Menu Close

గల్పిక

‘గల్పిక’ అనే పదం తెలుగు భాషలో పట్టాలు పొందిన వారికి తప్ప సాధారణ భాషాభిమానులు, సాహిత్యప్రియులకు అంతగా పరిచయం లేని పదం అవుతుంది. అందుకే మన సిరిమల్లె లో ‘గల్పిక’ అనే ఒక శీర్షికను ప్రారంభించి తద్వారా ‘గల్పిక’ అంటే అది సుపరిచితమే అనే భావన కలిగించాలని మా ఆకాంక్ష. అసలు ఈ ‘గల్పిక’ అంటే ఏమిటి? దాని స్వభావం ఎట్లా ఉంటుంది?

కథ కాగలిగి, కథ కాలేనిది ‘గల్పిక’. సన్నివేశాన్ని..దృశ్యాన్ని సంపూర్ణంగా చూపిస్తూ, పాత్రను పూర్తిగా చిత్రించి, ఆ రెండింటి అన్యోన్యక్రియతో, చెప్పదలచుకొన్న అంశాన్ని సమగ్రంగా ఆవిష్కరించేది ‘కథ’. అందులో పై మూడింటి శిల్పభరితమైన ‘కథనం’ ఉంటుంది. అంచేత అదో గొప్ప ‘కథన ప్రక్రియ’ గా ఎదిగింది. గల్పికలో కథనం ప్రాధాన్యం తక్కువ.

ద్రుశ్యీకరిస్తూ పెంచితే కథ; రేఖామాత్రంగా సూచిస్తే గల్పిక..

చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి.

అత్త గారికి పండక్కి పట్టు చీర(రా?) - డా. శ్రీదేవి శ్రీకాంత్

హాలో అమ్మ,
ఎలా వున్నావు?

నువ్వు ఫోను చేసావు. ఫోను బాగ్ లో ఉంది, వినబడ లేదు. బట్టలు కొనడానికి వెళ్ళాను. ఏమి జనం, ఏమి జనం, షాపులో నడవక్కర లేదు, తోపులాట తోనే కొట్టంతా చుట్టేయ్యొచ్చు.

ఈరోజు అయిదు సార్లు మాట్లాడు కున్నామా, అయినా ఏదో వెలితి. వారం రోజులైంది నిన్ను చూసి. ఒక యుగంలా ఉంది, అంది తల్లి తో శాంతి. నాకు అలాగే వుందమ్మా, అంది శాంతి తల్లి.

పిల్లలకు 23 వ తేదీ నుండి శలవలు. జనవరి 18 వ తేదీ న మళ్ళీ స్కూలు తెరుస్తారు. మీ అల్లుడుగారు వ్యాపార పని రీత్యా వారం రోజుల పాటు ఢిల్లీ లో వుంటారు. నాన్న ను లేదా తమ్ముడిని 23న రమ్మను. పిల్లలిని వాళ్ళ తో పంపి నేను ఈయన ఊరు వెళ్ళగానే వస్తాను.

నీకు, అక్కకు పట్టు చీరలు కొన్నాను. నాన్నకి గిజా కాటన్ చొక్కా, మంచి బ్రాండెడ్ బట్టలు కొన్నాను. నాన్నతో పాటు బావకి కూడా బట్టలు తీసుకున్నాను. ఫోటో తీసి అక్కకు వాట్సాప్ లో పెట్టాను.

తమ్ముడికి,  బ్రాండెడ్ బట్టలు, మీ అల్లుడు గారిని ఢిల్లీ లో కొనమని చెప్పాను.

మీ ముసలిదానికి ఏమి కొన్నావే అన్న అమ్మ మాటకు, శాంతి, ఆ ఏమి కొంటాను? ఆమెకు కొనడం నాకు పెద్దగా ఇష్టం లేదు. పట్టు చీర కొనమని మీ అల్లుడు గారు చెప్పారు. ఆమెకు ఈవయసులో అంత ఖరీదు చీర ఎందుకు అమ్మా?

ఏదో ఒక ఇమిటేషన్ చీరకొని, నీకు కొన్న చీర బిల్లు కాగితం ఆ చీరకు పెడతాను.

ఆవిడకు తోడు, మా ఆడపడుచు లిద్దరు, చుట్టాలింట్లో ఉపవీతం వేడుకకు వచ్చి ఇక్కడే తగలడ్డారు.

నేను వాళ్ళని, బట్టల షాపుకి తీసుకు వెళ్ళను. నాకు తెలిసిన వాళ్ళు పెట్టిన రెండు చీర లున్నాయి. ఆ చీరలు ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్. నాకు, అక్కకు కొన్న చీర బిల్లులు తీసి, ఆ చీరలకు పెట్టి పిన్ను చేస్తాను. మీ అల్లుడు గారు వాళ్లకు కూడా పట్టు చీరలు కొన మన్నారు.

వీళ్ళందరికి ఇలా పెట్టుకుంటూ పోతే నా పిల్లలకి మిగిలేది ఏమిటి?

చెప్పటం మరిచాను, అక్క పిల్ల లిద్దరికి బట్టలు కొన్నాను. బంటికి కొత్త మోడల్ లో వచ్చిన మోడీ కోటుతో ఉన్న డ్రెస్, పింకీ కి పార్టీ వేర్ గౌను కొన్నాను.

అమ్మా అమ్మా అంటూ , 11 సంవతస్సారాల కొడుకు పదే పదే పిలుస్తుంటే, అమ్మమ్మతో మాట్లాడు తుంటే, ఎందుకురా నీ అరుపులు, చింటూ అని విసుక్కుంది.

ఏంటి, ఎప్పుడూ ఫోనులో మాట్లాడేప్పుడే విసిగిస్తావు.  నేను ఫోనులో మాట్లాడేప్పుడే,ఎక్కడ లేనివి గుర్తుకు వస్తాయి నీకు. సరే చెప్పు అంది శాంతి విసుగ్గా.

అమ్మా, నేను పెద్దయ్యాక, పెళ్లి చేసుకున్నప్పుడు, నీకు "పిచ్చి పట్టు చీర" కొన మని నా ఆవిడకు చెబుతాను అన్న చింటూ మాటలకు, అవక్కయి ఉండి పోయింది శాంతి, అశాంతితో.

పరుగు - అత్తలూరి విజయలక్ష్మి

మొక్కలకి నీళ్ళు పోయడానికి డాబా మీదకు వెళ్లాను.హేమంత అతిధులు చామంతులు విరగబూసాయి. నర్సరీ ల్లో వెతికి, వెతికి తెచ్చుకున్న ఛమెలీ పిట్టగోడ మీద దర్జాగా వాలి పందిరంతా పూలతో పగలబడి నవ్వుతోంది. మందారాలు అరచేతి మందాన విచ్చుకుని చిటారు కొమ్మన గాలితో సయ్యటలాడుతున్నాయి.

క్రోటన్స్ పరిమళాలు వెదజల్లుతున్న ఆ పూ మొక్కల్ని అసూయగా చూస్తున్నాయి మాకేది మీ పరిమళం అన్నట్టు.

ఓ మూలగా ఉన్న బాత్రూం టాప్ కి రబ్బరు ట్యూబు పెట్టి అన్ని మొక్కలకి నీళ్ళు పోసి టాప్ కట్టేసి భుజాన వేసుకున్న టవల్ కి చేతులు తుడుచుకుని వాకింగ్ మొదలుపెట్టాను. బహుశా ఏడు అయి ఉండచ్చు. అరగంటన్నా వాకింగ్ చేయాలి.. మళ్ళి కిందకి వెళ్లి, వంట, టిఫిను, స్నానం, పరుగులు .... జీవితం ఓ పరుగుపందెం అయిపొయింది.. ఇందులో గెలుపో, ఓటమో కానీ, అనంతంగా ఇలా పరుగులు పెట్టడంతోటే సగం జీవితం అయిపొయింది..

ముప్ఫై ఏళ్ళు దాటాయి.. చదువులో పోటీపడుతూ పరుగు, ఉద్యోగం కోసం పోటీ పరీక్షల పరుగు... ఇప్పుడు ఉద్యోగంతో పరుగు... ఎప్పటికి ఆగుతుంది ఈ పరుగు... విసుగ్గా ఉంది.

ఎదురింటి ఇల్లాలు వాకిట్లో ముగ్గు వేస్తోంది. మెత్తటి కాటన్ చీర చెంగు నడుముకి దోపి,అలవోకగా ఒంగి. పొడుగాటి జడ ముందుకి పడి ఆవిడ కదలికలకు అనుగుణంగా లయబద్ధంగా కదులుతోంది. చెదిరిన ముంగురులు నుదుట, చెక్కిళ్ళ మీద పడి వింత సోయగాన్నిస్తున్నాయి. పచ్చటి రంగు, నుదుట ఎర్రటి బొట్టు.. చెదిరిన కాటుక కళ్ళ పక్క చుక్కలు పెట్టింది దిష్టి తగలకుండా.

ఎంత బాగుంది! ఆవిడ పట్ల అసూయతో మూలిగింది మనసు.

రాత్రంతా భర్త కౌగిట్లో కరిగి, కరిగి ఎంత సంతృప్తిని, ఆనందాన్ని గుండెల్లో నింపుకుందో! ఆ ఆనందం, సంతృప్తి కళ్ళల్లో మెరిసిపోతోంది.

జీవితం ఇలా ఉంటె ఎంత బాగుంటుంది!

తనకోసం కష్టపడే వాడు, తన కోసం ఆరాటపడే వాడు, తనకోసం బతికేవాడు, తనని మాత్రమే ప్రేమించేవాడు అయిన భర్తని మించిన సంపద ఈ ప్రపంచంలో ఏముంది ఆడదానికి!

సమానత్వం కోసం, హక్కుల కోసం, స్వేఛ్చ కోసం , ఇండివిడ్యు వాలిటీ కోసం పోరాడి, పోరాడి, అన్నీ సాధించుకున్నా గుప్పెడు సంతోషం, చిటికెడు సంతృప్తి మిగిల్చుకోలేకపోయాను. నాకు తరచూ గుర్తుకు వస్తుంది అమల... “మనం అప్పుడే పెళ్లి చేసుకోవద్దె.. చదువులు అవగానే పెద్దవాళ్ళు పెళ్లి, పెళ్లి అంటూ వెంటపడతారు.. ఒప్పుకోవద్దు... ముందు ఉద్యోగం సంపాదించుకుని, ఆర్ధిక స్వాతంత్ర్యం సంపాదించుకుని , మనది అనే ఇల్లు, బాంక్ బాలన్స్ సంపాదించుకుని కొంత కాలం స్వేచ్చగా బతికి తరవాత చేసుకుందాం. ఆ వచ్చేవాడు ఎలాంటి వాడు వస్తాడో, మంచివాడు అయితే ఫర్వాలేదు.. ఏ శాడిస్తో అయితే మాత్రం మనమే వాడిని గెట్ అవుట్ అనే స్థాయిలో ఉండాలి” అని చెప్పి, చెప్పి నరంనరం లో అవే భావాలు జీర్ణించుకు పోయేలా రెండేళ్ళ పాటు నారాయణ మంత్రం లా స్వేఛ్చ మంత్రం ఉపదేశించింది.

ఏమైంది... అన్నీ అమిరాయి...కానీ అసలైన జీవన సహచరుడు మాత్రం అమరలేదు. కోరికలు ఆడదాని సోత్తేనా ... మగవాళ్ళకి ఉంటాయిగా తన జీవిత భాగస్వామి ఇలా ఉండాలి.. అలా ఉండాలి... అని.. అందుకే నాలా ఉండాలని కోరుకునే వ్యక్తీ ఇంకా తారసపడలేదు. ఇప్పుడు అన్ని పోరాటాలు అయిపోయి, అతని కోసం అన్వేషణ మొదలైంది. అప్పుడు నాగార్జున లాంటి వాడు కావాలి అనుకున్నాను .. కానీ నేను అమలలా లేను కదా అన్న వాస్తవం తెలిసింది... ఇప్పుడు అతను బ్రహ్మానందం అయినా పర్వాలేదు... మనసు మంచిదైతే చాలు... ఆ మనసు నిండా నేనే నిండి ఉంటే బాగుండు... ఆ మనసులో ఆశలకి, కోరికలకి, ఆశయాలకి, అన్నిటికీ నేనే కేంద్ర బిందువునైతే బాగుండు ...

ఇప్పుడు సమానత్వం కోసం పోరాటం లేదు, స్వేఛ్చ కోసం ఆరాటం లేదు... హక్కుల హడావుడి లేదు.. అన్నీ ఉన్నాయి.. మొహం మొత్తేంతగా ఉన్నాయి. ఇప్పుడు కావాల్సింది విశాలమైన హృదయం ... ఆ హృదయం మీద తలవాల్చుకుని మిగతా జీవితం ఏ పోరాట కాంక్ష లేకుండా ప్రశాంతంగా బతకాలని ఉంది. అలాంటి వాడు దొరికితే ముత్యాల ముగ్గులో సంగీత లాగా అణకువగా, సౌజన్య మూర్తిలా అదిగో ఆ ఎదురింటి ఇల్లాలిలా మెరిసిపోయే మంగళ సూత్రాలు ముందుకు పడి పెండ్యులంలా అలా ఊగుతూ ఉంటే!

జడ సవరించుకున్నాను. ఏది ఆనాటి పొడుగాటి జుట్టు... జీవితంలో పెరిగిన వేగానికి అడ్డు అని సగానికి సగం కత్తిరించేసాను.. ఇప్పుడు ఈ జడ భుజాలు దిగని జడ అలా ఆవిడ జడలా అందంగా ముందుకు వాలదుగా.. ఫర్వాలేదు.. అదీ ఒక అందమే... తల స్నానం చేసి, తడి కురులతో వలపు జల్లులు కురిపిస్తూ రాత్రంతా కామక్రీడతో అలసి, సొలసి నిదురించే చేలికాడిని సుతారంగా నిద్రలేపి మమతల మాధుర్యం నింపిన కాఫీ అందించి,

“అమ్మా ... ఈడున్నావా.. కింద నీ గురించి దేవులాడి వచ్చిన .... టైమెంత తెల్సా... దస్కత్ పోవా ఏందీ” సత్తెమ్మ పిలుపుతో కలల అలల మీద నుంచి సముద్రంలో పడిపోయినట్టు గా తుళ్ళిపడ్డ్డాను..

సత్తెమ్మ వైపు చూసాను.. మేడలో పసుపుతాడు ... చవకరకం నల్లపూసలు గొంతుకు చుట్టుకుని...నల్లగా ఉన్నా కళగా .... ఆ కళకి కారణం ... ఆమె పొందుతున్న అన్యోన్యమైన దాంపత్య జీవితంలోని సంతృప్తి..

నా గుండెల్ని చీల్చుకుంటూ సన్నని నిట్టూర్పు... నీకు కలలు కనే అర్హత కూడా లేదు, అందుకు సమయమూ లేదు... పద, పద పరుగు... పరిగెత్తు... రన్ , రన్ .... భాగో...వీపు మీద జారిపోతున్న యవ్వనం చెళ్ళు, చెళ్ళున కొడుతోంటే మెట్లవైపు నడిచాను.

గల్పికావని-శుక్రవారధుని - మ్యాచింగ్ - జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
మీకు బ్యూటీ స్ట్రిప్ గురించి తెలుసు. దానివల్లే నాకీ అవార్డు దక్కిందనీ తెలుసు. కానీ అదెలా మొదలైందో తెలీదు. చెబుతా వినండి:నా పేరు మేకప్ మురళి. సినిమా మొదలయ్యేదే మాతో.

మేకప్ తో కొబ్బరికాయ. ప్యాకప్ తో గుమ్మడికాయ.ఏం చెప్పమంటారు, సీత కష్టాలకంటే పీత కష్టాలకంటే మా కష్టాలు గుండెలు చెరువైపోయేంత కష్టమైన కష్టాలు. ఈ గుండెలు ఎప్పుడు కరువౌతాయో ఎప్పుడు చెరువౌతాయో ఎప్పుడు బండలౌతాయో తెలీదుగానీ.., మా కళ్ళముందు రెండు కొండలౌతాయి. అవీ మామూలు కొండలు కావు. మురిపాల ముత్యాల బంగారుకొండలూ కావు. రక్తమాంసాల సూదంటురాళ్ళు.నేను ఈ ఫీల్డులోకి వచ్చిన కొత్తల్లో వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. అయినా అవి వయస్కాంతాలు కదా, చూపుల్ని ఇట్టే ఆకర్షిస్తూండేవి. దాంతో కళ్ళు వద్దన్నా అటే తిరుగుతూండేవి. ఈ విషయంగానీ మేకప్పేయించుకుంటున్న కంట్లో పడిందా? చచ్చే చావు. జూనియర్ ఆర్టిస్టులు బేరాలు చూసి పెట్టమంటూ మొదలెడతారు. అదే కాస్త పేరూ క్యారెక్టర్లూ ఉండేవాళ్ళైతే ఎకసక్కాలు మొదలు పెడతారు. వాళ్ళతో వేగడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళల్లో నటన కంటే నటీమణులమనే టెక్కే ఎక్కువ. మాట్లాడితే ఓ గొడవ. మాట్లాడకపోతే ఇంకో గొడవ. టచప్ టైంలో కూడా గొప్పలు చెప్పుకోవడం మానరు. పొగిండించుకోవడంలో ఏమాత్రం ఏమారరు.

చీర నిండుగా ఉన్నకాలంలో మ్యాచింగ్ గొడవంతగా ఉండేది కాదు. గొట్టం ప్యాంట్ల కాలంలో అప్పుడప్పుడూ వ్యాంపమ్మల్తో మ్యాచింగ్ సమస్యలొచ్చేవి. వాళ్ళ ముఖం రంగుతో శరీర భాగాల్ని కూడా మ్యాచ్ చెయ్యడాన్నే మ్యాచింగ్ అంటారు. ఈ మ్యాచింగ్ అనేది నేను పెట్టిన పేరే.

తరవాత్తరవాత అదే స్థిరపడిపోయింది. అంతే కాదు, జంబల్ హాట్ అనేది కూడా ఫీల్డ్ లోకి వదిలింది నేనే. బెల్లులు బ్యాగీలూ వస్తున్నకొద్దీ మ్యాచింగ్ ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. అందుక్కారణం కాస్ట్యూమ్స్ సైజు తగ్గుతూ రావడం. అప్పట్లో మిడిమేలం అమ్మాయిల్ని చూసి ఎగస్ట్రాలకి ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్టుకి తక్కువా అంటూ వెక్కిరించేవాణ్ణి. చివరికి అదే రావుగోపాల్రావుగారి నోట్లో పడి ఆల్ ఆంధ్రాకే వరల్డ్ ఫేమస్ డైలాగ్ అయిపోయింది.

ఈ సోదంతా ఎందుకంటే మొన్న ఓ సినిమాకి మేకప్ మేన్ గా పని చేస్తున్నప్పుడో విచిత్రం జరిగింది. అందులో హీరోయిన్ బ్రా వేసుకొచ్చింది. ఆవిడ గారు పక్కా స్టాండర్డ్ కలర్. రంగులేదని పొంగులు ఆకర్షించడం మానతాయా? కళ్ళు వయసుని గుర్తు పెట్టుకునేడుస్తాయా? నిజం చెప్పాలంటే ఆవిడకి మేకప్ వెయ్యడం కంటే మేచింగ్ చెయ్యడమే కష్టం. ఎందుకంటే ఒళ్ళంతా రుద్దలేక చావాలి. చేస్తున్నది మేచింగా మసాజా అనేది కూడా అర్థమై చావనంత ఒళ్ళు నొప్పులు. మనం ఏమాత్రం బద్ధకించినా డైరెక్టర్ చేతిలో తన్నులు తినక తప్పదు. సర్లే ఇదో రకం వ్యాయామం అని సద్దుకుపోయేవాణ్ణి. ఆ పొంగులాడికి మ్యాచింగ్ చేసేసరికి నాకు తాతలు దిగొచ్చారు. అది వేరే సంగతి.

ఇంతకీ అసలు సంగతి ఏంటంటే, ఆ సినిమాలో మన నటకీచకి వేస్తున్నది తనకి అన్నివిధాలా సూటైన దెయ్యం కారెక్టర్. అయితే అది నల్లదెయ్యం కాదు. తెల్లదెయ్యం. అంటే నాకు పండగన్నమాటే. వేసుకొచ్చిన బ్రా వరకూ నీట్ గా మ్యాచింగ్ చేసేసరికి నా తల ప్రాణం తోకలోకొచ్చింది. సామాన్యంగా హీరోయిన్లు మ్యాచింగ్ కి వచ్చేముందు కాస్ట్యూమ్స్ ఓసారి వేసుకుని అవి ఎంతవరకూ కవర్ చేస్తాయో చూసుకొస్తారు. అలా చేస్తే ఆ కాస్ట్యూమ్స్ ఎంతవరకూ వస్తాయో అంతవరకూ మేచింగ్ చేయించుకుంటే లొకేషన్లో ఏ సమస్యా రాదు. లేకపోతే కాస్ట్యూమ్స్ కీ మేచింగ్ కీ మధ్య ఒరిజినాలిటీ బైటికొచ్చేస్తుంది. ఈ నటకీచకి కాస్ట్యూమ్స్ వేసుకుని చూసుకోకుండా ఊపుకుంటూ వచ్చేసింది. తన నమ్మకం ఏమిటంటే తను వేసుకున్న బుడ్డి ప్యాడెడ్ బ్రా కంటే చిన్న సైజు కాస్ట్యూమ్స్ ఉండవని. నా దరిద్రం కొద్దీ ఆ నటకీచకికోసం డిజైన్ చేసిన కాస్ట్యూమ్ అంతకంటే చిన్న గుడ్డ పేలిక. అదీ తెల్లటి తెలుపు రిబ్బన్ ముక్కలాంటి డింగ్ డమాల్ డిజైన్.

ఉన్నట్టుండి డైరెక్టర్ రెడీ అని అరవడంతో కాస్ట్యూమర్ ఇచ్చిన గుడ్డ పీలిక కట్టేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడామె పరిస్థితి ఏమిటంటే బాడీ కలరూ కాస్ట్యూమ్ కలరూ తెల్లటి తెలుపు మధ్యలో నేచురల్ బాడీకి సంబంధించిన చక్రాల్లాంటి రెండు నల్లటి గీతలు. డైరెక్టర్ ఏ మూడ్ లో ఉన్నారో ఏమోగానీ టేక్ తీసుకోవడం.., ఓకే చెయ్యడం.., ఆ తరవాత మ్యాచింగ్ సగానికే జరిగిన విషయం గుర్తించడం .., తన తప్పు కప్పి పుచ్చుకోవడానికి ప్రొడక్షన్ మేనేజర్ మీద రెచ్చిపోవడం..,ఆ డబ్బా ప్రొడక్షన్ మేనేజర్ "కనీసం మ్యాచింగ్ చెయ్యడం కూడా రానివాడివి నువ్వేం మేకప్ మేన్?" అంటూ నన్ను బండబూతులు తిట్టి రావలసిన డబ్బెగ్గొట్టి నన్ను తరిమెయ్యడం చకచకా జరిగిపోయాయి.

పీనాసి ప్రొడ్యూసర్ ఆ సీన్ రీషూట్ చెయ్యడానికి ఒప్పుకోకపోవడంతో అలాగే రిలీజైపోయిందా బొమ్మ. ప్రొడ్యూసర్ అదృష్ఠం కొద్దీ సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అందుక్కారణం ఆ నటకీచకి ప్రదర్శనే అని హోరెత్తిపోయింది. దాంతో తెల్లహీరోయిన్లందరికీ మన నటకీచకి కాస్ట్యూమ్ కీ మేచింగ్ కీ మధ్య అందమైన నల్లటి ఒరిజినల్ బ్లాక్ బ్యూటీ స్ట్రిప్ వల్లే ఆ సినిమా హిట్టయిందనే డౌట్ కొట్టింది. అందరూ అలాగే వైట్ బ్యూటీ స్ట్రిప్స్ కావాలని పట్టుపట్టడం మొదలు పెట్టారు.

ఆ విధంగా నా ఫుడ్డు పోతే పోయిందిగానీ ఈ సంవత్సరం బెస్ట్ మేకప్ మేన్ గా అవార్డు దక్కింది.

Posted in May 2019, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!