకాది సాధన చతుష్టయ సంపత్తిని సాధించినవాడు, గురూపదేశ శాస్త్రోపదేశాదులను పొందినవాడు అయిన ముముక్షువుకు మాత్రమే మోక్ష్మలక్ష్మి భాగవతరూపంలో సాక్షాత్కరిస్తుందని తన మనసారా నమ్మాడు. ఆ భాగవతం వాఙ్మయరూపంలో బ్రహ్మాత్మైక్యజ్ఞానాన్ని సిద్ధింపజేసే పరమాశ్రయమని స్వానుభవంలో తెలుసుకొన్నాడు. ఆ వాఙ్మయోపహితమైన బ్రహ్మము తానే అన్న అపరోక్షజ్ఞానం సిద్ధించిన ధన్యధన్యుడయ్యాడు. అటువంటి అపరోక్షానుభూతి కలిగి స్వస్థావస్థలో ఉన్నప్పుడు జీవికి కావింపవలసిన కర్తవ్యమేమీ ఉండదు. కర్తవ్యం లేకపోయినా కర్మఫలభోగపర్యంతం నిత్యనైమిత్తికాదికర్మలను నిర్వహింపక తప్పదు. ఆత్మసాక్షాత్కారాన్ని పొంది జీవన్ముక్తుడైనప్పటికీ ప్రారబ్ధానుసారం దేహం పతనమయ్యేవరకు కర్మలన్నవి తప్పనిసరి అవుతాయి. అయితే, ఆ కర్మలు బంధగతుని బంధించినట్లు బంధనిర్ముక్తుడైన జ్ఞానిని బంధింపలేవు. విజ్ఞానావేశముక్తసంగుడైనవానికి జ్ఞానాగ్ని మూలాన కర్మగతబంధకత్వం దగ్ధమైపోతుంది. బంధనాశం తర్వాత లోకానుగ్రహార్థం మాత్రమే కర్మలను కావిస్తాడు. ఆ దృష్టితోనే తాను భాగవత రచనకు ఉపక్రమిస్తున్నానని తన షష్ఠ స్కంధం (6-14) అవతారికా పద్యంలో సప్రశ్రయంగా పేర్కొన్నాడు.

ఎ య్యది కర్మబంధముల నెల్ల హ
రించు; విభూతి కారణం
బె య్యది; సన్మునీంద్రులకు
నెల్లఁ గవిత్వసమాశ్రయంబు ము
న్నె య్యది; సర్వమంత్రముల
నేలిన దె య్యది; మోక్ష్మలక్ష్మి రూ
పె య్యది – దానిఁ బల్కెద సు
హృద్యము, భాగవతాఖ్యమంత్రమున్.

అని వెల్లడించాడు. పరిశుద్ధ జ్ఞానస్వరూపులైన మహనీయుల కవిత్వానికి భాగవత మంత్రమే సమాశ్రయణీయమని నమ్మినవాడు ఆ మాటనటం సహజమే కదా!

అయితే, శ్రీమహాభాగవతాన్ని అనువదించాలనే మహాసంకల్పం తనకు ఆకస్మికంగా కలిగినది కాదని, చిన్నవయసులోనే, “విద్యాభ్యాసంబునం దగిలి, కొండుక”గా ఉన్న కాలంలోనే ఉదయించినదని కూడా సింగన షష్ఠ స్కంధం అవతారిక (6-15) లో చెప్పాడు. “కొండుక” అంటే, ఆ శబ్దానికి గల వ్యావహారిక నైఘంటుకార్థాన్ని బట్టి మరీ బాల్యవయోఽవస్థలో ఉన్నవాడని గాక – ఆ చెప్పిన సందర్భాన్ని బట్టి – ఆయనప్పటికి విద్యావంతుడై యుక్తవయస్సులో ఉన్నాడని, మరీ యుక్తాయుక్తవివేకం లేనంతటి పసివాడు కాడని ఊహించాలి. ఆ వృత్తాంతాన్ని నెమరువేసుకొన్ననాటికి నలభైఅయిదు, యాభైయేళ్ళవాడని అనుకొంటే, పాతిక ముప్ఫైయేళ్ళ మునుపటి కథను, “నా చిన్నప్పుడొకరోజున ఇట్లా జరిగింది” అని చెప్పాడన్నమాట. ఆ మాటకు అర్థమేమిటంటే – ఆయనకు ఎవరు చెప్పారో ఏమో గాని, పోతన గారు శ్రీమహాభాగవతం అనువాదయజ్ఞాన్ని ప్రారంభించారని క్రీస్తు శకం 1475-1480 (±) దరిదాపులలో ఎప్పుడో విన్నాడన్నమాట. అప్పటికి ఇరవై, ఇరవైఅయిదేళ్ళవాడని అనుకొంటే – భాగవత షష్ఠ స్కంధ రచన కొంచెం ఇంచుమించుగా క్రీస్తు శకం 1495-1505 నాటిదవుతుంది.

సింగన “నా చిన్నప్పుడొకరోజున ఇట్లా జరిగింది” అని చెప్పినదంతా ఒకానొక విచిత్రమైన స్వప్నవృత్తాంతం. ఆ స్వప్నక్రమపరిగతిసంవిధానం ఇది:

ఆయన ఒకనాటి పగటి వేళ – ఏదో పర్వదినాన కాబోలు – నూతన వస్త్రాలను ధరించి, హిమాంబు సుగంధ చందనానులేపనాలంకృతుడై అలసట పూని మృదుశయ్యమీద మేనువాల్చి భద్రనిద్రాముద్రితుడై ఉన్నప్పుడు ఆయనకు ఒక వింతకల వచ్చింది. ఆ కలలో జగన్మాత సరస్వతీ దేవి సాక్షాత్కరించింది. “నా చాటున … చాటుకార పద సాధుకవిత్వము” చెప్పుము!” అని ఆదేశించింది.

చాటుకారులు అంటే మనస్సులకు హత్తుకొనిపోయే శబ్దసంఘటనతో చెవికింపుగా ప్రసంగించేవారు, రచించేవారు, గానం చేసేవారు అని అర్థం. చాటువు అంటే ఏమిటి? మనఃప్రీతికరమైన పలుకు. “ప్రార్థనా చాటుకారః” అని మేఘదూతం (శ్లో.32) లో కాళిదాసు. “అద్భుతావహమైన చాటుకార పదసందర్భముతో చేతోహరంగా కవిత్వం చెప్పు” అని ఆ తల్లి దీవించింది. ఆ చాటుకారత్వం ఆమె ఆశ్రయసిద్ధి వల్ల ఫలదాయకం కాగలుగుతుంది. “నా చాటున” అంటే, “ఇకపై నేను ముందుండి, నిన్ను కవిత్వమార్గంలో నడిపిస్తాను” – అని అభయం ఇచ్చిందన్నమాట.

అప్పుడొక చిత్రం జరిగింది. చాటుకార పద సాధుకవిత్వ రచన చేయమని ఆదేశిస్తూ సరస్వతీ దేవి తనను దయార్ద్రదృష్టితో చూచినప్పటి ఆ చూపు రూపుగొని ఆయన మనస్సులో నిలిచిపోయింది. ఎన్ని జన్మలుగానో చేసికొన్న తపస్సు ఆ క్షణంలో ఫలసిద్ధిని చెందిన దివ్యానుభూతిని పొందాడు. జగన్మాతృకృపావలోకనం వల్ల సుశ్లోకుణ్ణి అయ్యానని భావించాడు.

“సుశ్లోకుడు” అంటే – మంచి శ్లోకములు చెప్పగలవాడు, నలుగురిచే శ్లోకింపబడినవాడు అని రెండర్థాలు. ఆ సుశ్లోకత్వానికి తగినట్లు ఆయన అప్పటికే ఏమేమి రచనలను చేశాడో మనకిప్పుడు తెలియదు. భారతీమాతృసందర్శనం సిద్ధించినప్పుడు ఎన్నాళ్ళుగానో తన మనస్సులో నిండి నిబిరీసమై ఉన్న కోరికను ఆ తల్లికి నివేదించుకోవాలనే సంకల్పం ఉదయించింది కాబోలు. వెంటనే సద్యఃస్ఫురణతో ఒక శ్లోకాన్ని ఆమెకు వినిపించాడు.

ఏను ఒక శ్లోకంబును ఆ క్షణంబ నొడివితి; అది యెట్టి దనిన” (6-19)

అంటూ – ఆమె దివ్యసన్నిధిలో అప్పుడు నివేదించిన ఆ శ్లోకాన్ని మనకోసం అవతారికలో పొందుపరిచాడు:

హంసాయ సత్త్వనిలయాయ సదాశ్రయాయ
నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ
సత్సంగ్రహాయ సగుణాయ నిరీశ్వరాయ
సంపూర్ణపుణ్యపతయే హరయే నమస్తే.

అని. సంక్షేపతః సింగన చెప్పిన ఆ శ్లోకభావం ఇది.

హంసాయ = నిర్గుణము, నిరుపాధికము అయిన బ్రహ్మమే స్వరూపముగా గల పరమాత్మకు; సత్త్వనిలయాయ = సత్త్వగుణమునకు ఆశ్రయుడైన పరమేశ్వరునికి (లేదా) త్రికాలములచే బాధింపబడని సత్యమునకు విషయభూతుడైన జ్ఞానస్వరూపునకు; సదాశ్రయాయ = విష్ణుప్రీతికరములైన కర్మలను ఆచరించు సజ్జనులకు ఆశ్రయణీయుడైన (శరణాగతి వేడదగిన) మహనీయునకు; నారాయణాయ = సకలతత్త్వములకు తానే ఆధారమై, విశిష్ట జ్ఞానరూపుడైన శ్రీమన్నారాయణునకు; నిఖిలాయ = సర్వాత్మకుడైన పరమపురుషునకు;నిరాశ్రయాయ = అవిద్య వలన కలుగు దేహాభిమానము పొడచూపని నిరుపాధికునకు; సత్సంగ్రహాయ = సత్పురుషుల అంతఃకరణపరిశుద్ధిచే గ్రహింపదగినవానికి; సగుణాయ = గుణముల యందు ప్రవేశించినప్పుడు తనయొక్క మాయయే తనకు ఉపాధిగా కలిగిన జగదంతర్యామికి; నిరీశ్వరాయ = తనకంటె మాయోపహితమైన చైతన్యము వేరొకటి లేనివానికి; సంపూర్ణ పుణ్యపతయే = శుభకర్మము లన్నింటికి అధిష్ఠాన దైవతమైన సత్ప్రభువునకు; హరయే = తనయందు స్వస్వరూపానుసంధానము చేసిన భక్తులయొక్క మనోవ్యథను హరించువానికి; తే = నీకు; నమః = నమస్కారము – అని.

ఈ శ్లోకాన్ని జగన్మాతకు వినిపించిన వెంటనే ఆమె ఈ శ్లోకాన్ని ‘అంగీకరించిన’దట. “ఈ శ్లోకం బ ద్దేవి యంగీకరించె” అని (6-21) లో ఆ సంగతిని చెప్పాడు.

ఆ విధంగా జగన్మాత అంగీకారాన్ని పొందిన తర్వాత ఆయనకు మెళకువ వచ్చింది. స్వప్నవృత్తాన్ని నెమరువేసుకొన్నప్పుడు పట్టలేనంత ఆనందం కలిగింది. ఆ రోజు మొదలుకొని ఆయనకు సరస్వతి అనుగ్రహం కలిసివచ్చింది. తత్ఫలంగా చంద్రోదయం కాగానే లోకమంతటా పండువెన్నెల విరిసినట్లు శ్రీమన్నారాయణాంకితమైన కవిత్వము యొక్క తత్త్వజ్ఞానం గోచరం అయింది. ఆ తర్వాత కొంతకాలానికి సిద్ధసాధనుడై గోపికావల్లభుని మనస్సులో నిలుపుకొని శ్రీమహాభాగవత కావ్యరచనకు ఉపక్రమించాడట.

ఇంతవరకు సింగన ఎంతో ప్రకాశ్యార్థప్రకాశకంగా చెప్పిన ఈ వృత్తాంతాన్ని ఆంధ్ర భాగవత వ్యాఖ్యాతలు గాని, అర్థ-తాత్పర్యకర్తలు గాని, సాహిత్య విమర్శకులు గాని ఏమంత శ్రద్ధగా చూచినట్లు కనబడదు.

స్వప్నంలో సాక్షాత్కరించిన సరస్వతీ దేవి ఆయనను “నా చాటునఁ జాటుకార పద సాధుకవిత్వము చెప్పుము” అని ఆదేశించింది. ఆయన కృతజ్ఞుడై, ఆ సరస్వతీ దేవిని ఉద్దేశించి తత్ప్రార్థనారూపమైన ఒక సన్నుతిని గాక – శ్రీమన్నారాయణస్తోత్రరూపమైన ఒకానొక శ్లోకాన్ని సద్యఃస్ఫురణతో ఆశురీతిని “ఆ క్షణంబ” వినిపించటంలో ఔచిత్యం ఏమున్నది? కవిత్వరచనలో నిమగ్నుడై సంస్కృతాంధ్రాలను స్వాయత్తీకరించికొన్న ఒకానొక యువకవికి ఆపాటి ఒక శ్లోకాన్ని వినిపించేందుకు “ఆ క్షణంబ” అంతటి సద్యఃస్ఫురణ ఎందుకు ఆవశ్యకమైంది?

ఇంతకీ శ్లోకాన్ని వినిపించాడే కాని, ఆ తల్లిని ఈయన ఏమని అడిగినట్లు?

ఏమీ అడగనే లేదు కదా – ఆ అడగని కోరికకు ఆమె ఏమని అంగీకరించినట్లు?

ఏమీ అడగకుండానే, తను చెప్పిన శ్లోకానికి ఆమె అంగీకరించినదని “ఈ శ్లోకం బ ద్దేవి యంగీకరించె” అని ఆయనకు అంతటి సంతోషం ఎందుకు కలిగింది?

– అన్న దృగ్విషయాన్ని విమర్శకులు ఆలోచించినట్లు లేదు.

అసలు సంగతి ఇది:

కలలోనే అయినా, సింగనకు బుద్ధి పాదరసంలా ప్రకాశించినదన్నమాట. తన కన్నుల యెదుట కానవచ్చిన తల్లికి సంస్కృత భాగవతం షష్ఠ స్కంధంలో నుంచి తాను ఆ శుభదినాన నెమరువేసుకొంటుండిన శ్లోకమే కాబోలు, తత్కాలోచితమైన స్ఫురణతో (“ఆ క్షణంబ”) వినిపించాడన్నమాట.

సింగన వినిపించిన ఆ శ్లోకం శ్రీధరస్వామి వారు రచించిన అద్వైతపరకమైన భావార్థబోధినీ వ్యాఖ్యతోడి భాగవతం ప్రతి (6-వ స్కంధం: 9-వ అధ్యాయం: 45-వ శ్లోకం) లో –

హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ
సత్సంగ్రహాయ భవపాన్థనిజాశ్రమా
ప్తా వన్తే పరీష్టగతయే హరయే నమస్తే

అన్న పాఠంతో నిరూఢమై ఉన్నది. ఈ శ్లోకమే, శ్రీ గంగాసహాయ ప్రణీతమైన అన్వితార్థప్రకాశికా వ్యాఖ్య (6-9-45) లో “హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ, కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ, సత్సంగ్రహాయ భవపాన్థనిజాశ్రమా, ప్తా వన్తే పరీష్టగతయే హరయే నమస్తే” అన్న ఇదే పాఠంతోనూ, “హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ, కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ, సత్సంగ్రహాయ భవపాన్థనిజాశ్రమా, ప్తా వన్తే పరీష్టగతయే హరయే తే నమః” అని యత్కర్తృకమో తెలియరాని కృష్ణప్రియా వ్యాఖ్య (6-9-45) లోనూ, “హంసాయ సత్త్వనిలయాయ సదాశ్రయాయ, నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ, సత్సంగ్రహాయ సగుణాయ నిరీశ్వరాయ, సంపూర్ణపుణ్యపతయే హరయే నమస్తే” అని శ్రీ జీవగోస్వామి కృతమైన క్రమసందర్భ వ్యాఖ్య (6-9-45) లోనూ, “హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ, కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ, సత్సంగ్రహాయ భవపాన్థనిజాశ్రయాయ, నిరుపక్రమో హరి ర్నిత్య మప్రయత్నో హ్యుపక్రమేత్” అని శ్రీ ఆయీ నరహర్యాచార్యుల వారి ద్వైతపరకమైన దీపికా వ్యాఖ్య (6-9-35) లోనూ, “హంసాయ దభ్రనిలయాయ నిరీక్షకాయ, కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ, సత్సంగ్రహాయ భవపాన్థనిజాశ్రయాయ శశ్వ, ద్వరిష్ఠగతయే హరయే నమస్తే” అని శ్రీ విజయధర్మ తీర్థుల వారి పదరత్నావళీ వ్యాఖ్య (6-9-45) లోనూ, “హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ, కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ, సత్సంగ్రహాయ భవపాన్థనిజాశ్రయాయ శశ్వ, ద్వరిష్ఠగతయే హరయే నమస్తే” అని శ్రీ ఛలారీ నారాయణాచార్య విరచితమైన ప్రబోధినీ వ్యాఖ్య (6-9-35) లోనూ, “హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ, కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ, సత్సంగ్రహాయ భవపాన్థనిజాశ్రమా, ప్తా వన్తే పరీష్టగతయే హరయే నమస్తే” అని శ్రీ భగవత్ప్రసాదాచార్య కృతమైన భక్తమనోరంజనీ వ్యాఖ్య (6-9-44) లోనూ, “హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ, కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ, సత్సంగ్రహాయ భవపాన్థనిజాశ్రమాయ శశ్వ, ద్వరిష్ఠగతయే హరయే నమస్తే” అని శ్రీ వీరరాఘవాచార్యుల వారి విశిష్టాద్వైతపరకమైన సుప్రసిద్ధ భాగవత చంద్ర చంద్రికా వ్యాఖ్య (6-9-41) లోనూ, “హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ, కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ, సత్సంగ్రహాయ భవపాన్థనిజాశ్రయాయ శశ్వ, ద్వరిష్ఠగతయే హరయే నమస్తే” అని శ్రీ చెట్టి వేంకటాద్రి విరచితమైన భాగవత టిప్పణీ వ్యాఖ్య(6-9-35) లోనూ, “హంసాయ దభ్రనిలయాయ నిరీక్షకాయ, కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ, సత్సంగ్రహాయ భవపాన్థనిజాశ్రయాయ శశ్వ, ద్వరిష్ఠగతయే హరయే నమస్తే” అని శ్రీ సత్యధర్మ తీర్థుల వారి అదే పేరుగల మరొక భాగవత టిప్పణీ వ్యాఖ్య (6-9-35) లోనూ, “హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ, కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ, సత్సంగ్రహాయ భవపాన్థనిజాశ్రమా, ప్తా వన్తే పరీష్టగతయే హరయే నమస్తే” అని శ్రీ గిరిధర లాలా గోస్వామి కృతమైన బాలప్రబోధినీ వ్యాఖ్య (6-9-45) లోనూ, “హంసాయ సత్త్వనిలయాయ సదాశ్రయాయ, నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ, సత్సంగ్రహాయ సగుణాయ నిరీశ్వరాయ, సంపూర్ణపుణ్యపతయే హరయే నమస్తే” అని శ్రీ వంశీధరాచార్యులవారి భావార్థదీపికాప్రకాశ వ్యాఖ్య (6-9-45) లోనూ, “హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ, కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ, సత్సంగ్రహాయ భవపాన్థనిజాశ్రమా, ప్తా వన్తే పరీష్టగతయే హరయే నమస్తే” అని శ్రీ విశ్వనాథ చక్రవర్తి వినిర్మిత సారార్థదర్శినీ వ్యాఖ్య (6-9-45) లోనూ, “హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ, కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ, సత్సంగ్రహాయ భవపాన్థనిజాశ్రమా, ప్తా వన్తే పరీష్టగతయే హరయే నమస్తే” అని శ్రీ శుకదేవ కృతసిద్ధాంతప్రదీప వ్యాఖ్య (6-9-45) లోనూ విశిష్టంగా కనబడుతున్నది. నేను నా వద్ద ఉన్న కొన్ని ప్రతుల నుంచి మాత్రమే పాఠాన్ని ఉదాహరించాను. సింగనామాత్యుడు చూచిన ప్రతిలో ఆయన ఉదాహరించిన విధంగా “హంసాయ సత్త్వనిలయాయ సదాశ్రయాయ, నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ, సత్సంగ్రహాయ సగుణాయ నిరీశ్వరాయ, సంపూర్ణపుణ్యపతయే హరయే నమస్తే” అని ఉండినదని మనము ఊహించాలి. ఈ శ్లోకాన్ని బట్టి సింగనామాత్యుని చేతిలో ఉండిన ప్రతిని గుర్తుపట్టగలిగితే మరిన్ని విశేషాలు తెలుస్తాయి.

స్వప్నంలో గోచరించిన సరస్వతీదేవికి ఆ విధంగా షష్ఠ స్కంధం నవమాధ్యాయంలో ఉండిన తనకు ఆభిమానికమైన ఒక శ్లోకాన్ని సద్యఃస్ఫూర్తితో వినిపించి, సింగనామాత్యుడు శ్రీ మహాభాగవతానువాదం విషయమై తనకు గల అభిలాషను వెల్లడించాడన్నమాట. ఆ విషయాన్ని గ్రహించి అందుకు వెంటనే ఆమె నీవు తెలుగు చేయమని అంగీకరించినదన్నమాట.

ఈ ప్రసంగాన్ని బట్టి అనువాదం పోతనగారి పర్యవేక్షణలో జరగలేదని, బహుశః అప్పటికింకా షష్ఠ స్కంధానికి ఇతరుల అనువాదాలు మొదలుకాలేదని స్పష్టపడుతున్నది. తొలి అద్భుతావహమైన అనువాదం కనుకనే భాగవత మహాకవుల సహపంక్తికి నోచుకొన్నాడని మనమిప్పుడు ఊహింపగలుగుతున్నాము. ఆ విషయాన్ని రానున్న సంచికలో మరికొంత పరిశీలిద్దాము.

—- ఇంకా వుంది —-

Posted in February 2019, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!