Menu Close
జంతుసంపద
-- ఆదూరి హైమావతి --
చింపాంజీ
Chimpanzee

చింపాంజీ హోమినిడే కుటుంబానికి చెందిన జంతువు. ఇది నిటారుగా నిలబడ గలదు. కోతిలాగే చేతులతోనూ నడుస్తుంది.

Chimpanzeeవీటిలో రెండు  జాతులున్నాయి. ఒక జాతి పశ్చిమ ఆఫ్రికా, మధ్య ఆఫ్రికా ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. దానిని 'కామన్ చింపాంజీ' అంటారు. రెండవ జాతి చింపాంజీలు కాంగో ప్రాంతాల్లో నివసిస్తాయి. ఈ జాతి సాధారణ నామం బొనొబో. ఆఫ్రికాలో ఈ రెండు జాతులూ కాంగో నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తున్నది.

చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్‌లు, మానవులు - వీరంతా 'హోమినిడే' జీవ కుటుంబానికి చెందిన జంతువులు.  పైరెండు చింపాంజీ జాతులు మానవ జాతికి అతి దగ్గరగా ఉన్న జంతుజాలం.

ఎదిగిన మగ చింపాంజీ 35నుండి 70 కిలోగ్రాములు బరువుంటుంది. 3-4 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆడ చింపాంజీలు 26నుండి 50 కిలో గ్రాములు బరువు, 2-3½ అడుగులు ఎత్తు ఉంటాయి.

Chimpanzee

అడవులలో పెరిగే చింపాంజీల జీవన ప్రమాణం 40 ఏళ్ళు అని చెప్పుకోవచ్చు. పెంపుడు చింపాజీలు 60 ఏళ్ళ వరకు బ్రతకవచ్చు. టార్జాన్ అనే చిత్రంలో నటించిన "చీతా" అనే చింపాంజీ వయసు 2008 నాటికి 76 సంవత్సరాలు.

సాధారణ చింపాంజీ, బోనొబో అనే ఈ రెండు జాతులకూ ఈతరాదు. ఈదలేవు.

సాధారణ చింపాంజీ, బోనొబోల శారీరక నిర్మాణంలో తేడాలుంటాయి. ఐతే చాలా తక్కువ. కాని వాటి సామాజిక జీవనంలో చాలా భేదాలున్నాయి. సాధారణ చింపాంజీలు శాకాహారము, మాంసాహారము కూడా  తింటాయి. అన్నీ కలసి వేటాడుతాయి.

Chimpanzeeబోనొబోలు సాధారణంగా పండ్లనే తింటాయి. ఇవి చాలా స్నేహంగా జీవిస్తాయి. సమూహాలలో నాయకత్వం గురించి పెద్దగా పోటీ ఉండదు. మానవుల్లాగే ఆడ బొనొబోలు పిల్లల పెంపకంలో పూర్తిగా బాధ్యత కలిగి ఉంటాయి.

చింపాంజీ రెండు జాతులలోను పైకి కనిపించే చర్మం అవి చిన్నవిగా ఉన్నప్పుడు లేత రంగులో ఉండి పెరిగే కొద్దీ ముదురు రంగులోకి మారుతుంది. సాధారణ చింపాంజీల కంటే బోనొబోలు ఎక్కువగా రెండు కాళ్ళమీద నడుస్తాయి. బోనొబోల కంటే సాధారణ చింపాంజీలకే ఎక్కువగా దాడి చేసే ప్రవర్తన ఉంటుంది.

ఆఫ్రికాదేశీయులు చింపాంజీలతో కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచే సంబంధాలు కలిగి ఉండేవారు. అంటే మనం పెంపుడు జంతువులను పెంచుకున్నట్లన్నమాట. కాంగో లాంటి కొన్ని ఆఫ్రికా దేశాలలోని కొన్ని గ్రామాలలో వీటిని పెంపుడు జంతువులుగా పెంచుకునే వారట!.

ఇటీవల జరిపిన కొన్ని అధ్యయనాలు ఇలా తెలియజేస్తున్నాయి.

Chimpanzeeచింపాంజీలు సాటి జీవుల పట్ల దయ, జాలి, కనికరము వంటి గుణాలను చూపుతాయని ఋజువైందిట!  విచారాన్ని తెలియజేయడం, ప్రేమను చూపడం, వానలో చిందులుతొక్కి తమ ఆనందాన్ని వెలిబుచ్చడం, ప్రకృతి అందాలైన సూర్యోదయం, సూర్యాస్తమయం, జీవ జాలం పట్ల ఆసక్తి కలిగి ఉండటం మొదలైన లక్షణాలు, చింపాంజీ ఆధ్యాత్మికతకు ఆధారాలు అనుకోవచ్చు.

చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్‌లు మనుషుల లాగానే ఆటల్లోను, కుస్తీలలోను, చక్కిలిగింతలు పెట్టినపుడు నవ్వడంలోనూ శబ్దాలను చేస్తాయి.

బొనొబోలు సంతోషంగా ఉన్నపుడు, చక్కిలిగింతలు పెట్టినపుడు చిన్నపిల్లలలాగానే ముఖకవళికలను చూపడం, భావం వ్యక్తీకరించడం చేస్తాయి. చింపాంజీలకు కూడా మనుషులలాగానే చంకలు, పొట్ట వంటి అవయవాలమీద చక్కిలిగింత కలిగే లక్షణాలు ఉంటాయి.

కొన్ని చింపాంజీలు వినోద జంతువులుగాను, జంతుప్రదర్శనశాలలో మనకు కనిపిస్తాయి. 1859లో ‘ఛార్లెస్ డార్విన్’ ప్రచురించిన జీవ పరిణామ సిద్ధాంతము చూశాక చింపాంజీల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి కలిగి వాటి జీవనశైలి మీద ఎన్నో పరిశోధనలు చేశారు. కనుకనే వాటి గురించిన బోలెడంత సమాచారం మనకు ఇప్పుడు లభిస్తుంది.

Posted in June 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!