Menu Close

 

Kalthi Kalam Page title

“గుడ్ మార్నింగ్ సర్” రాజారావుని విష్ చేసాడు సతీష్.

“ఏం సతీష్ ఎలావున్నావు. పండగ సెలవునించి ఇవాళేనా రావటం” పలకరించాడు రాజారావు.

“అవును సర్. ఎదో మీ దయ వల్ల పండగ బాగా చేసుకున్నాము” మెల్లగా అన్నాడు సతీష్.

రాజారావు ఫుడ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. సతీష్ కాకుండా ఇంకా తనకింద నలుగురు పనిచేస్తున్నారు. అందరికంటే రాజారావు కి సతీష్ అంటేనే ఇష్టం. ఇద్దరూ కలిసే అన్ని ఆఫీసు పనులు చేస్తారు. కలిసి విచారణలు చేస్తారు. పై అధికారులకు నమ్మినబంటుల్లాగా పనిచేస్తారు. హోటల్స్ ను, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ను, తనిఖీ చేయటం, ఏవైనా లోపాలు ఉంటె కేసులు పెట్టటం, పెనాల్టీలు వసూలుచేయటం దినచర్యలో భాగం. రోజూ ఏవో కంప్లైంట్స్ వస్తూనే వుంటాయి. వాటిల్లో ఎన్ని ఫిర్యాదులు నిజమైనవి, ఎన్ని కల్పించినవి అని చూసి నిజమైనవి అన్న వాటిపై ఎంక్వయిరీ జరిపించాల్సి వుంటుంది. అలా ఎంక్వయిరీ జరిపి ఏ హోటల్ అయినా ఆహారంలో కల్తీ చేసినట్లు నిర్ధారణైతే, వాటిపైన చర్య తీసుకోవాల్సివుంటుంది. ఈ లోపల రాజకీయ నాయకులు, పోలీసులు ఇంకా సమాజంలో పలుకుబడి కలిగినవాళ్లు కల్పించుకొని కేసుల్ని నీరుగారుస్తుంటారు. గవర్నమెంట్ శాఖలలోని ఉద్యోగులను, వాళ్ళ పని వాళ్ళు చేసుకోనీకుండా పలుకుబడి కలిగిన ఎవరో ఒకరు అడ్డుకుంటుంటే, ఏదో ఒకనాటికి అందరూ అవినీతిపరులయ్యే ప్రమాదముంది.

“ఏవిటో సతీష్! ఈమధ్య మంచి కేసులు రావటం లేదు. రాబడి బాగా తగ్గింది. పై ఆఫీసర్లనుంచి వత్తిడి కూడా పెరుగుతోంది.” లంచ్ టైంలో సతీష్ ని ఉద్దేశించి అన్నాడు రాజారావు.

“అదేంటి సర్ కిందటి నెలేగా ‘ఎవర్ ఫ్రెష్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్’ మీద దాడులు జరిపి కేసు ఫైల్ చేయకుండా ఉండేందుకు ఒప్పందానికి వచ్చాం.” ఆశ్చర్యంగా అన్నాడు సతీష్.

“ఆ కేసులో ఏమీ మిగలలేదయ్యా. పై ఆఫీసర్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందట. అందుకని వాడి వాటా ఎక్కువ తీసుకున్నాడు. చివరికి నాకు ఇరవై నీకు పదేగా మిగిలింది.” అన్నాడు రాజారావు.

“అవును సర్. ఈ మధ్య మీరన్నట్లు, మంచి కేసులు రావటంలేదు.” వాపోయాడు సతీష్.

“నువ్వొక పనిచెయ్యాలయ్యా. మన సిటీలోని టాప్ హోటల్స్ మీద నిఘా పెట్టాలి. మరీ పెద్దవాటి జోలికి వద్దు.

రాజకీయనాయకులు కల్పించుకుంటారు. కొంచెం మీడియం హోటల్స్ మీద నిఘా పెట్టు. మంచి ఛాన్స్ దొరుకుతే, మన పంట పండుతుంది.” నవ్వుతూ అన్నాడు రాజారావు.

“నేనా పనిమీదే వున్నాను సర్. నాకు తెలిసిన సర్కిల్ లో మనకు కావలసిన సమాచారం ఇచ్చే వాళ్లకి చిన్న చిన్న పార్టీలు కూడా ఇచ్చాను. జాగ్రత్తగా ట్రాప్ చేసి ఈసారి మంచి కేసు పడదాం సర్”. ధీమాగా చెప్పాడు సతీష్.

“అవునయ్యా! మాఆవిడ బంగారం కొనమని రోజూ గొడవ పెడుతున్నది. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే మహాలక్ష్మి మన ఇంట్లోనే ఉంటుందటగా! ఈ అక్షయ తృతీయ నాడైనా కొనక పొతే నా పరువు పోయేటట్లుంది. అలాగే సిటీలో మంచి బంగారం షాపులేవో కనుక్కో” చెప్పాడు రాజారావు.

“అవును సర్ మా ఇంట్లో కుడా ఇదే గొడవ. ఈ సారి మంచి కేసు చూసి రాబడి పెంచుకోవాలి సర్” హుషారుగా అన్నాడు సతీష్.

ఆ రొజు రాత్రి భోజనాలయిన తరువాత టీవీ చూస్తూ మాట్లాడుకొంటున్నారు రాజారావు, అతని భార్య ఉష.

“ఈరోజుల్లో కల్తీ బాగా పెరిగి పోయిందండి. నిన్న తెచ్చిన ఆపిల్స్ కత్తితో కొస్తుంటే, తొక్కనుంచి సన్నగా మైనం వస్తోందండి.” అంది రాజారావు భార్య ఉష.

“పిచ్చిదానా కల్తీ గురించి నీకేం తెలుసు. నేను పని చేసేది ఆ డిపార్ట్మెంట్ లోనే కదా. నీకు ఇంతకూ ముందు కూడా చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెపుతాను. జాగ్రత్తగా విని బజారుకు వెళ్ళినప్పుడు, మంచి వస్తువులు మాత్రమే కొను.” అని మెల్లగా చెప్పడం ప్రారంభించాడు రాజారావు.

“తేనెలో మొలాసిస్ కలుపుతారు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఎర్రకారంలో ఇటుక పొడి, రంపపు పొట్టు, కృత్రిమ రంగులు కలుపుతారు. దీనివల్ల కడుపునెప్పి ఇంకా కాన్సర్ రావచ్చు. పాలల్లో యూరియా, డిటర్జెంట్స్, కలుషిత నీళ్లు కలుపుతారు. అందువల్ల కడుపునెప్పి రావచ్చు. పంచదారలో యూరియా, తెల్ల ఇసుక, చాక్ పౌడర్ కలుపుతారు. దీనివల్ల లివర్ పాడవుతుంది. పండ్లు కూరగాయలులో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ చేస్తారు. దీనివల్ల నరాల బలహీనత, బ్లడ్ షుగర్ పెరుగుట జరుగుతుంది. బిరియానిలో జంతు కళేబరాలనుంచి తీసిన నూనె కలుపుతారు. దీనివల్ల అన్ని రోగాలు వస్తాయి. ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా వుంది. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. కాబట్టి వస్తువులు కొనేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి.” చెప్పాడు రాజారావు.

“మీరు చెప్పినదాన్ని బట్టి, చాలా వస్తువులు కల్తీ చేయబడుతున్నాయి కదా. మరి ఇలాగయితే ప్రజల ఆరోగ్యం సంగతి ఎలా? మీ ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంది కదా. మీరేమి చేయలేరా?” అమాయకంగా అడిగింది ఉష.

“నియంత్రణ చేసేవాళ్ళు వందల్లో ఉంటే కల్తీ చేసేవాళ్ళు వేలల్లో ఉన్నారు మరి నియంత్రణ ఎలా జరుగుతుంది. ప్రజల్లో మార్పు రానంతవరకు ఈ కల్తీ ఇలాగే ఉంటుంది” దొంగలాగా చెప్పాడు రాజారావు.

ఇలాంటి రోజువారీ సంభాషణలు ఉష, రాజారావుల మధ్య అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కల్తీ గురించి చెప్పినా, తన డిపార్ట్మెంట్ వైఫల్యం చెప్పకుండా దాటవేస్తుంటాడు రాజారావు. తను తీసుకునే లంచాల విషయం ఉషకు తెలియదు. తెలిస్తే గొడవలొస్తాయని రాజరావు భయం. తనకు ఒక్కడే కొడుకు ప్రశాంత్. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇంక పిల్లల్లేరు. కొడుకు మీద రాజారావుకి చాలా కోరికలున్నాయి. బాగా చదివించాలి. తన బంధువుల్లో చాలామంది యు.ఎస్. లో సెటిల్ అయ్యారు. తన కొడుకు కూడా యు.ఎస్. వెళ్లాలన్నదే తన బలమైన కోరిక. ఒక్కడే కొడుకు కదా అని చాలా ముద్దు చేశారు. అందుకనే చదువులో వెనకబడి వున్నాడు. రాజారావుకి కొడుకును పట్టించుకొనే తీరిక లేదు. కొడుకు విషయం తల్లి చూసుకొంటుందని అనుకునేవాడు. ప్రశాంతమైన జీవితం. తన బంధువుల్లో కూడా చాలామంది ఇలాంటి జీవితాలే గడుపుతున్నారు. వాళ్లందరికంటే తనే గొప్పగా ఉండాలన్నదే రాజారావు కోరిక. రాజారావుకు తల్లిదండ్రులు లేరు. ఒక అన్న, ఒక చెల్లెలు ఉన్నారు. ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళెవరికీ తాను సహాయం చేయడు. వాళ్ళ ఇళ్లకు వెళ్ళటం కూడా తక్కువే. రాజారావు ప్రవర్తన చూసి వాళ్ళు కూడా ఇంటికి రావటం తగ్గించుకొన్నారు.

“అమ్మా రేపు ఆదివారం, కాలేజీవాళ్ళు పిక్నిక్ వేశారు. సిటీనుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక జలపాతం దగ్గర కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. ఉదయం బయలుదేరి రాత్రి పదింటికి వచ్చేస్తాము. అక్కడికి నేను మా ఫ్రెండ్స్ వెళ్ళాలి. దానికి ఐదు వేలు కావాలి.” అడుగుతున్నాడు ప్రశాంత్. “అంత డబ్బు ఎందుకురా” సంశయంగా అంటోంది ఉష.

“పిక్నిక్ అంటే మాటలా. బస్సు ఖర్చు, భోజనాలు, టిఫిన్స్, రిసార్ట్స్ ఖర్చులు చాలా ఉంటాయి. అక్కడ గేమ్స్ కూడా ఆడించి ప్రైజులు కూడా ఇస్తారు” ఉత్సాహంగా చెపుతున్నాడు ప్రశాంత్. కుతూహలంగా వింటున్నాడు రాజారావు.

“చూడండి వీడికి ఐదు వేలు కావాలంటున్నాడు. ఎక్కడో పిక్నిక్ కి వెళ్ళాలట” భర్తతో అంది ఉష.

“పొనీలేవే ఫ్రెండ్స్ అందరితో వెళ్ళేటప్పుడు ఆ మాత్రం ఖర్చులుంటాయి. ఎప్పుడు బయలు దేరుతున్నారు” ప్రశాంత్ ని అడిగాడు రాజారావు.

“నెక్స్ట్ సండే నాన్నా. నేను వస్తానని ఫ్రెండ్స్ కి మాట ఇచ్చాను. మీరు డబ్బులు ఇవ్వకపోతే నా పరువు పోతుంది.” విసుగ్గా అన్నాడు ప్రశాంత్.

“నువ్వు మంచి మార్కులు తెచ్చుకోక పొతే మా పరువు కూడా పోయేటట్టుంది.” మనసులో అనుకొన్నాడు రాజారావు.
“సరే డబ్బులు ఇస్తా. కానీ నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నువ్వు వెళ్ళేది కొంత గిరిజన ప్రాంతం. ఏ నీళ్లు బడితే ఆ నీళ్లు తాగొద్దు. ఆహారం తక్కువగా తీసుకో. ఎవరితోనూ దెబ్బలాటలొద్దు. పిక్నిక్ కోఆర్డినేటర్ చెప్పినట్టు వినాలి. ఈ షరతులకు ఒప్పుకొంటేనే నేను డబ్బులు ఇస్తాను.” అన్నాడు రాజారావు.

“ఏదో పెద్దవాళ్ళ చాదస్తం. అలాగే అంటే పోయేదేమిటి అనుకొని అలాగే డాడీ మీరు చెప్పినట్టే చేస్తాను.” అన్నాడు ప్రశాంత్.
తరవాతి రోజు కాలేజీ కోఆర్డినేటర్ కి ఫోన్ చేసి వాళ్ళ నుంచి పిక్నిక్ ప్రోగ్రామ్ గురించి వివరాలు కనుక్కున్నాడు. కోఆర్డినేటర్ నుంచి పూర్తి హామీ తీసుకున్న తరువాత వూపిరి పీల్చుకున్నాడు రాజారావు. కానీ మనసులో ఏదో మూల భయం. ప్రశాంత్ ఇలాగే పదో తరగతిలో ఉన్నప్పుడు, సైన్స్ టూర్ అని వెళ్లి నానా గొడవలు తెచ్చుకున్నాడు. వాటినుంచి బయటపడటానికి తల ప్రాణం తోకకు వచ్చింది. ప్రశాంత్ చాలా సెన్సిటివ్ కుర్రవాడు. ఆలోచించకుండా మాట్లాడుతాడు. ఎదుటివాడు ఎవరు అని చూడడు. శనివారం రాత్రి, తరువాతి రోజు టూర్ కు కావాలసిన వన్నీ సర్దుకుంటున్నాడు ప్రశాంత్. ఒక పెద్ద బాగ్ నిండా బట్టలు క్రికెట్ బ్యాట్ లు అన్ని సర్దుకున్నాడు.

“ఏవిటిరా ఇవన్నీ ఒక్కరోజు టూర్ కు ఇన్నికావాలా?” అడిగింది ఉష.

“నీకేం తెలుసు మమ్మి. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎక్కువ సామాన్లు తెచ్చుకుంటున్నారు.” గర్వంగా చెప్పాడు ప్రశాంత్.

“జాగ్రత్తగా ఎవరితో గొడవలు పడకుండా తిరిగి రావాలి.” సౌమ్యంతో కూడిన హెచ్చరికగా చెప్పింది ఉష.

తరువాతి రోజు ఉదయం ఆరుగంటలకే కాలేజీకి బయలుదేరాడు ప్రశాంత్. తాను లేచేటప్పటికే ప్రశాంత్ టూర్ కి బయలుదేరాడని తెలిసి నిట్టూర్చాడు రాజారావు. తనూ టిఫిన్ చేసి పది గంటలకి ఆఫీసుకు వచ్చాడు రాజారావు. ఆ రోజు ఇంకో ఫుడ్ ఇన్స్పెక్టర్ రవికి మంచి కేసు దొరికినట్లు వుంది. ఆఫీసంతా చాలా హడావిడిగా ఉంది. పై ఆఫీసర్లందరూ రవికి కంగ్రాట్యులేషన్స్ చెపుతున్నారు. రవి అతని అసిస్టెంట్ కలసి పై ఆఫీసర్లతో చాలా సీరియస్ గా మాట్లాడుకొంటున్నారు. ఇక ఆ సీన్లు చూడలేక కాంటీన్ వచ్చి కాఫీ తాగుతున్నారు రాజారావు, సతీష్. లంచ్ టైంలో కూడా ఇదే విషయం. రాజారావు కి అన్నం తినబుద్ది కాలేదు. ఏదో కొంచెం తిని తన కేబిన్ కు వచ్చాడు. సన్నగా నిద్ర పట్టింది.

ఫోన్ రింగవుతోంది. కానీ శబ్దం రాజారావుకి వినిపించడంలేదు. రెండుసార్లు మోగిన తరువాత మెల్లగా నిద్ర లేచి ఫోన్ తీసాడు రాజారావు. “రాజారావు గారేనా?” అవతల వ్యక్తి ఆత్రంగా అడుగుతున్నాడు.

“అవును. ఎవరు మీరు.” అడిగాడు రాజారావు. “సర్. నేను కాలేజీ బస్సు డ్రైవర్ ని. మీ అబ్బాయి ప్రశాంత్ ను, అతని స్నేహితులు కొందరిని ఇక్కడ దగ్గరలోని జిల్లా ఆసుపత్రిలో చేర్చాము సర్. మీరు త్వరగా ఇక్కడకు రావాలి. అని అడ్రస్ చెప్పి వివరాలు అడిగేలోపలే ఫోన్ పెట్టేసాడు డ్రైవర్. రాజారావుకి నిద్రమత్తు ఒక్కసారిగా వదిలింది. త్వరగా సతీష్ ను తీసుకొని కారులో డ్రైవర్ చెప్పిన ఆసుపత్రికి బయలుదేరాడు రాజారావు. ఇంట్లో ఈ విషయం చెప్పలేదు. చెపితే ఉష చాలా కంగారు పడుతుంది. దారిలో రాజారావు ఆలోచిస్తున్నాడు. ఏమీ అర్థం కావటంలేదు. ప్రశాంత్ ను ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సిన అవసరమేమిటి. ఆక్సిడెంట్ ఏమైనా అయిందా? మరి డ్రైవరేగా మాట్లాడింది. కాబట్టి యాక్సిడెంట్ కాకపోవచ్చు. రాజారావు, సతీష్ ఎంత ఆలోచించినా కారణం కనిపించటం లేదు. మళ్ళీ డ్రైవర్ కి ఫోన్ చేస్తుంటే డ్రైవర్ ఫోన్ ఎత్తటం లేదు.

“కంగారు పడకండి సర్. ప్రశాంత్ కి ఏమీ కాదు. “రాజారావుని ఓదారుస్తున్నాడు సతీష్. డ్రైవర్ చెప్పిన ఆసుపత్రికి వచ్చారు రాజారావు, సతీష్. రిసెప్షన్ లో అడిగి ప్రశాంత్ కు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ని కలిసాడు రాజారావు.

“ఏంటి డాక్టర్ గారూ ఏమైంది. కంగారుగా అడిగాడు రాజారావు.”

“మీరేనా ప్రశాంత్ తండ్రి. ప్రశాంత్ కి వాడి ఫ్రెండ్స్ కి ఫుడ్ పాయిజన్ అయింది. దారిలో ఏదో డాబా దగ్గర బిరియాని తిన్నారట. అది బహుశా కల్తీది కావచ్చు. వాంతులు, విరేచనాలు చాలా ఎక్కువగా అయ్యాయి, సెలైన్ ఎక్కించాము. పల్స్ కూడా చాలా నెమ్మదిగా కొట్టుకొంటోంది. మీరు వీళ్ళని సిటీకి తీసుకవెళ్లటం మంచిది.” చెప్పాడు డాక్టర్. రాజారావుకి ఒక్కనిమిషం ఏంచేయాలో తెలియక స్థాణువులా నిలబడి వున్నాడు.

“సర్ వెంటనే సిటీకి తీసుకు వెల్దాము. ఆలస్యంచేస్తే ప్రమాదం కావచ్చు.” అన్నాడు సతీష్. రాజారావు వెంటనే తేరుకొని తాను వచ్చిన కారులో ప్రశాంత్ ని. వాడి ఫ్రెండ్స్ కొందరిని ఎక్కించుకొని సిటీకి బయలు దేరాడు. సిటీలో తనకు తెలిసిన ఒక మంచి హాస్పిటల్ లో ప్రశాంత్ ని జాయిన్ చేసాడు.

“డాక్టర్ మావాడికి ఏం పరవాలేదుగా” డాక్టర్ ని ఆతృతగా అడుగుతున్నాడు రాజారావు.

“ఇరవై నాలుగు గంటలు దాటితే కానీ ఏం చెప్పలేం సర్. ఫుడ్ పాయిజన్ ఒక్కోసారి ప్రాణాలు తీస్తుంది కూడా.” అన్నాడు డాక్టర్. ఐసీయూ బయట వెయిటింగ్ రూమ్ లో కూర్చుని ఆలోచిస్తున్నారు రాజారావు, సతీష్.

“ఎలా జరిగివుంటుంది సతీష్.” అడిగాడు రాజారావు.

“అదే అర్ధం కావటం లేదు సర్. ఫుడ్ కాలేజీ ఇస్తుంది కదా! మరి వీళ్ళు డాబాలో బిరియాని ఎలా తిన్నారు.” మెల్లగా అన్నాడు సతీష్. రాజారావు కు డ్రైవర్ గుర్తుకొచ్చాడు. వెంటనే డ్రైవర్ కి ఫోన్ చేసాడు.

“నేను ప్రశాంత్ తండ్రిని మాట్లాడుతున్నాను. అసలేం జరిగింది. మావాడు బయట బిరియాని ఎందుకు తిన్నాడు.” డ్రైవర్ ని అడిగాడు రాజారావు.

“సర్ మేము పిక్నిక్ స్పాట్ కి నలభై కిలోమీటర్ల దూరం లో ఉండగా ఫుడ్ సప్లై వ్యాన్ పాడయింది. అది తెలియక మేము చాలా దూరం వెళ్ళాము. ఈ లోపల స్టూడెంట్స్ అందరూ ఆకలి అని గోలచేశారు. ఒక్క అరగంట ఆగండి అని ఎంత చెప్పినా వినలేదు. ఈలోపల మీవాడు ఇంకొంతమంది దగ్గరలోని డాబాకి వెళ్లి బిరియాని తిన్నట్టున్నారు. బస్సు దగ్గరకు తిరిగి వచ్చేటప్పటికే వాంతులు, విరేచనాలు అయ్యి పరిస్థితి సీరియస్ అయ్యింది. వెంటనే బస్సులో తీసుకు వెళ్లి దగ్గరలోని జిల్లా ఆసుపత్రిలో చేర్చాము సర్”. చెప్పాడు డ్రైవర్.

రాజారావుకి విషయం పూర్తిగా అర్ధమయింది. రోడ్డు పక్కవుండే చాలామటుకు డాబాల్లో శుభ్రత ఉండదు. కల్తీ విషయం చెప్పక్కరలేదు. తను చాలాసార్లు అలాంటి డాబాలపై విచారణకు వెళ్లి, చర్య తీసుకోకుండా లంచం తీసుకొని వదిలేసాడు. అదే ఈనాడు తనకు శాపమై తన కొడుకు ప్రశాంత్ ని శిక్షించింది. “వీడికి ఏంకాకుండా చూడు భగవంతుడా.” మనసులో ప్రార్థించుకొన్నాడు రాజారావు.

“రాజారావు గారూ మీ అబ్బాయికి స్పృహ వచ్చింది. ఇంకేం పరవాలేదు. కాసేపు అయిన తరువాత ఐసీయూ లోకి వెళ్లి చూసి రండి. ప్రశాంత్ ని ఎక్కువ మాట్లాడించకండి.” చెప్పాడు డాక్టర్.

రాజారావుకి ప్రాణం లేచి వచ్చినట్లనిపించింది. “థాంక్స్ డాక్టర్. మీమేలు మరిచిపోలేను.” ఆనందంగా చెప్పాడు రాజారావు. మరుసటి రోజు ప్రశాంత్ ని డిశ్చార్జ్ చేశారు. తరువాత ప్రశాంత్ ని ఇంటికి తీసుకొని వచ్చారు. ఈ విషయం ఉషకి జాగ్రత్తగా చెప్పి ఇంటికి వచ్చేదాకా కంగారు పడకుండా చేసాడు రాజారావు.

ఆరోజు రాత్రి పడుకున్నాడన్న మాటేగాని రాజారావుకి నిద్రపట్టడం లేదు. తను, తన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎన్నో హోటల్స్ మీద దాడులు చేస్తుంటారు. వాళ్ళల్లో చాలామందిని లంచం తీసుకొని వదిలేస్తారు. దానివల్ల వాళ్ళు మళ్ళీ ఆహరం కల్తీ చేస్తుంటారు. సామాన్య జనాలకు ఇవేమి అర్ధంకావు. ఏమి జరగనంతవరకు పరవాలేదు. ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయి ఎవరయినా చనిపోతే, వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంది. పెద్దవారెవరైనా చనిపోతే కుటుంబాలు అనాధలైపోతాయి. ఇవన్నీ తను, తన డిపార్ట్మెంట్ ఆలోచిస్తోందా? సమాజంలో ఎవరెలాపోతే మనకేంటి మనం బాగున్నామా అనే చాలామంది ఆలోచిస్తుంటారు. ఒకవేళ మనకే ఆ ప్రమాదం జరిగి కోలుకోలేని నష్టం జరిగితే కానీ ఆ విషయం తెలుసుకోలేమా?

ఆలోచనలు రింగురింగులుగా తిరుగుతున్నాయి. చాలాసేపు ఆలోచించిన తరువాత ఒక నిశ్చయానికి వచ్చాడు రాజారావు. అప్పటినుంచి లంచం తీసుకోవటం మానేసాడు. తన వృత్తి ధర్మాన్ని నిజాయితీగా నిర్వర్తించాడు. ఫలితం, కొద్ది నెలలకే రాజారావు కి సిటీనుంచి ట్రాన్స్ఫర్ అయింది. పై వాళ్ళతో గొడవలే ఇందుకు కారణం అని అందరూ చెప్పుకున్నారు. కానీ తన డ్యూటీ ఎంత కష్టమైనా చేస్తున్నాడు. తనకు లభించిన ఆత్మ సంతృప్తిని మనసారా ఆస్వాదిస్తున్నాడు.

## సమాప్తం ##

Posted in December 2018, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!