Menu Close
balyam_main

పంచతంత్రం కథలు

- దినవహి సత్యవతి

కపట సన్యాసి

Panchatantram

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి రాజు దేవదత్తుడు. ఆయన కొలువులో భద్రుడనే మంత్రి ఉండేవాడు. భద్రుడు మహా ప్రజ్ఞాశాలి కావడంవలన అతడిని మంత్రులందరి పైనా మహామంత్రిగా నియమించాడు రాజు.

ఒకనాడు గూఢచారులు ‘మహారాజా! తిరుగుబాటుదార్లు మన రాజ్యంపై దండయాత్ర చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు’ అనే వార్తను మోసుకొచ్చారు.

వెంటనే మహారాజు భద్రుడిని పిలిచి ‘మహామంత్రీ! మీరు మన సైన్యాధిపతిని, సైన్యాలను వెంటబెట్టుకుని వెళ్ళి తిరుగుబాటును అణచివేయండి’ అని ఆజ్ఞాపించాడు.

‘చిత్తం ప్రభూ’ అని తక్షణమే బయలుదేరి వెళ్ళిపోయాడు మహామంత్రి.

ఆ తరువాత కొన్ని రోజులకి కౌటిల్యుడనే ఒక సన్యాసి ఆ రాజ్యానికి వచ్చాడు. అతడు అడిగిన వారందరికీ జాతకాలు చూసి, వారి భవిష్యత్తు చెప్పి, వారికున్న చిన్న చిన్న రోగాలను నయం చేసి అనతి కాలంలోనే ప్రజలందరి మన్ననలు పొందాడు.

ఆ నోటా ఈ నోటా సన్యాసి గురించి విన్న రాజు దేవదత్తుడు అతడిని రాజభవనానికి రప్పించాడు.

సన్యాసికి సకల మర్యాదలు చేసి ‘అయ్యా! మీరు అందరి గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారట?’ అని అడిగాడు రాజు.

‘రాజా మీరు నా గురించి వాకబు చేయిస్తే నిజమేమిటో మీకే తెలుస్తుంది’ అంటూనే తన గురించి గొప్పలన్నీ చెప్పుకొచ్చాడు సన్యాసి.

సన్యాసి చెప్పినవన్నీ విని ఎంతో ఆశ్చర్యానికి లోనయిన రాజు అతడికి ఒక పెద్ద భవనాన్ని మఠంగా మార్చి అందులో అతడికి సకల సౌకర్యాలతో వసతి కలుగజేసాడు. అంతేకాదు రోజూ ఆ సన్యాసిని తన వద్దకు పిలిపించికుని మాట్లాడుతుండేవాడు.

ఒకరోజు సన్యాసి రాజభవనానికి వచ్చి ‘రాజా! నీకొక మంచి వార్త. దేవతలందరూ నన్ను మరీ మరీ పిలిస్తే నా భౌతిక శరీరాన్ని నా భవనంలోనే విడిచిపెట్టి సూక్ష్మ శరీరంతో స్వర్గానికి వెళ్ళాను. దేవతలందరూ మీ క్షేమ సమాచారాలు అడిగి ఆశీస్సులు పంపించారు’ అన్నాడు.

‘స్వామీజీ మీరు స్వర్గానికి వెళ్ళి వచ్చారా?’ ఆశ్చర్యపోతూ అడిగాడు రాజు.

‘అవును రాజా! నేను రోజూ స్వర్గానికి వెళ్ళి వస్తాను. అది నాకెంతో సులువైన పని’ బదులిచ్చాడు సన్యాసి.

అమాయకుడైన రాజు సన్యాసి మాయ మాటలలో పడిపోయి రాచకార్యాలన్నీ మానేసి, రాణివాసానికి కూడా వెళ్ళక పగలూ, రాత్రీ సన్యాసి తోనే గడపసాగాడు.

తిరుగుబాటును అణచి రాజ్యానికి తిరిగి వచ్చిన భద్రుడికి, రాజుగారు ఒక కపట సన్యాసి మాయలో పడి ప్రజలను పట్టించుకోవడం మానుకున్నారనే వార్త చెవిన పడింది.

రాజ దర్బారులో అడుగు పెట్టి చూడగా అక్కడ వేరే మంత్రులెవరూ లేకపోవడం, కేవలం రాజు సన్యాసీ మాత్రమే కూర్చుని మాట్లాడుకుంటూ ఉండడం గమనించాడు భద్రుడు.

సన్యాసి ఏదో చెప్తుంటే ఆనందంగా వింటున్న రాజు భద్రుడు రావడం గమనించనే లేదు.

ఆ సమావేశం చూడగానే భద్రుడికి విషయమంతా అర్థమైంది.

సరాసరి రాజు వద్దకు వెళ్ళి  సాష్టాంగ పడి ‘జయం మహారాజా జయం’ అన్నాడు భద్రుడు.

తిరుగుబాటు గురించిన ప్రస్తావనే తేకుండా ‘మంత్రివర్యా మీకు ఈ మహాత్ముడు తెలుసునా?’ అని అడిగాడు రాజు సన్యాసిని చూపిస్తూ.

‘ఎందరో మహాపురుషులను తయారు చేసిన ఈ మహనీయుడి గురించి తెలియకేం? వీరు తరచూ స్వర్గానికి కూడా వెళ్ళి వస్తుంటారట కదా?’ అన్నాడు భద్రుడు.

‘అవును మహామంత్రీ’ అన్నాడు రాజు.

‘తన గురించి బాగా తెలిసినట్లుగా పొగుడుతున్న భద్రుడి మాటలకి ఉప్పొంగిపోయిన సన్యాసి, మంత్రికి మరింత నమ్మకం కలిగించడానికి ‘మీకు అంత ఆసక్తిగా ఉంటే మీరు స్వయంగా చూడండి’ అంటూ తన మఠంలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు.

కొంత సమయం గడిచాక ‘మహారాజా! సన్యాసి ఎప్పుడు తిరిగి వస్తాడు?’ అడిగాడు భద్రుడు.

‘అంత తొందరెందుకు? సన్యాసి తన భౌతిక శరీరాన్ని మఠంలోనే వదిలి సూక్ష్మ శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు’  అన్నాడు రాజు.

‘అవునా? అయితే నాకు అనుజ్ఞ ఇవ్వండి . మఠాన్ని వెంటనే తగలబెడతాను’ అన్నాడు మంత్రి భద్రుడు.

‘ఎందుకు?’ ప్రశ్నించాడు రాజు.

‘ఎందుకేమిటి మహారాజా? మఠంతో బాటు ఈ సన్యాసి భౌతిక శరీరాన్ని కూడా తగలబెట్టామంటే సన్యాసి సూక్ష్మ మైన దేవ శరీరంలోనే ఉండిపోతారు. ఇకపై సూక్షం శరీరంతోనే సన్యాసి మీ వద్దకు వచ్చి వెళతారు. దానివల్ల మీ కీర్తి ప్రతిష్ఠలు ప్రపంచమంతా వ్యాపిస్తాయి.’ అన్నాడు మహామంత్రి భద్రుడు.

తనకి కీర్తి వస్తుందని భద్రుడు చెప్పిన మాటలకి ఆనందంతో పొంగిపోయిన రాజు మఠం తగులబెట్టడానికి అనుమతించాడు. ఆ మంటలలో మోసకారి సన్యాసి కాలి బూడిదయ్యాడు.

ఆ విధంగా అమాయకుడైన రాజునీ, రాజ్యాన్నీ, ప్రజలనూ కపట సన్యాసి బారినుంచి కాపాడాడు మహామంత్రి భద్రుడు.

నీతి: మాయ మాటలు చెప్పి మోసం చేసే కపట సన్యాసులను నమ్మకూడదు.

Posted in April 2018, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!