Menu Close

గ్రంథ గంధ పరిమళాలు

ఉపోద్ఘాతము: వినతి...ప్రణతి

సద్గ్రంధం ఎప్పుడూ సుగంధ భరిత సాహితీ సుమహారమే. అట్టి సద్గ్రంధాలను మనకు అందించిన జ్ఞాన మూర్తులకు ముందుగా అక్షర నిరాజనం.

60 సంవత్సరాల మా వైవాహిక జీవితంలో మాతో పాటు మాయింటి గ్రంధాలయం కూడా అభివృద్ధి చెంది, ఎన్నో అమూల్యమైన వెలకట్టలేని పుస్తకాలు కూడా పెరిగాయి. వాటిని చూచినప్పుడల్లా నాలో ఏదో తెలియని వేదన. ఈ గ్రంథాలన్నీ ఇలా మగ్గి పోవలసిందేనా?

ఈ గ్రంధాలను భావి తరాల వారికే కాదు ఈ తరం వారికి తెలిసే విధంగా ఒక్కో గ్రంథం యొక్క సుగంధాలను విశ్లేషణల రూపంలో అందరికీ అందిస్తే ఎంత బాగుంటుంది...ఇలాంటి ఆలోచనే ఈ శీర్షికకు మూలమైంది.

ఇక రెండవది, అది ఒక విశేషానుభూతి. మంచి స్నేహ బృందం ఎవరికైనా విరబూచిన బృందావనమే. భగవత్కృపవల్ల మాకు ఆ భాగ్యం లభించింది. మా ఇంట కాలుమోపి మా ఇంటిని పావనం చేసి మా ఆతిధ్యం స్వీకరించిన కొందరు మహనీయులను ఈ సందర్భంగా స్మరించడం సముచితం. వారు: మహాకవి ముదివర్తి కొండమాచార్యులు, డా. బెజవాడ గోపాలరెడ్డి, కళాప్రపూర్ణ మరుపూరు కోదండరామరెడ్డి, డా. బిరుదరాజు రామరాజు, డా. సర్వోత్తమరావు, డా. వెలగా వెంకటప్పయ్య.. ఇలా ఎందఱో జ్ఞానమూర్తులు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యము స్వీకరించడమే గాక వారితో సంభాషించడం వల్ల, వారు విరచించిన రచనలవల్ల నాలో కలిగిన భావనలకు మరింత బలం చేకూర్చారు.

అంతే కాక, వారి పరిచయ భాగ్యం చేత మాకు పరమానందాన్ని, ఎంతో స్ఫూర్తిని కలిగించిన వారు మరికొందరు. వారు: పూజ్య శ్రీ శివానంద మూర్తి గారు, డా. తిరుమల రామచంద్ర, డా. హరి శివకుమార్, డా. తుమ్మపూడి కోటేశ్వరరావు, డా. చలపతి, డా. సముద్రాల లక్ష్మణయ్య, డా. దామోదర నాయుడు.. ఇలా సుజ్ఞాన శిఖరాల వంటి వారి పరిచయ భాగ్యం నాకు అంతర్లీనంగా దోహదపడింది.

బంగారం ఉంటే ఆభరణాలు రావు. స్వర్ణకారుని చేతి స్పర్శతోనే ఆభరణాలుగా అవి సృష్టించబడతాయ్. నా ఆలోచన చెప్పగానే తమ పూర్తి మద్దతు అంగీకారం తెలిపి నన్ను ప్రోత్సహించిన డా. మధు, శ్రీమతి ఉమాప్రియ లకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు. నా ఈ వినూత్న ప్రక్రియకు వేదికగా దొరికిన మన సిరిమల్లె కు  ఈ ‘గ్రంథ గంధ పరిమళాలు’ మరింత సాహితీ సువాసనలను అందిస్తాయని ఆశిస్తున్నాను.

#### #### ####

మొదటి గ్రంధ పరిమళం: మహాకవి శ్రీ ముదివర్తి కొండమాచార్యుల వారి “మధుకమాల” గ్రంథ ప్రశస్తి:

కవి పరిచయం:

మహాకవి ముదివర్తి కొండమాచార్యులు నేటి పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు వాస్తవ్యులు. జననం 02-09-1923; మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ‘విద్వాన్’ పట్టభద్రులు. నెల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 30 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. 1980 నుండి తిరుమల-తిరుపతి దేవస్థానం (టి.టి.డి) వారి పుస్తక ప్రచురణ విభాగంలో ఉపసంపాదకులుగా, సంచాలకులుగా పనిచేస్తున్నారు.

ఆచార్యుల వారు ‘ధర్మదీక్ష’, ‘నారాయణమ్మ’ మొదలైన 40(౪౦) కావ్యాలను రచించారు. తాళ్ళపాక అన్నమయ్య, పెద తిరుమలయ్య, చిన తిరుమలయ్య రచించిన ఆధ్యాత్మిక కీర్తనలలో 1500 కీర్తనలను తీసుకొని వాటిని సరళ సుందరంగా సీస పద్యాలలోకి మార్చిన మహాకవి ఆచార్యుల వారు. టి.టి.డి వారు ప్రచురించిన ఆంధ్ర మహాభారత, మహా భాగవతాలలో కొన్ని భాగాలకు ఆచార్యుల వారు వ్యాఖ్యానం రచించారు. వీరు ‘కవిశేఖర’ ‘విద్వత్కవి’ ‘శిరోమణి’ ‘మహాకవి’ బిరుదాంకితులు.

మదూకమాల గ్రంథ ప్రశంస:

౧. వేడుకోలు, ౨. ఏమని పొగడుదు, ౩. మదూకమాల – కవనవనహేల, ౪. ఇవిగో కొన్ని కలకండ పలుకులు, ౫. సహృదయ హృదయ స్పందనలు.

౧. వేడుకోలు

ఓ మహాకవీ!

మీ మనో మధూక వృక్షము విరగబడి పూచె
రెండు నూర్లకు పైబడి పద్య మధూక పుష్పములను
అయ్యవి చిరుజల్లులా హరివిల్లులా యన
రాలినవి మీ భావనా భాగ్య భవ్యదివ్య దేహళి ముంగిటన్
చెప్పలేనయ్య , - ఆ ఇప్పపువ్వుల సొగసుకు
మీ భావనా మరువంపు కలిమి గలిపి
మా కన్నుల పంటగా మనసుకు హాయిగా
దండలల్లిన మీ చాతుర్యమేమని చెప్పగలను!

హితుల, స్నేహితుల గూర్చి, సమసమాజ స్థితిగతుల గూర్చి
పండు వలిచి మాచేత బెట్టినట్లు
చెప్పి ప్రశస్తి కెక్కితివి మీ కృషి విస్తరించె
హర్షమందినది మీ స్నేహ బృందమంతా.

ఓ సుకవీ!

నిండుపున్నమి పండువెన్నెల పగిది వెలుగు
నీ కవన వనమ్ముతోన కావ్య రసాస్వాదనా సహృదయులకు
కాలూని కలయ తిరుగు కలిమి ప్రసాదింపుమని
మా వేడుకోలు. మాకది చాలు చాలు.

Posted in September 2018, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!