Menu Close
జంతుసంపద
-- ఆదూరి హైమావతి --
ఖడ్గమృగం-రైనోసరస్
Rhinoceros

ఖడ్గం అనగానే పూర్వపు రాజులు యుధ్ధాలలో శతృవులను సంహరించను వాడే ఖడ్గం అదే కత్తి గుర్తుకు వస్తుంది. ఐతే పాపం ఈ జంతువుకు ఉన్నది అలాంటి ఖడ్గం కాదు. మూతిమీద ఖడ్గం ఆకారంలో పైకి లేచి ఉన్న ఒక శరీర భాగం.

ఖడ్గమృగానికి కొన్ని పేర్లున్నాయి. అడిదపు మెకము, కటికమెకము, కత్తిపేరి మెకము, ఖడ్గధేనువు, ఖడ్గాహ్వము, ఖడ్గి, గండకము, గండము, వార్ద్రీణసము. భారతదేశపు ఖడ్గమృగాన్ని ఒంటి కొమ్ము ఖడ్గమృగం అంటారు. ఇది ఆంగ్లంలో రైనోసరస్.

ఇది ఆకారంలో పెద్దది. ఖడ్గమృగాలు క్షీరదాలు అంటే పిల్లలకు పాలిచ్చి పెంచే జంతువన్నమాట, మన ఆవు, గేదె, మేకల్లా. ఇవి ఎక్కువగా కాకున్న కొంతవరకూ నేపాల్, భారతదేశం లోని అస్సాం అడవుల్లో జీవిస్తాయి. హిమాలయాల క్రింద ఉండే  గడ్డిమైదానాల్లో, అడవుల్లో జీవిస్తుంటాయి.  పెద్ద ఆకారంలో, లావుగా ఉన్నా దేని రక్షణ దానిదే కనుక ఈ ఖడ్గమృగం గంటకు 25 మైళ్ళ వేగంతో పరుగెత్తుతుంది.

Rhinoceros

ఇది ఈత లోనూ చాలా నేర్పరే. దీని చూపు మాత్రం చాలా మందం. దూరపు వాటిని సరిగా చూడలేదు. ఖడ్గమృగం, మందంగా వెండి రంగులో ఉండే చర్మంతో ఉంటుంది. దీని చర్మం మడతలు మడతలుగా ఉంటుంది. ఈ మడతలవద్ద చర్మం ఎర్రగా వుంటుంది. మగ ఖడ్గమృగం మెడపై చర్మపు మడతలు మందంగా ఉంటాయి, ఐతే శరీరంపై వెంట్రుకలు చాలా తక్కువ.

ఇవి ఆహారం లభించే అడవి ప్రాంతల్లో సంచరిస్తూ, జీవిస్తూ, ఆపదలను గమనించి స్వరక్షణ గావించుకుంటూ జీవిస్తాయి.

మానవులు ధన సంపాదన కోసం ఏ జంతువునైనా మచ్చిక చేసుకునో, బంధించో లాభం పొందుతారుకదా! దీన్ని బంధించి వుంచితే 40 యేండ్లు, స్వేచ్ఛగా అడవుల్లో తిరూగుతుంటే 47 యేండ్లు బ్రతుకుతాయని ఒక అంచనా. వీటికి, వీటి ఆకారం వల్లో ఏమో కానీ  ప్రకృతిలో శత్రువులు చాలా తక్కువ. మందపాటి చర్మం ఉండటాన చలికి తట్టుకోగలుగుతాయి.

పులులు మాత్రం వీటి ప్రధాన శత్రువులు. పులి మాటూవేసి వెనుక నుంచి దూకి మెడ పైభాగాన కొరికి గోళ్ళతో గీరి చంపేస్తుంటూంది. పులులు అటకాయించి సమూహాలలో లేని చిన్న ఖడ్గమృగపు దూడలను సులువుగా చంపి తింటాయి.

మానవులు వీటి రెండవ ప్రధాన శత్రువులు. మానవులు శతృవులు కాని జంతువులే లేవుకదా! అందుకే జంతుసంతతి అధికంగా కొన్ని జాతులు కనుమరుగవుతున్నాయి. మానవులు వీటిని చంపి వీటి శరీరభాగాలను అమ్ముకుంటారు. ఎంత దారుణం!

Rhinoceros

ఈ ఖడ్గమృగాలు, భారతదేశం, పాకిస్తాన్ ,బర్మా, బంగ్లాదేశ్, చైనా వరకు తిరుగుతుంటాయి. ఈశాన్యభారతం, నేపాల్ లో వీటి జనాభా ఉంది.

పందొమ్మిదో శతాబ్దపు చివర్లో, ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభ దశలో, వీటిని వేటాడి చంపేవారు. ఇలా చంపుకుంటూపోతే చివరకు ఏఒక్క మృగమూ మిగలదు.అందుకే అన్ని దేశాల ప్రభుత్వాలూ మేలుకుని వన్య జంతుసంరక్షణ చేపట్టడం ముదావహం!

'సూడాన్' అనే ఈ ప్రపంచంలోని ఏకైక తెల్ల మగ ఖడ్గమృగం చనిపోతే ఇక ఆ జాతి భూమిపై ఉండదుట!

ప్రఖ్యాతి గాంచిన గర్టీ అనే పేరు గల నల్లని ఖడ్గమృగం కొమ్ము 1.4 మీటరు కన్నా పొడవు పెరిగిందిట! ఒక తెల్లని ఖడ్గమృగం కొమ్ము రెండు మీటర్ల వరకు పెరిగింది! చాలామంది ప్రజలు వాటిని మందులకు ఉపయోగిస్తారు, మరి కొందరు కటారికి పిడిగా ఖడ్గమృగం కొమ్ములను ఉంచుకోవడం ఒక హోదాగా భావిస్తారు, వీటికోసం నిర్ధాక్షిణ్యంగా వీటిని చంపేస్తున్నందుకే వీటి జాతి క్షీణించి పోతున్నది. 1900 సం.లో కేవలం 100 మృగాలు మాత్రమే వుండగా, నేటికి వీటి జనాభా 2500 చేరింది. అయినా వీటి జనాభా అపాయస్థితిలోనే ఉంది. భారత్, నేపాల్ ప్రభుత్వాలు ప్రపంచ వన్యప్రాణులను కాపాడే దిశలో పనిచేస్తున్నాయి. ఇలా సాగితే మరికొంతకాలానికి ఇవి సురక్షితంగా వాటి సంఖ్యను పెంచుకుంటూ జీవిస్తాయేమో చూద్దాం.

Posted in July 2021, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *