Menu Close
Galpika-pagetitle
గల్పికావని-శుక్రవార ధుని-27- అల్లో నేరెళ్ళో -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

"ఏంటి నాన్నా డబ్బులిస్తే వచ్చే పళ్ళ కోసం నిద్దర చెడగొట్టుకుని ఇంత తెల్లారుజామునే లేచి ఇంత దూరం వచ్చి ఇలా ఏరుకు వెళ్ళడం అవసరమా?" ఇదీ మా అబ్బాయి అనుమానం.

అందుకే వాడినో ప్రశ్న అడిగాను,"జ్యేష్ఠమాసం వచ్చిందని చెప్పేదెవరు? పంచాంగ కర్తలా? పత్రికల దినఫలాలా? బుల్లితెరల భవిష్యవాణులా?"

"జ్యేష్ఠ మాసమా అదేంటి నాన్నా?" అని ఎదురడిగాడు. నేను లక్షలకి లక్షలు ఖర్చుపెట్టి చదివిస్తున్న చదువు వాడికి నేర్పిందదే. తెలిస్తే గొప్పలు పోవడం. తెలియకపోతే తెల్లబోవడం.

వాడికి జ్యేష్ఠమాసం అంటే తెలుగు నెల అనీ దాని రాకని తెలియజేసేవి నేరేడు పళ్ళనీ అర్థమయ్యేలా చెప్పడానికి అరగంట సేపు ఆంగ్లంలో కొట్టించుకోవలసి వచ్చింది.

నిజానికి నేరేడు పళ్ళంటే ఏమిటి? పదహారేళ్ళ పడుచు కళ్ళు. అవి లేకపోతే అమ్మాయిలకి అందమే లేదు. అందం లేకపోతే అమ్మాయిలూ ఉండరు. ఆకర్షణా ఉండదు. ఆ రెండూ లేకపోతే జీవితానికి అర్థం ఏముంటుంది? ఇవన్నీ ఓ తండ్రిగా వాడికి నేను చెప్పగలిగేవి కావు. మనం చెప్పలేని ఎన్నో విషయాల్ని ఎంతో మనోహరంగా సవివరంగా మనసుకి హత్తుకునేలాగా చెప్పేదే ప్రకృతి. సమయం ఆసన్నమైనప్పుడు కాలమే ఆ ప్రకృతి గురించి వాడికి వివరిస్తుంది.

అందుకే అందాల గురించి కాకుండా ఆరోగ్యాన్ని గురించి చెప్పడం మొదలెడుతూ ప్రశ్నించాను, "మా అమ్మ షుగరుకి విరుగుడేంటో తెలుసా?" అనగానే వాళ్ళ నానమ్మ వాడే మందుబిళ్ళల పేర్లన్నీ టకటకా చెప్పేశాడు.

"ఆ మందుల్ని మించిన దివ్యౌషథం నేరేడు పళ్ళు" అనగానే వాడు వెటకారంగా నవ్వాడు.

ఈ మధ్యన పిల్లల్లో వినయానికి బదులుగా వెటకారం పెరుగుతోంది. అందుక్కారణం వాళ్ళకిస్తున్న జ్ఞానం కంటే.., వాళ్ళలో విజ్ఞానులమైపోతున్నాం అనే భ్రమల్ని మాత్రమే పెంచే కార్పొరేటు బడులు.

వాటి గురించి మాట్లాడుకోవడానిది సమయం కాదు. అందుకే వాడిని నోరుమూసుకుని నేరేడు పళ్ళు ఏరమని కసిరాను. వాడు బిక్కమొగం వేసుకుని ఏరడం మొదలెట్టాడు. వాడు ఏరుతున్నవాటిలో కొన్ని చితికిపోయాయి. నేను ఏరినవాటిల్లో చితికిపోయినది ఒక్కటి కూడా లేదు. ఈ విషయాన్ని వాడే గమనించాడు. అంటే ఎలా ఏరాలనేది కూడా వాడే స్వయంగా తెలుసుకుంటాడని అర్థం.

వాడు నేను ఏరుతున్న ప్రదేశాల్ని శ్రద్ధగా గమనించాడు. దాంతో నా విజయ రహస్యం వాడికి అర్థమైపోయింది. అందుకే ఉన్నట్టుండి "నాన్నా దేవుడు గడ్డిని ఎందుక్కనిపెట్టాడో తెలుసా? ఈ నేరేడు పళ్ళు ఇంత మెత్తగా ఉన్నాయి కదా? అవి రాలి పడితే వాటికి దెబ్బతగలకుండా ఉండాలి కదా? అందుకే నేరేడు పళ్ళకి దెబ్బలు తగలకుండా ఉండటానికే ఈ గడ్డి పరుపుని కనిపెట్టాడు"అని చెబుతూంటే వినడం నాకెంతో ముచ్చటేసింది. ఎంతైనా వాడు నా కొడుకు. కాబట్టీ మా నాన్నగారి వారసత్వం వాడికి రాక తప్పదు.

దాదాపు పదినిమిషాలు ఏరామో లేదో తెచ్చిన సంచీ అప్పుడే నిండిపోయింది.

ఇద్దరం ఇంటికి తిరిగొచ్చాం. వాడు నేరేడు పళ్ళు ఏరుకొచ్చాడని తెలిసి మా అమ్మ సంబరం అంతా ఇంతా కాదు. రోజంతా వాణ్ణి పొగుడుతూనే ఉంది. వచ్చినవాళ్ళందరికీ వాడి ప్రయోజకత్వాన్ని గురించి వర్ణించి చెబుతూనే ఉంది. అంతే కాదు, సాయంత్రం వాడు ఆడుకోవడానికి గాలి తుపాకీ కూడా తయారు చేసింది. ఒక గొట్టాన్ని సంపాదించింది. దానికి అటొకటీ ఇటొకటీ నేరేడు గింజల్ని గాలి కూడా చొరలేనంత బిగుతుగా గుచ్చింది. ఇవతలి గొట్టంలో పట్టే గూటంతో గట్టిగా పొడవగానే గొట్టంలో గింజల మధ్య చిక్కడిపోయిన గాలి తాకిడికి ఇవతలి గింజ తుపాకీ గుండులా వెళ్ళి ఎవర్ని గురి చూసి కొడితే వాడికి తగుల్తోంది.

నేను ఆఫీసునించీ ఇంటికొచ్చేసరికి వాడు నేరేడు గింజల తుపాకీతో సిద్ధంగా ఉన్నాడు. నాతో దొంగా పోలీస్ ఆడుతూంటే చూస్తున్న అమ్మ ఆనందం అంతా ఇంతా కాదు.

మా అమ్మ నవ్వుతూ అంది,"తుపాకీ గొట్టంద్వారా వచ్చేది కేవలం విప్లవం మాత్రమే కాదురా, వికాసం కూడా"

నాలోకి నేను చూసుకుంటూ నవ్వేశాను.

మర్నాడు తెల్లవారుజామున "నాన్నా నేరేడు పళ్ళకెళ్దాం రా"అంటూ వాడే నన్ను నిద్రలేపాడు.

"కార్తీ"క బంధం -- డా. శ్రీదేవి శ్రీకాంత్

విజయా.......

కొంచం వక్క పొడి ఇవ్వవూ...

వక్క తింటే క్యాన్సర్ వస్తుందన్నారు గా నేనివ్వను....

పోని...ఒక గ్లాసు వెచ్చని నీళ్ళు ఇవ్వు....

ఊ...

వినిపించిందా....విజయా...

ఉ...ఊ...

ఊ... గుడింతం ఆపు... వంటింట్లో

ఎవరితో మాట్లాడుతున్నావు?

"అతిథి"....తో

నేరుగా వంటింట్లోకి వచ్చిన అతిథి ఎవరో?

"కార్తీ"....

కార్తీ?......నా

అవును శ్రీవారు....ఇవిగో మంచి నీళ్ళు అంటూ వచ్చింది విజయ.

"విజయా ఆచేతిలో..పిల్లిపిల్ల..ఎక్కడిది?"

"ఇదే అతిథి....పేరు .కార్తీ... ఈ రోజు కార్తీక తిథి...ఈ రోజు మన ఇంటికి వచ్చిందని...కార్తీ అని పేరు పెట్టాను"...

'ఓహో...అప్పుడే ..నామకరణ మహోత్సవం జరిపించేశావన్న మాట...'

అవును కదూ...మీరు అక్షింతలు వెయ్యండి కార్తీకి... అంటూ విజయ దేవుని గదిలోకి వెళ్ళి అక్షింతలు...కుంకుమతో తిరిగి వచ్చింది.

హేమంత్.... అనురాగంలో తన గారాలు కలిపి  .... చంటి పిల్లలా వొదిగి పోతుంది విజయ.

'నీలో...పసిపిల్ల తనం పొలేదోయ్ విజయ' అన్నాడు హేమంత్ విజయను చూస్తూ..

విజయ...గోముగా నవ్వుతూ...చూడండి

"చిట్టితల్లి ..తెల్లగా....ముద్దుగా ...ఎంత బాగుందో.... చిన్న కుంకుమ బొట్టు పెట్టండి. కంట్లో పడితే...పాపం మంట పెడుతుంది" అంది గారాంగా...

"ఓహో...నాకు ఈ రోజు నుండి మరో పసిపిల్ల దొరికింది అన్నమాట" అంటూ నవ్వేశాడు  హేమంత్..

"మియావ్ మియావ్"...

'చూడండి...మిమ్మల్ని పలకరిస్తుంది'..

'ఓహో...ఏమంటుందో...నాకు పిల్లి భాష రాదు గాని...నీకేమన్నా అర్ధ మైతే చెప్పు' అన్నాడు భార్య సంతోషాన్ని పంచుకుంటూ...

'హౌ డూ యూ డూ'..అంటుంది...

ఓహో...ఇంగ్లీషులోనా... అంటూ..ప్రతిస్పందనగా...

మీయాం మీయామ్ కార్తీ....అన్నాడు.

చూడండి...కార్తీ ని చూడగానే మీకూ దాని భాష వచ్చేసింది? అని నవ్వుతున్న విజయ వైపు తిరిగి...

" అవును...బాగానే అర్థం చేసుకున్నావు. నేనేమి సమాధాన మిచ్చానో...నీకు అర్ధ మయ్యిందా?" అన్నాడు.

'నువ్వు చాలా అందంగా వున్నావు కార్తీ అన్నారు'...

'ఎంత బాగా చెప్పావే విజయా. బాగానే అర్ధమయ్యిందే  నీకు.

కార్తీ రాక విజయ....హేమంత్ లకు చిరునవ్వుల  వసంతాన్ని తెచ్చింది.

గుంటూరు వాసి, హేమంత్, తిరువనంతపురంలోని ఇస్రోలో సైంటిస్ట్.

విజయ లక్ష్మీ.. హేమంత్ ల ...పెళ్ళి అవ్వగానే..విజయలక్ష్మి ......విజయవాడ నుండి కేరళ లోని తిరువనంతపురం కాపురానికి వచ్చింది.

కార్తీ కోసం పాలుతాగడానికి పాల సీసా,  గిన్నె, అన్నం తినడానికి ప్లేటు...వాటిని పెట్టడానికి ఒక చిన్న బుట్టా...కార్తీ కూర్చోడానికి మెత్తని పీట, కార్తీ కోసం చక్కని పక్కా ...ఏర్పాటు చేసింది.

కార్తీ కోసం బేబీ బాత్ టబ్, సోప్ జెల్, టవలు, దువ్వెన... ఏర్పాటు చేసింది విజయ.

కార్తీకి చక్కని గౌనులు, చిన్న చిన్న సాక్స్ కుట్టింది...

కార్తీకి స్నానం చేయించి బొట్టు పెట్టి...గౌను వేసి వొళ్ళో కూర్చో బెట్టుకుని ఉయ్యాల వూగుతూ పాటలు పాడటం దినచర్య.. కార్తీకి సీసాతో పాలు పట్టి నిద్ర పుచ్చుతూ "జో హచ్చుతానంద" పాడేది విజయ. పాట పాడ కుండా ఆపేస్తే... దాని  భాషలో హడావుడి చేసేది కార్తి. దాని హడావుడి చూస్తే నవ్వు  వచ్చేది విజయకు.

కార్తీ కోసం...చిన్న పట్టులంగా జాకెట్టు కుట్టి...తన రాళ్ళ నక్లేస్ పెట్టి... దానితో ఫోటో తీసుకుంది విజయ.

రోజులు , నెలలు చక చకా దొర్లుతున్నాయి.

"కార్తీ...బంగారం...నువ్వు పెద్దదానివి అవుతున్నావు...కొన్ని పనులు నేర్చుకో....

సరేనా"...కార్తీ..మీయావ్ అనగానే ..."చిట్టి తల్లి చక్కగా అర్థం చేసుకుంటుంది" అని మురిసి పోయింది.

కార్తీ ఒక్కటే బంతి ఆట ఆడుకుంటూ ఇల్లంతా తిరుగుతూ తెగ సందడి చేస్తుంది.

కార్తీకి విజయ... ఓ పిగ్గా...నీ గిన్నె తీసుకురా.... పేపర్ తీసుకురా...అని నేర్పు తూ..దానితో మాట్లాడుతూ వుంటుంది...చూసే వాళ్ళు  ఆశ్చర్యపోయేవారు. మొదట్లో వింతగా అనిపించినా...కార్తీ చేసే చేష్టలు, విజయ చిన్న పిల్లై...ముద్దు ముద్దుగా...నత్తి నత్తిగా మాట్లాడం చూసిన హేమంత్...విజయ .,...ఆనందంలో శృతి కలిపేవాడు.

కార్తీ...పాలు తాగుదుగాని రా..అని పిలిచే సరికి.....దానికి పాలుతాగాడానికి పెట్టిన గిన్నె తీసుకుని...దానికి నిర్దేశించిన పీట మీద కూర్చుంది...పాలు తాగగానే ఆ గిన్నె తీసుకుని...కుళాయి కింద పెట్టింది కార్తీ.

ప్రొద్దుటే వార్త పత్రిక తీసుకుని హేమంత్ కి ఇవ్వడం కార్తీ దిన చర్యల్లో మొదటిది. హేమంత్ ఆఫీసు నుండి వచ్చే సమయానికి ...గేటు దగ్గరికి వెళ్తుంది. కారు దిగగానే దానిని ఎత్తుకోవాలి. హేమంత్ సోఫాలో కూర్చుని...టీవీ చూస్తుంటే వొళ్ళో కూర్చుంటుంది. హేమంత్ తన వొళ్ళో నుంచి కార్తీ ని తీసి పక్కన పెట్టగానే... మళ్ళీ వచ్చి ఒడిలో కూర్చుని సీరియస్ గా టీవీ చూస్తుంది, ప్రపంచంలోని వార్త లన్నీ దానికి పెద్ద అర్ధమవుతున్నట్లు.

హేమంత్ కూర్చునే కుర్చీలో ఎవరైనా కూర్చుంటే వాళ్ళు ఆ కుర్చీలో నుండి దిగే వరకు అరుస్తూనే వుండేది. వాళ్ళు ఆ కుర్చీ లోనుండి దిగగానే ....వేగంగా వెళ్ళి కూర్చునేది. కార్తీ....ఆ కుర్చీ...దానిది హేమంత్ ది మాత్రమే స్వంతం అయినట్లు.

కార్తీ ఎలుకల్ని చూడగానే పారి పోవడం చూసి...నువ్వు పిల్లివి కావు...పిరికివి అని విజయ నవ్వుతూంటుంది. కార్తీ.. బొద్దింక తో ఆడుతున్నావా... అంటూ... కార్తీ ని పట్టుకుని...బొద్దింక దగ్గరగా తీసుకెళ్ళి.... మళ్ళీ వెనక్కు తీసేస్తూ... అలా కొన్ని సార్లు చేసి...చీ ఛ్చి.. పురుగుల జోలికి వెళ్లకూ.. ..అంటూ

విజయ కార్తీకి... ఏ పురుగూ ముట్టుకోకూడదని శిక్షణ ఇచ్చింది...

ఏదైనా చెప్పి.. అర్ధం అయ్యిందా కార్తీ అంటే...కార్తీ మీయావ్ మియావ్ అంటుంది.

కార్తీకి... వాక్సిన్స్... అన్నీ సమయానికి వేయించేది. కార్తీ.. కాస్త నలతగా కనిపిస్తే...వెటర్నరీ డాక్టర్ ని ఇంటికి పిలిచింది విజయ..

డాక్టర్...కార్తీ.. త్వరగా కోలుకుంటుంది కదూ అని పదిసార్లు అడిగింది.

డాక్టర్ గారు..పిల్లుల జీవిత కాలం ఎంతుంటుంది అని అడిగింది. సాధారణంగా... రెండు నుండి పదిహేను సంవత్సరాలు ....ఆ పైన కూడా వుండొచ్చు. మనం ఇచ్చే పోషకాహారం బట్టి, వాతావరణం బట్టి వుంటుంది అన్నారు డాక్టర్. ఈ మధ్య ప్రపంచ రికార్డు లో చేరిన....ఒక పిల్లి జీవించిన కాలం ....ఇరవై తొమ్మిది సంవత్సరాల యెనిమిది నెలల ఇరవై ఏడు రోజులు అని చెప్పారు డాక్టర్. ఇరవై కంటే ఎక్కువ సంవత్సరాలూ బ్రతికినవి వున్నాయి అన్నారు డాక్టర్...మా  కార్తీ ముప్పై సంత్సరాల పైనే బతకాలి డాక్టర్ అంది విజయ.

డాక్టర్ కార్తీ ఎందుకో ఏమీ తినడం లేదు. బాగా నలతగా అనిపిస్తుంది అంది విజయ.

భయపడకండి...ఈ మందులు వేళకు వెయ్యండి అన్నారు డాక్టర్.

విజయ గారు...పిల్లుల వల్ల... మనుషులకు కొన్ని అనారోగ్యాలు వస్తాయి. మీరు జాగ్రతలు పాటిస్తూ పెంచండి అన్నారు డాక్టర్.

... .... ... ... .... ... ... .... ...

మీన్ మీన్ (చేపలోయ్ చేపలోయ్) ...ఇంటి ముందు...చేపల బషీర్ పిలవడం విని కార్తీ..చిన్ని గిన్నె తీసుకుని పరుగున గేటు దగ్గరికి  వెళ్ళింది...

చేపల బషీర్..... బుట్ట అక్కడ పెట్టి...కాతుమ్మా... నువ్వు చేపల బుట్ట జాగ్రత్త గా చూస్తూ వుండు...కుక్కలు, కాకులూ ముట్టుకోకుండా అని చెప్పి...పక్క వాళ్ళకి..చేపలివ్వడానికి వెళ్ళాడు...చేపల వాసనకి...కావ్ కావ్ మంటూ వచ్చిన కాకులు ...పైనుంచి పైనే ఎగురుతూ పోవాల్సిందే...వాటిని నేలపై వాలనివ్వదు కార్తీ... కాకుల్ని చూసి...కార్తీ హడావుడి చేసేస్తుంది.. అటూ ఇటూ అరుస్తూ కార్తీ వేసే పరుగులు చూస్తే...ఎవరికైనా కాసేపు అక్కడే ఆగి దాని సందడి చూడాలని పిస్తుంది.

చేపలు అమ్మే బషీర్...  చుట్టు పక్కల వారికి చేపలు ఇచ్చి....కాతుమ్మా... ఈ చేప తిను అని కింద వేశాడు...కార్తీ తీసుకోలేదు. అప్పుడే గేటు దగ్గరికి వచ్చిన విజయ...బషీర్ నుద్దేశించి.. బషీర్...కార్తీ కింద వేసింది ఏదీ తినదు అంది.

అలాగామ్మ.. అంటూ... కాతుమ్మా....."కయికు"(తిను) అంటూ..  చేపను నోటికి అందిస్తే తీసుకుంది.

కార్తీ చేపను తీసుకెళ్ళి... పెరటి లోని ఇటుక రాయిపై పెట్టి.. ముళ్ళు తీసుకుని...సుతారంగా తిని...నీళ్ళు తాగి ..ఇంట్లోకి వెళ్ళింది..

కాతుమ్మా....మా ఇంటికి వస్తావా బోలెడు చేపలు పెడతాను అనీ బషీర్ అంటే..ఏమి అర్ధమయ్యేదో కార్తీకి.....

ఒక్క పరుగున అరుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళి పోయింది.

రోజూ బషీర్ గుమ్మం లోకి వచ్చి ... కాతుమ్మా... అని పిలవగానే... తోక వూపుకుంటూ వెళ్ళి చేపల బుట్టకు కాపలా కాయడం  కార్తీకి దినచర్య.

విజయ పక్కింటి వాళ్ళు... కార్తీ ని చూసి..."హై ప్రొఫైల్ పూచ" అని..."నల్ల బుద్ది వుళ్ళ పూచా" (చాలా తెలివైన పిల్లి) అనే వారు.

విజయ...కార్తీకి రోజూ దిష్టి తీసేది. పది సంవత్సరాల వయసు గల ...పక్కింటి రీనుకుట్టీ రోజూ కార్తీతో ఆడుకుంటానికి వస్తుంది. రీనూ ని చూడగానే కార్తీ గెంతులు వేసుకుంటూ పరిగెడుతూ ఆడుతుంది...కార్తీకి కొత్త పాత వుండదు. ఎవరు పిలిచినా...పలకరిస్తూ వాళ్ళ దగ్గరకు వెళుతుంది.

...   ....   ..... ...   ....   ..... ...   ....   .....

విజయ హేమంత్ ల వివాహం అయ్యి ఆరు సంత్సరాలు అయ్యింది.

విజయకు.. పిల్లలు లేరన్న దిగులు... కార్తీ ఆలనా పాలనలో కాస్త వూరట నిచ్చింది.

హేమంత్ బెడ్రూం లో పాట పాడుకుంటూ వున్నాడు..."రసమయ జగమును రాస క్రీడ కు వుసి గొలిపే ఈ మధురిమ లో."... ఎందుకో...మాంచి హుషారుగా వున్నారు శ్రీవారు..పాయసం తీసుకోండి అంటూ గదిలోకి వచ్చింది విజయ...

ఎందుకంటే..ఏమి చెప్పను ...ఏమిటంటే ఎలా చెప్పాను ..మన మిద్దరమే వున్నవేళ..

ఇంతలో విజయ లక్ష్మీ...సరసాలు చాలు శ్రీవారు.. ..వేళకాదు...అంటూ పాట అందుకుంది...

...  ...    ... ...   ....   ..... ...   ....   .....

ఒక రోజు....ఇంటి ముందుకు ఒక సాధువు వచ్చాడు... డబ్బులు ఇవ్వడానికి గుమ్మంలోకి వెళ్ళిన విజయ తో పాటు కార్తీ కూడా బయటకు వచ్చింది..

తల్లీ... త్వరలో నీ ఒడి నిండ బోతుంది.

ఈ మార్జాలం ...కారణ జన్మురాలు. దీని దీవెనలు నీకు మెండుగా వున్నాయి.

కానీ.. ఆ తరువాత..ఒక దుఃఖాన్ని కలిగించే సంఘటనా జరుగుతుంది ...ఈ అమ్మన్ కుంకుమ పెట్టుకో అమ్మా...మళ్ళీ వస్తా... శుభం... అంటూ వెళ్ళిపోయాడు.

....   ....  .... ...   ....   ..... ...   ....   .....

విజయకు కళ్ళు తిరుగు తున్నట్లుగా వుంది... కార్తీ..ఏలా కనిపెట్టిందో ఏమో...వురుకున వెళ్ళి నోటితో మొబైల్ తెచ్చి యిచ్చింది. కళ్ళు మూత పడుతున్నా...విజయ వోపిక తెచ్చుకుని భర్తకు ఫోన్ చేసింది.

హేమంత్, డాక్టర్ను తీసుకు వచ్చారు..

విజయను పరీక్షించిన డాక్టర్... హేమంత్ గారు... మీరు తండ్రి కాబోతున్నారు కంగ్రాట్స్ అంది.

విజయ గారు బాగా నీరసంగా వున్నారు..... మూడు.. నాలుగు నెలలు విశ్రాంతి  తీసుకోవడం మంచిది. ఈ మందులు వాడండి.....మంచి ఆహారం తీసుకోండి. బరువైన పనులు చేయకండి అంది డాక్టర్.

....  ... .... ...   ....   ..... ...   ....   .....

కార్తీ ని జాగ్రత్తగా చూసుకోమని పని అమ్మాయికి అప్పగింతలు పెట్టి....విజయ తిరువనంత పురం నుండి విజయవాడ పుట్టింటికి వచ్చింది.

విజయ వెళ్ళాక...కార్తీ...బెంగతో సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదు...చేపల బషీర్ రాగానే..బయటికి వస్తుంది. ఎప్పటిలా బుట్ట కాపలా కాస్తుంది.....కాతుమ్మా...చేప ఇస్తే తీసుకోవడం మానే శావు. అమ్మ మీద బెంగ పడ్డావా? కార్తీ..బషీర్ వైపు చూసి... మియావ్ మియావ్ మంటూ...బషీర్ ఒళ్ళో కూర్చుంది.

కాతుమ్మా....అమ్మ వచ్చేస్తుంది లే...బెంగ పెట్టుకోకు...... అంటూ కార్తీ తల నిమిరాడు బషీర్. కార్తీ చాలా సన్నగా అయిపోవడం గ్రహించాడు హేమంత్.. విజయ మీద బెంగ పెట్టుకున్నట్టు వుంది అనుకున్నాడు.

విజయ ప్రసవించింది...కమల పిల్లలు పుట్టారు...విజయ...పిల్లల నిద్దరిని తీసుకుని కేరళ వచ్చింది.

విజయను చూసిన కార్తీ...అమాంతం ఆమె మీదకు వురికి...చుట్టూ తిరిగి సందడి చేసింది. సన్నగా అయిన కార్తీని చూసి బాధ తో కన్నీళ్ళ పర్యంతం అయ్యింది విజయ.

పిల్లల్ని వుయ్యాలలో వూపుతుంటే కార్తీ వుయ్యాలతో పాటు..ముందుకి వెనక్కి వెళుతూ... ఉయ్యాల దగ్గరే వుంటుంది.

విజయ...పిల్లల దగ్గరికి కార్తీని రానివ్వకు..పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాడు హేమంత్.

కార్తీ బాగా అరుస్తుంది...

సాధారణంగా కార్తీ అలా అరవదు...  . కార్తీ ఏమయ్యింది అంటూ వంటింటి లో వున్న విజయ పిల్లల గదిలోకి వచ్చింది...

పిల్లల మంచం వైపుగా వెళుతున్న పామును చూసి  కార్తీ ...మీద పడి కొరికింది....అది పెద్ద తాచు పాము. అప్పుడే కూరగాయలు తెచ్చిన కారు డ్రైవర్ సురేష్...పామును జాగ్రత్త గా పట్టి సంచిలో వేసి అటవీ శాఖ వారికి అప్పగించాడు. మన కార్తీ పిల్లల్ని కాపాడిందమ్మా అన్నాడు కార్తీ ని ఎత్తుకుని. విజయ కార్తీని పట్టుకుని ఏడ్చేసింది. రోజూ సురేష్ రాగానే కార్తీ ని ఎత్తు కోవాలి.....సురేష్ తో ఆడడం కార్తీ కి సరదా...

కార్తీ రోజూ  ప్రొద్దుటే .. ఆరు గంటలకు బయటికి వెళుతుంది.... ఏడు గంటలకు విజయ కార్తీకి గుడ్డు పెడుతుంది. విజయ కార్తీ కోసం గుడ్డు పెట్టింది. గుడ్డు అలాగే ఉండడాన్ని చూసి కార్తీ..కార్తీ అని పిలుస్తూ..కార్తీ...ఏమయ్యావు? గుడ్డు తిను..కార్తీ కార్తీ.... విజయ చాలా సార్లు పిలిచింది.

అప్పుడే నిద్ర నుండి లేచిన హేమంత్...ఏమిటి ఈ రోజు పేపర్ రాలేదా? కార్తీ కార్తీ...అని పిలుస్తూ వున్నాడు...

ఉదయం పది అయ్యింది బషీర్ వచ్చాడు... కాతుమ్మా... కాతుమ్మా... అని పిలిచాడు.

విజయ గేటు దగ్గరకు వచ్చి...బషీర్ని చూసి....కార్తీ కనబడడం లేదు బషీర్ అంది  కంగారు పడుతూ...

పెరట్లో గోడ దగ్గరికి వెళ్ళి... రీను కుట్టి...కార్తీ వచ్చిందా మీ ఇంటికి...అని అడిగింది.

రా లేదు ఆంటీ అంది రీనుకుట్టి...చేపలన్నీ ఇచ్చి.. వచ్చిన బషీర్...చుట్టు పక్కల చూసి వస్తానమ్మా అంటూ కార్తీ ని వెదకడానికి వెళ్ళాడు...మధ్యాహ్నం అయ్యింది....

ఆ సందు మొదటిలో...వున్న టీ కొట్టు అబ్బాయిని అడిగాడు బషీర్...

నుదుటన కుంకుమ బొట్టు ఉన్న ఆ తెల్ల పిల్లా?...చూశాను...అని విషయం చెప్పాడు టీ కొట్టు అబ్బాయి.

బషీర్ అవాక్కయ్యాడు.

హేమంత్ ఆఫీస్ నుండి భోజనానికి వచ్చాడు. ఏమిటి కార్తీ గేటు దగ్గరకు రాలేదు అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు హేమంత్...

విజయ భోరున ఏడుస్తూ...కార్తీ కనబడడం లేదని చెప్పింది...

విజయా... ఏడవకు కార్తీ వస్తుందిలే...రా భోజనం చేద్దాం అన్నాడు హేమంత్.

చేపల బషీర్ కార్తీ ని వెదక డానికి వెళ్ళాడు అని చెప్పింది.

ఇంతలో...బషీర్ వచ్చాడు. హేమంత్ బషీర్ ఎదురుగా వెళ్ళాడు.

"సర్, మన వూరిలో సర్కస్ పెట్టారుగా...అందులో జంతువులకి ఆహారంగా వేయడానికి... కాతుమ్మ ను తీసుకు వెళ్లారు" అని ఏడుస్తూ చెప్పాడు.

వెంటనే హేమంత్. ..ఆ సర్కస్ వున్న ప్రాంతానికి వెళ్ళాడు. సర్కస్ దగ్గర..జంతువులకు ఆహారం వేసేవాడు...హేమంత్ పిల్లి గురించి అడగ గానే..."తెల్ల పిల్లా...ఇప్పుడే పులికి ఆహారంగా వేశాను" అన్నాడు...

హేమంత్ కళ్ళల్లో సముద్రాలు వుప్పొంగాయి. బరువైన గుండెతో ఇంటికి వచ్చాడు.

విజయ ఎదురుగా వెళ్ళి...కార్తీ కనిపించిందా అని అడిగింది...

విజయా ఏడవకు...అన్నాడు... హేమంత్ కు వీజయకు నిజం చెప్పే ధైర్యం లేదు.

మౌనంగా వున్నాడు...

కార్తీ...కార్తీ ఎక్కడికి వెళ్ళావు? నన్ను వదిలి ఎలా వెళ్ళాలని పించింది కార్తీ. ఈ రోజు కార్తీక...కార్తీ నువ్వు ఇంటికి వచ్చి ఐదు సంవత్సరాలు..... ఈ రోజు నీకు వేద్దామని కొత్త గౌను కొన్నాను...అని గుండెలవిసేలా ఏడుస్తున్న విజయ రోధనను చూసిన హేమంత్ కూడా దుఃఖాన్ని ఆపుకోలేక పోయాడు.

కాతుమ్మా...  కాతుమ్మా

ఇకపై....నాచేపల బుట్టని ఎవరు కాపలా కాస్తారు...అంటూ...బషీర్ ఏడుస్తున్నాడు..

"కార్తీ"క బంధం తీరి పోయింది. కార్తీ ఫోటో చూసుకుంటూ దుఖిస్తున్న విజయకు....

సాధువు చెప్పిన మాటలు... చెవిలో మారు మోగాయి....

Botswana

(ఈ కథ కల్పితం కాదు)

తల(వం)చకు -- కాసాల గౌరీ

"ఏమంటావమ్మా" నుదిటి చిట్లింపు లో విసుగు దాచుకుంటూ మెల్లగానే అడిగాడు మాధవ్. కూతురు కూడా ఆమె వైపే చూస్తోంది ఏం జవాబు చెబుతుందా అని.

"అయ్యో ఉండు టీ పెట్టాను మరుగుతోంది ఏమో" అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది శారద.

వేడి వేడి టీ కప్పులతో వచ్చి “టీ తాగి స్నానం చేయండి తర్వాత మాట్లాడుకుందాం.” అంది. "ఈ సారి మాధవవ్ చిరాకు దాచుకునే ప్రయత్నం చేయలేదు.

"అమ్మా తీరిగ్గా మాట్లాడుకోవడానికి తింటానికి రాలేదు. సూటిగా విషయానికి వచ్చేస్తున్నాను. మొన్న పొద్దున్న నాన్న ఎవరో పక్కింటాయన సాయంతో మా ఇంటికి వచ్చాడు. అంతకన్నా ఆ పక్కింటి పుణ్యాత్ముడు తెచ్చాడు అంటే బాగుంటుంది నన్ను అసలు గుర్తు పట్టలేకపోయాడు. చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు. ఎంత చెడ్డా నాన్న కదా. మన డాక్టర్ దగ్గరికి  తీసుకెళ్ళాను. ఆయనకి బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లంట. మానసిక స్థితి కూడా బాలేదు. ఆయన్ని హాస్పిటల్ లో జాయిన్ చేసి నిన్ను తీసుకెళ్తామని వచ్చాను. ఆపరేషన్ అయ్యాక ఆయనకి చాలా జాగ్రత్త  అవసరమట. ఒక మంచి ఇల్లు తీసుకుంటాను. నీకేమి పని ఉండదు. అన్ని నర్సులు చూసుకుంటారు. నువ్వు మన మనిషిగా ఉండాలి అంతే!! నిన్ను కూడా తీసుకెళ్తామని వచ్చాను. నువ్వు కాదనలేవుగా రేపు నీకు అవసరం పడవచ్చు. నాకు ఆఫీస్ లో సెలవు లేదు." అదేదో చాలా సాధారణమైన విషయంగా గబగబా చెప్పేశాడు.

"సరే నన్ను ఆలోచించుకోనీ" అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. వంటింట్లో సింకు టాప్ లో నీళ్లు బొట్లు బొట్లుగా పడుతున్నాయి. శారద తలలో అనేక విషయాలు ఒకటొకటిగా కని/వినిపి స్తున్నాయి. దూరపు చుట్ట మైన ఇతనితో పెళ్లి నిశ్చయం అయినప్పుడు "అమ్మా.. అతనికి అస్సలు స్థిరత్వం లేదు నాకు వద్దు.

"చూడమ్మా స్థిరత్వం లేకపోయినా స్థిరమైన ఉద్యోగం ఉంది. ఇంతకన్నా నాకు శక్తిలేదు." అని తల్లి నిష్కర్ష.

"సంసారం ఓహో అని లేకపోయినా ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు."

"శారదా నన్ను సస్పెండ్ చేశారు. వీళ్ళ మొహంలే మళ్ళీ నా ఉద్యోగం నేను సంపాదించుకోనూ" తలను ఎగరేస్తూ అంటున్న భర్త మాటలకి తలదించుకొంది.

నాలుగు రోజుల తర్వాత, "శారదా, మనం ఊరికి వెళ్తున్నాము పిల్లల్ని.. మీ అక్క దగ్గర దింపి రా..” అంటున్న భర్త మాటలు విని యాంత్రికంగా తల ఊపింది.

"మనం రైల్లో కాదు ఫ్లైట్లో వెళ్తున్నాం. తలూపింది.

ఫ్లైట్ లో రెండు సీట్లు ఉన్న వరుసలో తన పక్కన భర్త గారి ఆఫీసర్ కూర్చోవటం... తలదించుకుని కూచుంది.

ఒక పెద్ద హోటల్లో దిగగానే "నేనిప్పుడే వస్తాను” అని భర్త వెళ్లిపోవడంతో తల తిరిగింది.

"చూడండి శారదా నేను చాలా ప్రాక్టికల్. మీ వారు ఏం చెప్పి మిమ్మల్ని తెచ్చారో కానీ, తన ఉద్యోగం నిలుపుకోవటం కోసమే మనల్ని ఒంటరిగా వదిలి వెళ్లిపోయాడు. ఆయన ఉద్యోగం నా మాటల వల్ల నిలిచినా మళ్లీ అతని ప్రవర్తన వల్ల ఎప్పుడో ఊడిపోతుంది. నిన్ను చూస్తే అమాయకురాలు లాగా కనిపిస్తున్నావు. నాకు దురదృష్టవశాత్తు భార్య సరిగా లేదు. నాకు సహకరిస్తే మిమ్మల్ని జీవితాంతం పోషిస్తాను. మీ పిల్లలకి చదువు చెప్పేస్తాను. ఇది మన మధ్య ఒప్పందం. అదేదో బిజినెస్ డీల్ లాగా మాట్లాడాడు.

తను ఆ మనిషి దగ్గరనుంచి తప్పించుకోలేను అని తెలిసిపోయింది.. అమాయకులైన పిల్లలు కళ్ల ముందు మెదిలారు. మెడతో సహా తలవంచుకుంది. కీలు బొమ్మ అయిపోయింది శారద.

ఇది ఎదురుచూడని భర్త శారదను నిందించి వెళ్ళిపోయాడు. బంధువులు వెలివేశారు. డీల్ కుదుర్చుకున్న పెద్దమనిషి న్యాయంగానే వ్యవహరించాడు. పిల్లలను చదివించి సెటిల్ చేసి పెళ్ళిళ్ళు చేయడంలో కూడా చాలా సాయం చేశాడు. ఫారిన్ వెళ్ళిపోతూ.. శారద  జీవితానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి వెళ్లిపోయాడు.

ఇప్పుడిప్పుడే యాంత్రికత నుంచి బయటకు వచ్చి, ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరింది. తలెత్తుకుని తిరుగుతూ... ప్రతిరోజు... రోజంతా.. తనకి నచ్చినట్టు తాను గడుపుతోంది".

అంతలో భర్త కొడుకు దగ్గరకు వచ్చాడు అని వింది. ఇవాళ పొద్దున మాధవ్ రానే వచ్చాడు.

అందరూ వదిలేసినా తనకు అండగా నిలిచిన స్నేహితురాలు లతకి ఫోన్ చేసింది.

"నీ ఇష్టం శారదా నీ మనసు ఎలా చెప్తే అలా విను అంతే. ఇప్పటికైనా నీ కోసం నువ్వు జీవించు" అంది లత.

పోన్లే ఓల్డ్ ఏజ్ హోమ్ లో తన తోటి వారికి తను సాయం చేస్తోంది కదా అలాగే ఇది కూడా అనుకుని మాధవ్ కి ఓకే చెప్పింది. మాధవ్ పొంగిపోయాడు.

"నాకు తెలుసమ్మా నీది వెన్నలాంటి మనసు మా కోసం నువ్వు ఎన్నో త్యాగాలు చేశావు, ఎప్పుడూ సిద్ధంగా ఉంటావు... తెల్లవారుజామున బయలుదేరదాం.. ఇంత మొహం చేసుకుని మరీ అన్నాడు.

రాత్రి భోజనాలు చేస్తున్నప్పుడు మామూలుగా అడిగింది శారద.

"అవును మాధవా నేను మీ నాన్న వేరే ఇంట్లో ఉండటం ఎందుకు .. మీది చాలా పెద్ద ఇల్లెగా...మేము మీ ఇంట్లోనే ఉంటాము. నాకు కొంచెం ధైర్యంగా కాలక్షేపంగా ఉంటుంది.

"భలే దానివే..అమ్మా నాన్న ఒకోసారి ఉన్నట్టుండి రంకెలు వేస్తాడు. రచ్చ చేస్తాడు. నీ కోడలు, మనవరాలు భయపడరూ" అని నాలిక్కరుచుకుంటూ లేచి వెళ్లిపోయాడు...

తలవంచి పులుసులో చిలకడ దుంప ముక్కలను వెతుక్కుంటున్న శారద ఒక్కసారిగా తలెత్తింది.....

"అమ్మా మూడింటికే లేపు అన్నాను. నాలుగు అయిపోయింది లే అంటూ తల్లి రూమ్ లోకి వచ్చాడు."

తల్లి బెడ్ మీద లేదు. ఎదురుగా బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో.. “పరిస్థితులకి తలవంచిన నేను ఈ మధ్యనే తలెత్తటం నేర్చుకున్నాను..అందులో ఉన్న స్వేచ్ఛ ఆనందం అద్భుతంగా అనిపిస్తోంది. ఇంక తలదించుకోలేను. నువ్వు వెళ్ళిపో....”

అసంకల్పితంగానే మాధవ్  తలదించుకున్నాడు.

"జుంబా" -- రాజేశ్వరి దివాకర్ల

గిరిజ కాలేజీలో చేరాక ఇంటి పట్టున ఇన్ని రోజులు ఉండడం, ఇప్పుడే. చేరిన మొదట్లో కొంత బెంగ పడినా డోమ్స్ లో ఇతర విద్యార్థుల సాంగత్యం తో త్వరగా కుదుట పడింది. అంతే కాదు, తను చేరిన కాలేజీ, ఒక గంట ప్రయణం మాత్రమే అవడం వల్ల తను అమ్మా నాన్నలతో వారానికొకసారైనా ఇంటికెళ్ళి గడిపే అవకాశం ఉంది. కాని తక్కిన విద్యార్థులు, వివిధ దేశాలనుండి వచ్చిన వాళ్ళకు ఆ అవకాశం లేదు.

గిరిజకు ఇంట్లో తోచటం లేదు, రెండు నెలలకు పైగా అయింది. చదువుకని, కేంపస్ దగ్గరలోనే ఉంటున్న గిరిజకు, స్నేహితులతో సరదాగా గడపడం అలవాటయింది. మిత్రులతో కలసి, విందులు చేసుకోడం, పార్టీల సందర్భంగా మందు పొగతాగడం వంటివి ఇతర విద్యార్థులందరూ సాధారణ విషయాలుగా భావించి కొనసాగిస్తూ ఉంటే తనుగూడా ఆరంభించింది. క్రమంగా ఈ సంవత్సర కాలంలో బాగా అలవాటు చేసుకుంది. అందుకు కారణం, ఆమె రూం మేట్ మిషల్ అని కూడా చెప్పాలి. మిషల్ పెరిగిన వాతావరణంలో ఈ అలవాట్లన్నీ కొత్తవేమీ కాదు. గిరిజ ఇంట్లో, తల్లిదండ్రులు, ప్రత్యేక సందర్భాల కోసం, డ్రింక్స్ ఉంచుకున్నా గిరిజను ఆ దరిదాపుల లోనికి రానివ్వలేదు.

గిరజకు చికాకుగా ఉంది. ఇంట్లో నిర్భంధం, విసుగ్గా ఉంది, తాగాలనిపిస్తోంది. ఇంట్లో అమ్మ పని సహాయానికి పిలిచినా తరగతులున్నాయని తన గదిలోనే తలుపేసుకుని ఉంటోంది. గిరిజ చదువులో వెనుక బడలేదు కనుక అనుమానమేమీ రాలేదు. కాలేజీ నివాసంలో, బయట రెస్టారెంట్లలో అమెరికన్ ఫుడ్ అలవాటయి ఇంటి భోజనం రుచించటం లేదు. సమ్మర్ మొదలయింది, ఇప్పుడు ఇళ్ళల్లోనే అందరూ ఉంటున్నారు కనుక అందరూ తోట పని మొదలు పెట్టారు. ఎప్పుడూ గదిలో కూచోకు వచ్చి సరదాగా సాయం చేయి అని తండ్రి పిలిచినా బయటకు రాదు. ఒకే సంతానం గారాబం, కనుక అతడు ఏమీ అనడు. కొద్ది సేపు విసుగుకొని, నిట్టూరుస్తాడు.

గిరిజకు అసహనం ఎక్కువయింది. మిషల్ ఉండే ఊరు దగ్గరే. ఎలాగైనా ఆమెను కలవాలి. ఇంట్లో ఒప్పించి, ఆమె దగ్గర రెండు రోజులుండి సరదాగా గడిపి రావాలి అనుకుంది. నాన్న చెప్పిన జాగ్రతలు పాటిస్తానని మాట ఇచ్చి, మిషల్ కు తాను వస్తున్నట్టు తెలిపింది. మిషల్ సంతోషంగా ఆహ్వానించగానే, కారులో బయలు దేరింది.

జి.పి.ఎస్. ను అనుసరిస్తూ మిషల్ ఇంటికెళ్ళింది. మిషల్ సన్నగా తీగెలా తయారయింది. గిరిజను చూస్తూనే "గిర్జా, పుట్ ఆన్ సోమచ్" అంటూ గేలి చేసింది. ఆ మాటకే కొంత నిరుత్సాహపడింది గిరిజ. లోపలికి వెళ్ళిన గిరిజకు మరింత ఆశ్చర్యం తోడయింది. పెద్ద హాల్ లో దూర దూరంగా తమకు నిర్దేశించిన స్థలాల్లో నుంచుని  ఉన్నారు పదిమంది వరకూ యువతులు. మిషల్ గిరిజతో పాటు అక్కడకు వెళ్ళింది. గిరిజను "నా కాలేజ్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేసింది. “గిర్జా యు అల్సో జాయిన్” అని, ఇక మళ్ళీ స్టార్ట్ చేద్దాము, అంటూ, మ్యూజిక్ ఆన్ చేసింది. హుషారయిన ఆ పాటలకు అందరూ వివిధ భంగిమలతో నృత్యం ఆరంభించారు. వాళ్ళకు, మిషల్ నిర్దేశిస్తోంది. వెళ్ళగానే డ్రింక్స్ తీసుకుంటూ అమెరికన్ ఆహారం తింటూ స్వేచ్ఛగా గడపాలని వచ్చిన గిరిజ హతాశయురాలయింది. మిషల్ కనీసం ఆహార, పానాలను గురించి ప్రస్తావన చేయలేదు. అలా గంటసేపు క్లాసు నడిపిన తరువాత ఆమెను ఒక్కొక్కరూ "అమేజింగ్ డాన్స్ స్టెప్స్ మాం" అంటూ మిషల్ ను అభినందించి, చెమటలు తుడుచుకుంటూ బయలు దేరారు. ఇక మిషల్ గదిలోకి వెళ్ళాక గిరిజ మరింత ఆశ్చర్యపడింది. ఆమె గది నిండా పర్యావరణ, జంతు సంరక్షణను గురించిన ఛాయా చిత్రాలను అందంగా అలంకరించింది, ‘ఫ్రెష్ అయ్యి రా’ అంటూ గిరిజకు చెప్పింది. ఇద్దరూ కిందకు వెళ్ళాక, ఒక పెద్ద బౌల్ నిండా సాత్వికాహారం గిరిజముందుంచింది. దాదాపు ఏడుపు పర్యంతంగా అవుతున్న గిరిజతో మిషల్ అంది "గిరిజా, మా అమ్మ నర్స్, నాన్న డాక్టరు. వాళ్ళిద్దరూ స్వచ్ఛతను గురించి, ఆరోగ్య రక్షణను గురించి, పర్యావరణాన్ని, కాపాడకపోతే కలిగే వైరస్ విజృంభణను గురించీ తాము రోజూ చూస్తున్న మరణాల గురించీ, చెప్తుంటే నాకే కాదు, మా ఇంట్లోనే పెద్ద మార్పు వచ్చింది. ముందున్న అలవాట్లను మానేసాం. భారతీయ పద్ధతులలో ధ్యానం యోగా ఆరభించాం. మీ ఇండియన్స్ చాలా అదృష్టవంతులు. మంచి గురువులున్నారు.. నాకు నృత్యం చాలా ఇష్టం కాని కాలేజీ లో చేరాక మానేసాను. ఇప్పుడు నా నృత్యాన్ని మళ్ళీ మొదలు పెట్టాను. తరగతులను కూడా ఆరంభించాను. దాని వల్ల ప్రత్యేకించి ఈ నిర్బంధ కాలంలో నాకే కాదు, ఇతరులకు కూడా ఆరోగ్యంతో బాటు, ఉత్సాహాన్ని, తమ శరీరం పట్ల అవగాహననూ కలిగిస్తున్నాను. ఈనృత్యం కేవలం పాశ్చాత్య సంగీతమేకాదు. బాలీవుడ్, తెలుగు, ఏ నేపథ్యమైనా అనుగుణంగా చేయవచ్చు.

మిషల్ అలా చెప్పాక గిరిజకు ఇంక సోమరిగా ఉండాలనిపించలేదు. మిషల్, నేను లావుగా వైట్ పుటాన్ చేసానని నువ్వు అన్నప్పుడే నన్ను నేనొక సారి చూసుకున్నాను. ఇక కాలేజీ తెరిచాక అలా అందరూ కామెంట్ చేస్తే భరించగలనా? ఇక్కడకు రావడం మంచిదే అయింది నేనిక వెళ్తాను అంది. మిషల్ గిరిజను నివారించలేదు.

ఇంటికి తిరిగొచ్చిన గిరిజను చూసి, ఆ విషయం ముందే తెలిసినట్లుగా నాన్న నవ్వాడు. గిరిజ తను ఇంట్లో లేని సమయంలో అమ్మా, నాన్నా, కింద హాల్ లో మైకు, మ్యూజిక్ సిస్టమూ, ఇత్యాదిపరికరాలన్నీ అమర్చడం చూసి ఆనంద పడింది. తక్షణమే "జుంబా "నృత్యాన్ని ఆరంభించాలనుకుంది. ఉత్సాహంగా, ముందుకు నడచింది. ఇదంతా నాన్నకు ముందే తెలుసునని ఊహించి కృతజ్ఞతగా చూసింది.

కరోనా బంధాలు! -- డా. రాయసం లక్ష్మి

నిశికన్య ఇరుల కురులను సరిచేసి పాపిట సింధూరం దిద్దుకుంది ఆ సింధూరపు కాంతి పున్నమి వెలుగులా పుడమిఅంతా పరుచుకుంది. చల్లని పైరగాలి నెమ్మదిగా తనువులను పరామర్శిస్తోంది. ఓపికగా పెంచుకున్నట్లున్న తరువుల తోట మధ్యలో నలుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు వరుసలో కూర్చున్నారు. అందరూ పద్మాసనంలో నిటారుగా కూర్చుని ఉన్నారు. అక్కడే వారికి ఎదురుగా ట్రైనర్ లాగా కూర్చుని ఉన్న ఒక పెద్దాయన నెమ్మదిగా ‘లోనికి గాలిని పీల్చుకోండి..’ , ‘నె...మ్మ....ది...గా’ అనే శబ్దాలు ఆయన నోటినుంచి పెదవుల కదలిక లేకుండానే  వస్తున్నట్లున్నాయి. ఆ ట్రైనర్ నిటారుగా కూర్చుని కళ్లు రెండూ మూసుకుని శ్వాసమీదనే ధ్యాసన్నుట్టుగా మాట్లాడుతున్నారు. 

‘రాఘవయ్యగారు ఏమిటండీ! గత నాల్గురోజుల నుంచి వాకింగ్కు రావడం లేదు.’ అంటూ ఓ నలుగురు అరవై పైబడిన వారు వచ్చారు.

నెమ్మది నెమ్మది.... ఇక్కడ అందరూ యోగాభ్యాసకులు ఉన్నారు... అన్నారు మరొకరు...

‘ఇదేమి? మనకు తెలియకుండానే యోగాభ్యాసం బడి పెట్టినట్టు ఉన్నదే... ’ గుసగుస లాడారు ఇంకొకరు....తెలిసిన గొంతులు వినేసరికి కళ్లు రాఘవయ్యగారి అనుమతి లేకుండానే తెరుచుకున్నాయి.

ఆయనకన్నా ముందే పిల్లలూ కళ్లు తెరిచి వచ్చినవారు ఎవరై ఉంటారన్నట్లు చూస్తున్నారు... ఓ రండీ రండీ కోటయ్యగారూ! అంటూ నడిచి వస్తున్న వారికి ఎదురేగి నలుగురికీ ఆహ్వానం పలికి వారికి చుట్టింటి అరుగులపైన కూర్చోమని చెబుతూ తాను కూర్చున్నాడు రాఘవయ్య. ఉండబట్టలేని రామయ్య ‘రాఘవయ్యగారూ! ఈ పిల్లలను ఇంతకుముందు వామింటిపత్తిలో నేనూ చూడలేదు. ఎవరు వీరు’ మనసులో ఏదో అనుమానంతో అన్నాడు.

‘మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే యోగాభ్యాసం క్లాసులకు చిలమత్తూరు ఆశ్రమంనుంచి పిల్లలను పిల్చుకుని వచ్చారా? వారే పంపారా’ పాపయ్య, భీమయ్య ఇద్దరూ ఒకటేసారి అడిగేశారు..

రాఘవయ్య నవ్వుతూ ‘ఆగండి ఆ ఆలోచనాస్రవంతులకు అడ్డుకట్టవేయండి. నేనేమీ మీకు తెలియకుండా ఏమీ చేయలేదు.’ అని అంటుండగానే

‘‘గ్రాన్ పా గ్రాన్ పా మేము కోడు బిళ్ల ఆడుకోమా...’ ఒకరు...

‘గ్రాన్ పా... వీరంతా నీ ఫ్రెండ్సా!’ అని ఒకరు...

‘తాతా! ఆశ్రమం, బడి అంటున్నారు అంటే ఏంటి.’ అని ఒకరు...

ప్రశ్నల పరంపర తో ముందుకు వచ్చారు..

‘పిల్లలూ మీరంతా కాసేపు ఆడుకుని రండి ఈ తాతయ్యలతో కాసేపు మాట్లాడి మీకు వీరి కబుర్లు అంతా మధ్యాహ్నం చెప్తాను’ అన్నాడు రాఘవయ్య

అన్నదే తడవుగా అందరూ వెళ్లిపోయారు... ‘తాతయ్య అంటున్నారే మీ మనవళ్లు కానీ వచ్చారా అన్నాడు భీమయ్య..’

‘అవును’ అని ఎంతో ఆనందం మిళితమైన మనసు పలికిన మాటలను కళ్లతో వ్యక్తం చేస్తూ నోటితో చెప్పావు రాఘవయ్య...

‘అదీ సంగతి అలా చెప్పు’ అన్నాడు కోటయ్య...

ముగ్గురు కొడుకులూ వచ్చారా. అనుమానంగా అడిగాడు రామయ్య...

నిజమే వచ్చారు. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు నలుగురు మనవళ్లు ఇద్దరు మనవరాళ్లు అందరూ అందరూ వచ్చేశారు..

ఏమిటి సంగతి.. ఆరాతీశాడు భీమయ్య

ఏంలేదు. పిల్లలకు ఆన్ లైన్ క్లాసులట. అవి ఇక్కడున్నా క్లాసులకు అటెండు అవ్వొచ్చుకదా అని పిల్లలు, 

మా కొడుకులూ సాఫ్ట్ వేర్ కదా వారికీ వర్క్ ఫ్రం హోమ్ అని వారూ ఇక వీరంతా వస్తుంటే మేమేం చేస్తాం అని, పైగా వారికి కోవిడ్తో చిన్న చిన్న కంపెనీలు తెరవలేదట.. వారికి వర్క్ ఫ్రం హోం లేదట.. అందుకనీ ముగ్గురు కోడళ్లూ వచ్చేశారు..

రాఘవయ్య వివరాలు అందిస్తుండగానే ‘మామయ్యగారూ టీ బిస్కెట్లు తీసు కొచ్చాను. అలా మాట్లాడుతూ ఇలా తేనీటి రుచి ఆస్వాదించండీ’ అంటూ కోడలు రాగానే

‘ఇదుగోండి. ఈమె నా మూడో కోడలు వచ్చినప్పటి నుంచి నాకేమి కావాలో నేను అనుకోకముందే నా ముందుకు తెచ్చి ఇస్తోంది పేరు రాగిణి’ అన్నాడు రాఘవయ్య..

అందరికీ నమస్కారాలు పెట్టి వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుని వెనుదిరిగింది రాగిణి.

సమాచారాలు అన్నీ ఇచ్చిపుచ్చుకున్నాక రాఘవయ్య మిత్రబృందం కదిలింది. వాళ్లు కాళ్లు బయటకు పెట్టగానే పిల్లలంతా తాత దగ్గరకు వచ్చేశారు. వారికి తన చిన్నప్పటి సంగతులు.. తన మిత్రబృందం, తను చేసే పనులు అన్నీ చెప్తూ వారిని కబడీ ఆట గురించి ఆనందంగా వివరిస్తూ కూర్చున్నాడు రాఘవయ్య.

..... ..... ..... ..... .....

‘అమ్మగారూ ఇదిగోనండి.. సావిత్రమ్మగోరిని పిల్చుకుని వచ్చాను...’ అంటూ ఓ మధ్యవయస్కురాలిని వంటింటి ముందు నిల్చోపెట్టింది మంగి..

‘మంగీ! పిల్చుకుని వచ్చేశావా ఇదిగో వస్తున్నా..’ అంటూ రెండు నిముషాల తర్వాత జానకి వచ్చింది. వస్తూనే ‘సావిత్రమ్మా ! బాగున్నావా.. నీ పిల్లలు అంతా బాగున్నారని ఫోను చేస్తున్నారా...’ అంది జానకి.

‘ఆ చేస్తున్నారమ్మ.. వాళ్లు ఇక్కడికి నాల్గురోజుల్లో వస్తామని చెప్పారు నిన్ననే’ అంది సావిత్రమ్మ.

‘అవునా! మంచి విషయం చెప్పావు. ఇక నీకు ఒంటరితనం పోయినట్టే.. ఇదిగో అట్లా నన్ను మరిచిపోకు.. ఈ నాల్గురోజుల్లోనే నా పనంతా చేసేపెట్టేయాలి నీవు. అసలే పిల్లలు, కోడళ్లు, కొడుకులు వచ్చి ఉన్నారు నీకు తెలుసుకదా’ అంది జానకమ్మ..

‘పనిచెప్పండమ్మా నేను వాళ్లు వచ్చినా నేను మీదగ్గరకు వస్తూనే ఉంటాను కదమ్మ’ సావిత్రమ్మ అంది. కావల్సిన వారికి పిండివంటలు చేసుకోలేనివారికి వంటలు చేసి ఇస్తూ కొడుకూ కోడలు సిటీ దారి పట్టిపోయినా సావిత్రమ్మ తన పొట్టను తాను పోసుకుంటూ నలుగురికీ తలలో నాలుకగా ఉంటుందీ ఊర్లో.

‘లేదు లేదు ఇప్పుడు కాలం మారింది. మా ఇల్లు చూడు...’ ఏదో చెప్పబోతుండగా..జానకి...

 ‘అత్తయ్యా! ఇటు చూడండి... ఈ వంకాయలు చాలా ఇంకా కోయమంటారా’ ఒకసారి ఇలా రండి అన్న కేక వినిపించింది. 

పద సావిత్రమ్మ అలా పెరడులోకి వెళ్దాం.. మా పెద్దకోడలు పద్మజ పిలుస్తోంది.  తను ఆ తోటను వదిలి రావడానికి ఇష్టపడడం లేదు. ఎంతసేపూ అక్కడే ఉంటానంటుంది పిల్లల్లాగా.. అంటూ తోటలోకి నడిచింది జానకి..

అక్కడ ఎంతో అందంగా ప్రయోగాల కోసం పెంచుకున్నట్లు వరుసల్లో పెంచుకున్న అన్ని రకాల కూరగాయలు, మరో ప్రక్క ఆకుకూరలు... మరో పక్క పండ్ల చెట్లు... పెరటి గోడకు దగ్గరగా మామిడి, సపోట, పనస చెట్టు కనిపిస్తున్నాయి. ఆ మళ్ల మధ్యలో పద్మజ ఆమెతోపాటు రమణి ఉన్నారిద్దరూ ..

జానకమ్మ తోటలోకి రావడం చూసిన ‘పిన్నిగారూ! ఏంటి ఏదైనా వ్రతం చేస్తున్నారా.. హడావుడిగా వున్నారు’ పలకరించింది పక్కింటి పంకజాక్షి.

ఏం లేదమ్మా అంటూ వంకాయల మడి దగ్గరకు అడుగులువేసింది జానకమ్మ.

‘ఆగండి ఆగండి అమ్మగారింటికి వ్రతంగాదు పెద్ద పండుగే వచ్చింది. ఇదిగో ఈ సావిత్రమ్మను పిల్చుకొచ్చాను. మంచి మంచి పిండివంటలు చేయిస్తోంది మా జానకమ్మ.. మీకు ఎప్పటిమాదిరిగానే ఇస్తుందిగా’ అంది మంగి...

‘అదేమీ లేదులే పంకజాక్షి! ఏదో పిల్లలు వచ్చారుగా వాళ్లకి చాక్లెట్లు బిస్కెట్లు తినే అలవాటు కదా.. ఇక్కడ అట్లాంటివి ఏమీ లేవు కదా.. అందుకే నేను పప్పుఉండలు, శనగక్కాయ ముద్దలు చేసేసరికి నడుం పట్టుకుంది సావిత్రమ్మతో మినపసున్నీ, మురుకులు చేయిద్దామని పిల్చుకుని రమ్మన్నాను. మీరు వేరేగా ఏమీ చేయించుకోకండీ... నేనే మీకు కూడా పంపుతానులే.’ అంది జానకమ్మ.

‘నానమ్మా! నానమ్మా... ఈ పప్పుండ గట్టిగా ఉంది... ’నాకు కొరకడం రావడం లేదు అంటూ ప్రహ్లాదు వచ్చాడు

అందుకే నాన్న నీకోసం మెత్తగా మినపసున్నీ చేస్తుందీ సావిత్రమ్మఅత్త... కాస్తా ఆగు అంది ఎంతో మురిపెంగా జానకీ...

ఇంట్లోనుంచి పిలుపు అందుకుని వచ్చే వచ్చే అంటూ లోపలికి వెళ్లింది పంకజాక్షి.

‘అన్నీ కోర్కెలు తీర్చేసుకుంటున్నారు మన పిల్లలు ’తన తోటికోడలితో పద్మజ

‘మనం తీర్చుకోనట్టు.. మనమూ అత్తగారు పెంచుకున్న ఈ తోటలో కోరుకుని మరీ కోసుకుని వచ్చి అవి వండుతాం ఇవి వండుతాం అటున్నాం గా.. అలానే వారూ’ అంది రమణి..

పోనీలేరా... మనం ఇంత కష్టపడేది తినడానికేగా... ఎవరికి కావాల్సిందివారు చేయడం తప్పులేదులే.. ఏవీవంకాయలుచూపించు... అంటూ మరో అడుగు ముందుకేసింది జానకి...

.... ..... ..... ..... .....

భోజనాలు అయి పిండివంటలు అయ్యి మధ్యాహ్నం నడుం వాల్చడానికి గదికి వచ్చిన జానకి ‘ఏమండీ! కాస్త మూవ్ పూయరా!’ అంది.

‘ఇదేంటి నేను కదా ఈ మాట అడగాల్సినవాడిని’

‘కాలం మారిందండీ... మన కోడళ్లు ఎంతగా నాతో కలిసిపోయారో తెలుసా మీకు. నాతోనే కాదు ముగ్గురూ ఒకరితో ఒకరు బాగా కలిసిపోయారు. అందరూ కలిసి అర్థం చేసుకుని చక్కగా పనులు చేసుకుంటూ ఇల్లంతా హడావుడిగా తిరుగుతుంటే ఎంత బాగుందో కదా. పిల్లలంతా నానమ్మా నానమ్మా అని పిలుస్తూ నాకు అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతుంటే లేని ఓపిక వచ్చేస్తోంది. ఏదేదో చేయాలి అనిపిస్తోంది. జానకీ చెప్పుకుంటూ పోతోంది. ఇదే కదాండీ మనం కోరుకుందీ.. ఈ వయస్సులో పిల్లలు వారి పిల్లలు మన దగ్గరుంటే చాలు కదా... ’జానకీ మాటలు ఏవీ రాఘవయ్య చెవుల్లో దూరడం లేదు.

ఆయన ఇందాక తాను పెద్దోడితో మాట్లాడుదామని అటుగా వెళ్లాడు అంతలో లోపల నుంచి మాటలు వినిపించి ఆగిపోయాడు.

‘అమ్మా! నువ్వు ఆగు. మా అత్తగారితో కలిసి ఉండవద్దు అంటావు కానీ వాళ్లు ఎంతగా బాగా చూసుకుంటున్నారో నీకు తెలియదు. ఏ బాధాలేకుండా పిల్లలు నేను మూడుపూటలా తిండి, నిద్రా హాయిగా ఉంది. మీ అల్లుడు ఒక్కడే తెచ్చే జీతం డబ్బులు అక్కడ ఇంటి రెంటు, కరెంటు, మెయిన్టెయిన్స్ ఇట్లాంటివన్నీ చాలవు. పైగా పిల్లలకు స్కూళ్లు లేవు కానీ ఫీజులున్నాయి. పైగా లాప్టాప్లు కొన్నివ్వాలి.. ఇవన్నీ నాకు ఒక్కదానికే కాదు మా ముగ్గురి తోడికోళ్లల పిల్లలకూ మా మావగారు కొనిచ్చారు. ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చేస్తే మీరు ఇంత పెట్టగలరా... పైగా అక్కడకు కూడా వదినా వాళ్లు వచ్చేశారు అన్నావు కదా.. మరి వారు ఏమంటారు మా కుటుంబం అంతా మీ దగ్గరుంటే ఇట్లాంటివన్నీ జరుగుతాయా చెప్పు. ఇక నీ మాటలు బోధల్లాంటివన్నీ కట్టిపెట్టు ఇప్పుడు అవసరాలు తీర్చేవారే బంధువులు ఇంక ఏమీ చెప్పకు.. నేను చూసుకుం•లే...నాకు తెలుసు ఎవరితో ఎంత ఉండాలో..’ అనే మాటలు పద్మజ వాళ్ల అమ్మతో ఫోన్లో మాట్లాడుతోన్న మాటలు వినేకదా నేను వెనకడుగు వేసా.

నిన్నటి నిన్న చిన్నోడికి అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం కోడలే వాడిని మార్చేసింది అనుకునేవాళ్లం.. నిన్న వాడి మాటలు వింటుంటే కోడలే నయం కొడుకు అని చెప్పుకోవడానికికూడా సిగ్గుచేటుగా మాట్లాడాడు వాడు.

‘ఏమండీ నేను చెప్తూ ఉంటే చేతిలో ఉన్న మూవ్కి మూత తీయకుండానే ఎక్కడికి వెళ్లారు...’ అన్న జానకి మాటలు తలలో దూరాయి.

నేను చెప్పేది వినండీ.. మనమంటే ఇప్పుడు కోడళ్లకు తెలిసి వచ్చిందండీ..మనపై వారు ఎంతో ప్రేమగా ఉన్నారు. ఇంతకాలానికి దేవుడు కళ్లు తెరిచాడు. మనమలను అసలు ఏ కోడలన్నా మనదగ్గరికి రానిచ్చేద్దా చెప్పండి. మీరు కూడా మీ మనవళ్లతోహాయిగా కాలక్షేపం చేస్తున్నారు కదా.. ’ఆగకుండా చెప్తూనే ఉంది జానకి. ఆమె మనసులో ఆనందం వర్ణనాతీతంగా ఉరకలు వేస్తూ ముందుకు పరుగెత్తుతూ ఉంది.

‘నిజమేలే! ఇదంతా కరోనా బంధం.. కలి మాయాబంధం.. అవసరబంధం... ’ అని రాఘవయ్య మనసు అంటున్న మాటలను అణిచివేసి ‘నిజమే జానకీ వారంతా ఇప్పటికి అర్థం చేసుకున్నారు’ అన్నాడు.

‘నిజమేనండీ. ఎప్పటికీ  ఇలా ఉంటే చాలండీ..’ అంది జానకీ

‘ఎప్పటికీ ఏది ఉండేది కరోనా.. నా లేక అవసరాలా... ఏది నిలిచిఉండేది...’ అనకుండా ఉండలేకపోయాడు రాఘవయ్య.

Posted in March 2021, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!