Menu Close

Alayasiri-pagetitle

మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు

లేపాక్షి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్

లేపాక్షి

మన చరిత్ర ఎన్నో మధురానుభూతులను, సంస్కృతీ సంప్రదాయాలను వివిధ రూపాలలో భద్రపరచి మనకు అందిస్తుంటుంది. ముఖ్యంగా మన ఆలయాలలో ఉన్న శిల్పసంపద మనకు ఎన్నో అమూల్యమైన ఆధ్యాత్మిక విషయాలను, సనాతన పద్ధతులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది.

‘లేపాక్షి బసవయ్య లేచి రావయ్య
కైలాస శిఖరానా కదిలి రావయ్య’

అని అడవి బాపిరాజు గారు భావావేశంతో అన్న మాటలు అక్షరాల నిజం చేస్తూ నేటికీ ఠీవిగా 15 అడుగులఎత్తు, 27 అడుగుల పొడవుతో అలంకార భూషితమై ఏకశిలా రూపంతో కూర్చొని ఆ వీరభద్ర స్వామి రక్షకుడిగా ఉన్న నందీశ్వరుడు మనకు అనంతపురం జిల్లాలోని లేపాక్షి లో దర్శనమిస్తాడు. క్రీ.శ.16వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ ప్రాంగణ విశేషాలే నేటి మన ఆలయసిరి.

ఈ సందర్భంగా తను ప్రత్యేకంగా దర్శించి, ఆ అనుభవాలను, ఫోటోలను మన కొఱకు అందించిన శ్రీ బి.వి.డి. ప్రసాదరావు గారికి ధన్యవాదాలు.

కళలకు, తెలుగు సాహిత్యానికి పెద్దపీట వేసిన శ్రీ కృష్ణదేవరాయల స్వర్ణ వైభవ కాలంలో పెనుగొండ ప్రాంతానికి అధిపతి మరియు జవాబుదారి అయిన విరూపన్న, తన కులదైవం వీరభద్రుని పేర ఈ ఆలయాన్ని కట్టించాడు. ముఖ మంటపం లేదా నాట్య మంటపం, అర్థ మంటపం మరియు గర్భగుడి అని మూడు భాగాలుగా ఉన్న ఈ ప్రాంగణం తూర్పు, పడమర 110 మీటర్లు, దక్షిణోత్తరం 93 మీటర్లు విస్తరించి ఉంది. ఇక్కడ నిర్మించిన నాట్య మంటపం లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండేవి. అందుకే అక్కడ వివిధ సంప్రదాయ నృత్యరీతుల భంగిమలు మనకు కళ్ళకు కట్టినట్లు గోచరిస్తాయి.

లేపాక్షి

ఇక్కడ లభించిన శాసనాల విశ్లేషణ ప్రకారం మొదట ఈ లేపాక్షి ప్రాంతం పేరు “కూర్మశైలం’’. ఆగస్త్య మహాముని శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించి, ఇక్కడే తపస్సు చేసుకుంటూ కొద్ది కాలం గడిపారని ఇక్కడి స్థల పురాణం చెపుతోంది. రామాయణ కాలంలో సీతను రావణుడు అపహరించిన పిమ్మట ఆమెను వెతుకుతూ రామలక్ష్మణులు ఆమెను కాపాడబోయి రావణుడి చేత దెబ్బతిని గాయపడ్డ జటాయువును ఈ ప్రాంతంలోనే చూసి ‘లే పక్షి’ అని పిలువగా జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి “లేపాక్షి” అనే పేరు నాటినుండి స్థిరపడిందనే కథ ఇక్కడ ప్రచారంలో ఉంది.

లేపాక్షిఈ ఆలయ ప్రాంగణంలోని రాతి స్తంభాలు ఎన్నో అపురూపమైన వర్ణ చిత్రాలతో నాటి సంప్రదాయ రీతులను, మన సంస్కృతిని పరిరక్షించే ప్రామాణికాలుగా నేటికీ అలరారుతున్నాయి. ఆ స్తంభాలపై చెక్కిన శిల్పాలు, ప్రధాన గర్భగుడి పైకప్పుపై చెక్కిన అతి పెద్ద వీరభద్రస్వామి చిత్రం నాటి శిల్పుల పని నైపుణ్యానికి కొలమానాలు. గుడి లోని పైకప్పు మీద కలంకారి చిత్రాలు అద్భుతంగా వేయబడ్డాయి. చెట్ల లేపనాలతోనూ ఎరుపు, నారింజ, ఆకుపచ్చ రంగులతోనూ పైకప్పుమీద వేసిన చిత్రాలు పర్యాటకులను ఆకట్టుకొంటాయి. ఆనాడే రంగుల వాడకం మొదలైందని చెప్పవచ్చు.

ఈ ఆలయంలో మరొక ముఖ్య ఆకర్షణ, నాట్య మంటపం పై నుండి వేలాడే అంతరిక్ష స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనము ఒక తువ్వాలుని అతి సులువుగా తీయవచ్చును. ఈ చిన్న ఉదాహరణ చాలు మనవారి మేధోసంపత్తి, నాటి శాస్త్రీయ పరిజ్ఞానం.

లేపాక్షి

ఈ ప్రాంగణం లోని ప్రధాన దేవతలు అయిన వీరభద్రుడు, ఓ స్తంభంలో చెక్కిన భద్రకాళి అయిన దుర్గాదేవి నేటికీ నిత్యపూజలు జరుగుతున్నాయి. గర్భగుడికి తూర్పువైపున ఆరు అడుగుల ఎత్తుతో చెక్కిన ఉగ్ర గణపతి శిల్పం మరొక ఆకర్షణ. సమీపంలోనే మూడు చుట్టుల మధ్యన శివలింగంతో సప్త శిరస్సుల విశాలమైన పడగతో ఉన్న సర్పం అతిభయంకరంగా ఉండి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయిదు అడుగుల ఎత్తుతో చెక్కిన ఈ శిల్పం నాటి శిల్పుల నైపుణ్యానికి మరో కలికితురాయి.

లేపాక్షి ఆలయం తప్పక మనమంతా గర్వంగా చెప్పుకోదగ్గ ప్రదేశం. ఎంతో విలువకట్ట లేని శిల్పసంపదతో, మన ప్రాచీన సంస్కృతులను ప్రతిబింబిస్తూ అలరారుతున్న ఈ ప్రాంగణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మనందరిదే. కర్నాటక ప్రభుత్వం ఈ లేపాక్షి నందిని తమ రాష్ట్ర చిహ్నంగా పరిగణించడం ఎంతో ఆనందకరం.

Sources:
Source-01, Source-02

Posted in September 2018, ఆధ్యాత్మికము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *