Menu Close
sravanthi_plain

Kalyanam Sravanthi Feb2019

కల్యాణం

మంగళమహాశ్రీ ఐదువతనంబునకు ఆదియగు సత్కృతుల అంద ఱొనరించు శుభవేళన్

మోదమున బంధువులు ముఖ్యపరివారమును ముచ్చటగ ఒక్కతటి చేరన్

వేదములు వాద్యములు వీనులకు విం దొసగ వేడ్కమెయి విప్రవరు లాశీ

ర్వాదములు జంటపయి వర్షమున చిన్కులన పల్క కడుప్రీతి బహుజిహ్వ

స్వాదుమధురాన్నరసభక్ష్యములు భోజ్యములు పండ్లు కొని ఆగతులు మెచ్చన్

శ్రీదమగు పెండ్లి అయి చెందు నిరువంశములు శీఘ్రముగ గొప్ప అభివృద్ధిన్

చం. సతి యన సర్వశాస్త్రముల సారము తిన్నగ కుప్పవోసి తా

నతివగ రూప మిచ్చి ఒక అద్భుతశక్తి నొసంగి బ్రహ్మ స

ద్గతిని చరింప పూరుషుడు ధర్మయుతంబుగ సౌఖ్యసంపదల్

అతిముద మొంది పొందగ నహర్నిశ లిచ్చిన సద్వరంబెగా

కం. పతిసతులకు జీవనమున

మతి ఒక్కటె కాని రెండు మనుజాకృతులౌ

సతతము క్షీరము నీరము

గతి విడదీయంగరాని ఘనసృష్టి అదే.

తే.గీ. పూవుతావియు, వాగర్థములును, నేత్ర

దృక్కు లిందుచంద్రికలు తంత్రీస్వరమ్ము

లినఘృణులు(1) సూత్రసరములు(2) నేడు(3) జంట

పదము(4) లవిభాజ్యపతిసతీబంధము లవె

  1. సూర్యుడు,సూర్యకాంతి
  2. దారము(ఆధారము),దండ [మంగళసూత్రమును సూచిస్తూ]
  3. ఏడు (సప్త) (4) జంటమాటలు / వధూవరు లిద్దరు ఒకరితో ఒకరు వేసే అడుగులు

ఈ పద్యంలో పూవుతావి నుంచి సూత్రసరముల వఱకు 7 జంటపదాలు ఉన్నాయి. అవే కళ్యాణపరంగా సప్తపది; అవే పతిపత్నులను (పతిని ముందు చెప్పడంలో జంటపదాల్లోని క్రమం పాటించాను) విడదీయలేని జంటగా కలకాలం నిలిపే బంధాలు.

Posted in February 2019, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!