Menu Close

page title

హమ్మింగ్ బర్డ్

humming bird

హమ్మింగ్ బర్డ్ అనే పేరే తమాషాగా ఉంది కదూ! ముచ్చటగా వుండే పోకంత [వక్క] చిన్న పిట్ట [పక్షి] ఇది. ప్రపంచంలో ఉండే పక్షులన్నింటి కంటే అతి చిన్న పక్షిగా రికార్డులకెక్కింది ఈ హమ్మింగ్ బర్డ్!

హమ్మింగ్ బర్డ్ అనడంతో ఇది పాట పాడుతుందేమో అనే అభిప్రాయం మనకు కలగ వచ్చు. కానీ ఈ పక్షి తన రెక్కలను అలా అలా ఆడించేప్పుడు వచ్చే శబ్దం చాలా శ్రావ్యంగా ఉండటం వల్ల దీనికి 'హమ్మింగ్ బర్డ్' అనే పేరొచ్చింది. పేరు మానవులకైనా పశుపక్ష్యాదులకైనా వాటి ఆకార విశేషాలను బట్టి, రంగు, రెక్కలు కంఠధ్వనిని బట్టీ వస్తుంటుంది. అలాగే దీనికీ దీని రెక్కల శబ్దం ఇంపుగా, వినసొంపుగా, పాట ‘హం‘ చేసినట్లుగా ఉండటాన దీనికి హమ్మింగ్ బర్డ్ అనే పేరు వచ్చినట్లు తెలుస్తున్నది. వీటి కాళ్ళు సన్నగా బక్క పలచగా ఉండటాన ఇవి నడవ లేవు. అందువల్ల తమ ఆహారమైన పుష్పాలలోని తేనెను గాలిలో రెక్కలు అల్లల్లాడిస్తూ ఎగురుతూనే త్రాగుతుంటాయి. చూడటానికి చాలా తమషాగా ఉంటుంది. పూలలో ఒక కదిలే పువ్వుల రెక్కల్లా ఉంటుంది.

వీటికి మిగిలిన పక్షులకంటే చాలా చిత్రమైన శక్తి ఉంది. అదే వెనక్కు ఎగరడం. సాధారణంగా పక్షులన్నీ ముందుకే ఎగురుతాయి. ఇవిమాత్రం వెనకకు కూడా ఎగుర గలవు. ఈ పక్షులు గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయంటే నమ్మలేం. కానీ, యదార్ధం. ఇవి సెకనుకు 200 సార్లు తమ రెక్కలను ఆడించగలవు! అలా ఆడిస్తూ ఉంటేనే అవి తమ పనులు చేసుకోగలవు. నేల మీద నడవ లేవు గనుక రెక్కలను ఆడిస్తూనే ఉంటాయి. ఎక్కడైనా ఆగినపుడు తప్ప. వీటిల్లో మగ పక్షుల ముక్కులు కాస్త పొడుగ్గా, వాడిగా ఉంటాయి. అవి వాటి పదునైన ముక్కునే కత్తుల్లా వాడుకుంటాయట.

శత్రువుల నుంచి స్వయం రక్షణ చేసుకోను ఆయుధాల్లా వాడుకుంటాయన్నమాట. న్యూమెక్సికో స్టేటు లోని విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలోఈ విషయం బయట పడిందిట. ఇన్నాళ్లూ ఈ పక్షులు చురుకైన ముక్కుల ద్వారా పూల మకరందాన్ని మాత్రమే ఆస్వాదిస్తాయని అనుకున్నారు. కానీ, ఇవి ముక్కుతో చేసే పనులు చూసి శాస్త్రజ్ఞులే ఆశ్చర్యపోయారు. వీటికి ఆటలు, పోటీలు అనేకం ఉన్నాయి. ఇవి ఒకదానితో మరొకటి గొంతుపై ముక్కుతో పొడుచుకుంటూ పోటీ పడతాయి. తమ జత పక్షి ఇబ్బందుల్లోఉంటే శత్రువుల నుండి కాపాడటానికి మగ హమ్మింగ్ పక్షులు ముక్కులతో ప్రత్యర్థుల గొంతుపై గట్టిగా పొడుస్తూ యుద్ధానికి దిగుతాయి. చూశారా! తమ జంటను కాపాడుకోను వీటికి దేవుడిచ్చిన ఆయుధం, దాన్ని వాడుకునే తెలివీ కూడా ఎంత గొప్పవో!

శాస్త్రవేత్తలు ఎన్నెన్నో విషయాలను ఎంతో కష్టపడి వారి పరిశోధన ద్వారా కనుగొని లోకానికి అందించి ఆశ్చర్యపరుస్తారు కదా. అలాగే కొస్టారికా ప్రాంతంలో శాస్త్రవేత్తలు నాలుగేళ్ల పాటు అక్కడున్న అనేక వివిధ వయసు పక్షుల ముక్కుల పొడవు, చురుకుతనం లాంటివి తెలుసుకోను పరిశోధనచేశారుట! ఇలా ముక్కుతో శత్రువు బారినుండి కాపాడుకొనే నైపుణ్యం అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ కు మాత్రమే ఉండడంతో ఆశ్చర్యపోయారు. అంతకు ముందు జరిగిన పరిశోధనల్లో మగ హమ్మింగ్లు ఆడపక్షుల్ని ఆకట్టుకోవడానికి గొంతును మార్చుతూ శబ్దాలు చేస్తాయనే సంగతి తెలిసింది.

వీటికి వాసన చూసే శక్తి లేదు! వీటి నాలుక ఇంగ్లిష్ అక్షరం ‘డబ్ల్యూ’ ఆకారంలో ఉంటుంది! వాతావరణాన్ని బట్టి వీటి ఒంటి రంగు కూడా మారుతుందిట, మన ఊసరవెల్లిలా! వీటి గుండె నిమిషానికి 1,260 సార్లు కొట్టు కుంటుందట! ముందుకీ వెనక్కీ కూడా ఎగరగల పక్షి ఇదొక్కటే. ఇవి గుండ్రం గా చక్కర్లు కూడా కొట్టగలవు. పైకి, కిందికి నిటారుగా కూడా ఎగర గలవు!

మగ హమ్మింగ్ పక్షులు అసలు ఏపనీ చేయవు. ప్రతిదానికీ ఆడవాటి మీదే ఆధార పడతాయి. గూడు కట్టడం దగ్గర్నుంచి, గుడ్లు పొదగడం, పిల్లల కు ఆహారం తీసుకు రావడం వరకూ ఆడ పక్షులే అన్ని పనులు చేస్తాయి! మగమహారాజులు మరి!

వీటికి ఎరుపు రంగంటే చాలా ఇష్టం. ఎక్కువగాఎర్రటి పూల తేనెనే త్రాగుతాయిట! ఇవి ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకో లేవు. అందువల్ల తరచూ తినకపోతే బతక లేవు. అందుకే గంటకు ఏడు నుంచి పది సార్లు తింటాయి. తిండిపోతులా ఏం అనిపిస్తుంది కదూ! ప్రతి సారీ ముప్పై నుంచి నలభై సెకన్లు మాత్రమే భోజన కార్యక్రమానికి వెచ్చిస్తాయి. తేనె, జిగురు, చిన్నచిన్న పురుగుల్లాంటివాటిని తింటాయి! సృష్టిలోని వింతలు ఎన్నెన్నో. సృష్టికర్త చాతుర్యం, నైపుణ్యం మహా గొప్పనిపిస్తుంది.

Posted in December 2018, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *