Menu Close
జంతుసంపద
-- ఆదూరి హైమావతి --
చారలగుర్రం - జీబ్రా

Zebra

మానవులను నల్లవాడు, ఎర్రవాడు అన్నట్లే ఒంటినిండా నిలువు చారలున్న ఈ జంతువును ఆంగ్లంలో జీబ్రా అని,  తెలుగులో చారల గుఱ్ఱం అంటాం. వీటి ఒంటిమీది చారలు చాలా తమాషాగా ఉంటాయి.

విద్యార్ధులకు ‘జీబ్రా’ అనగానే ఆల్ జీబ్రా గుర్తుకొచ్చి గుండె దడ దడ లాడటం సహజం. ఐతే ఆల్ తీసేస్తే ఈ జీబ్రా గురించి తెలుసుకోవడం సరదాగానే ఉంటుంది. చూట్టానికి చారల చారలతో పులిచారల్ల ఉన్నా పాపం ఇవి పులులచేతే చంపబడతాయి!

ఈ జీబ్రా లు ఎత్తు, పొడవుల్లో కొంచెం గుఱ్ఱంలా ఉన్నా, ఒంటి మీద చారలతో చాలా తమాషాగా ఉంటాయి. తోక, చెవులు గుఱ్ఱానికి వున్నట్లే ఉంటాయి.

ఐతే గాడిదకూ, వీటికీ కూడా పోలికలున్నాయి. వీటికి ఒంటినిండా నల్లని చారలు ఉంటాయి. అవే వీటిని గుఱ్ఱం నుండీ, గాడిద నుండీ వేరు చేస్తున్నాయి. అందుకే దీనికి చారల గుఱ్ఱం అనే పేరు వచ్చింది. అంటే చారలున్న  గుఱ్ఱం అన్నమాట.

Zebra

ఒంటినిండా చారలుండటాన చెట్ల పొదల్లో కలసిపోయి ప్రాణ రక్షణ గావించుకుంటాయి. వీటి బుజ్జి బుజ్జి పిల్లలు చాలా తమాషాగా ఉంటాయి. తల్లులను వదలక వాటి తోకల వెంటే నడుస్తూ మెళకువలన్నీ నేర్చుకుంటాయి.

జీబ్రాలు మొదట ఆఫ్రికాలో ఉండేవి, క్రమేపీ ప్రపంచమంతా వ్యాపించాయి.

Zebra

మనదేశంలో కేవలం జంతుప్రదర్శన శాలల్లో మాత్రమే చూస్తాం. వీటి జీవనకాలం సుమారుగా 25 నుండి 30 సం. రాలు. వీటికి క్రూర జంతువులైన పులులు, సింహాల నుంచి ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే గుంపులు గుంపులుగా జీవిస్తాయి.

ఆహారాన్ని, ప్రమాదం లేని ప్రాంతాలనూ వెతుక్కుంటూ గుంపులతో వెళుతుంటాయి. మళ్ళా వీటిలోనూ ఒక్కో చిన్న గుంపూ ఉంటుంది. అంటే మన ఉమ్మడి, చిన్న కుటుంబాల లాగా అన్నమాట.

Zebra

ఇవి సూమారుగా 5 అడుగుల ఎత్తు ఉంటాయి. వేగం కూడా తక్కువేం కాదు గంటకు సుమారుగా 35 మైళ్ళ వేగంతో పరుగుతీస్తూ ప్రాణ రక్షణ గావించుకుంటాయి. పది పన్నెండు నెలలు కడుపులో మోస్తూ ఆడ జీబ్రాలు పిల్లలను కంటాయి.

దాదాపు రెండేళ్ళపాటు తల్లుల వద్దే పెరుగుతూ, తల్లిపాలు త్రాగుతూ మెళకువలన్నీ నేర్చేసుకున్నాక తమ వయసు జీబ్రాలతో కలసిపోయి తిరుగుతుంటాయి. స్వతంత్రంగా జీవిస్తూ ఆహారం వెతుక్కుంటూ వెళతాయి. 3 నుండి 6 ఏళ్లప్రాయం వచ్చాక వాటికి ప్రత్యుత్పత్తి వయస్సు వస్తుంది. పాపం ముసలివయ్యాక ఎక్కువ వేగంగా పరుగెత్తలేవు కనుక పులులు సింహాలకు ఆహారంగా తమ జీవితాలను ముగిస్తాయి.

Posted in May 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!