Menu Close
Adarshamoorthulu
-- మధు బుడమగుంట --
డా. Gertrude B Elion
Gertrude Elion

మనిషి పుట్టగానే వారి జీవన విధానం, అభివృద్ధి, శైలి తదితర అంశాలు అన్నీ వారి నుదిటిమీద వ్రాసి ఉంటాయని మనందరి నమ్మకం. అందుకే మన జాతకం ఎట్లుంటుంది అనే ఉత్సుకత మనందరిలో ఉంటుంది. కానీ, కొన్నిసార్లు మన నిజజీవితంలో జరిగే సంఘటనలు మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చి మనలను సరికొత్త మార్గంలోకి నడిపిస్తాయి. అటువంటి ఆలోచనలు సన్మార్గంలో ఉంటే వాటి వలన నిర్ణయాత్మకమైన కార్యాలతో మన జీవితం సన్మార్గంలో వెళుతుంది. ఆ క్రమంలోనే ఎన్నో వినూత్న ప్రక్రియలకు, సరికొత్త విషయాలను కనుగొనేందుకు, అభివృద్ధి పథంలో సాగేందుకు దోహదపడుతుంది. కష్టాలను చవి చూసినప్పుడే సుఖాల విలువ తెలుస్తుంది అన్నట్లు చిన్నప్పుడు ప్రాణాంతకమైన రోగాలతో బాధపడే వారిని చూసినప్పుడు కలిగే బాధ, అసంతృప్తి కొన్నిసార్లు వాటిని రూపుమాపేందుకు ఉన్న అనువుల వైపు మన ఆలోచననలను ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణ వలన ఆ రోగాలకు విరుగుడును కనుగొనే విధానం మనకు కనపడుతుంది. అటువంటి ఆలోచనలతో, ఆ విధానం వైపు తన జీవన గమ్యాన్ని మార్చుకొని ఎన్నో అద్భుత ఆవిష్కరణలకు సూత్రధారియైన మహిళా మూర్తి, జీవ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత, డా. Gertrude Belle Elion, నేటి మన ఆదర్శమూర్తి.

Gertrude Elionజనవరి 23, 1918 న న్యూయార్క్ లో Gertrude గారు జన్మించారు. న్యూయార్క్ లోని సుప్రసిద్ధ మన్హట్టన్ (Manhattan) లోనే తన బాల్యమంతా గడిచింది. ఆమె తండ్రి అక్కడ ఒక దంతవైద్యశాలను నడుపుతుండేవాడు. చదువులో ఎంతో చురుకుగా ఉంటూ, ఎప్పుడూ ఏదో ఒక క్రొత్త విషయాలను నేర్చుకోవాలనే ఉత్సుకత లో ఆమె బాల్యము మరియు ప్రాధమిక విద్యాభ్యాసం నిండిపోయింది. ఆ పిమ్మట పదిహేను ఏళ్ళకే న్యూయార్క్ లోని హంటర్ కాలేజీ లో చేరి 19 సంవత్సరాలు నిండేటప్పటికి రసాయన శాస్త్రంలో పట్టాను పొందింది. కానీ ఆమెకు వెంటనే ఉద్యోగం దొరకలేదు. కారణం, నాటి సామాజిక లింగ వివక్ష. ఆమె స్త్రీ కనుక అప్పుడు ఆడవారికి చదువుకోనూ, మరియు ఉద్యోగావకాశాలు దాదాపు లేవు. అందుకే ఆమెకు ఏ ప్రయోగశాల లోనూ ఉద్యోగం దొరకలేదు కనుక పార్ట్ టైం ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. ఆ పిమ్మట అక్కడి హై స్కూల్ లో substitute టీచర్ గా పనిచేస్తూ న్యూయార్క్ యూనివర్సిటీ లో తన మాస్టర్ ప్రోగ్రాం కూడా పూర్తి చేసింది.

ఎన్నో శాస్త్రీయ విశ్లేషణలు, సరికొత్త ఆవిష్కరణలు చేయాలనే సంకల్పం ధృడంగా ఉండి అందుకు తగిన కృషి సల్పే సామర్ధ్యం ఉంది. కానీ సరైన ప్రోత్సాహం లేదు. కారణం తను ఒక మహిళ. తన మేధోసంపత్తి అంతా ఇలా వ్యర్ధమై పోవడమేనా అని వ్యాకులత చెందుతున్న తరుణంలో ఒక మంచి అవకాశం తనను వెతుక్కుంటూ వచ్చింది.

1941 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు తప్పనిసరై ప్రభుత్వం, మహిళలకు కూడా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉపాధినివ్వడం మొదలుపెట్టింది. వెంటనే మన Gertrude, ఒక ఫుడ్ కంపెనీ లో క్వాలిటీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం సంపాదించింది. అలా ఎదిగి, చివరకు Gertrude, 1944 సంవత్సరంలో Burroughs-Wellcome (ప్రస్తుత GlaxoSmithKline) కంపెనీ లో చేరింది. తన ప్రతిభను గుర్తించి నాటి ప్రముఖ శాస్త్రవేత్త Dr. Hitchings ఆమెను తన సహాయకురాలిగా చేర్చుకొని ఆ పిమ్మాట ఆమెకు మరింత బాధ్యతలు, పరిశోధనా అంశాలు అప్పగించారు. అప్పటి నుండి 40 సంవత్సరాలు నిరంతరం పరిశోధనలు చేస్తూ దాదాపు 45 patents in medicine మరియు 23 గౌరవ పట్టాలు పొందారు. వాటిలో మూడు గౌరవ Ph.D.. పట్టాలు George Washington University, Brown University మరియు The University of Michigan నుండి అంతేకాక Doctor of Science degree, Harvard University నుండి పొందారు. ఆమె ప్రతిభను అంచనా వేసేందుకు ఇంతకన్నా వేరే కొలమానం అనవసరం.

Gertrude Elionఆమె తన పరిశోధనలను పాత పద్దతులననుసరించి trial and error పద్దతి లో సాగించకుండా, మనిషిలోని కణాల రసాయనిక మేళనాన్ని, రోగాన్ని సృష్టిస్తున్న కారకాల రసాయనిక మిశ్రమాలతో పోల్చి వాటిలోని తేడాలను గమనించి తదనుగుణంగా మందులను తయారుచేసే సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందులో మంచి ఫలితాలను సాధించి వైరల్ ఇన్ఫెక్షన్ ను నియంత్రించే మందులను తయారు చేసి leukemia, herpes and AIDS వంటి వ్యాధుల నిర్మూలనకు ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా నేడు అత్యంత సులువుగా చేస్తున్న మూత్రపిండాల మార్పిడి, కాలేయ మార్పిడి తదితర శస్త్రచికిత్సలకు మార్గం సుగమం ఆనాడే చేశారు.  ఎందుకంటే సాధారణంగా ఒక మనిషి అవయవాన్ని మరొకరికి అమరుస్తున్నప్పుడు అవతలివారి శరీరం వెంటనే ప్రతిచర్య జరిపి నిరాకరిస్తుంది. దానినే శాస్త్రీయ భాషలో  ‘body's rejection of foreign tissue’ అని అంటాము. ఇది సంబంధీకులు కానివారు డొనేట్ చేస్తున్నప్పుడు జరుగుతుంది. Dr.Elion మరియు ఆమె టీం, అటువంటి పరిస్థితులలో ఆ నిరాదరణను తగ్గించే విధానాలను రూపొందించారు.

ఆమె నిరంతరం పరిశోధనలు సాగిస్తూనే, అనేక విశ్వవిద్యాలయాలలో భోదిస్తూ తన విజ్ఞానాన్ని భావితరాలకు అందించడమే కాకుండా అనేక సంస్థలలో గౌరవ సలహాదారుగా సేవలందించింది. భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల అన్ని విభాగాలలో పరిశోధనలతో తన గుర్తింపును చాటింది. ఆమెకు ఎన్నో పురస్కారాలు లభించాయి. అన్నింటినీ మించి 1988 లో Dr. Elion కు మెడిసిన్ లో Dr. Hitchings మరియు Sir James Black తో కలిసి నోబెల్ ప్రైజ్ లభించింది.

జీవ రసాయన శాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలకు సూత్రధారిగా నిలిచి వైద్య రంగంలో ఎన్నో నూతన విధానాలకు తెరతీసి తద్వారా 1988 నోబెల్ బహుమతి కూడా పొందిన ఈ మహా సాధ్వి  ఫిబ్రవరి 21, 1999 న నార్త్ కెరొలినా రాష్ట్రంలోని చాపెల్ హిల్ పట్టణంలో పరమపదించారు. కానీ వైద్య రంగంలో ఆవిడ సృష్టించిన మందులు, విధానాలు నేడు ఎంతోమంది రోగులకు, వైద్యులకు, పరిశోధకులకు, ఉపయోగపడుతున్నాయి.

Posted in May 2021, వ్యాసాలు

2 Comments

  1. Dr C. Vasundhara.

    ఆదర్శం,ఆలోచన,ఆచరణ మూడు కలిస్తే మనిషి మనీషి గా మారి చిరంజీవిగా తన చేతల చేత భువిపై నిల్చిపోతాడు.ఆదర్శమూర్తులను
    దర్శింపజేస్తూ ఆదర్శ పత్రికా సంపాదకులుగా సుస్థిర స్తానం సంపాదించుకున్నారు.అభినందనలు

  2. D.Nagajyothi

    గొప్ప వ్యక్తి ని గూర్చి తెలిపినందుకు ధన్యవాదాలు సిర్

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!