Menu Close

గ్రంథ గంధ పరిమళాలు

సింహరాజ్ గారి ‘పంచతంత్రంలో ప్రపంచతంత్రం’

(సంస్కృత శ్లోకాలకు ఆంధ్ర పద్యానువాదం వ్యాఖ్యానసహితం)
సంస్కృత మూలం : విష్ణు శర్మ రచించిన “పంచతంత్రం”

గత సంచిక తరువాయి »

అనువాద విధానం:

సంస్కృత పంచతంత్ర ప్రాశస్తాన్ని గూర్చి పంచతంత్ర కర్త విష్ణుశర్మ రెండే రెండు శ్లోకాలలో తెల్పారు. ఆ శ్లోకాలకు సింహరాజ్ గారి అనువాదం –

“ఎవరికి పంచతంత్రము హృదయగతమొ
తాము చదివిగాని, గురు బోధనమున గాని
అట్టివారికి ఓటమి యనుటెలేదు
స్వర్గవిభుడె తమకు ప్రతిస్పర్థియైన”

అటుతర్వాత సింహరాజ్ విద్యను గూర్చి, ధర్మాన్ని గూర్చి తన అనువాద గ్రంధంలో వివరించారు. ‘మానవునికి ముఖ్యంగా కావలసినవి –విద్య, ధర్మం. విద్య నేర్చుకొంటే దాన్ని ధర్మపరమైన ధనార్జనకు ఉపయోగిస్తే మానవుడు పరిపూర్ణుడవుతాడు’ అని సింహరాజ్ తన అనువాదం ద్వారా తెలిపారు. విద్య “అన్యులపహరింప అలవికానట్టిది..” “విద్య వినయకారి –వినయ మర్హత నిచ్చు.. (పేజి 4)..” “శాస్త్రమన నరులకు చక్షువువంటిది..” అని విద్య యొక్క విలువను తెలిపారు.

విద్య రెండు రకాలు ౧. శస్త్ర విద్య ౨. శాస్త్ర విద్య.

మానవునికి “వార్థకమున శస్త్రపాండితి హాస్యమౌ

శాస్త్ర విద్య యశము శాశ్వతమ్ము“

ముసలితనంలో తోడుగా నిల్చి మనసుకు శాంతి నిచ్చేది అక్షరవిద్యే గదా.

ప్రతి పనికి ఒక నిర్ణీత కాలం ఉంటుంది. అలాగే విద్య నేర్చుకోవడానికి గూడా ఒక సమయం ఉందన్న ఈ పద్యం తెలుగు పదాల పాల రుచులు నిండిన పాలకుండ.

“క్రొత్త గిన్నె పైన కూర్చిన రేఖలు
చిరము నిల్చునట్లు స్థిరముగాను
పొట్టెగాండ్ర లేత బుద్ధిని నాటంగ
హితము మప్పవలయు కతలు చెప్పి” (పేజీ 5)

పిల్లలకు అన్నపానాదులతోపాటు చిన్నతనం నుండి తల్లిదండ్రులు విద్య నేర్పించండి అన్న సత్యాన్ని చాటి చెప్పే ఈ పద్యం అందరికీ ఆచరణీయం. మంచి కథలు చెప్పడం కూడా విద్యలో ఒక భాగమే.

ధర్మో రక్షతి రక్షితః –

ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఇది మనం తరచూ వింటుంటాం. అయితే అసలు ధర్మం అంటే ఏవిటి? ఈ ప్రశ్నకు ….

“ఒక్క ముక్కలో ధర్మంము నొక్కి చెప్ప
అన్యులకు మేలుసేయుట పుణ్యమగును
పరుల పీడించుటే దొడ్డ పాపమగును
బరుల తప్పులు క్షమియింప నొదవు శాంతి”

ఇతరులకు ఉపకారం చేయడమే ధర్మం. అట్టి ధర్మం నీకు పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది.

సకల ధర్మశాస్త్రాలు చెప్పే సారం ఒక్కటే. అది ఇతరులపై పగ తీర్చుకోకుండా ఉండడమే ఉత్తమ కృతి అన్నారు పెద్దలు. ఈ సందర్భంలో సింహరాజ్ తిక్కన రచించిన “బరు లేయని ఒనరించిన.. అన్న పద్యాన్ని ఉదాహరించారు.

“ధర్మవిరహితమగు జీవితమ్ము” ఎవడు నడుపుతాడో వాడు “కమ్మరుల కొల్మితిత్తికి తమ్ముడతడు” కొలిమితిత్తి లాగా ఊపిరి పీల్చుకొంటూ మాత్రమే బ్రతికే అతని బ్రతుకు నిరర్థకం గదా.

“తనువు కన్న చేయు ధర్మమెచ్చు” (పేజీ 10) కాబట్టి విద్య నేర్చుకొని, ధర్మమార్గంలో మానవుడు దానం సంపాదించాలి. “తనకు చావు ముసలితనం రాదు అన్నట్లు పైడి, విద్య సంపాదించి దానిని తగురీతిలో వెంటనే దానధర్మాది కార్యాలకు వెచ్చించడం, ఇతరులను బాధించకుండా ఉండడం మానవధర్మం” అని విష్ణుశర్మ చెప్పిన సత్యాలను, సూక్తులను అర్థవంతంగా, మనోహరంగా అనువదించిన సింహరాజ్ అభినందనీయులు.

3. రాజనీతి – 12 ఉపశీర్షికలు

రాజనీతిని గూర్చి రాజకుమారులకు బోధించండమే పంచతంత్రం యొక్క ముఖ్యోద్దేశం. కాబట్టి ఈ శీర్షికకు ప్రాధాన్యత నిచ్చి సింహరాజ్ గారు రాజనీతిని పన్నెండు ఉపశీర్షికలుగా విభజించారు. 14వ పేజీ నుండి 204 వ పేజీ వరకు రాజు, రాజ్యసంబంధమైన అన్ని విషయాలను హృద్యంగా అనువదించారు.

ఉపశీర్షికలలో ఉన్న విషయాన్ని సంక్షిప్తంగా, విషయపూర్ణంగా తెల్పుతూ, దానికి సంబంధించిన ప్రాచీన, ఆధునిక సమాజంలో ఉన్న పరిస్థితులను, విలువలను సింహరాజ్ వివరించిన తీరు అద్భుతం. ఒక్కొక్క ఉపశీర్షికకు సంబంధించి సింహరాజ్ తెలిపిన, ఒక్క ప్రత్యేక విషయం వారి పరిశోధనకు, విషయ పరిజ్ఞానానికి గీటురాయి. అలాంటివి కొన్ని మచ్చుకు ఇక్కడ పొందుపరుస్తున్నాను.

ఉపశీర్షిక – 4: రాజనీతి, రాజ లక్షణములు –ధర్మములు (పేజీ 14)

రాజ్యానికి ముఖ్యమైనవి సప్తాంగములు; స్వామి, అమాత్యుడు, సుహృదుడు, కోశము, రాష్ట్రము దుర్గము మరియు బలము. అలాగే రాజుకు కావలసినవి మూడు శక్తులు; ప్రభుశక్తి, మంత్రశక్తి మరియు ఉత్సాహశక్తి. వీటిని గూర్చి సింహరాజ్ గారు, పంచతంత్ర కర్త చెప్పినదే గాక సంస్కృత భాషలో నారాయణ పండితుడు రచించిన “హితోపదేశం నుండి గూడా మంచి విషయాలను సేకరించి అందించారు.

హితోపదేశం లోని సంధి విగ్రహాలలోని విషయాన్ని ప్రస్తావిస్తూ, పూర్వం రాజు చతుష్షష్ఠి కళలలో ఆరితేరినవాడై ఉండాలని నిబంధన ఉండేదని అది నేటి అభివృద్ధి చెందిన నాగరికత లో కూడా కనపడుతున్నదని (నాటో) చెబుతూ ఎక్కడో ఒక మూల యుద్ధం రాజుకొంటూనే ఉన్నదనీ, సంధీ జరుగుతూనే ఉందని గుర్తుచేశారు.

“విత్తుకానుపించు సత్తువలేనట్లు
తగిన ఎరువు, నీరు తగిలి నంత
తరువు రూపమెత్తి, తనియించు పండ్లతో
ప్రజలనట్లె బ్రోవ ఫలితమిత్త్రు”

నీరసమై కనపడే విత్తుకు నీరు, ఎరువు తగిలితే చెట్టై, పండ్లనిస్తుంది. అదేవిధంగా రాజు ప్రజలను ప్రేమగా చూచుకొంటే ప్రజలు కూడా రాజుకు అండగా ఉంటారు అన్నది పరమ సత్యం, యదార్థం కూడా. ఇది మంచి పద్యం. మంచి ఉపమానం గూడా.

ఈ సందర్భంగా విష్ణుశర్మను సింహరాజ్ స్మరిస్తూ, “రాజకుమారులను సర్వాంగీణ ప్రతిభా సంపన్నులను చేయడానికి ఒక సంక్షిప్త ప్రయత్నంగా ఈ పంచతంత్ర రచన జరిగింది. అందులో ప్రపంచతంత్రాన్ని ఇమర్చడంలో రచయితా పూర్తిగా కృతకృత్యుడై విశ్వజనీన కృతికర్తగా ఖ్యాతి సంతరించుకున్నాడు. ఇందులో ఉదాహరించిన సూక్తులన్నీ శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాసకావ్య, మనుధర్మశాస్త్ర, అర్థశాస్త్ర గతములైన విషయములే. ఈ గ్రంథం ఒక సంక్షిప్త విజ్ఞాన సర్వస్వం” అని అన్నారు.

రాజుకు కావలసినవి మూడు శక్తులు; ప్రభుశక్తి, మంత్రశక్తి మరియు ఉత్సాహశక్తి గురించి ప్రస్తావిస్తూ,

ప్రభుశక్తి అంటే రాజు ప్రజలను రక్షించడం, ఉద్యోగులను అదుపులో ఉంచడం, రాజు సర్వజ్ఞుడై ఉండడం.

మంత్రశక్తి అంటే మంత్రి యొక్క మంతనముల(ఆలోచనల) శక్తి. రాజు మంచి మంత్రులను కలిగి ఉండాలి.

ఉత్సాహశక్తి అనగా చతురంగబలాలు, పూర్ణంగా ఉండే ధనాగారం, రాయబారులు, మంత్రులు, సమర్థవంతమైన గూఢచారి వ్యవస్థ, ఇవన్నీ రాజుకు ఉత్సాహాన్నిస్తాయి. అదే ఉత్సాహశక్తి.

“కలిమి, మంచితనము, తెలివితేటలుగల శత్రుతోడనైన సఖ్యపడుము” ఎవరితో సంధి చేసుకోవాలో చెప్పాడు. అలాగే రాజుకు ఈ గుణాలు ఉండకూడదో, ఏ గుణాలు ఉండాలో మొదలైన విషయాలను విపులంగా సింహరాజ్ చర్చించారు.

 

….. చివరి భాగం వచ్చే సంచికలో …..

Posted in February 2019, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!