Menu Close
Tookiga page title
కాల విభజన

గత సంచికలో మన తెలుగు సంవత్సరాల గురించి తెలుసుకొన్నాము కదా! ఇప్పుడు మన పంచాంగం ప్రకారం కాలాన్ని ఎలా నిర్వచించడం జరిగిందో తెలుసుకుందాం.

ఒక సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది ఆయనమవుతుంది. అంటే మనకు రెండు ఆయనములు, అవి:

ఉత్తరాయణము: సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో ప్రవేశించువరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంతబాగము, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో మిగిలిన భాగం ఉంటుంది.

దక్షిణాయణం: కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగము.

ప్రకృతి పరమైన మార్పులను ఆరు భాగాలుగా విభజించి వాటినే ఋతువులు అంటారు. అవి: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు మరియు శిశిర ఋతువు.

ఒక సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం అవుతుంది, మన పన్నెండు తెలుగుమాసాలు:
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం.

అలాగే మన పంచాగం లో ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు. అవి:

కృష్ణపక్షం: (కృష్ణ అంటే నలుపు అని అర్థం) ఇది అమావాస్య పదిహేను రోజులకు గుర్తు.

శుక్ల పక్షం: పౌర్ణమి పదిహేను రోజులకు గుర్తు.

పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం, పౌర్ణమి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం.
ప్రతి పక్షానికి పదిహేను రోజులు ఉంటాయి కనుక వాటిని పదిహేను తిథులతో నిర్వచించడం జరిగింది. అవి:

పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి లేక అమావాస్య.

అలాగే ఒక పక్షానికి రెండు వారములు. ఒక వారమునకు ఏడు రోజులు. ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు. ఒక గంటకు అరవై నిమిషములు. ఒక నిమిషానికి 60 సెకన్లు.

నక్షత్రం అంటే నశించనిది. సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయానికి ముందు అంతరిక్షంలోకనిపించే నక్షత్రాలను గుర్తించి, అవి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉదయిస్తున్నాయో, ఎప్పుడు అస్తమిస్తున్నాయో గమనించి, ఋతువుల క్రమానికీ నక్షత్రాల స్థానానికీ ఒక అనుబంధాన్ని దర్శించారు మన ప్రాచీనులు. మొత్తం 27 నక్షత్రాలకు పేర్లు పెట్టారు. అవి:

అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.

ఇలా ప్రతి అంశాన్ని చక్కటి ప్రణాళికతో తయారుచేసిన మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మన హిందూ సంస్కృతీ, సాంప్రదాయాలు ఎంతో విలువగలిగి అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయి.

Posted in April 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!